రాస్తారోకోలతో రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగుతుందా
posted on Nov 7, 2013 @ 3:50PM
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని గట్టిగా కోరుతున్న వైకాపా మొదటి నుండే అదే మాట మీద నిలబడి ఉంటే నేడు సీమాంధ్రలో సమైక్య చాంపియన్ గా అవతరించాలని ఇంత చెమటోడ్చవలసిన పని ఉండేది కాదు. అలాగే తెలంగాణాలో కూడా ఇంత లోకువ అయ్యేది కాదు. గానీ, తన విశ్వసనీయతను పణంగా పెట్టి మరీ అనేక ‘యూ టర్నులు’ తీసుకొని ఇప్పుడు తెలంగాణాలో మళ్ళీ తన ఉనికిని కాపాడుకోవడానికి, సీమాంధ్రపై పట్టు సాధించడానికి తిప్పలు పడుతోంది.
ఒకవైపు డిల్లీలో రాష్ట్ర విభజన ప్రక్రియ చకచకా జరిగిపోతుంటే, ఇక్కడ వైకాపా రాస్తారోకోలు చేయడం వలన అది ఆగిపోతుందని గుండెల మీద చేయి వేసుకొని చెప్పగలదా? అంటే లేదనే సమాధానం వస్తుంది. దాదాపు ఆరేడు లక్షల మంది ప్రజలు, ఉద్యోగులు రోడ్ల మీద రెండు నెలలపైగా ఉద్యమాలు, సమ్మెలు చేసినా చలించని కాంగ్రెస్ పార్టీ, వైకాపా చేస్తున్న రాస్తా రోకోలతో రాష్ట్ర విభజన ప్రక్రియను ఆపుతుందని ఎవరయినా నమ్మగలరా?
ఆ పార్టీ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని గట్టిగా, నిజాయితీగా కోరుకొంటున్నట్లయితే, రాష్ట్ర విభజన ప్రక్రియను ఆపే ప్రయత్నం చేయడంమాని చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డే అందుకు బాధ్యులు అని నిందిస్తూ ఎందుకు కాలక్షేపం చేస్తోంది? ఒకప్పుడు రాష్ట్ర విభజనను అడ్డుకొనే శక్తి తమ పార్టీకి లేదని పదేపదే చెప్పిన వైకాపా ఇప్పుడు ఒంటరిగా రాష్ట్ర విభజనను ఏవిధంగా అడ్డుకోవాలనుకొంటోంది? ఆరేడు లక్షల మంది చేయలేని పనిని తను ఒంటరిగా చేయగలనని నిజంగానే భావిస్తోందా? లేక ఈ పేరుతో సీమాంధ్రలో పార్టీని బలపరచుకోవాలని ప్రయత్నిస్తోందా? అనే ప్రశ్నలకి వైకాపా నిజాయితీగా సమాధానం చెపితే బాగుంటుంది.