తెదేపాలో ముసలం
posted on Nov 6, 2013 @ 8:03PM
చంద్రబాబు ఆరోపిస్తున్నట్లుగానే రాష్ట్ర విభజన తెదేపాలో చిచ్చుపెడుతోంది. గోరుచుట్టుపై రోకటి పోటు పడినట్లు, ఇప్పటికే రాష్ట్ర విభజన విషయంలో క్రిందామీద పడుతున్న తెదేపాకి తాజాగా హోంశాఖ విభజనపై అభిప్రాయాలను, సూచనలను పంపవలసిందిగా పార్టీలను కోరడం, అఖిలపక్ష సమావేశానికి రమ్మని ఆహ్వానాలు పంపడంతో, తెదేపాలో ముసలం పుట్టింది.
హోం శాఖకు ఎటువంటి లేఖ వ్రాయకూడదని, అదేవిధంగా అఖిలపక్ష సమావేశానికి హాజరు కాకూడదని తెదేపా నిశ్చయించుకొంది. అయితే పార్టీలో రెండు వర్గాలను సంతృప్తి పరిచేందుకు మధ్యేమార్గంగా అన్ని ప్రాంతాల ప్రజల సమస్యలు పరిష్కరించేవరకు విభజన ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ చంద్రబాబు ప్రధానికి లేఖ వ్రాసారు.
ఇది సహజంగానే పార్టీలో ఎర్రబెల్లి వంటి తెలంగాణా నేతలకి ఆగ్రహం కలిగించింది. మళ్ళీ ఇప్పుడు కేంద్రమంత్రుల బృందంతో సమావేశమయ్యి విభజన విషయంలో సలహాలు, సూచనలు చేయడానికి నిరాకరించడంతో, తమ పార్టీ తెలంగాణా కంటే సీమాంధ్రకే ప్రాధాన్యత ఇస్తోందనే భావం తెలంగాణా నేతలలో నెలకొంది. పయ్యావుల, కోడెల వంటి సీమాంధ్ర నేతల ఒత్తిడికి లొంగినందునే చంద్రబాబు నేటికీ తెలంగాణాపై పార్టీ వైఖరి స్పష్టం చేయడం లేదని తెలంగాణా నేతలు ఆగ్రహంతో ఉన్నారు.
పయ్యావుల కేశవ్ విభజనను వ్యతిరేఖిస్తూ సుప్రీం కోర్టులో పిటిషను వేసినప్పటి నుండే వారి మధ్య ప్రచ్చన్న యుద్ధం మొదలయింది. పుండు మీద కారం చల్లినట్లు, “తమ అధినేత ప్రధానికి వ్రాసిన లేఖ ద్వారా ఇప్పుడు తమ పార్టీ సమైక్యాంధ్రకి అనుకూలంగా తన వైఖరి మార్చుకొన్నట్లు స్పష్టమవుతోందని, త్వరలో ఈవిషయంపై మరింత స్పష్టత వస్తుందని” పయ్యావుల చేసిన తాజా వ్యాఖ్యలతో తెదేపాలో గొడవ ముదిరి పాకన పడింది. అందుకు ఎర్రబెల్లి తీవ్రంగా స్పందిస్తూ పయ్యావుల వంటి వారు పార్టీలో చీడ పురుగుల వంటి వారని విమర్శించారు.