రాష్ట్రపతి పాలనను స్వాగతిస్తున్నా: ఆనం

  ఆనం అనం రామినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉన్నపటికీ ఎన్నికల ముందు తిరిగి అధికారం చెప్పట్టాలనే తాపత్రయం లేనందునే కేంద్రం రాష్ట్రపతి పాలన విదించిందని, దానిని తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. అయితే, ఇద్దరు ముఖ్యమంత్రులను మార్చినప్పటికీ ఐదేళ్ళపాటు రాష్ట్రాన్ని పాలించలేక కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసి మళ్ళీ నాలుగు దశాబ్దాల తరువాత కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రం మీద రాష్ట్రపతి పాలన బలవంతంగా రుద్దిందని చంద్రబాబు ఎద్దేవా చేసారు. పైగా ఆ పార్టీకి చెందిన మంత్రి దానిని స్వాగతిస్తున్నానని సిగ్గులేకుండా చెపుతున్నారని ఆయన ఎద్దేవా చేసారు.

సోనియమ్మకు సీమాంధ్ర స్వాగతం: బొత్స

  రాష్ట్రంపై రాష్ట్రపతి పాలన విదించడంతో ముఖ్యమంత్రి కావాలని కలలుగన్న ముగ్గురు సీమాంధ్ర కాంగ్రెస్ నేతల పరిస్థితి వ్రతం చెడినా ఫలం దక్కనట్లయింది. ముఖ్యమంత్రి పదవి దక్కకపోగా అందుకు అర్రులు చాచినందుకు ఉన్న పరువు కూడా పోయింది. పైగా వారి పోటీ కారణంగానే రాష్ట్రంలో మళ్ళీ రాష్ట్రపతి పాలన కూడా విదింప బడిందనే అపవాదు కూడా మూటగట్టుకొన్నారు. అయితే, రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో పది సీట్లయినా గెలుస్తుందో లేదో తెలియకపోయినా బొత్స సత్యనారాయణ మాత్రం విభజన పూర్తయిన తరువాత ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయ్యేందుకు గాను సోనియమ్మను ఇప్పటి నుండే ఏదోవిధంగా ప్రసన్నం చేసుకొనే ప్రయత్నాలు మొదలుపెట్టేసారు.   సీమాంధ్ర ప్రజల ఆగ్రహానికి గురయిన ఆమె వారి గురించి ఒక మాట మాట్లాడేందుకు సాహసించలేకపోతున్నఈ తరుణంలో ఆమెను సీమాంధ్రలో పర్యటించవలసిందిగా బొత్స సత్యనారాయణ కోరారు. ఆమెను, కాంగ్రెస్ పార్టీని సీమాంధ్ర ప్రజల ముందు దోషిగా నిలబెడుతున్న ప్రతిపక్షాలను ఎదుర్కొని పార్టీని బ్రతికించుకోవాలంటే ఆమె తప్పనిసరిగా సీమంధ్రలో పర్యటించాలని ఆయన కోరుతున్నారు. ఒకసారి ఆమె సీమాంధ్రకు వచ్చి ప్రజల కోసం తమ పార్టీ ఏమేమి చేయబోతోందో చెపితే చాలు వారు గ్యారంటీగా పడిపోతారని ఆయన హామీ ఇస్తున్నారు. అయితే ఆమె మాత్రం వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం.   ఆమె రాజకీయ సలహాదారులు మాత్రం ఈ విభజన వేడి తగ్గి ప్రజలు శాంతించే వరకు మరికొంత కాలం ఆగి వెళితేనే మేలని సూచిస్తున్నారు. కానీ తమ రాజకీయ ప్రత్యర్ధి నరేంద్ర మోడీ పర్యటన ఖరారు అవుతుండటంతో బహుశః కనీసం యువరాజ వారినయినా సీమాంధ్ర ప్రజలను అనుగ్రహించేందుకు పంపించవచ్చును.

త్వరలో మోడీ సీమాంధ్ర పర్యటన

  పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లు అమోదం పొందిన వెంటనే, అందుకు సహకరించిన బీజేపీ సీమాంధ్ర ప్రజల ప్రతిస్పందన తెలుసుకొనేందుకు వెంకయ్య నాయుడిని పంపింది. ఆయన విజయవాడలో నిర్వహించిన కొన్ని సమావేశాలలో ఎటువంటి వ్యతిరేఖత కనబడకపోవడంతో, ఆయన త్వరలోనే నరేంద్ర మోడీని కూడా సీమాంధ్ర పర్యటనకు తీసుకువస్తానని ప్రకటించారు. ఆ తరువాత రెండు మూడు రోజులలోనే ఆయన పర్యటన దాదాపు ఖరారు అయిపోయింది. పార్టీ సీనియర్ నేత హరిబాబు మాట్లాడుతూ నరేంద్ర మోడీ వచ్చే నెల20- ఏప్రిల్ 10తేదీల మధ్య వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి నగరాలలో పర్యటించి ఎన్నికల ప్రచారం చేస్తారని ప్రకటించారు. ఆయన పర్యటన పూర్తి వివరాలను త్వరలో తెలియజేస్తామని ఆయన మీడియాకు తెలిపారు.

తెరాస కాదంటే కాంగ్రెస్ ఖేల్ ఖతం?

  తెరాస, కాంగ్రెస్ పార్టీలో విలీనం కాకపోయినా కనీసం పొత్తులకయినా అంగీకరిస్తుందని నిన్నటి వరకు కూడా అందరూ భావించారు. కానీ ఒక్క రోజులోనే పరిస్థితులు, వ్యూహాలు అన్నీ మారిపోయాయి. ఇప్పుడు రెండు పార్టీలు ఒకదానిపై మరొకటి కత్తులు నూరుకొంటున్నాయి. అందుకు ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ తన సీమాంధ్ర శాఖను పణంగాపెట్టి మరీ తెలంగాణా రాష్ట్రం మంజూరు చేసినప్పటికీ, కేసీఆర్ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయకుండా, కనీసం ఎన్నికల పొత్తులకి కూడా అయిష్టత చూపడమే. పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదం పొందిన తరువాతనే విలీనాలు, పొత్తుల గురించి ఆలోచిద్దామని ఇంతకాలం చెపుతూ వచ్చిన కేసీఆర్, ఇప్పుడు బిల్లు ఆమోదం పొందిన తరువాత కాంగ్రెస్ పార్టీతో కనీసం పొత్తులకి కూడా అంగీకరించకుండా ఉండేందుకు ఏవో కుంటి సాకులు చెప్పి తప్పించుకొనే ఆలోచనలు చేస్తున్నారని కాంగ్రెస్ ఆగ్రహంగా ఉంది. అందుకే నిన్న కేంద్రమంత్రి జైరాం రమేష్ తెరాసపై తీవ్రంగా విరుచుకు పడ్డారు.   అయితే, కేసీఆర్ మరియు ఆయన అనుచరులు కూడా ఏదో విధంగా కాంగ్రెస్ పార్టీని వదిలించుకోనేందుకే చూస్తున్నారు గనుక, జైరాం రమేష్ చేసిన విమర్శలు అందిపుచ్చుకొని ప్రతివిమర్శలు చేస్తూ, పద్ధతి ప్రకారం తెగతెంపులకి సిద్దమయిపోయారు. రాష్ట్ర విభజన చేసి తెలంగాణాలో అనుకూల ఓటుతోను, సీమాంధ్రలో కిరణ్ కుమార్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిల ద్వారా వ్యతిరేఖ ఓటుతోను కేంద్రంలో మళ్ళీ అధికారం చేజిక్కించుకొనేందుకు కీలకమయిన యంపీ సీట్లు పోగేసుకోవాలని అడియాసకు పోయి కాంగ్రెస్ అధిష్టానం రచించిన వ్యూహం బెడిసికొట్టినట్లు కనబడుతోంది ఇపుడు పరిస్థితులు చూస్తుంటే. ఒకవేళ తెరాస ఇప్పుడు గిల్లి కజ్జాలు ఇప్పుడు తెరాస గిల్లి కజ్జాలు పెట్టుకొని దూరమయిపోయినట్లయితే తెలంగాణాలో తెరాసను డ్డీకొని ఎదురునిలవలేక అక్కడా తుడిచిపెట్టుకు పోవడం ఖాయం. కాంగ్రెస్ పార్టీయే తెలంగాణా ఇచ్చినప్పటికీ ఆవిషయాన్ని ప్రజలలోకి తీసుకు వెళ్ళడంలో ఘోరంగా విఫలమయిన టీ-కాంగ్రెస్ నేతలు, ఇక విజయోత్సాహంతో ఉన్న తెరాసను ఏవిధంగా ఎదుర్కొని నిలువగలరు?   ఒకవేళ తెరాస కనుక బీజేపీతో చేతులు కలిపినట్లయితే ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో ఒక్కసీటు కూడా సాధించడం కల్ల. ఆ రెండు పార్టీలు చేతులు కలిపినట్లయితే ఆధాటికి కాంగ్రెస్ పార్టీ గడ్డిపోచలా కొట్టుకుపోవడం ఖాయం. వారికి నరేంద్ర మోడీ కూడా వచ్చి జేరితే ఇక తెలంగాణాలో కాంగ్రెస్ పరిస్థితి ఏవిధంగా తయారవుతుందో చాలా తేలికగానే ఊహించుకోవచ్చును.   ఆరిపోయే దీపం మరింత ఎక్కువ వెలిగినట్లు బహుశః కాంగ్రెస్ పార్టీకి చివరి ఘడియలు వచ్చినందునే ఇటువంటి అతితెలివికిపోయి తన భస్మాసుర హస్తాన్ని తన నెత్తి మీదే పెట్టుకొంది పాపం!

తెదేపాలోకి కాంగ్రెస్ నేతల వలసలు

  ఇంతకాలం మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి సమైక్య పోరాటం చేసిన మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాప రెడ్డి, టీజీ వెంకటేష్ తదితరులు ఇప్పుడు ఆయన కొత్త పార్టీ పెట్టబోతుంటే అందులో చేరకుండా తెదేపాలో చేరేందుకు సిద్దపడటం ఆశ్చర్యం కలిగిస్తున్నా మంచి రాజకీయ అనుభవజ్ఞులయిన వారు ముగ్గురు రానున్న ఎన్నికలలో తెదేపాకే విజయావకాశాలున్నాయని ఖచ్చితంగా నమ్ముతున్నట్లు అర్ధమవుతోంది. వారితో బాటు కాంగ్రెస్ శాసనసభ్యుడు అదలా ప్రభాకర్ రెడ్డి కూడా నిన్న చంద్రబాబుని కలిసి మాట్లాడారు. అందువలన ఆయన కూడా తెదేపాలో చేరుతున్నట్లే భావించవచ్చును. వీరు గాక వైజాగ్ నుండి నలుగురు కాంగ్రెస్ శాసనసభ్యులు కూడా తెదేపాలో చేరబోతున్నారు. ఇది తేదేపాకు శుభసూచకమే అయినప్పటికీ ఒకేసారి ఇంతమంది కొత్తవారు వచ్చి పార్టీలో చేరుతుంటే, ఎంతో కాలంగా పార్టీని నమ్ముకొని పనిచేస్తూ టికెట్స్ ఆశిస్తున్న వారు ఆందోళన చెందవచ్చును. అందరికీ టికెట్స్ కేటాయింపు సాధ్యం కాదు గనుక బహుశః త్వరలోనే తెదేపాలో అలకలు, బుజ్జగింపుల పర్వం మొదలవుతుందేమో!

ఏపీ యన్జీవోలకు కొత్త పార్టీలో టికెట్స్

కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టడం గురించి ఆయన నేరుగా మాట్లాడకుండా తన సహచరులతో ఒకటొకటిగా వివరాలు వెల్లడిస్తున్నారు. ఆయన మార్చి రెండవ తేదీన రాజమండ్రీలో భారీ బహిరంగ సభపెట్టి అక్కడ తన కొత్త పార్టీ జెండా, ఎజెండా, పార్టీ చిహ్నం, మ్యానిఫెస్టో ప్రకటిస్తారని కొద్ది రోజుల క్రితమే ఆయనకు సన్నిహితంగా మెలుగుతున్న ఒక మాజీ మంత్రి ఒకరు ప్రకటించారు. ఇప్పుడు యంపీ రాయపాటి సాంభశివరావు మీడియాతో మాట్లాడుతూ కిరణ్ కుమార్ రెడ్డి మరొక రెండు మూడు రోజుల్లో  కొత్త పార్టీ ప్రకటిస్తారని, అందులో 50శాతం టికెట్స్ ఏపీయన్జీవోలకు, మిగిలిన 50శాతం రాష్ట్ర విభజనకు వ్యతిరేఖంగా పోరాడిన నేతలకి కేటాయిస్తారని ప్రకటించారు.ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాలని ఉవ్విళ్ళూరుతున్న ఏపీ యన్జీవో సంఘాల అధ్యక్షుడు అశోక్ బాబు, మరికొందరు ఉద్యోగులు కిరణ్ పెట్టె కొత్త పార్టీ ద్వారా రాజకీయ ఆరంగ్రేటం చేయబోతున్నారని స్పష్టమవుతోంది.

కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి

      మెదక్ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ రోజు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటి అయిన విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ కండువా కప్పి విజయశాంతిని పార్టీలోకి ఆహ్వానించారు. శివుడి భక్తురాలినని, శివరాత్రి చాలా మంచి రోజు కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. తెలంగాణ పై సోనియా గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని, తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ లో చేరుతానని చెప్పానని, అందుకే తను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని అన్నారు. రాజకీయ నాయకులు ఎవరైనా మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండాలని చెప్పారు.

బాబుతో భేటి: టిడిపిలోకి 7గురు ఎమ్మెల్యేలు

      తెలుగుదేశంలోకి కాంగ్రెస్ కి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేల చేరిక ఖరారు అయినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టికి చెందిన టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి, గంటా శ్రీనివాసరావు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారితో సమావేశమయ్యారు. గత కొంతకాలంగా వీరు టిడిపిలో చేరుతారని వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఈ భేటి ప్రాధాన్యతను సత్కరించుకుంది. వీరే కాకుండా విశాఖ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు అవంతి శ్రీనివాస్ (భీమిలి), వెంకట్రామయ్య (గాజువాక), రమేష్ బాబు (పెందుర్తి), కన్నబాబు (ఎలమంచిలి) కూడా టిడిపి అధినేతతో సమావేశమయ్యారు. వీరందరూ తమ జిల్లాలలో ప్రజాగర్జన సభలు నిర్వహించే సమయంలో పార్టీలో చేరనున్నట్లు సమాచారం.

సమన్యాయం..మాయం

      ఏపీలో నిన్న.. మొన్నటి వరకు వినిపించిన సమన్యాయం మాయమైంది. విభజన ప్రక్రియకు ఆమోదముద్ర మాత్రమే మిగిలిన దశలో రాజకీయ పార్టీల నినాదాలు మారిపోయాయి. అందరికంటే ముందుగా తెలుగుదేశం పార్టీ తన సమన్యాయ సిద్ధాంతాన్ని సవరించింది.   తెలంగాణా, రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాలలో బలమైన కేడర్ ఉన్న టీడీపీ తన  పూర్వవైభవాన్ని సాధించేందుకు కార్యరంగంలోకి దూకింది. అధినేత దిశానిర్దేశంలో టీడీపీ సీనియర్లు ఏ ప్రాంత అవసరాలను బట్టి ఆ నినాదంతో ముందుకు వెళుతున్నారు.      తన 9 ఏళ్ళ పదవీకాలంలో హైదరాబాద్ ను హైటెక్ సిటీగా తీర్చిదిద్దిన బాబు.. తెలంగాణను అభివృద్ధి చేసింది నేనే .. రాబోయే రోజుల్లో సామాజిక తెలంగాణా నాతోనే సాధ్యం అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా ప్రపంచపటంలో నిలిపానని.. ఇప్పుడు అవషేశాంద్ర ప్రదేశ్ తానే పునర్ నిర్మించగలనని సవాల్ చేసి చెబుతున్నారు.   టీడీపీ ఏమి చేస్తుందో చెబుతున్న బాబు.. ఇతర పార్టీలు అధికారంలోకి వస్తే ఏమవుద్దో వివరించి చెబుతున్నారు. జగన్ పార్టీ అధికారంలోకి వస్తే సీమాంద్రకు చక్కని రాజధాని బదులు ...చంచల్ గూడ జైలు నిర్మిస్తాడని బాబు వ్యగ్యంగా వ్యాఖ్యానించారు. విజయనగరం లో టీడీపీ నిర్వహించిన ప్రజగర్జనలో బాబు సమన్యాయం నుంచి ..న్యూ టర్న్ తీసుకోవడం నేతలు, కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపింది. దిక్కులేని అక్కుపక్షిలా మారిన సీమాంద్రకు బాబు నాయకత్వమే కరెక్ట్ అని కొందరు విశ్లేషిస్తుంటె .. విజన్ 20-20 రూపకర్త,, స్వర్ణాంద్ర సారధి అవశేషా ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలపగలడని, హైదరాబాద్ కు ధీటైన రాజధాని నిర్మించగలదని విస్వసిస్తున్నారు.  

చివరికి పవన్ కళ్యాణ్ కూడా దూరమయ్యాడు

  ఈరోజు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ మొట్ట మొదటి సినిమా షూటింగ్ హైదరాబాదులో ప్రారంభమయింది. దానికి చిరంజీవి, పవన్ కళ్యాణ్ తదితరులు అందరూ వచ్చారు. కానీ, పవన్ కళ్యాణ్ మర్యాద పూర్వకంగానయినా సోదరుడు చిరంజీవిని పలుకరించే ప్రయత్నం చేయలేదు. ఆయన అభిమానులను ఉద్దేశ్యించి మాట్లాడుతుండగా పవన్ కళ్యాణ్ చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయారు. అందరితో ఎంతో ఆత్మీయంగా మెలిగే పవన్ కళ్యాణ్ ఆయనను కనీసం పలుకరించేందుకు కూడా ఇష్టపడకపోవడం గమనిస్తే, ఆయన చివరికి కుటుంబ సభ్యులని కూడా ఎంతగా దూరం చేసుకొన్నారో అర్ధమవుతోంది. అంతకంటే ముఖ్యంగా ఆయన సగటు తెలుగు ప్రజల అభిమానాన్ని ఎంతగా పోగొట్టుకొన్నారో ఈ సంఘటన తెలియజేస్తోంది.   మూడు రోజుల క్రితం ఆయనే స్వయంగా “కాంగ్రెస్ అధిష్టానం నాకు ఏ భాద్యత అప్పగించినా సవినయంగా స్వీకరిస్తానని” చెప్పారు. కానీ మళ్ళీ ఆయనే ఈరోజు “నేను ముఖ్యమంత్రి పదవి కోసం ఎన్నడూ అర్రులు చాచలేదు. మీడియానే ఈ విషయంలో అనవసరమయిన రాద్దాంతం చేసింది,” అని ఆయన చెప్పే మాటలు వినేందుకు మనస్కరించకే బహుశః పవన్ కళ్యాణ్ అక్కడి నుండి నిష్క్రమించారనుకోవచ్చు.   ఈవిధంగా చిరంజీవి కాక మరే రాజకీయ నాయకుడు ప్రవర్తించినా ప్రజలు కూడా అంతగా పట్టించుకొనేవారు కాదు. కానీ, ఇంతకాలంగా వారు గుండెల్లో పెట్టి పూజించుకొన్న తమ మెగా దేవుడే ఒక సామాన్య రాజకీయ నాయకుడిలా వ్యవహరించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అదే అభిప్రాయం ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ ఈరోజు వెలిబుచ్చారనుకోవచ్చును. ఇదంతా చూసి బహుశః ఆయన మారే ప్రయత్నం చేస్తే చేయవచ్చు, చేయకపోవచ్చును. కానీ ఈ రెండేళ్ళ రాజకీయ జీవితంలో ఆయన బయటపెట్టుకొన్న తన అసలు రూపం ప్రజలెన్నటికీ మరిచిపోలేరు.

మెగా ప్రస్తానం

  మెగా స్టార్ చిరంజీవి సినీ పరిశ్రమ నుండి బయటకి వచ్చి రాజకీయాలలోకి అడుగుపెట్టిన తరువాత పరిశ్రమలో ఆయనకి ఎంత వ్యతిరేఖత ఉందో బయటపడింది. డా.రాజశేఖర్ రెడ్డి దంపతులు, మోహన్ బాబు, అనేక మంది చిన్ననిర్మాతలు ఆయనను ద్వేషించారు. ఇక యువ హీరో ఉదయ కిరణ్ సినీ జీవితం దెబ్బతినడంతో అతను అర్ధాంతరంగా జీవితానికి ముగింపు పలికి వెళ్ళిపోయినప్పుడు, చాలా మంది ఆయననే వేలెత్తి చూపారు.   రాజకీయాలలోకి వచ్చిన తరువాత కూడా ఆయన విమర్శలు మూటగట్టుకొంటూనే ఉన్నారు. ఆయన ప్రజారాజ్యం స్థాపించినపుడు లక్షలాది ఆయన అభిమానులు, ప్రజలు ఆయన వంక ఎంతో ఆశగా ఎదురు చూసారు. హనుమంతుడిలా అన్నకు జీవితాంతం తోడుంటానని చెప్పి పార్టీలో చేరిన ఆయన వీరాభిమాని పోసాని కృష్ణ మురళి, కొద్ది రోజులలోనే ఆయన తీరుని అసహ్యించుకొంటూ ఆయనకు దూరం జరిగారు. ఆ తరువాత ఆయనను నమ్ముకొని వచ్చిన రాజకీయనాయకులు, అభిమానుల ఆశలన్నీ అడియాసలు చేస్తూ ఎన్నికలు కూడా మొదలవక మునుపే ఆయన పార్టీ పతనం ప్రారంభమయి, ఫలితాలు వెలువడిన కొద్ది నెలలకే ప్రజారాజ్యం ప్రస్థానం ముగిసిపోయింది.   కేంద్రమంత్రి పదవి కోసం తనను నమ్ముకొన్న ప్రజలను, పార్టీ కార్యకర్తలను నట్టేట ముంచి ఆయన తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపి వేసినప్పటి నుండి క్రమంగా ప్రజలు, అభిమానులు, చివరికి స్వంత సోదరులు పవన్ కళ్యాణ్, నాగబాబు కూడా దూరం కాసాగారు. తెలుగు ప్రజల అత్మాభిమానానికి, గౌరవానికి నిలువెత్తు ప్రతీకగా నిలుస్తారని అందరూ భావిస్తే, ఆయన సోనియాగాంధీ ముందు ‘జీ హుజూర్!’ అంటూ ఆయన చేతులు కట్టుకొని నిలబడటం తెలుగు ప్రజలకు, ముఖ్యంగా ఆయన అభిమానులకు చాలా బాధ కలిగించింది.   తెలంగాణా ఉద్యమాలు పతాక స్థాయిలో జరుగుతున్నపుడు ఆయన తాను సమైక్యవాదినని ప్రకటించుకొని తెలంగాణా ప్రజలనూ దూరంచేసుకొన్నారు. అయితే ఆయన సమైక్య వైఖరివల్ల కనీసం సీమాంద్రలో కూడా మంచి పేరు సంపాదించుకోలేకపోయారు. కారణం ఆయన కాంగ్రెస్ అధిష్టానానికి అనుకూల వైఖరి అవలంబించడమే. ఆ తరువాత రాష్ట్ర విభజన వ్యవహారంలో ఆయన వ్యవహరించిన తీరుతో ఆయన మూడు దశాబ్దాలు శ్రమించి సంపాదించుకొన్న పేరు ప్రతిష్టలను చేజేతులా పాడుచేసుకొన్నారు. సీమాంధ్ర ప్రజలు రాష్ట్రవిభజన జరిగినందుకు ఎంతో బాధపడుతుంటే, ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం ఆరాటపడటం చూసి ప్రజలు తీవ్ర ఆగ్రహం చెందారు. అయితే, వ్రతం చెడినా ఫలం దక్కనట్లయింది ఆయన పని. ముఖ్యమంత్రి పదవి ఆశించి అటు అధిష్టానం వద్ద భంగపడ్డారు. ఇటు ప్రజల ముందు కూడా చులకనయిపోయారు.

శివనామస్మరణతో మార్మోగుతున్న ఆలయాలు

      మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివనామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచే ఆలయాలకు భక్తులు బారులు తీరారు.   శ్రీశైలం: మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం పుణ్య క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచి భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి దేవదేవున్ని దర్శించుకుంటున్నారు. కేంద్రం మంత్రి పురంధేశ్వరి దంపతులు మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. వరంగల్ : శివరాత్రి సందర్భంగా వేయిస్తంభాల ఆలయానికి భక్తులు పోటెత్తారు. దుర్గేశ్వర ఆలయం, భోగేశ్వరాలయం, ఐనవోలు, పాలకుర్తి, సిద్ధేశ్వర ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయవాడ : మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని కృష్ణానదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. పాత శివాలయం, యనమలకుదురు, రామలింగేశ్వర ఆలయాల్లో భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీ దృష్ట్యా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. చిత్తూరు : శివరాత్రి పండుగ సందర్భంగా జిల్లాలోని శివాలయాలు భక్తులతో పోటెత్తుతున్నాయి. శ్రీకాళహస్తి,కపిలతీర్థం. సదాశివకోన, కైలాసకోన, తలకోన సిద్దేశ్వర ఆలయం, మల్లయ్యకొండ, రుద్రకోటి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఖమ్మం జిల్లాలో శివరాత్రి సందర్భంగా శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. నీలాద్రి, తీర్థాల, గణపేశ్వరస్వామి, మృత్యుంజయస్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. భద్రాద్రి దేవాలయం శివనామస్మరణతో మార్మోగింది. భద్రాచలం గౌతమి తీరంలో భక్తుల కోలాహలం అధికంగా ఉంది. వైరా మండలం స్నానాలలక్ష్మీపురంలోని శివాలయంలో డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిలాబాద్ : పండుగ సందర్భంగా శివాలయాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంది. గోదవరిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు శివున్ని దర్శించుకుంటున్నారు. జైపూర్ మండలం వేలాలలో శివరాత్రిజాతర ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. నిర్మల్, కాగజ్‌నగర్‌లోని పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.  

యువరాజవారి తాజా లెక్చర్

  మన యువరాజ వారికి అవకాశం దొరకాలే కానీ ఏవిషయంపైనైనా అనర్గళంగా లెక్చర్లు దంచుతుంటారు. కానీ, ‘ఎదుటవాడికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి’ అని ఎవరో కవి చెప్పినట్లు ఆయన లెక్చర్లు కూడా ఎదుటవాడి కోసమే తప్ప అవి తనకు, తన పార్టీకి వర్తింపవని ఆయన దృడంగా నమ్ముతారు. అందుకే తమ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోఉన్న డిల్లీలోనే ఏడాదిన్నర క్రితం ఒక అబల మీద బస్సులో సామూహిక అత్యాచారం జరిగితే నోరు మెదపని ఆయన, నిన్న అస్సోం డాన్ బాస్కో విశ్వవిద్యాలయంలో విద్యార్దినులతో మాట్లాడుతూ ‘మహిళలు-రక్షణ’ అనే అంశంపై చిన్న లెక్చర్ దంచిన తరువాత, అలా దంచినందుకు చాలా బాధ కలుగుతోందని, కానీ ఆవేశం ఆపుకోలేక దంచిపడేశానని ముగించారు. భారత్ జనాభాలో సగం ఉన్న మహిళలకు భద్రత, సమాజంలో సమాన హోదా, గౌరవం కల్పించిన తరువాతనే భారత్ సూపర్ పవర్ గా ఎదగడం గురించి మాట్లాడుకోవచ్చని ఒక ఉచిత అభిప్రాయం కూడా వ్యక్తం చేసారు. నిజానికి డిల్లీలో ఆ ఘోర సంఘటన జరిగిన తరువాత నుండి డిల్లీతో సహా దేశ వ్యాప్తంగా మహిళల మీద చివరికి అన్నెం పున్నెం ఎరుగని బాలికలు, పసిపిల్లల మీద అత్యాచారాలు విచ్చలవిడిగా జరుగుతున్నా, మన యువరాజవారు ఏనాడు నోరు మెదిపిన పాపాన పోలేదు. కనీసం తమ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాష్ట్రాలలోనయినా అటువంటి ఘోర అకృత్యాలు జరుగకుండా నివారించేందుకు తగిన చర్యలు చెప్పట్టమని గట్టిగా ఆదేశించి ఉండవచ్చును. కానీ, యువరాజవారికి లెక్చర్లు దంచడంపై ఉన్న మక్కువ, నేర్పు వాటిని ఆచరణలో పెట్టడంలో కనబడదు. కనుక, మతకలహాలు జరిగినప్పుడు ఆయన బీజేపీని విమర్శించవచ్చు. ఉగ్రవాదుల దాడులు జరిగినప్పుడు తండ్రిని నాయనమ్మను తలచుకొని బాధపడవచ్చును. అది ఎన్నికల సమయం అయితే ‘తను కూడా ఏదో ఒకనాడు ఉగ్రవాదుల దాడిలో చనిపోతానేమో’ నని సానుభూతి ఓట్లు ఆశించవచ్చును. ఆదర్శ్ కుంభకోణాలు బయటపడినప్పుడు తను ప్రతిపాదించిన అవినీతి బిల్లుల గురించి వాటికి ప్రతిపక్షాల సహాయ నిరాకరణ చేయడం గురించి లెక్చర్లు దంచవచ్చును. టాపిక్ ఏదయినా సరే లెక్చర్ కి రెడీ...దటీజ్ ప్రిన్స్ స్టైల్...

పాపం చిరంజీవి!

  చిరంజీవి ముఖ్యమంత్రి కావడం దాదాపు ఖాయమయిపోయినట్లేనని నిన్నటి వరకు వార్తలు వచ్చాయి. చిరంజీవిని ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు సిద్దంగా ఉండమని దిగ్విజయ్ సింగ్ కోరినట్లు కూడా విన్నాము. చిరంజీవి కూడా తను కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే ఏ బాధ్యతయినా చెప్పట్టేందుకు సిద్దమని ఒక స్టాండర్డ్ డైలాగ్ కూడా పలికేసారు. ఆ తరువాత ఆయన రాష్ట్రపతిని కూడా కలిసి వచ్చారు. ఇక మరో గంటో ఘడియలోనో కాంగ్రెస్ అధిష్టానం ఆయన పేరుని అధికారికంగా ప్రకటిస్తుందని అందరూ భావిస్తుంటే, మళ్ళీ రాష్ట్రపతిపాలన విదించబోతున్నట్లు వార్తలు గుప్పుమనడంతో చిరంజీవి ముఖ్యమంత్రి అవ్వాలనే కల పగటికలగానే మిగిలిపోనుందని స్పష్టమవుతోంది. డిల్లీ నుండి నిన్నహైదరాబాద్ కు తిరిగివచ్చిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, “నేను ముఖ్యమంత్రి రేసులో లేను. ఉన్నానని మీడియానే అనవసరంగా లేనిపోని ప్రచారం చేసింది,” అని చిరుబురులాడుతూ వెళ్ళిపోయారు.   అయితే చివరి నిమిషంలో ఇలా ఎందుకు జరిగింది? ఆయన ముఖ్యమంత్రి కాకుండా ఎవరు అడ్డు పడ్డారు? అని ఆలోచిస్తే పోటీలో ఉన్న మిగిలిన అభ్యర్దులేనని చెప్పక తప్పదు. నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన చిరంజీవి నేరుగా కేంద్రమంత్రి పదవి పొందడమే కాకుండా ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి పదవి కూడా పోటీకి రావడం, ఆ పదవి ఆశిస్తున్న బొత్స సత్యనారాయణ, కన్నా లక్ష్మి నారాయణలు జీర్ణించుకోవడం కష్టమే. కనుక వారిరువు చేతులు కలిపి మిగిలిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరినీ తమవైపు తిప్పుకోవడంతో చిరంజీవి పరిస్థితి అకస్మాత్తుగా తారుమారయి ఉండవచ్చును. పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న బొత్సకు మిగిలిన వారిని తనవైపు తిప్పుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ, రాజకీయ పరిపక్వత, తనకంటూ ఒక ముటా లేని మేస్త్రి చిరంజీవికి చెక్కభజన చేసేందుకు ఒక్క రామచంద్రయ్య తప్ప మరెవరూ లేకపోవడంతో రేసులో ఓడిపోయారు. ఇంతవరకు తన వెంట నీడలా మసులుకొంటూ నిత్యం గంట కొట్టే శ్రీనివాసరావు కూడా లేకపోవడంతో పాపం! చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఒంటరి జీవి అయిపోయారు.   ఈ అవమానం సరిపోదన్నట్లు, నిన్న తిరుపతి వచ్చిన కేంద్రమంత్రి జైరాం రమేష్ మీడియాతో మాట్లాడుతూ “చిరంజీవే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ‘ఓపెనింగ్ బ్యాట్స్ మ్యాన్’ గా రాబోతున్నారని జోకేసారు. మూడు నెలలు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ముచ్చట తీర్చుకోనేందుకే సహకరించని బొత్స, ఆనం, కన్నా, డొక్కా, కొండ్రు తదితరులు, ఎన్నికల తరువాత చిరంజీవిని శాస్వితంగా ముఖ్యమంత్రిగానో లేక పీసీసీ అధ్యక్షుడిగానో నియమించేందుకు ఎందుకు అంగీకరిస్తారు? అని ఆలోచిస్తే జైరాం కూడా కుళ్ళు జోక్ వేసారని అర్ధమవుతుంది. అయినా ఎన్నికలలో గెలుస్తుందో లేదో తెలియని కాంగ్రెస్ పార్టీ చిరంజీవి ఇంకా ఎందుకు ఆశలు కల్పిస్తోందంటే, కనీసం ఎన్నికలలో ప్రచారానికయినా పనికొస్తాడనే ఉద్దేశ్యంతోనే తప్ప వేరే దురుదేశ్యం ఏమీ లేదు.    

బొత్స తులసి వనంలో గంజాయి మొక్క: చంద్రబాబు

  బుధవారం సాయంత్రం విజయనగరంలో జరిగిన ప్రజాగర్జన సభలో ఊహించని స్థాయిలో ప్రజలు భారీగా తరలిరావడంతో చంద్రబాబు నాయుడులో ఉత్సాహం కట్టలు తెంచుకొంది. ఆ ఊపులో సోనియా గాంధీ, జగన్మోహన్ రెడ్డి మొదలు జిల్లా మంత్రి బొత్ససత్యనారాయణ వరకు అందరినీ తీవ్ర పదజాలంతో ఏకి పడేసారు. దేశంలో అన్ని సమస్యలకు మూల కారకురాలు సోనియాగాంధీయేనని, ఆమె ఒక పెద్ద అనకొండవంటి అవినీతి సర్పమని, రాష్ట్రంలో కూడా ఆమె అనేక చిన్నా పెద్దా అనకొండలను తయారు చేసి ప్రజల మీదకు వదిలిందని, వారిలో జగన్మోహన్ రెడ్డి, బొత్ససత్యనారాయణ కొందరని ఆయన ఎద్దేవా చేసారు. ఎందరో మహానుభావులు పుట్టి నడయాడిన విజయనగరం వంటి పవిత్రమయిన స్థలంలో బొత్ససత్యనారాయణ వంటి వారు తులసి వనంలో గంజాయి మొక్కలా పెరిగిపోయారని అందుకు విజయనగరం ప్రజలందరూ చాలా బాధపడుతున్నారని ఆయన అన్నారు. అటువంటి అవినీతి అనకొండలను ప్రజలందరూ బెబ్బులి పులిలా, జస్టిస్ చౌదరిలా ఎదుర్కొని ఓడించాలని ఆయన హితవు పలికారు. అసలు కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతీ వ్యక్తిని కూడా సమాజం నుండి వెలేయవలసిన అవసరం ఉందని అన్నారు.   తెదేపాను ఎన్నికలలో ఎదుర్కోలేక దొంగచాటుగా దెబ్బతీసేందుకు రాష్ట్ర విభజన చేసి తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టిన కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు రాజధాని అంశంతో సీమాంధ్ర ప్రజల మధ్య చిచ్చుపెట్టి ఎన్నికల గండం గట్టెక్కాలని కుట్రలు పన్నుతోందని ఆయన ఆరోపించారు. హైదరాబాదుని అభివృద్ధి చేసి రాష్ట్రానికి, దేశానికి అంతులేని సంపద సృష్టించిన తాను, అధికారం ఇస్తే హైదరాబాదును తలదన్నేలా గొప్ప రాజధాని నగరం నిర్మిమించగలనని హామీ ఇచ్చారు.   రాష్ట్ర విభజనతో తెలుగు ప్రజలను ఘోరంగా అవమానించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వేర్వేరు వేషాలు వేసుకొని ప్రజల ముందుకు వస్తోందని అందువల్ల ప్రజలందరూ అప్రమత్తతతో ఉంటూ వాటిని ఓడించాలని కోరారు. కాంగ్రెస్, జగన్ కాంగ్రెస్, కిరణ్ కాంగ్రెస్, తెరాసలలో ఏ ఒక్క పార్టీకి వేసిన తిరిగి అవి కాంగ్రెస్ పార్టీ ఖాతాలోనే జమా అవుతాయనే సంగతి ప్రజలు మరిచిపోరాదని ఆయన హెచ్చరించారు. కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే తెలుగు ప్రజలకు జవాబు దారీగా ఉంటుందని మిగిలిన అన్ని పార్టీలు డిల్లీ నుండి సోనియాగాంధీ ఏవిధంగా ఆడిస్తే ఆవిధంగానే ఆడుతాయని, ఆమెకు కానీ, ఆమె సృష్టించిన పార్టీలకు గానీ తెలుగు ప్రజల అభిప్రాయలు, సమస్యలు పట్టవని ఆక్షేపించారు.   స్వర్గీయ నందమూరి తారకరామారావు తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడటం కోసం కేంద్రంతో అలుపెరుగని పోరాటం చేస్తే, బొత్ససత్యనారాయణ వంటి నేతలు ముఖ్యమంత్రి పదవి కోసం తెలుగు ప్రజల గౌరవాన్ని సోనియా గాంధీ కాళ్ళ ముందు పెడుతున్నారని ఆక్షేపించారు. అందువల్ల అటువంటి సిగ్గుమాలిన, స్వార్ధ, అవినీతి రాజకీయ నేతలకు రానున్న ఎన్నికలలో డిపాజిట్లు కూడా దక్కనీయకుండా ఓడించి గుణపాటం చెప్పాలని ఆయన ప్రజలను కోరారు.

కొనసాగుతున్నకేసిఆర్ ర్యాలీ..ఒంటెపై హరీష్

      కేసీఆర్ రాకతో బేగంపేట నుంచి గన్ పార్క్ వరకూ పెద్ద పండుగ వాతావరణం నెలకొన్నది. అభిమానులు గులాబి పూలతో కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా కేసీఆర్ ప్రజలకు అభివాదం చేస్తూ ప్రత్యేక వాహనంలో ముందుకు కదిలారు. కేసీఆర్‌ను చూడడంతోనే ప్రజలు జై తెలంగాణ అని నినాదించారు. బేగం పేట విమానాశ్రయం నుంచి గన్ పార్క్‌కు బయలుదేరిన ర్యాలీకి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం క్యాంపు ఆఫీసు, పంజగుట్ట, నిమ్స్, ఖైరతాబాద్, లక్డీ కా పూల్ మీదుగా ఈ ర్యాలీ గన్ పార్క్‌కు చేరుకుంటుంది. టీఆర్ఎస్ నాయకుడు హరీశ్‌రావు ఒక ఒంటెపై ఎక్కి కూర్చుని ర్యాలీలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు అందరూ వేర్వేరు వాహనాలలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజలు అడుగడుగునా వారికి బ్రహ్మరథం పట్టారు.

కేసిఆర్ విజయోత్సవ ర్యాలీ ప్రారంభం

      టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసిఆర్ ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్రవిభజన తరువాత తొలిసారిగా తెలంగాణ గడ్డపై అడుగుపెట్టిన కేసిఆర్ కు తెలంగాణావాదులు, తెరాస కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. జై తెలంగాణ, జై కేసిఆర్ నినాదాలతో విమానశ్రయ ప్రాంగణం మారుమోగింది. అక్కడ చిన్న చార్టర్డ్ విమానంలో బేగంపేట విమానశ్రయానికి చేరుకున్నారు. బేగంపేట విమానశ్రయంలో కేసిఆర్ కి ఘన స్వాగతం లభించింది. కేసిఆర్ ఆశీర్వదిస్తూ సర్వమత ప్రార్ధనలు చేశారు. ప్రత్యేక రూపొందించిన వాహనంలో ఆయన బేగంపటే విమానాశ్రయం నుంచి తన ర్యాలీని ప్రారంభించారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు కెసిఆర్‌పై పూలవర్షం కురిపించారు. బేగంపేట నుంచి గన్ పార్క్ వరకు జరిగే ర్యాలీ సందర్బంగా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటులు చేశారు.

జేసి ప్రభాకర్ రెడ్డి భార్య అరెస్ట్

      మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జేసి దివాకర్ రెడ్డి కుటుంబానికి షాక్ తగిలింది. మహబూబ్‌నగర్ జిల్లా పాలెం బస్సు దుర్ఘటన కేసులో జేసి ప్రభాకర్ రెడ్డి సతీమణి ఉమా ప్రభాకర్ రెడ్డిని సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. ఆమెకు మహబూబ్‌నగర్ కోర్ట్ బెయిల్ మంజూరు చేయడంతో విడుదల అయ్యారు. బస్సు ప్రమాదానికి మూడు కారణాలు అని సిఐడి చీఫ్ కృష్ణ ప్రసాద్ చెప్పారు. రోడ్డు డిజైన్, రోడ్డు నిర్మాణంలో లోపాలు, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి తొమ్మిది మంది నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు. 36 సెక్షన్ కింద కేసు నమోదు చేశామన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద గత అక్టోబర్ 30న బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు అగ్నిమాదానికి గురై 45 మంది సజీవదహనమైన సంగతి తెలిసిందే.