సోషల్ మీడియా ద్వారా అభ్యర్థులపై నిఘా

      ఎన్నికల కమిషన్ మొట్టమొదటిసారిగా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు చేసే వ్యయంపై సోషల్ మీడియా ద్వారా నిఘా వేయనుంది. వికీపీడియా, ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి సామాజిక సంబంధాల వెబ్‌సెట్ల ద్వారా అభ్యర్థుల ఎన్నికల ఖర్చును ఈసీ పర్యవేక్షించనుంది. అలాగే, ఈ సైట్లలో ప్రకటనల రూపంలో అభ్యర్థులు చేసే వ్యయాన్ని కూడా చూస్తుంది. పెయిడ్ న్యూస్, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు వ్యతిరేకంగా చర్యలను కట్టుదిట్టం చేయనుంది. ఇందుకోసం రాష్ట్ర, జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు కానున్నట్టు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.

సుప్రీంకోర్టుపై రాయపాటి తీవ్ర ఆరోపణలు

  ఈరోజు కాంగ్రెస్ ఎంపీ రాయపాటి సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు ధర్మాసనంపై తీవ్ర ఆరోపణలు చేసారు. రాష్ట్ర విభజనలో కీలక పాత్ర పోషించిన జైరాం రమేష్ వంటి కేంద్రమంత్రులు కొందరు రాష్ట్ర విభజనకు వ్యతిరేఖంగా సుప్రీంకోర్టులో దాఖలయిన అనేక పిటిషన్లను కోర్టు పరిగణనలోకి తీసుకొని స్టే విదించకుండా న్యాయమూర్తులను మేనేజ్ చేసారని రాయపాటి ఆరోపించారు. మరి కాంగ్రెస్ పార్టీ, సుప్రీంకోర్టు ఈ ఆరోపనలపై ఏవిధంగా స్పందిస్తాయో వేచి చూడాలి. గత వారం ఆయన తిరుపతి వెళ్ళినప్పుడు రెండు మూడు రోజుల్లో కిరణ్ కుమార్ రెడ్డి కొత్తపార్టీ ప్రకటిస్తారని తెలిపారు. కానీ ఆ మాట చెప్పి వారం రోజులయినా ఇంకా కొత్త పార్టీ రాకపోవడంతో ఆయన మళ్ళీ ఈ రోజు కొత్త పార్టీకి మరో సరికొత్త ముహూర్తం ప్రకటించారు. మరో వారం పది రోజుల్లో కిరణ్ తన కొత్త పార్టీ ప్రకటిస్తారని మీడియాకు తెలిపారు.

పిఠాపురంలో సైకిల్ కు పంక్చర్

      సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ‘దేశం’లో నాయకత్వంపై కార్యకర్తలు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాల్లో అనుచరగణంతో తిరుగుతున్న నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ వర్మకు అడుగడుగునా చుక్కెదురవుతోంది. పిఠాపురం రూరల్ మండలంలోని భోగాపురంలో సోమవారం రాత్రి జరిగిన ఇంటింటా టీడీపీ ప్రచార కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ వర్మ స్థానిక మర్రిచెట్టు సెంటర్‌లో ఏర్పాటు చేసిన సభలో పార్టీకి మొదటి నుంచి కష్టపడి పని చేస్తున్నఅల్లుమల్లు విజయకుమార్‌పై విమర్శలు చేశారు. విసుగెత్తిపోయిన నాయకులు, కేడర్ చివరకు ఆయనపై కుర్చీలు విసిరేసే పరిస్థితి వచ్చింది. ఈసారి కూడా టీడీపీ టిక్కెట్టు వర్మకు కేటాయిస్తే పార్టీలోనే ఉండి వ్యతిరేకంగా పని చేయడమా లేక, ప్రత్యామ్నాయం వైపు అడుగులు వేయడమా అనేదానిపై వర్మ వ్యవహార శైలి నచ్చని నేతలంతా వచ్చే 15 రోజుల్లో ఒక స్పష్టత తీసుకువచ్చేందుకు సిద్ధపడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్

      కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వి.ఎస్.సంపత్ 16వ లోక్ సభ ఏర్పాటుకు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ లో రెండు విడతల్లో ఎన్నికల జరగనున్నాయి. లోక్ సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుతం వున్న లోక్ సభ, శాసన సభ సీట్ల ఆధారంగానే ఎన్నికలు జరగనున్నాయి.    తెలంగాణ: 1. తెలంగాణలో ఏప్రిల్ 2 ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు.                          2. ఏప్రిల్ 9 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది.   3. ఏప్రిల్ 10న నామినేషన్ల పరీశీలన.   4. ఏప్రిల్ 12 నామినేషన్ల ఉపసంహరణకు గడువు.   5. ఏప్రిల్ 30 తెలంగాణలో పోలింగ్ వుంటుంది.   6. తెలంగాణలో 17 ఎంపీ, 119 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.        సీమాంధ్ర: 1. సీమాంధ్రలో ఏప్రిల్ 12 ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు.               2. ఏప్రిల్ 19వరకు నామినేషన్ల స్వీకరణ వుంటుంది.     3. ఏప్రిల్ 21న నామినేషన్ల పరీశీలన.   4. ఏప్రిల్ 23నామినేషన్ల ఉపసంహరణకు గడువు   5. మే 7న సీమాంధ్రలో పోలింగ్ వుంటుంది.    6. సీమాంధ్రలో 25ఎంపీ, 175 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.          మే16న ఇరుప్రాంతాలలో ఓకే రోజు ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని ఎన్నికల కమిషనర్ పేర్కొన్నారు.   

మోత్కుపల్లి సైలెన్స్ దేనికి సంకేతం

  రాజ్యసభలోకి అడుగుపెట్టే అవకాశం వస్తుందని చివరి వరకు ఆశపడి, అధినేత చంద్రబాబు చెయ్యివ్వడంతో ఓ దశలో సైకిల్ కూడా దిగిపోదామనుకున్న టీడీపీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులుకు ఇప్పుడు ముందంతా చీకటే కనిపిస్తోంది. గతంలో కేసీఆర్ మీద, టీఆర్ఎస్ మీద ఒంటికాలిమీద లేచే నర్సింహులు.. రాజ్యసభ వ్యవహారం తర్వాత అస్సలు నోరెత్తితే ఒట్టు. ఆయన మాటే ఎక్కడా వినిపించడంలేదు. నర్సింహులు ఈసారి పోటీచేసే విషయంలో కూడా ముందు వెనక ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఓ దశలో అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారని కూడా కథనాలొచ్చాయి. కానీ అప్పట్లో నామా నాగేశ్వరరావు ఆయనను బుజ్జగించి పార్టీలో కొనసాగేలా చేశారు. ఇక గతంలో ఆలేరు నుంచి వలస వెళ్లి తుంగతుర్తి నుంచి గెలిచినా.. ఇప్పుడక్కడ కుడిభుజంగా ఉండే నేతలు గానీ, కేడర్ గానీ పెద్దగా లేకపోవడంతో మహబూబ్ నగర్ జిల్లాలోని మరో ఎస్సీ నియోజకవర్గం నకిరేకల్ మీద ఆయన దృష్టి పడినట్లు తెలుస్తోంది. నకిరేకల్ టీడీపీ ఇన్‌చార్జ్ పాల్వాయి రజనీ కుమారిని ఆమె సొంత నియోజకవర్గం తుంగతుర్తి పంపి, ఆయన ఇక్కడ పోటీ చేయచ్చంటున్నారు. మరోవైపు, ఖమ్మం జిల్లాకు వచ్చి మధిర ఎస్సీ రిజర్వుడు స్థానంలో పోటీ చేయాలని, ఎన్నికల ఖర్చులు తాను భరిస్తానని నామా నాగేశ్వరరావు హామీ ఇచ్చినట్లు కూడా చెబుతున్నారు. చివరకు మోత్కుపల్లి పయనం ఎటు సాగుతుందో చూడాలి మరి.

తెలుగు ప్రజలు మరీ అంత చులకనయిపోయరా

  తెలుగువాళ్లంటే కాంగ్రెస్ పెద్దలకు, అందునా రాష్ట్రాన్ని నిలువునా గొడ్డలితో చీల్చేసిన జీవోఎం సభ్యులకు ఎంత చులకనో మరోసారి రుజువైంది. సాక్షాత్తు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, సొంత పార్టీ కార్యకర్తల ముందే జైరాం రమేష్ తన అహంకారాన్ని, తెలుగువాళ్ల పట్ల ఉన్న నీచ భావాన్ని బయటపెట్టారు. ‘‘సీమాంధ్రులకు అవకాశం ఇస్తే చార్‌మినార్‌లో రెండు మినార్లు కావాలని అడుగుతారు...’’ అంటూ వ్యంగ్యంగా విమర్శించారు.   సీమాంధ్ర కేంద్రమంత్రులు రోజూ అధిష్టానం వద్దకు వచ్చి అష్టోత్తరం, సహస్రనామం చదివినట్లుగా హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయాలని అడిగారని జైరాం వ్యాఖ్యానించారు. విజయవాడ, గుంటూరు పార్టీ కార్యాలయాల్లో కార్యకర్తల సమావేశంలో.. దుగ్గరాజపట్నం పోర్టుతో పాటు రామాయపట్నం పోర్టును కూడా అభివృద్ధి చేయాలని కేంద్రమంత్రి జె.డి.శీలం కోరినపుడు జైరాం పైవిధంగా ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. జాతీయ రహదారుల కాంట్రాక్టర్లు, ఎయిర్‌పోర్టు, ఫార్మాసూటికల్, పవర్ ప్లాంట్ కాంట్రాక్టర్లు అందరూ ఈ ప్రాంతంలోనే ఉన్నారంటూ మరోసారి ఎద్దేవా చేశారు.

నేడే సార్వత్రిక ఎన్నికల నగారా

  కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వి.ఎస్.సంపత్ బుధవారం ఉదయం 10.30 గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలకు కూడా షెడ్యూలు ప్రకటించనున్నారు. షెడ్యూలు ప్రకటనతో బుధవారం నుంచే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రానుంది. సాధారణంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ప్రకటన కేంద్ర ప్రధాన ఎన్నికల కార్యాలయంలోనే జరుగుతుంది. కానీ ఈసారి వేదికను కేంద్ర ఎన్నికల సంఘం విజ్ఞాన్‌భవన్‌కు మార్చింది. ఏప్రిల్ రెండో వారంలో మొదలుపెట్టి మే 15వ తేదీకల్లా మొత్తం ఎన్నికల పర్వాన్ని పూర్తిచేసేందుకు ఈసీ ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిసింది. సాధారణ ఎన్నికలను మొత్తం ఆరు లేదా ఏడు విడతల్లో నిర్వహించనున్నట్లు సమాచారం.

కాంగ్రెస్ నేతలకు పెద్దిరెడ్డి వల

  చిత్తూరు కాంగ్రెస్ నాయకులకు మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వల విసురుతున్నారు. గతంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీద ఆయన మంత్రివర్గంలో ఉండగానే బహిరంగ విమర్శలు చేసిన పెద్దిరెడ్డి, ఆ తర్వాతి కాలంలో పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేసి జగన్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నేతలను లాగేందుకు ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారు. నగరంలోని పీసీసీ మాజీ సభ్యుడు ఎస్.సుధాకరరెడ్డిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఆయనతోపాటు కాంగ్రెస్ నా యకులు, చిత్తూరు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పురుషోత్తంరెడ్డి, ఐరాల మాజీ ఎంపీపీ పొలకల ప్రభాస్‌కుమార్‌రెడ్డి(చిట్టిరెడ్డి)తో పెద్దిరెడ్డి దాదాపు గంటసేపు మంతనాలు జరిపారు. దీంతో వారిలో కొందరు జగన్ పార్టీలో చేరడానికి కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కిరణ్ సొంత పార్టీ పెట్టే విషయంపై ఇప్పటివరకు ఒక స్పష్టత లేకపోవడం, కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు లేకపోవడంతో నాయకులు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు.

యలమంచిలిలో మల్లగుల్లాలు

విశాఖ జిల్లా యలమంచిలి నుంచి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. టీడీపీ నుంచి నియోజకవర్గ ఇన్‌చార్జ్ సుందరపు విజయ్‌కుమార్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారం జరుగుతున్నా, మరోపక్క మాజీ ఎంపీ పప్పల చలపతిరావు పేరు వినిపిస్తోంది. సుందరపు అభ్యర్థిత్వాన్ని విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావుతోపాటు ఆయన అనుచరులు వ్యతిరేకిస్తుండడంతో అభ్యర్థి విషయంలో స్పష్టత కనిపించడంలేదు. మరోపక్క ఎమ్మెల్యే యు.వి.రమణమూర్తిరాజు కూడా హఠాత్తుగా రూటు మార్చారు. చంద్రబాబుతో మంతనాలు జరిపిన ఎమ్మెల్యే యలమంచిలి నుంచే టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తానని కార్యకర్తలతో చెబుతున్నారు. ఎమ్మెల్యే ప్రకటనలు తెలుగుతమ్ముళ్లతోపాటు, కాంగ్రెస్ కార్యకర్తలకు మింగుడు పడడం లేదు. ఇక రాష్ట్ర విభజన దెబ్బకు.. కాంగ్రెస్‌పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న వారు కనుచూపుమేరలో కనిపించడం లేదు. వైఎస్సార్‌సీపీ నుంచి ఆపార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు పేరు వినిపిస్తోంది.

బదిలీల కత్తి పట్టిన ఉగ్ర నరసింహన్

  ఉగ్ర నరసింహన్ తన కత్తికి పదును పెంచుతున్నారు. పాలనలో తనదైనా మార్కు చూపిస్తున్నారు. నిన్న కాక మొన్న పెట్రోలు బంకుల సమ్మెను గంటల వ్యవధిలోనే ఆపించిన ఆయన.. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి చివరి నిమిషంలో చేసిన నియామకాలు, బదిలీలపై దృష్టి పెట్టారు. సీఎం పదవికి రాజీనామా చేయడానికి ఒకటీ రెండు రోజుల ముందు తన పేషీలో పనిచేస్తున్న కార్యదర్శులకు ఇచ్చిన కీలక పోస్టింగులను గవర్నర్ రద్దు చేశారు. అజయ్ కల్లాం మినహా జవహర్‌రెడ్డి, ఎన్.శ్రీధర్, శంషేర్‌సింగ్ రావత్, సురేందర్‌ల బదిలీలను రద్దు చేశారు. వారిని ఇతర శాఖలకు బదిలీ చేశారు.   కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ఇచ్చిన పోస్టింగ్‌లను ఒకటి తరువాత ఒకటి రద్దు చేస్తూ కొత్త పోస్టింగ్‌లు ఇస్తున్నారు. కిరణ్ వెళ్తూ వెళ్తూ తన వద్ద ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసిన ఎన్.శ్రీధర్‌ను ఏపీ బ్రూవరీస్, డిస్టిలరీస్, బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా నియమించగా.. ఇప్పుడు ఆయన్ను ప్రాధాన్యం లేని రాష్ట్ర విద్యా, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. సీఎంఓలో ఓఎస్డీగా పనిచేసిన సురేందర్‌ను కిరణ్ చివరిరోజున రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎండీగా నియమించారు. ఆయనను ఏపీఐఐసీకి బదిలీ చేశారు. తన వద్ద గతంలో సంయుక్త కార్యదర్శిగా పనిచేసి, తర్వాత ఐఏఎస్‌కు ఎంపికై చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా వెళ్లిన బసంత్‌కుమార్‌ను గవర్నర్ మళ్లీ రాజ్‌భవన్‌కు రప్పించుకున్నారు. బసంత్‌కుమార్‌ను గవర్నర్ సంయుక్త కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు కూడా బదిలీ అయ్యారు. ఎస్‌పీఎఫ్ డీజీ తేజ్‌దీప్ మీనన్‌ను రాష్ట్ర ప్రింటింగ్, స్టేషనరీ విభాగం కమిషనర్‌గా, ఆక్టోపస్ అదనపు డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావును ఎస్‌పీఎఫ్ డీజీగా బదిలీ చేశారు. ఆక్టోపస్ బాధ్యతలను రాష్ట్ర ఆపరేషన్స్ విభాగం డీజీపీ జేవీ రాముడుకు అప్పగించారు.

దెయ్యమని తిట్టినా.. సోనియానే తెలంగాణ ఇచ్చారు

  కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని దెయ్యమని కేసీఆర్ తిట్టినా .. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. టీఆర్ఎస్ ను విలీనం చేయమని ఎవరూ కేసీఆర్ ను అడగలేదని పొన్నాల ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ను విలీనం చేస్తానని కేసీఆరే స్వయంగా చెప్పిన విషయాన్ని పొన్నాల గుర్తుచేశారు. సీమాంధ్రలో పార్టీ పరిస్థితి ప్రతికూలంగా మారే అవకాశమున్నా.. తెలంగాణ ఏర్పాటుకు ధైర్యంతో సోనియా తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ మాట మార్చి.. ఎదో కుంటిసాకులు చెప్పడం తగదని, విలీన నిర్ణయం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని పొన్నాల వ్యాఖ్యానించారు. కేసీఆర్ రెండునాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని.. అయితే సోనియాను విమర్శించే నైతికత కేసీఆర్‌కు లేదని పొన్నాల మండిపడ్డారు.

సీమాంధ్రకి ‘ప్యాకేజీ’ సినిమా

   సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీది పూర్తిగా డిఫరెంట్ ఇస్టోరీ. తెలంగాణా తెచ్చామని ఇక్కడ.. ప్యాకేజి ఇచ్చామని అక్కడ.. టముకు వేయమని రాష్ట్రాన్ని విడదీసిన తెల్లదొర జైరాం రమేష్ ను సోనియమ్మ పురమాయించడంతో ఆయన సీమాంధ్రలో రెక్కలు కట్టుకొని వాలిపోయి మన రాజమౌళి డైరెట్రు కంటే బాగా ఎఫెక్టివ్ గా అరచేతిలో వైకుంటం చూపిస్తూ ఊర్లు చుట్టబెట్టేస్తున్నాడు. అయితే ఆయన కంటే ముందే డిల్లీ నుండి ఊడిపడి సీమాంధ్ర మీద కర్చీఫ్ వేసుకొని కూర్చొన్న వెంకయ్య నాయుడు తన ప్రాస బాషలో అలవోకగా కాంగ్రెస్ పార్టీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంటే, జైరాం రమేష్ కి ఆయన తమను తిడుతున్నాడో లేక పొగుడుతున్నాడో అర్ధం కాక నోరు వెళ్ళబెట్టేసాడు. అది చూసి కంగారు పడిన సోనియమ్మ పార్లమెంటులో విభజనపై చర్చ జరగకుండా చక్కగా మేనేజ్ చేసి, మూజువాణి ఓటింగ్ తో బిల్లుని గట్టేకించిన ఘనుడు కమల్ నాథ్ ని జైరాంకి తోడుగా ఉండమని పురమాయించింది.   ఇక తమతో పొత్తులు పెట్టుకునే ధైర్యం ఎవరూ చేయరని గ్రహించిన బొత్సబాబు ఈసారి తాము ఎవరితోనూ పొత్తులు పెట్టుకోమని, ఒంటరిగానే పోటీ చేసి క్లీన్ స్వీప్ చేసేస్తామని ప్రకటించి లౌక్యం ప్రదర్శించాడు. ఆయన కాంగ్రెస్ పార్టీనే రాష్ట్రం నుండి క్లీన్ స్వీప్ చేసేస్తానని దానర్ధమని గిట్టని వాళ్ళు పెడర్ధాలు తీసి ఒకటే ఇకఇకలు పకపకలు. ఇక్కడ సీమంధ్రలో బొత్స బాబు పార్టీని క్లీన్ స్వీప్ చేసేస్తానని హామీ ఇస్తుంటే, అక్కడ గులాబీ బాసు క్లీన్ స్వీప్ చేసేందుకు కమిట్ అయిపోవడంతో సోనియమ్మకు మా చెడ్డ చిక్కు వచ్చి పడింది పాపం!  

హస్తంలో గులాబీ ముళ్ళు

  సీమాంధ్రలో పూర్తిగా మునిగిపోయిన హస్తం పార్టీ వారు గులాబీ కారుకి లిఫ్ట్ కోరుతూ హస్తం చూపించారు. కారు ఆపి ఎక్కించుకొంటే, వెనుక సీటులో కూర్చొని డ్రైవింగ్ చేస్తూ తెలంగాణలో షికారు చేద్దామని ఊహల్లో తేలిపోయింది. కానీ కారు ఆగలేదు. పోతూ పోతూ... (పొత్తుల) స్టీరింగ్ నా చేతుల్లో లేదు...మీ కేశవన్న కమిటీయే స్టీరింగ్ తిప్పుతోంది...సారీ...అంటూ కాంగ్రెస్ కంట్లో దుమ్ముకొట్టి రివ్వున ముందుకు దూసుకుపోయింది గులాబీ కారు.   “మా బంగారు తల్లి సోనియమ్మ మా దేవత” అంటూ ఫ్యామిలీతో సహా గ్రూప్ ఫోటోలు దిగిన గులాబీ బాస్ అందరికీ హ్యాండ్ ఇచ్చే కాంగ్రెస్ పార్టీకి హ్యాండివడమే కాకుండా మళ్ళీ “కాంగ్రెస్ పార్టీయే మాకు హ్యాండిచ్చింది” అని సన్నాయి నొక్కులు నొక్కారు. అప్పుడు కాంగ్రెస్ నేతలు “ఇప్పటికీ మా హ్యాండ్ మీ హ్యాండ్స్ లోనే ఉన్నాయని” చాలా ఏమ్మోషనల్ అయిపోతూ జవాబిచ్చారు. షబ్బీర్ అలీ అయితే ఉక్రోషం పట్టలేక కెసిఆర్ పిట్టలదొర అని నోరుజారేసారు కూడా.   అయినా హస్తాలు కాలాక పొత్తులు పట్టుకుంటే మాత్రం ఏమి లాభం? అని కాంగ్రెస్ నేతలు మేకపోతుని గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. కడుపులో నుండి పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఉగ్గబట్టుకొనేందుకు ‘ఇక తెరాసతో చేడుగుడే’ అంటూ కాంగ్రెస్ కండువాలు నడుంకి బిగించి పోటీకి సై అంటూ తమ ముసలి తొడలు ‘టపీ టపీమని’ సోనియమ్మకు వినబడేలా చరుచుకొన్నారు టీ-కాంగ్రెస్ నేతలు.   సోనియమ్మ కూడా వారిని డిల్లీకి పిలిచి టీ-పార్టీ ఇచ్చి “వాళ్ళకి తెలంగాణా ఉంటే, మీతో కలిసి పోరాడేందుకు అనేక ఎన్నికలలో పార్టీకి శల్యసారధ్యం చేసిన మన యువరాజు ఉన్నాడు. అదైర్య పడకండి” అని ఓదార్చారు.

పొత్తులకు పైఎత్తులు

  కాలం కలిసొస్తే .. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఐదేళ్ళకోసారి నిర్వహించే పెజాస్వామ్య కుంభమేళా అంగరంగ వైభవంగా జరుగుద్ది. పరస్పరం కత్తులు దూసుకునే పార్టీలు పొత్తులతో రంగంలోకి దిగుతాయి. చేతిలో చెయ్యేసి కలిసి సాగిన వేర్వేరు పార్టీల నేతలు సై అంటే సై అంటూ ఈవీఎమ్ ఫైట్ కు సిద్ధమవుతారు. గెలుపే పరమావధి.. అధికారమే లక్ష్యంగా పొత్తులు కుదురుతాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు.. శాశ్వత మిత్రులు ఉండరు అనే ఒక ప్రకటనతో ఓటర్లను ఓదార్చుతారు.   ఎవరి గోల వారిదే: ఎన్నికలకు ముందు ఏదో ఒక పార్టీతో చెట్టాపట్టాలేసుకు తిరిగే లెఫ్ట్ పార్టీలు... ఈసారి మాత్రం లెఫ్ట్... రైట్... అంటూ చెరో దారి చూసుకుంటున్నాయి. తెలంగాణా ఏర్పాటుకు మద్దతు పలికిన సీపీఐ, సమైక్యాంధ్ర నినాదంతో ఉన్న సీపిఎం చెరో దారి వెతుకుంటున్నాయి. అవినీతిపై పోరాడి అలిసిపోయిన సీపీఎం జగన్ తో సెటిల్ అయిపోయేందుకు సిద్ధమవుతున్నట్లు కామ్రేడ్స్ గుసగుసలాడుకుంటున్నారు. సీపీఐకి సీపిఎం హ్యాండ్ ఇవ్వడంతో కొత్త మిత్రులను వెతికే పనిలో పడింది నారాయణ గ్యాంగ్. తెలుగుదేశంతో వెళ్తే తెలంగాణలో నష్టపోయే పరిస్థితి. అందుకని “ఒంటరినైపోయాను...ఇక ఎన్నికలకు ఎలాగు పోనూ...” అంటూ విషాదంగా పాత పాటను కొత్తగా పాడుకుంటు గులాబీ బాస్ చుట్టూ తిరుగుతున్నారు. ఆయన కనుక దయ తలిస్తే ఈసారికి గండం గట్టెక్కినట్లే అని ఆశగా చూస్తున్నారు. కనీసం కాంగ్రెస్ పార్టీ అయినా తమకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోదా? అని కామ్రేడ్స్ ఆశగా ఎదురు చూస్తున్నారని ఊరంతా ఒకటే పుకార్లు.

కేసిఆర్ రాజకీయ గురువు నేనె: బాబు

      తెలంగాణ తెలుగుదేశం త్వరలో ఖాళీ అవడం ఖాయమని వస్తున్న వార్తలపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఖాళీ అవడానికి తెలుగుదేశం పార్టీ బ్రాందీ సీసా కాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో పేదవాళ్ళకు అందాల్సిన నిధులను కాంగ్రెస్ నేతలు దోచుకున్నారని, సోనియా గాంధీయే అవినీతి అనకొండని ఆరోపించారు. టిడిపి హయంలో లక్షలాది మందికి ఉద్యోగ అవకశాలు కల్పించమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన ఘనత టిడిపిదేనని గుర్తుచేశారు. కేసిఆర్ పార్టీ పెట్టినప్పుడు అతని ఆస్థి ఎంతని? ఇప్పుడు ఎంతని? ప్రశ్నించారు. కేసిఆర్ రాజకీయ గురువు తానేనని, మంచి దారిలో వెళ్తాడని అనుకుంటే..అడ్డదారిలో వెళ్తున్నాడని అన్నారు.

రాజీనామా చేస్తా...విలీనం చేస్తారా?..విజయశాంతి

      కాంగ్రెస్ పార్టీకి తాను రాజీనామా చేస్తే, టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తారా? అని ఎంపీ విజయశాంతి ప్రశ్నించారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మెదక్ ఎంపీ విజయశాంతి టీఆర్ఎస్ విలీనంపై మీడియాతో మాట్లాడారు. ఒకవేళ తనని కాంగ్రెస్ పార్టీలో చేర్చుక్కునందుకే విలీనంపై వెనక్కి తగ్గినట్లయితే..తాను రాజీనామా చేయడానికి సిద్దంగా వున్నానని స్పష్టం చేశారు.   తనను కాంగ్రెస్ లో చేర్చుకోవడం తప్పు అయితే , కాంగ్రెస్ ఎమ్.పిలను మందా జగన్నాధం, వివేక్ లను టిఆర్ఎస్ లో ఎలా చేర్చుకున్నారని ఆమె గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే పార్టీని విలీనం చేస్తానని చెప్పిన కేసిఆర్ కుంటిసాకులతో తప్పించుకోవాలని చూస్తున్నారని అన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన టీఆర్ఎస్, ఇచ్చిన మాటకు కట్టుబడి వుండాలని పేర్కొన్నారు. ఆ మాట అడిగితె ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు.   తెరాసలో తనని చాలా ఇబ్బంది పెట్టారని అన్నారు. షోకాజ్ నోటిసులు ఇవ్వకుండా పార్టీ నుండి సస్పెండ్ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ అధిష్టానం అప్పగించే బాధ్యతలు నిర్వహించేందుకు సిద్దంగా వున్నానని తెలిపారు. తెలంగాణ ప్రజల కోసమే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని అన్నారు.