పిల్లి మెడలో గంట కట్టేదెవరు
posted on Nov 7, 2013 @ 2:35PM
చంద్రబాబు మళ్ళీ ఈ నెల 20నుండి ఆత్మగౌరవ యాత్ర మొదలుపెట్టనున్నారు. ఈ సారి నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో ఆయన పర్యటిస్తారు. అయితే రాష్ట్ర విభజన కసరత్తు దాదాపు పూర్తి కావస్తున్నఈ తరుణంలో కూడా ఆయన విభజనపై స్పష్టమయిన ప్రకటించలేకపోవడం చాలా చిత్రంగా అనిపిస్తుంది.
కానీ, మొన్న తెదేపా నేత పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ తమ పార్టీ ప్రధానికి వ్రాసిన లేఖ మారిన తమ పార్టీ వైఖరికి అడ్డం పడుతోందని చెప్పడం, దానిపై పార్టీలో ఎర్రబెల్లి వంటి తెలంగాణా నేతలు తీవ్ర ఆగ్రహం ప్రకటించడం, ఇంత జరుగుతున్నపటికీ వారి వాదనలలో చంద్రబాబు జోక్యం చేసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. తెలంగాణాలో కూడా పార్టీని రక్షించుకోవాలని గట్టిగా భావిస్తున్నకారణంగానే చంద్రబాబు ఈ వివాదంలో తల దూర్చేందుకు ఇష్టపడి ఉండక పోవచ్చును. ఎందుకంటే వారిలో ఎవరిని వెనకేసుకు వచ్చిన రెండో ప్రాంతానికి తప్పుడు సంకేతాలు వెళతాయనే భయంవల్ల కావచ్చు.
అయితే ఇప్పటికయినా ఆయన తమ పార్టీ రాష్ట్ర విభజనకు ఏ పరిస్థితుల్లో అంగీకరించవలసి వచ్చిందో దైర్యంగా ప్రజలకు చెప్పగలిగితే ప్రజలు కూడా అర్ధం చేసుకొనే అవకాశం ఉంటుంది. అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలని ఊరికే అనలేదు పెద్దలు. ఆ పని ఆయనే స్వయంగా చేయకపోతే, ఆ విషయంలో కాంగ్రెస్, వైకాపాలు చూపుతున్న ఉత్సాహం వల్ల పార్టీకి మున్ముందు మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.