దిల్ సుఖ్ నగర్ పేలుళ్ళ ఘటనకు ఏడాది

గత ఏడాది సరిగ్గా ఇదే రోజు హైదరాబాద్ నగరం బాంబు పేలుళ్ళతో ఉలిక్కి పడింది. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు రాత్రి ఏడుగంటల సమయంలో దిల్ సుఖ్ నగర్ లో కోణార్క్ ధియేటర్ వద్ద,  107 బస్ స్టాప్ వద్ద, ఎ1 మిర్చి సెంటర్ వద్ద బాంబు పేలుళ్లు జరపడంతో 17మంది మృతి చెందగా,  138 మంది గాయాలపాలయ్యారు. ఇప్పటికి బాధితుల కుటుంబాలను ఆ విషాదఛాయలు వెంటాడుతూనే వున్నాయి.  చాలా మంది కుటుంబాలు తమ ఆధారాన్ని కోల్పోయాయి. ఉజ్వల భవిష్యత్తు కనుమరుగై మంచానికే పరిమితమయ్యారు మరికొ౦దరూ, ఆదుకుంటామన్న ప్రభుత్వ౦ చేయూత నివ్వకపోవడంతో...ఇప్పటికి చాలా కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.                       ఈ సందర్భంగా ఘటనా స్థలంకోణార్క్ థియేటర్ వద్ద పలువురు రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు నివాళులర్పించారు. ఘటనలో మృతి చెందిన వారికి పూలమాలలు వేసి, కొవ్వొత్తులు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు. అక్కడికి చేరుకున్న మృతుల బంధువులు ఘటనను తల్చుకుని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పలువురు విద్యార్థులు జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు.  

టీ ఆవిర్భావ తేదీపై దృష్టి పెట్టాం: షిండే

      తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తేదీపై దృష్టి పెట్టినట్లు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. ఈరోజు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు. తెలంగాణ బిల్లు ఆమోదం, ముఖ్యమంత్రి రాజీనామాతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించి నట్లు సమాచారం. గవర్నర్ పంపించిన నివేదిక తమకు ఇంకా అందలేదని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలా లేక కొత్త ముఖ్యమంత్రిని నియమించాలనే దానిపై నిర్ణయం తీసుకోలేదని అన్నారు. రాష్ట్రపాతి పాలన వద్దని ఇరుప్రాంత కాంగ్రెస్ నాయకులు అధిష్టానాన్ని కోరినట్లు తెలిపారు.

ఈ (చిరం)జీవి ప్రయాస దేనికో?

  నిన్న రాజ్యసభలో చిరంజీవి మొట్ట మొదటిసారిగా ప్రసంగించబోతుంటే, అంతవరకు సభ్యుల నినాదాలతో హోరెత్తిన సభ ఒక్కసారిగా నిశబ్దమయింది. ఆయన ఈ అంశం గురించి చాలా అద్భుతంగా ప్రసంగిస్తారని అందరూ ఎదురు చూసారు. కానీ షరా మామూలుగానే ఆయన తడబడుతూ మొదలు బెట్టిన ప్రసంగంలో అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకొనే పనిలో బీజేపీ, తెదేపా, వైకాపాలను విమర్శిస్తూ కాంగ్రెస్ చర్యలను సమర్దించే ప్రయత్నం చేయబోగా ప్రతిపక్షాలు ఇంతకీ “తమరు ఏ పార్టీ తరపున ఏ వైఖరితో మాట్లాడుతున్నారని?”నిలదీయడం చూస్తే ఆయన ప్రసంగం ఎంత అయోమయంగా ఉందో అర్ధమవుతుంది. తాను వ్యక్తిగతంగా, కాంగ్రెస్ వాదిగా రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తున్నాని చెపుతూనే, క్రమశిక్షణ గల కాంగ్రెస్ కార్యకర్తగా తన అధిష్టానం తీసుకొన్న నిర్ణయాన్ని పూర్తిగా సమర్దిస్తున్నానని తెలిపి సోనియమ్మను ప్రసన్నం చేసుకొనే ప్రయత్నం చేసారు. హైదరాబాద్ ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని, సీమాంధ్రకు నిర్దిష్టమయిన ప్యాకేజీలు కావాలని కోరుకొంటున్నట్లు తెలిపారు.   అయితే, ఇంతవరకు సీమాంధ్ర యంపీలు, కేంద్ర మంత్రులు అందరూ కూడా ఎన్నిసార్లు ప్రాదేయపడినా పట్టించుకోని కాంగ్రెస్ అధిష్టానం, రాజ్యసభలో బిల్లుని ఆమోదింపజేయడానికి సిద్దమవుతున్న తరుణంలో తన విన్నపాలను ఎందుకు చెవికెక్కించుకోదనే సంగతి తెలిసి ఉన్నపటికీ చిరంజీవి తన డిమాండ్ల చిట్టాను మరోసారి సభలో బిగ్గరగా చదివి వినిపించారు. బహుశః తను కూడా సీమాంధ్ర కోసం చాలా గట్టిగా పోరాడానని సీమాంధ్ర ప్రజలు గ్రహించాలనే ఆశతోనే శ్రమపడి ఉంటారు. కానీ, ఆయన తన ప్రసంగం మొదలుపెట్టగానే మొట్ట మొదట తన అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి రాష్ట్ర విభజనకు అంగీకరిస్తున్నాని కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పిన తరువాత ఇంకా ఈ వృదా ప్రయాస అంతా దేనికో? ఏమి సాధించాలనో? ఆయనకే తెలియాలి. రానున్న ఎన్నికలలో అయన పోటీ చేసేమాటయితే తన గురించి సీమాంధ్ర ప్రజలు ఏమని భావిస్తున్నారో తప్పకుండా తెలుసుకొనే గొప్ప అవకాశం కలుగుతుంది. మరి ఆయన అవకాశం వినియోగించుకొంటారో లేదో మరి!

అన్నదమ్ముల్లా ఉందాం: కేసిఆర్

      రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంతో తెలంగాణ వాదులు పెద్దఎత్తున సంబరాలు చేసుకున్నారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసిఆర్ పార్లమెంట్ నుంచి తన నివాసానికి చేరుకున్న సమయంలో పార్టీ నేతలు ఆనందంతో బాణాసంచా పేల్చి తమ సంతోషాన్ని చాటారు. కేసిఆర్ మీడియాతో మాట్లాడుతూ...పార్లమెంట్ లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. సోనియా గాంధీ దృడ సంకల్పతోనె తెలంగాణ కల సహకారమైందని అన్నారు. ఇది 'ఒక ప్రాంత ఓటమి..మరో ప్రాంత గెలుపు'కాదని అన్నారు. రాష్ట్ర విభజన ఉద్యమంలో ఇరు ప్రాంత మేధావులు, నేతలు మధ్య ఏర్పడిన వైషమ్యాలు మర్చిపోయి ఒకరికి ఒకరు పరస్పరం సహకరించుకుందామని అన్నారు. ఇతర రాష్ట్రాలకు దీటుగా తెలుగురాష్ట్రాలను అభివృద్ధి చేసి, తెలుగు ప్రజలు ఎవరికి తీసిపోరని నిరూపిద్దమని చెప్పారు.  హైదరాబాద్ లో ఉన్నవాల్లందరూ మా వాళ్ళే, అందరం కలిసిమెలిసి హైదరాబాద్ ను విశ్వనగరంగా రూపాంతరం చేద్దామని పిలుపునిచ్చారు.  

తెదేపా బీజేపీతో పొత్తులు పెట్టుకొనే సాహసం చేయగలదా?

  సీమాంధ్ర ప్రజలు తమ అభిప్రాయాలను పూచికపులల్లా తీసి పక్కనపడేసి రాష్ట్ర విభజన చేసినందుకు కాంగ్రెస్ పార్టీపై పగతో రగిలిపోతున్నారు. విభజనను అడ్డుకొంటామన్నట్లు మాట్లాడి చివరి నిమిషంలో విభజనకు పూర్తి మద్దతు తెలిపిన బీజేపీపై కూడా వారు అంతే కక్షతో, పగతో రగిలిపోతున్నారు. రానున్న ఎన్నికలలో ఆ రెండు పార్టీలకు తగిన గుణపాటం చెప్పేందుకు వారు చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీతో ఎన్నికల పొత్తులకు తెదేపా సాహసిస్తుందని ఎవరూ భావించలేరు. ఒకవేళ దైర్యంచేసో, కక్కుర్తి పడో పొత్తులు పెట్టుకొంటే అది తేదేపాకు రాజకీయంగా ఆత్మహత్యతో సమానమవుతుంది. గనుక పొత్తులు పెట్టుకోకపోవచ్చును.   అంటే, ఆ రెండు పార్టీలు కూడా ఆంధ్ర తెలంగాణా ప్రాంతలలో ఒంటరి పోరాటం చేయక తప్పదన్నమాట! ఆ రెండు పార్టీలు చేతులు కలిపినట్లయితే ఎంత బలంగా ఉంటాయో అందరికీ తెలుసు. కానీ రాష్ట్ర విభజన అంశం వారి మధ్య కూడా చిచ్చుపెట్టి వాటిని పూర్తిగా బలహీనపరిచింది. రాష్ట్ర విభజన ద్వారా కాంగ్రెస్ ఆశించిన అనేక ప్రయోజనాలలో బహుశః ఇది కూడా ఒకటని చెప్పక తప్పదు.   కానీ, ఇప్పుడు రాష్ట్రంలో ఆ రెండు పార్టీలు ఎన్నికల పొత్తులు పెట్టుకోకపోయినా ఎన్నికల తరువాత ఒకవేళ కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే గనుక తెదేపా మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రాజకీయాలలో శాశ్విత శత్రువులు లేదా మిత్రులు ఉండరనే సిద్ధాంతం ఉండనే ఉంది.

తెరాస కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుందా?

  ఈ ఎన్నికలలో తెరాస తిరుగులేని మెజార్టీ సాధించవచ్చని సర్వే నివేదికలు స్పష్టం చేస్తున్నాయి గనుక, ప్రస్తుతానికి తెరాస-కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల పొత్తులతో సరిబెట్టుకోవడం ద్వారా తెదేపా, బీజేపీలను పూర్తిగా దెబ్బ తీసే ప్రయత్నం చేయవచ్చును. ఆవిధంగా చేయడం ద్వారానే తెరాసకు మేలు కలుగుతుంది. ఒకవేళ ఇప్పుడే విలీనం చేసినట్లయితే, ఎన్నికల తరువాత కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రానట్లయితే, అది తెరాసకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. అదే పూతుఉలతో సరిబెట్టేస్తే, అవసరమయితే బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి తెలంగాణాకు అవసరమయినవన్నీ సాధించుకొనే అవకాశం ఉంటుంది. గనుక తెరాస కాంగ్రెస్ తో పొత్తులతోనే సరిపెట్టవచ్చును.

విభజన తరువాత ఏమిటి?

  రాష్ట్రవిభజన వ్యవహారం ఒక కొలిక్కి రావడంతో ఇప్పుడు తరువాత ఏమిటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాటిలో ప్రధానంగా చర్చించబడుతున్నవి 1. రాష్ట్రంపై రాష్ట్రపతి పాలన విధిస్తారా లేక తెరాస, మజ్లిస్ తదితర పార్టీల మద్దతుతో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వ పగ్గాలు చేపడుతుందా? 2. చేపడితే ముఖ్యమంత్రి ఎవరు? 3. ఎన్నికలు సమైక్య రాష్ట్రంలో నిర్వహిస్తారా లేక ఎన్నికలలోగానే తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేసి వేర్వేరుగా నిర్వహిస్తారా? ఇటువంటి అనేక ప్రశ్నలు చాలానే ఉన్నపటికీ మొదట ఈ మూడు ప్రశ్నలకే సమాధానం తెలియవలసి ఉంది.   తాజా సమాచారం ప్రకారం నేడో రేపో రాష్ట్రపతి పాలన విదిస్తూ ప్రకటన వెలువడనుంది. అయితే, ప్రస్తుత శాసనసభను రద్దు చేయకుండా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తయ్యేవరకు తాత్కాలికంగా నిద్రావస్థలో ఉంచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఎన్నికల ముందు ఏ పార్టీ అధికారం వదులుకోవాలని భావించదు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ నయాన్నో భయాన్నో అందరి మద్దతు కూడగట్టి ప్రభుత్వ పగ్గాలు చెప్పట్టె ప్రయత్నాలు చేయవచ్చును.   ఎన్నికలలోగా మిగిలిన రాష్ట్రవిభజన ప్రక్రియ అంటే రాష్ట్రపతి ఆమోదం, కొత్త రాష్ట్రా ఏర్పాటుకి గజిట్ నోటిఫికేషన్ విడుదల వంటివి పూర్తి కావడం కష్టం గనుక, అంతవరకు రాష్ట్రం యధాతధ స్థితిలో ఉంటుంది గనుక కొత్త ముఖ్యమంత్రి నియమించవచ్చును. రానున్న ఎన్నికలలో తెలంగాణాలో అన్ని యంపీ, యం.యల్యే. సీట్లు కైవసం చేసుకోవాలని కాంగ్రెస్, తెరాసలు భావిస్తున్నాయి గనుక, అందుకు మార్గం సుగమం చేసేందుకు తెలంగాణాకు చెందిన వ్యక్తినే ముఖ్యమంత్రిగా నియమించవచ్చును. అదే ఎవరనేది కాంగ్రెస్-తెరాసల మధ్య ఏర్పడే అవగాహనపై ఆధారపడి ఉంటుంది.

సీమాంధ్రలో శాసనసభ ఎన్నికలు వాయిదా?

  రాజ్యసభ నిన్న తెలంగాణా ఏర్పాటుకి మార్గం సుగమం చేయడంతో, త్వరలో జరగనున్న ఎన్నికలు సమైక్య రాష్ట్రంలో నిర్వహిస్తారా? లేక వేర్పడిన రాష్ట్రాలలో విడివిడిగా నిర్వహిస్తారా?అనే ప్రశ్న తలెత్తింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించినట్లయితే తెలంగాణాలో తెరాస-కాంగ్రెస్ కూటమి విజయం సాధించడం ఖాయమే. కానీ, సీమాంధ్రలో మాత్రం కాంగ్రెస్ దారుణంగా దెబ్బ తింటుంది. గనుక, పరిస్థితులు చక్కబడే వరకు శాసనసభ ఎన్నికలు వాయిదా వేయమని కొందరు సీమాంధ్ర మంత్రులు కోరుతున్నట్లు సమాచారం. అయితే విజయోత్సాహంతో ఉన్న తెరాస, టీ-కాంగ్రెస్ నేతలు ఎంత మాత్రం ఒప్పుకోకపోవచ్చు గనుక, ఎలాగయినా ఎన్నికలలోగా తెలంగాణా ఏర్పాటు చేయగలిగినట్లయితే, అప్పుడు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు కోరిన విధంగా పరిస్థితులు పూర్తిగా చక్కబడిన తరువాత సీమాంధ్రలో ఎన్నికలు నిర్వహించవచ్చును.   కాంగ్రెస్ అధిష్టానం తన రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా రాష్ట్ర విభజన చేసింది గనుక, ఇప్పుడు కూడా బహుశః ఇదే విధంగా వ్యవహరించవచ్చును. ఎందుకంటే, ఆ పార్టీ కేంద్రంలో తిరిగి అధికారంలోకి రావాలంటే కేవలం యంపీ సీట్లే అవసరం కానీ శాసనసభ సీట్లు కాదు. అందువలన వీలయితే సీమాంధ్రలో శాసనసభ ఎన్నికలు వాయిదా వేసినా ఆశ్చర్యం లేదు. అయితే, ఎన్నికలలోగా అది అధికారికంగా తెలంగాణా ఏర్పాటు చేయగలిగినప్పుడే ఈ ఆలోచన సాధ్యమవుతుంది. కానీ వీలుకాకపోతే సమైక్య రాష్ట్రంలోనే ఒకేసారి లోక్ సభ, శాసనసభ ఎన్నికలు నిర్వహించక తప్పదు.

తెలంగాణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

      రాజ్యసభ తెలంగాణా బిల్లుని మూజువాణి ఓటుతో ఆమోదించింది. బిల్లుకి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మద్దతు పలికాయి. ప్రొద్దున నుండి తీవ్ర గందరగోళం మధ్య అనేకసార్లు వాయిదాపడుతూ వచ్చిన రాజ్యసభ సమావేశాలలో ఊహించినట్లుగానే కాంగ్రెస్, బీజేపీలు తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం చేసిన తరువాత అంతిమంగా రెండు పార్టీలు కూడా బిల్లుని మూజువాణి ఓటుతో ఆమోదింపజేసాయి. ఈ క్రమంలో బీజేపీ నేతలు వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ బిల్లులో పలుసవరణలు సూచించినప్పటికీ, కొన్నిటిని సభ మూజువాణి ఓటుతో తిరస్కరించగా, మరికొన్నిటిని వారే స్వయంగా ఉపసంహరించుకొన్నారు. వెంకయ్య నాయుడు సీమాంధ్రకు న్యాయం చేయాలని గట్టిగా వాదిస్తూనే బిల్లుకి పూర్తి మద్దతు ఇస్తామని పదేపదే కాంగ్రెస్ పార్టీకి హామీ ఇవ్వడం విశేషం.   సీపీయం, తృణమూల్ కాంగ్రెస్, అన్నాడీఎంకే, డీయంకే, అసోం గణపరిషత్, శివసేన, సమాజ్ వాడీ పార్టీలు బిల్లుని వ్యతిరేఖించగా, కాంగ్రెస్, బీజేపీ,సీపీఐ, అకాలిదళ్, బీయస్పీ తదితర పార్టీలు బిల్లుని సమర్ధించాయి. బిల్లుపై క్లాజులవారిగా మూజువాణి ఓటింగ్ నిర్వహించిన రాజ్యసభ ఉపసభాపతి కురియన్ అంతిమంగా తెలంగాణా బిల్లుని మొత్తంగా సభ మూజువాణి ఓటుతో ఆమోదించినట్లు ప్రకటించారు. దీనితో ఇక రాష్ట్ర విభజన ప్రక్రియ దాదాపు పూర్తయిపోయినట్లే. రాష్ట్రపతి ఆమోదముద్రపడటం కేవలం సాంకేతికమే గనుక ఇక తెలంగాణా ప్రజల ప్రత్యేక రాష్ట్రం కల నేటితో సాకారమయినట్లే.

సీమాంధ్రకు ఐదేళ్ళు ప్రత్యేక హోదా: ప్రధాని మన్మోహన్

      ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు పైన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ప్రసంగించారు. సీమాంధ్రకు ఐదేళ్ళపాటు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తామని తెలిపారు. సీమాంధ్ర ప్రజల ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని తగిన ఆర్ధిక సాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సీమాంధ్ర ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని షిండే ఇంతకుముందే తెలిపారని గుర్తు చేశారు.   ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో తెలంగాణ బిల్లు ప్రతులని చింపి ప్రధానిపై తృణమాల్ కాంగ్రెస్ సభ్యులు విసిరారు. దీంతో కాంగ్రెస్ ఎంపీలు ప్రధాని చుట్టూ రక్షణగా నిలిచారు. మధ్యలో కలుగచేసుకున్న బీజేపీ నేత వెంకయ్యనాయుడు సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి పదేళ్ళు పెంచాలని డిమాండ్ చేశారు. రాజధాని విషయంలో కూడా ఇప్పడే స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే వెంకయ్య నాయుడు డిమాండ్‌కు స్పందిస్తూ ప్రత్యేక ప్రతిపత్తి పదేళ్ళు ఇవ్వడం కుదరదని హోంశాఖ మంత్రి షిండే సమాధానమిచ్చారు. సీమాంధ్రలోని పదమూడు జిల్లాలకు ప్రత్యేక హోదా ఇస్తున్నామన్నారు. పారిశ్రామిక హోదా కోసం పన్ను రాయితీ ప్రకటించారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నట్లు చెప్పారు. సీమాంధ్ర ఆర్థికంగా ఎదగడానికే ప్రత్యేక హోదా ఉపకరిస్తుందన్నారు. పోలవరం నిర్మాణానికి యూపిఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని, సీమాంధ్రకు తొలి ఏడాది ద్వారా ఏర్పడే లోటును కేంద్ర బడ్జెట్ ద్వారా పూడ్చుతామన్నారు. పారిశ్రామిక ప్రోత్సాహానికి పన్ను రాయితీ ఇస్తున్నట్లు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పునరావాసంపై అవసరమైతే సవరణలు త్వరలో చేద్దామన్నారు.

సమైక్యవాదినే..పార్టీ నిర్ణయానికి మద్దతు:చిరు

      రాజ్యసభలో కేంద్రమంత్రి చిరంజీవి తన తొలి ప్రసంగాన్ని తెలంగాణ బిల్లుపై చేశారు. రాష్ట్ర విభజనకు తానూ వ్యతిరేఖం అంటూనే, పార్టీ తీసుకున్న విభజన నిర్ణయానికి కట్టుబడి వున్నానని తెలిపారు. లోక్ సభలో కేంద్రం తెలంగాణ బిల్లును ఆమోదించిన తీరు దారుణమని అన్నారు. తెలుగు ప్రజల సమస్యలును అసలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీడబ్ల్యూసీ నిర్ణయం తెలుగు ప్రజలందరినీ దిగ్బ్రాంతికి గురిచేసిందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియలో శ్రీకృష్ణ కమిటీ నివేదిక కూడా కేంద్రం పరిగణలోకి తీసుకోలేదని అన్నారు. రాష్ట్ర విభజన కాంగ్రెస్ పార్టీని మాత్రమే దోషిగా చూడవద్దని, అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇచ్చాయని గుర్తు చేశారు. ఏది ఏమైనా రాష్ట్ర విభజన దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

టి బిల్లుకు మద్దతు..సీమాంధ్రకు ఇవి ఇవ్వండి: వెంకయ్య

      రాజ్యసభలో సభ్యుల గందరగోళం మధ్యే తెలంగాణ బిల్లుపై వెంకయ్య నాయుడు ప్రసంగించారు. రాష్ట్రంలో జరుగుతున్న అనర్ధాలకు కాంగ్రెస్సే కారణమని మండిపడ్డారు. పదేళ్ళ క్రితం తెలంగాణపై హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించారు. మూడేళ్ళ కిందటే విభజన చేసి ఉంటే ఈ వివాదం ఉండేదికాదని వెంక్యనాయుడు అభిప్రాయపడ్డారు.   ఒకవైపు ప్రధాని విభజన చేయాలంటారు..మరోవైపు వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ మొదటి నుంచి తెలంగాణకు కట్టుబడి వుందని, సీమాంధ్ర సమస్యలు పరిష్కరించాలన్నదే తమ డిమాండని వెంకయ్య స్పష్టం చేశారు.  సీమాంధ్రకు రూ. 15 వేల కోట్ల ద్రవ్యలోటు ఇవ్వలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ కంపెనీలను సీమాంధ్రలో కూడా పెట్టాలని ఆయన అన్నారు. సీమాంధ్రను ప్రత్యేక ప్రతిపత్తి రాష్ట్రంగా ప్రకటించాలని అన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలకు పన్ను మినహాయింపులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. దమ్ముగూడెం-సాగర్ టేల్‌పాండ్ పనులు ప్రభుత్వం చేపట్టాలని దుగరాజపట్నం, రామాయపట్నం పోర్టుల పని వెంటనే ప్రారంభించాలని వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు.

రాజ్యసభలో తెలంగాణ బిల్లు..గందరగోళం

      తెలంగాణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టడంతో సభలో తీవ్ర గందరగోళ వాతావరణం ఏర్పడింది. సభ సజావుగా సాగేందుకు సభ్యులు ఎవరూ సహకరించకపోవడంతో సభ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. పరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించలేదు. దీంతో సభను సజావుగా నడిపేందుకు సభ్యులు సహకించాలని చైర్మన్ కురియన్ కోరినా సభ్యులు పట్టించుకోలేదు. సభను ఎన్ని సార్లు వాయిదా వేసినా సీమాంధ్ర నేతల తీరు మాత్రం మార్చుకోకుండా తమ నిరసనలు యధావిధిగా కొనసాగిస్తున్నారు. తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తూ 'సేవ్ ఆంధ్రప్రదేశ్' ఫ్లకార్డులను పట్టుకుని సీమంధ్ర నేతలు నిరసనలు కొనసాగిస్తున్నారు. ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం సాయంత్రం 3-30 గంటలకు రాజ్యసభకు చేరుకున్నారు. సీమాంధ్రకు ప్యాకేజీ విషయమై ఆయన సభలో ప్రసంగించనున్నారు.

బిల్లు రాజ్యాంగ విరుద్దం: నోటీసు ఇచ్చిన బీజేపీ

  రాష్ట్ర విభజన బిల్లులో బీజేపీ సూచించిన కొన్ని సవరణలను చేర్చకుండా హోంమంత్రి సుషీల్ కుమార్ షిండే బిల్లుని యదాతధంగా రాజ్యసభలో ప్రవేశపెట్టడంతో, బీజేపీ రాజ్యసభ సభ్యుడు అరుణ్ జైట్లీ బిల్లు రాష్ట్ర విభజన బిల్లులో బీజేపీ సూచించిన కొన్ని సవరణలను చేర్చకుండా హోంమంత్రి సుషీల్ కుమార్ షిండే బిల్లుని యదాతధంగా రాజ్యసభలో ప్రవేశపెట్టడంతో, బీజేపీ రాజ్యసభ సభ్యుడు అరుణ్ జైట్లీ బిల్లు రాజ్యాంగ వ్యతిరేఖంగా ఉంది గనుక దానిని తాము వ్యతిరేఖిస్తున్నట్లు ఉపసభాపతి కురియన్ కి నోటీసు ఇచ్చారు. ఆయనతో బాటు సుజన చౌదరీ, రాజీవ్ చంద్ర శేఖర్, నరేంద్ర గుజ్రాల్ తదితరులు కూడా బిల్లుని వ్యతిరేఖిస్తున్నట్లు నోటీసులు ఇచ్చారు. సభలో సీమాంధ్ర మరియు తమిళనాడుకు చెందిన సభ్యులు బిల్లుకి వ్యతిరేఖంగా ఆందోళన చేస్తుండటంతో సభ పావుగంట సేపు వాయిదాపడింది.   పార్లమెంటు బయట బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ జవదేకర్ మీడియాతో మాట్లాడుతూ “మేము బిల్లుని వ్యతిరేఖిస్తున్నట్లు ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీ సభను, మీడియాను తప్పు దోవ పట్టిస్తోంది. కానీ అది నిజం కాదు. బిల్లులో మేము సూచించిన సవరణలను చేర్చకుండా సభలో ప్రవేశపెట్టడంతో మా సభ్యుడు అరుణ్ జైట్లీ బిల్లు రాజ్యంగా విరుద్దంగా ఉందని, దానిపై చర్చ కోరుతూ నోటీసు ఇచ్చారు తప్ప బిల్లుని వ్యతిరేఖించలేదు. మేము తెలంగాణా ఏర్పటుకు కట్టుబడి ఉన్నాము. కానీ, అదే సమయంలో సీమాంధ్రకు నష్టం కలగకూడదని కోరుకొంటున్నాము,” అని తెలిపారు.   లోక్ సభలో బిల్లుకి బేషరతుగా మద్దతు ఇచ్చిన బీజేపీ అదే బిల్లుని రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు వ్యతిరేఖించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నపటికీ దానికి ప్రధాన కారణం ఆ పార్టీకి వ్యతిరేఖంగా సీమాంధ్రలో ఎగసిపడిన వ్యతిరేఖతే కాకుండా, అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ఒకవేళ బీజేపీ సూచించిన సవరణలను బిల్లులో ప్రవేశపెడితే, బిల్లుని తిరిగి లోక్ సభకు పంపవలసి ఉంటుంది గనుక, కాంగ్రెస్ పార్టీ ఎట్టిపరిస్థితుల్లో బిల్లుని యధాతధంగా ఆమోదింపజేసే ప్రయత్నం చేయవచ్చును. సీమాంధ్రలో వ్యతిరేఖతను చూసి బిల్లు విషయంలో నాటకాలు ఆడుతున్న బీజేపీ, సభలో ప్రధానమంత్రి ప్రసంగం తరువాత బిల్లుకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. నాలుగు గంటలకి తిరిగి సమావేశమయిన సభ సభ్యుల అందోళనల కారణంగా మళ్ళీ వాయిదా పడింది.

రాజ్యసభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన షిండే

      రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశపెట్టారు. కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలంగాణ బిల్లును రాజ్యసభలో ప్రవేశ పెట్టారు. బిల్లును ప్రవేశపెట్టేటప్పుడు షిండేకు రక్షణగా కాంగ్రెస్ ఎంపీలు, మార్షల్స్ నిలబడ్డారు. సభలో బిల్లును ప్రవేశపెట్టగానే తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీఎంసీ బిల్లును అడ్డుకొనేందుకు ప్రయత్నించగా మార్షల్స్ అడ్డుకున్నారు. తెలంగాణ, సీమాంధ్ర ఎంపీల మధ్య సభలో తోపులాట జరిగింది. బిల్లు రాజ్యంగా విరుద్దమని సభలో సభ్యులు నినాదాలు చేశారు. తెలంగాణ బిల్లు రాజ్యంగ బద్దంగా లేదని పలువురు సభ్యులు స్పీకర్ కు నోటిసులు ఇచ్చారు. సభలో తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొనడంతో సభను 15 నిమిషాలు వాయిదా వేశారు.

విభజన చేసింది కాంగ్రెస్ కాదట

  రాష్ట్ర విభజన ప్రక్రియలో తన పాత్ర పూర్తయిపోగానే కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసి తప్పుకొన్నారు. పోతూపోతూ సోనియాగాంధీ తనను పదవిలో కొనసాగమని ఆదేశించినందునే ఇంతకాలం కొనసాగాననే చల్లటి కబురు కూడా తెలుగు ప్రజల చెవినవేసి మరీ పోయారు. ఆయన బ్యాటు, బాలు అన్ని పక్కన పడేసి మైదానం ఖాళీ చేసి వెళ్లిపోతుంటే, ఇంతకాలంగా ఆయనే వెనుకే ఫీల్డింగ్ చేస్తున్నఏపీయన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు కూడా ఇక తాముమాత్రం ఇంకా మైదానంలో ఉండి చేసేదేముందని, మళ్ళీ ‘బ్యాక్ టూ పెవిలియన్’ అంటూ డ్యూటీలో చేరిపోయారు. సరయిన ఆటగాళ్ళను ఎంపిక చేసుకోక పోవడం వలనే ఓడిపోయామని ముక్తాయింపు కూడా ఇచ్చారు.   ఇంతకాలంగా లాస్ట్ బాల్ మిగిలే ఉంది, ద్వారము తెరిచే యున్నది అంటూ మురిపించి మురిపించిన కెప్టెన్ కిరణ్ కుమార్ రెడ్డి ఫౌల్ గేమ్ ఆడుతూ తమకి బౌలింగ్, బ్యాటింగ్ చేసే అవకాశం లేకుండా అన్నీ తానే ఆడేసి మోసం చేసేసాడని అనేక కాంగ్రెస్ జీవులు కూడా వాపోతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీలోకెల్లా అత్యంత శీలవంతుడయిన కేంద్ర మంత్రి జేడీ.శీలం అయితే , సోనియా, రాహుల్ గాంధీలు రాష్ట్ర విభజన చేసినప్పటికీ సీమాంధ్ర ప్రజల పట్ల అపారమయిన దయ జాలి కలిగినందునే ప్యాకేజీలు విదిలించారని అందుకు ప్రతిగా సీమాంధ్ర ప్రజలందరూ ఎన్నికలలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే ఎన్నుకొని వారికి కృతజ్ఞతలు తెలపడం కర్తవ్యమని సూచించారు. మరి సోనియాగాంధీ దయతోనే ముఖ్యమంత్రి అయ్యాయని, ఆమె ఆదేశంతోనే పదవిలో కొనసాగానని ఆయనే స్వయంగాప్రకటించి తప్పుకొన్నారు గనుక, ఈ విభజన పాపం కూడా ఆయన అకౌంటు లోనే జమా చేయడం సముచితమని భావించిన కాంగ్రెస్ జీవులన్నీ రాష్ట్ర విభజన జరగడానికి కాంగ్రెస్ అధిష్టానం కానీ, తాము గానీ  ఎవరూ కారణం కాదని కేవలం కెప్టెన్ కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం, వైకాపాలే కారణమని  తీర్మానించేసాయి. బహుశః కాంగ్రెస్ అధిష్టానం ఈస్క్రిప్ట్ అంతా చాలా ముందే తయారుచేసి కిరణ్ కుమార్ రెడ్డి చేతిలో పెట్టినందునేనేమో, ఆయన కూడా తన పాత్ర ముగింపుకి సరిపోయేలా "శాసనసభ తిరస్కరించిన టీ-బిల్లుని కేంద్రం యధాతధంగా పార్లమెంటులో ప్రవేశపెట్టినట్లయితే నేను రాజకీయ సన్యాసం తీసుకొంటానని" ముందే క్లూ ఇచ్చేసి పాపం! ఆ పాపం నెత్తిన బెట్టుకొని మౌనంగా నిష్క్రమించారు.

రాజ్యసభలో 3గంటలకు టీ బిల్లు

      ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును రాజ్యసభలో మధ్యాహ్నం 3గంటలకు ప్రవేశపెట్టనున్నారు. లోక్ సభలో బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే రాజ్యసభలో కూడా బిల్లును ప్రవేశపెట్టనున్నారు. విభజన బిలుపై చర్చ జరిగిన వెంటనే ఆమోదం పొందే అవకాశం వుంది. రాజ్యసభలో ప్రధాని సీమాంధ్ర ప్యాకేజీ పైన ప్రకటన చేసే అవకాశముంది. మరోవైపు బిల్లు విషయంలో బిజెపి సూచించిన ఆరు ప్రతిపాదనలకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఈ మేరకు బిజెపి నేతలకు కేంద్రం లిఖిత పూర్వకంగా తెలిపింది. బిజెపి ప్రతిపాదనలపై ప్రధాని రాజ్యసభలో ప్రకటన చేయనున్నారు.

రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫారసు

    రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫారస్ చేస్తూ కేంద్రానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ నివేదిక పంపించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో ఎవరూ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాకపోవడంతో, రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ కేంద్రానికి నివేదికనిచ్చారు. దీనిపై సాయంత్రం కేంద్ర కేబినేట్ సమావేశమై నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు కేంద్ర కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ప్రధాని మన్మోహన్ సింగ్ తో కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత ఏర్పడ్డ పరిస్థితులు, రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదంపై చర్చిస్తున్నారు.