జేఏసీల రాజకీయ రంగ ప్రవేశం
తెలంగాణా, సమైక్యాంధ్ర ఉద్యమాలు కొత్త రాజకీయ నాయకులకు పురుడుపోశాయి. ఇంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండే ప్రభుత్వోద్యోగులు, న్యాయవాదులు, విద్యార్ధులు తదితరులు ఈ ఉద్యమాల పుణ్యామాని రాజకీయ నేతలతో, వారి పార్టీలతో, మంత్రులతో భుజాలు రాసుకొని తిరిగే భాగ్యం పొందారు. ఉద్యమాల కోసం వారు స్థాపించుకొన్న జేఏసీలే వారికి సమాజంలో, రాజకీయాలలో ఒక సరికొత్త గుర్తింపుని, హోదాని, పలుకుబడిని కల్పించాయి. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొనేందుకు వీధికొకటి చొప్పున జేఎసీలు పుట్టగొడుగుల్లా వెలిసాయి. అయితే అన్ని జేఏసీలను, నేతలను ఒకేగాట కట్టలేము. ఉద్యమాలు పతాక స్థాయిలో నడుస్తున్న తరుణంలో వాటిలో అనేకం చురుకయిన పాత్ర పోషించి, దారి తప్పుతున్న రాజకీయ నేతలను అదుపుచేస్తూ తమ భాద్యత నెరవేరగానే స్వచ్చందంగా తప్పుకొన్నవీ చాలానే ఉన్నాయి.
అయితే ఉద్యమాలు ముగిసిన తరువాత కూడా ఇంకా తమ ఉనికిని చాటుకొనే ప్రయత్నం చేస్తున్నవి కూడా ఉన్నాయి. అవి ఉద్యమంలో తము పడిన కష్టానికి రాజకీయ పార్టీల నుండి టికెట్స్ రూపంలో ప్రతిఫలం ఆశిస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాలలో ఇంకా సజీవంగా ఉన్న ఇటువంటి జేఏసీలు ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి అధికారం చెప్పట్టాలని ఉవ్విళ్ళూరుతున్నాయి. అయితే ఇది తప్పని ఎవరూ అనకపోయినప్పటికీ, తమ ఉద్యమ లక్ష్యం నెరవేరిన తరువాత ఇంకా జేఏసీలను సజీవంగా ఉంచడం, దానిని తమ రాజకీయ ప్రయోజనాలకోసం ఉపయోగించుకోవాలనుకోవడం సబబు కాదు. జేఏసీ నేతలకు ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి, ప్రభుత్వంలో పాలు పంచుకోవాలనుకొంటే ముందుగా జేఏసీలను పూర్తిగా రద్దు చేసి, తమ ప్రభుత్వోద్యోగాలకు రాజీనామా చేసి, ఎన్నికలలో పోటీ చేస్తే ఎవరూ తప్పు పట్టలేరు.