శివనామస్మరణతో మార్మోగుతున్న ఆలయాలు
posted on Feb 27, 2014 @ 10:59AM
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివనామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచే ఆలయాలకు భక్తులు బారులు తీరారు.
శ్రీశైలం: మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం పుణ్య క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచి భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి దేవదేవున్ని దర్శించుకుంటున్నారు. కేంద్రం మంత్రి పురంధేశ్వరి దంపతులు మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు.
వరంగల్ : శివరాత్రి సందర్భంగా వేయిస్తంభాల ఆలయానికి భక్తులు పోటెత్తారు. దుర్గేశ్వర ఆలయం, భోగేశ్వరాలయం, ఐనవోలు, పాలకుర్తి, సిద్ధేశ్వర ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
విజయవాడ : మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని కృష్ణానదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. పాత శివాలయం, యనమలకుదురు, రామలింగేశ్వర ఆలయాల్లో భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీ దృష్ట్యా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
చిత్తూరు : శివరాత్రి పండుగ సందర్భంగా జిల్లాలోని శివాలయాలు భక్తులతో పోటెత్తుతున్నాయి. శ్రీకాళహస్తి,కపిలతీర్థం. సదాశివకోన, కైలాసకోన, తలకోన సిద్దేశ్వర ఆలయం, మల్లయ్యకొండ, రుద్రకోటి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
ఖమ్మం జిల్లాలో శివరాత్రి సందర్భంగా శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. నీలాద్రి, తీర్థాల, గణపేశ్వరస్వామి, మృత్యుంజయస్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. భద్రాద్రి దేవాలయం శివనామస్మరణతో మార్మోగింది. భద్రాచలం గౌతమి తీరంలో భక్తుల కోలాహలం అధికంగా ఉంది. వైరా మండలం స్నానాలలక్ష్మీపురంలోని శివాలయంలో డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆదిలాబాద్ : పండుగ సందర్భంగా శివాలయాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంది. గోదవరిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు శివున్ని దర్శించుకుంటున్నారు. జైపూర్ మండలం వేలాలలో శివరాత్రిజాతర ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. నిర్మల్, కాగజ్‌నగర్‌లోని పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.