వైకాపాకు అగ్నిపరీక్షగా మారనున్న ఎన్నికలు
త్వరలో జరగనున్న ఎన్నికలు తెదేపా, వైకాపాలకు జీవన్మరణ పోరాటం వంటివి గనుక అవి గెలుపు కోసం శక్తికి మించి కృషి చేస్తాయి. ఈసారి వాటికి కలిసొచ్చే అంశం ఏమిటంటే ప్రజలలో తీవ్ర కాంగ్రెస్ వ్యతిరేఖత నెలకొని ఉండటం. అదేవిధంగా నష్టం కలిగించే అంశం ఏమిటంటే ఉన్న13జిల్లాలలో అనేక కొత్త, పాత పార్టీలు పోటీ పడటం.
వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తన సమైక్యవాదంతో కాంగ్రెస్ వ్యతిరేఖతను తన పార్టీకి అనుకూలంగా మలుచుకొనేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే రాష్ట్ర విభజన జరిగిపోయినప్పటికీ ఎన్నికల వరకు ఆ వేడిని నిలిపి ఉంచేందుకు రాష్ట్ర విభజనకు వ్యతిరేఖంగా సుప్రీం కోర్టులో మళ్ళీ న్యాయ పోరాటానికి సిద్దపడుతున్నారు. కానీ, ఇప్పుడు ఏదయినా ఒక పార్టీ ధర్నా చేసినా, రాష్ట్రపతిని కలిసినా మిగిలిన పార్టీలు కూడా దానిని అనుసరించక తప్పని విచిత్రమయిన పరిస్థితి, సంప్రదాయం నెలకొని ఉన్నందున సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు, తెదేపా కూడా సుప్రీంకోర్టులో కేసులు వేయవచ్చును, రాష్ట్రపతిని కలిసినా ఆశ్చర్యం లేదు. అందువల్ల వైకాపా ఇతర ప్రయత్నాలు కూడా గట్టిగానే చేయవలసి ఉంటుంది.
బహుశః త్వరలోనే పెద్ద ఎత్తున సీమాంధ్ర అంతటా పెద్ద ఎత్తున సభలు సమావేశాలు నిర్వహించి రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీని అందుకు సహకరించిన బీజేపీని, విభజనకు లేఖ ఇచ్చినందుకు తెదేపాను ఎండగట్టవచ్చును. కానీ చంద్రబాబుతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి పరిపాలనానుభవం లేదు. పైగా చాలా దుందుడుకు స్వభావం. గత పదేళ్లుగా అస్తవ్యస్తమయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టి, సమర్ధంగా పాలన సాగిస్తూనే రాష్ట్ర పునర్నిర్మాణం చేయాలంటే అందుకు చాలా అనుభవం, కార్యదక్షత, నేర్పు కావలసి ఉంటుంది. చంద్రబాబు తన దీక్షా దక్షతలను నిరూపించుకొన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డికి అవేమి లేకపోగా అతని వెనుక జైలు జీవితం, అనేక అవినీతి ఆరోపణలు, సీబీఐ కేసులు మాత్రమే ప్రముఖంగా కనిపిస్తున్నాయి. పైగా కాంగ్రెస్ పార్టీతో రహస్య సంబంధం కలిగి ఉన్నారనే ఆరోపణలు ప్రజలలో ఆయనపట్ల అపనమ్మకం కలిగిస్తున్నాయి. ఆయన ఇమేజే వైకాపాకు పెద్ద అండగా ఉంది గనుక, ఇప్పుడు కూడా ఆయన ఈ వ్యక్తిగత అంశాలు ఆ పార్టీపై తీవ్ర ప్రభావం చూపకమానవు.
ఇక కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడితే అందులో జేరుదామని ఇంతకాలం ఎదురు చూసిన కాంగ్రెస్ నేతలు, మారిన పరిస్థితుల్లో కొంతమంది కాంగ్రెస్ లోనే ఉండేందుకు సిద్దపడుతుంటే మిగిలినవారు తెదేపా, వైకాపాలవైపు చూస్తున్నారు. అందువల్ల అటువంటి వారినందరినీ వైకాపా వైపు ఆకర్షించే ప్రయత్నం గట్టిగా చేసి పార్టీని బలోపేతం చేసుకొనే ప్రయత్నం చేయవచ్చును. కానీ సరిగ్గా ఇదే కారణంతో పార్టీలో కొత్త, పాత నేతల మధ్య విభేదాలు మొదలయి, జగన్మోహన్ రెడ్డి పార్టీపై అదుపు కోల్పోయినట్లయితే వైకాపా కూడా మరో ప్రజారాజ్యంగా మారి ఎన్నికలలో మునిగి కాంగ్రెస్ పార్టీలో తేలుతుంది. మరి ఈ ఎన్నికల కురుక్షేత్రంలో వైకాపాను జగన్మోహన్ రెడ్డి ఒడ్డుకు చేరుస్తారో లేక కాంగ్రెస్ నావ ఎక్కించి చిరంజీవిలా క్షేమంగా బయటపడతారో చూడాలి.