సోనియమ్మ గుడికి పూజారి ఎవరు?
తన రాజకీయ ప్రస్థానంలో చివరి దశలో ఉన్న మాజీమంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ రావు, ఇంతవరకు తన సికిందరాబాద్ కంటోన్మెంటు నియోజక వర్గం ప్రజలకు ఒరగబెట్టినదేమీ లేకపోయినా, వచ్చే ఎన్నికలకు టికెట్ సంపాదించాలనే యావ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో హేమా హేమీలకే తమ పరిస్థితి ఏమిటో అర్ధం కాక తలలు పట్టుకొంటుంటే, శంకర్ రావు మాత్రం ‘అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే’ అనే పాలసీతో నిత్య సోనియా పారాయణం చేస్తూ ఆమె దృష్టిలో పడాలని తెగ తాపత్రయపడుతున్నాడు.
ఆ ప్రయత్నంలో భాగంగానే తెలంగాణా వరంగా ఇచ్చిన ఆ దేవతకు ఒక గుడి కట్టాలని కూడా సంకల్పం చెప్పుకొని ప్రయత్నాలు మొదలుపెట్టేసాడు. స్థలం గుర్తించడం, (బహుశః ప్రభుత్వభూమి అయినందున) రెవెన్యు అధికారులను సంప్రదించడం కూడా జరిగిందని, సోనియమ్మ పుట్టిన రోజు అంటే డిశంబర్ 9న సోనియాలయ శంఖు స్థాపన కూడా చేయాలని ఆయన కమిట్ అయిపోయినట్లు సమాచారం.
అయితే ఆయన గ్రహించని రెండు విషయాలు ఏమిటంటే, ఆయన ఇంకా రాజకీయాలలో చక్రం తిప్పాలని ఆరాటపడుతున్నప్పటికీ, సోనియమ్మ వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాహుల్ బాబుని ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టి, తను రిటర్మెంట్ తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అటువంటప్పుడు శంకర్ రావు ఆమెకు గుడి కట్టించడం కంటే రాహుల్ బాబుకే కట్టించేస్తే బెటరేమో ఓ సారి ఆలోచించవలసి ఉంది. లేకుంటే రాజకీయాల నుండి రిటర్ అయిపోతున్న సోనియమ్మకు గుడి కట్టి అందులో భజన చేసుకోవాలంటే ఆమెతో బాటు శంకర్ రావు కూడా రిటర్మెంట్ తీసుకోక తప్పదు.
ఇక రెండో పాయింటు: రాహుల్ గాంధీ వచ్చే ఎన్నికలలో తన వంటి యువతకి అంటే 40 నుండి 60 మధ్యలో ఉన్నవారికే ప్రాధాన్యం ఇస్తారని ఇప్పటికే చాలా స్పష్టమైయిన సంకేతాలు ఇస్తున్నారు. మరి తను ఆ ‘యువ రేంజ్’ లో ఉన్నాడో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని, వీలయితే మళ్ళీ ఓ సారి ఆరోగ్యపరీక్షలు చేయించుకొంటే మంచిది. ఎందుకంటే పోలీసులు విచారణకు పిలిచినప్పుడల్లా ఆయన ఆరోగ్యం పాడయిపోవడం, వెంటనే ఏ కార్పోరేట్ ఆసుపత్రిలో చేరిపోవడం చూసి ఆ సాకుతో రాహుల్ ఆయనకు టికెట్ నిరాకరించే ప్రమాదం ఉంది. అందువల్ల సోనియమ్మని ఎలాగో ప్రసన్నం చేసుకొని, యువ రేంజ్ లోకి దూరిపోయి టికెట్ సంపాదించుకొన్నా, తీరా చేసి మళ్ళీ ఆరోగ్యంపాడయిపోతే టికెట్ వృదా అయిపోతుంది గనుక ముందే ఓ సారి ఓల్ బాడీ చెకప్స్ కూడా చేయించుకొంటె మంచిదేమో అని అలోచించాలి. .
అందువల్ల సోనియమ్మకి గుడి కట్టే ముందు ఓసారి టికెట్ విషయం కూడా కన్ఫర్మ్ చేసుకొంటే మంచిదేమో. అప్పుడు గుడికి, తనకి కలిపి మొత్తం ఎంత ల్యాండ్ పుచ్చుకోవాలో, అసలు గుడి కట్టాలో వద్దో, కడితే ఎవరికి కట్టాలో, కడితే టికెట్ వస్తుందో రాదో, రాకపోతే దానిలో నిత్యపూజలు తనే స్వయంగా నిర్వహించాలో లేక వేరవరినా నిర్వహించాలో, వగైరా సమాచారం అంతా సేకరించవచ్చును.
ఏమయినప్పటికీ ఇటువంటి గొప్ప భక్తుడిని తమ ప్రతినిధిగా ఎన్నుకొన్న సికిందరాబాద్ కంటోన్మెంటు ఓటర్ల విజ్ఞతకు జోహార్లు చెప్పక తప్పదు. ఒకవేళ ఈ సారి అతనిపై అమ్మ దయ తప్పి, యువరాజు టికెట్ మంజూరు చేయకపోతే కనీసం సదరు నియోజక వర్గ ప్రజలయినా అతనిని స్వతంత్ర అభ్యర్ధిగా నిలబెట్టుకొని గెలిపించుకోవలసిన గురుతరమయిన బాధ్యత తమపైనే ఉందని గుర్తించాలి.లేకుంటే శంకరన్న అదే గుడిలో గంట కొట్టుకొంటూ కాలక్షేపం చేయక తప్పదు.