పాపం చిరంజీవి!
posted on Feb 27, 2014 6:48AM
చిరంజీవి ముఖ్యమంత్రి కావడం దాదాపు ఖాయమయిపోయినట్లేనని నిన్నటి వరకు వార్తలు వచ్చాయి. చిరంజీవిని ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు సిద్దంగా ఉండమని దిగ్విజయ్ సింగ్ కోరినట్లు కూడా విన్నాము. చిరంజీవి కూడా తను కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే ఏ బాధ్యతయినా చెప్పట్టేందుకు సిద్దమని ఒక స్టాండర్డ్ డైలాగ్ కూడా పలికేసారు. ఆ తరువాత ఆయన రాష్ట్రపతిని కూడా కలిసి వచ్చారు. ఇక మరో గంటో ఘడియలోనో కాంగ్రెస్ అధిష్టానం ఆయన పేరుని అధికారికంగా ప్రకటిస్తుందని అందరూ భావిస్తుంటే, మళ్ళీ రాష్ట్రపతిపాలన విదించబోతున్నట్లు వార్తలు గుప్పుమనడంతో చిరంజీవి ముఖ్యమంత్రి అవ్వాలనే కల పగటికలగానే మిగిలిపోనుందని స్పష్టమవుతోంది. డిల్లీ నుండి నిన్నహైదరాబాద్ కు తిరిగివచ్చిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, “నేను ముఖ్యమంత్రి రేసులో లేను. ఉన్నానని మీడియానే అనవసరంగా లేనిపోని ప్రచారం చేసింది,” అని చిరుబురులాడుతూ వెళ్ళిపోయారు.
అయితే చివరి నిమిషంలో ఇలా ఎందుకు జరిగింది? ఆయన ముఖ్యమంత్రి కాకుండా ఎవరు అడ్డు పడ్డారు? అని ఆలోచిస్తే పోటీలో ఉన్న మిగిలిన అభ్యర్దులేనని చెప్పక తప్పదు. నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన చిరంజీవి నేరుగా కేంద్రమంత్రి పదవి పొందడమే కాకుండా ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి పదవి కూడా పోటీకి రావడం, ఆ పదవి ఆశిస్తున్న బొత్స సత్యనారాయణ, కన్నా లక్ష్మి నారాయణలు జీర్ణించుకోవడం కష్టమే. కనుక వారిరువు చేతులు కలిపి మిగిలిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరినీ తమవైపు తిప్పుకోవడంతో చిరంజీవి పరిస్థితి అకస్మాత్తుగా తారుమారయి ఉండవచ్చును. పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న బొత్సకు మిగిలిన వారిని తనవైపు తిప్పుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ, రాజకీయ పరిపక్వత, తనకంటూ ఒక ముటా లేని మేస్త్రి చిరంజీవికి చెక్కభజన చేసేందుకు ఒక్క రామచంద్రయ్య తప్ప మరెవరూ లేకపోవడంతో రేసులో ఓడిపోయారు. ఇంతవరకు తన వెంట నీడలా మసులుకొంటూ నిత్యం గంట కొట్టే శ్రీనివాసరావు కూడా లేకపోవడంతో పాపం! చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఒంటరి జీవి అయిపోయారు.
ఈ అవమానం సరిపోదన్నట్లు, నిన్న తిరుపతి వచ్చిన కేంద్రమంత్రి జైరాం రమేష్ మీడియాతో మాట్లాడుతూ “చిరంజీవే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ‘ఓపెనింగ్ బ్యాట్స్ మ్యాన్’ గా రాబోతున్నారని జోకేసారు. మూడు నెలలు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ముచ్చట తీర్చుకోనేందుకే సహకరించని బొత్స, ఆనం, కన్నా, డొక్కా, కొండ్రు తదితరులు, ఎన్నికల తరువాత చిరంజీవిని శాస్వితంగా ముఖ్యమంత్రిగానో లేక పీసీసీ అధ్యక్షుడిగానో నియమించేందుకు ఎందుకు అంగీకరిస్తారు? అని ఆలోచిస్తే జైరాం కూడా కుళ్ళు జోక్ వేసారని అర్ధమవుతుంది. అయినా ఎన్నికలలో గెలుస్తుందో లేదో తెలియని కాంగ్రెస్ పార్టీ చిరంజీవి ఇంకా ఎందుకు ఆశలు కల్పిస్తోందంటే, కనీసం ఎన్నికలలో ప్రచారానికయినా పనికొస్తాడనే ఉద్దేశ్యంతోనే తప్ప వేరే దురుదేశ్యం ఏమీ లేదు.