సిబిఐ ఏర్పాటు చెల్లదు
posted on Nov 8, 2013 6:41AM
పలు కేసుల్లో సంచలనాలను నమోదు చేయటంతో పాటు విమర్శలను మూట గట్టుకుంటున్న సిబిఐ పై ఇప్పుడు మరో వివాదం రేగింది. భారత దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ ‘సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’(సీబీఐ) ఏర్పాటే అసలు రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు కాదని గౌహతి హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. జస్టిస్ ఐ ఎ అన్సారీ, జస్టిస్ ఇందిరా షాలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు తీర్పు వెల్లడించింది. 1963 ఏప్రిల్ 1న కేంద్రహోం శాఖ సీబిఐని ఏర్పాటు చేస్తూ చేసిన తీర్మానాన్ని కోర్టు కొట్టేసింది.
నేర దర్యాప్తు అధికారం కలిగిన పోలీస్ డిపార్ట్‌మెంట్‌ని కేవలం ఆ కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వార ఏర్పాటు చేయటం కుదరదని కోర్టు అభిప్రాయపడింది. అలా ఓ పోలీస్ శాఖను ఏర్పాటు చేయాలంటే చట్టం తప్పని సరి అని కోర్టు స్పష్టం చేసింది. అప్పట్లో సిబిఐ ఏర్పాటు విషయంలో కేబినెట్ నిర్ణయంగాని, రాష్ట్రపతి ఆమోదం గాని ఆర్డినెన్స్ లాంటివి ఏవి జరగలేదని కాబట్టి సిబిఐకి రాజ్యంగ బద్దత లేదని స్పష్టం చేసింది.
అంతేకాదు హోం శాఖ తీర్మానంతో ఏర్పాటైన ఒక పోలీసు దళం.. ఒక నిందితుడిని అరెస్టు చేయటం, దాడులు, తనిఖీలు చేసి ఆస్తులు స్వాధీనం చేసుకోవటం, చార్జిషీట్లు దాఖలు చేయటం, నిందితుడిని ప్రాసిక్యూట్ చేయటం లాంటి చర్యలన్నిటినీ రాజ్యాంగ విరుద్ధంగా పరిగణిస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.