పురుగుల మందు తాగిన ఎమ్మెల్యే

      వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాపు రామచంద్రరెడ్డి రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఎదుట పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. తన సర్పంచ్ లను కౌన్సెలింగ్ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన ఈ ఘటనకు పాల్పడ్డారు. వైకాపా కార్యకర్తల వేధింపులకు నిరసనగా రామచంద్రరెడ్డి రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఎదుట భైఠా౦యి౦చారు. కారణం లేకుండానేతన అనుచరులను వేధింపులకు గురిచేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపిస్తూ తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును సేవించి కిందపడిపోయారు. దీంతో అధికారులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వైకాపా నేతలు రాయదుర్గం బంద్ కు పిలుపునిచ్చారు.

పవన్ 'పవర్' కోసం జేపీ ఆరాటం

      పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో రాజకీయాలలోకి రావడం ఖాయమని వార్తలు వస్తుండడంతో ఆయన స్టార్ డమ్ ను క్యాష్ చేసుకోవాలని రాజకీయపార్టీలు ఆరాటపడుతున్నాయి. రాజకీయాల్ని క్యాష్ చేసుకోవడాన్ని ఎప్పుడు విమర్శించే లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ కూడా పవన్ 'పవర్' ను క్యాష్ చేసుకోవాలని చూడడం విశేషంగా చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి రావాల్సిన అవసరం ఎంతైన ఉందని అన్నారు. ప్రజా సేవ చేయాలనుకొనే వారికి లోక్ సత్తా బహిరంగ వేదికని అన్నారు. పవన్ తమ పార్టీలో చేరుతానంటే స్వాగతిస్తామని అంటున్నారు. పవన్ తనకు మంచి మిత్రుడని, దీనిపై ఆయనతో చర్చలు చేస్తామని తెలిపారు.

కేసిఆర్ పై సమరానికి 'టీ కాంగ్రెస్' సిద్దం

      టీఆర్ఎస్ అధినేత కేసిఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు అమీతుమీకి సిద్దమవుతున్నారు. కాంగ్రెస్ లో టీఆర్ఎస్ ను వీలినం చేయమని ప్రకటించడంతో ఆయనపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. కెసిఆర్ విలీనం చేయనని తేల్చడంతో తెలంగాణ ప్రాంత ఎంపీలు ఇక ఇంటింటికీ ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ ఓట్లు చీలకుండా ఉండేందుకే తాము తెరాస విలీనం అడిగామని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెసు చిత్తశుద్ధితో పని చేసిందన్నారు. పునర్ నిర్మాణం కాంగ్రెసుతోనే సాధ్యమన్నారు. కేసీఆర్ ఎప్పుడూ అబద్దాలే చెబుతారని కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆలీ ఆరోపించారు. పార్లమెంట్‌లో పిట్టలదొర కేసీఆర్ ఒక్క మాట మాట్లాడలేదని, తెలంగాణ రావడంలో కేసీఆర్ పాత్రలేదని ఆయన అన్నారు. తెలంగాణపై చర్చ సందర్భంగా ఎంఐఎం పార్టీ బిల్లులో సవరణలు చేసిందని, కేసీఆర్ బిల్లులో ఒక్క సవరణ ఏమైనా ప్రతిపాదించారా అని ప్రశ్నించారు. ఉద్యమం చేసిన వారంతా ఒక్కటి కావాలనే కాంగ్రెస్‌లో టీఆర్ఎస్‌ను విలీనం చేయాలని కోరామన్నారు. అయితే కేసీఆర్ నైజం అందరినీ మోసం చేయడమే అని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం మొత్తాన్ని తీసుకెళ్లి సోనియా కాళ్లెందుకు మొక్కారని ఈ సందర్భంగా షబ్బీర్ అలీ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇతరులపై ఎప్పుడు ఆధారపడలేదని మాజీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. టీఆర్ఎస్ తో పోత్తుగాని, వీలినంపై కాంగ్రెస్ ఎప్పుడు ఆలోచనలు చేయలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెసు చిత్తశుద్ధితో పని చేసిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన ఘనత ఎఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ దేనని అన్నారు. 

వి.హెచ్. ఆవేదన..కేసిఆర్ పునరాలోచించుకోవాలి

      తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో వీలినం చేస్తానని మాటిచ్చిన కేసిఆర్, ఇప్పుడు సడన్ గా మాట మార్చడంపై పునరాలోచించుకోవాలని ఎంపీ వి. హనుమ౦తరావు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుందని తెలిసినా, తెలంగాణ విద్యార్ధుల ఆత్మబలిదాలను చూసి చలించిన సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందుకు వచ్చారని అన్నారు. కేసిఆర్ వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకాలేదని అన్నారు. కేసిఆర్ స్వార్ధరాజకీయపరుడని ఆరోపించారు. కుటుంబంతో వెళ్ళి సోనియాని కలిసిన కేసిఆర్, అమరవీర కుటుంబాలను ఎందుకు తీసుకువెళ్ళలేదని ప్రశ్నించారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని నమ్ముకుంటే కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు తప్పదని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు అన్న మాటలు నిజమవుతుంటే భరించలేక ఆయన ఆవేదన చెందుతున్నారు!

అరచేతిలో స్వర్గం చూపిస్తున్న జైరాం రమేష్

  రాష్ట్ర విభజనతో ఆగ్రహంగా ఉన్నసీమాంధ్ర ప్రజలను ప్రసన్నం చేసుకొనేందుకు, రాష్ట్ర విభజనలో ముఖ్యపాత్ర పోషించిన కేంద్రమంత్రి జైరాం రమేష్ నే కాంగ్రెస్ అధిష్టానం ఎంచుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. కానీ ఆయనను ఎంచుకొని కాంగ్రెస్ అధిష్టానం చాలా తెలివయిన నిర్ణయమే తీసుకొందని ఆయన నిరూపిస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో లక్షలాది ప్రజలు స్వచ్చందంగా రోడ్ల మీదకు వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేసినా పట్టించుకొని కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు ఎన్నికలు ముంచుకు వస్తుండటంతో వారిని ప్రసన్నం చేసుకొనేందుకు జైరాం రమేష్ ను సీమాంధ్రలో పర్యటనకు పంపింది.   రానున్న పదేళ్ళలో వైజాగ్, విజయవాడలకు మెట్రో రైళ్ళు, ప్రత్యేక రైల్వే డివిజన్ల ఏర్పాటు, వందల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు, హైకోర్టు, శాసనసభ, సచివాలయం తదితర భవనాల నిర్మాణం, అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడరేవులు, పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు, విశ్వవిద్యాలయాలు, ఐఐటీ, ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పన, ఇతర అభివృద్ధి పనులు అంటూ కలలో కూడా ఎవరూ ఊహించలేని స్వర్గాన్ని ఆయన అరచేతిలో చూపిస్తూ ప్రజలను ఆకట్టుకొంటున్నారు.   ఆయన చెపుతున్నవన్నీ ఏర్పడితే నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో ప్రధమ స్థానంలో నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. కానీ, రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలే కనబడనప్పుడు జైరాం చేస్తున్నవాగ్దానాలకు విలువేమి ఉంటుంది? అవి ప్రజలను మభ్యపెట్టడానికే తప్ప వేరెందుకు ఉపయోగపడవు. ఒకవేళ ఎన్నికల తరువాత బీజేపీ అధికారంలోకి వచ్చినట్లయితే, తలకు మించిన భారంగా తయారయ్యే కాంగ్రెస్ ప్రకటిస్తున్న ఈ వరాలన్నిటినీ ఎందుకు అమలు చేస్తుంది? ఎలా అమలు చేస్తుంది? ఎంతవరకు అమలు చేస్తుంది? అని ప్రశ్నించుకొంటే సరయిన సమాధానాలు దొరకవు.   గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీయే కేంద్రంలో, రాష్ట్రంలో కూడా అధికారంలో ఉన్నపుడు ఇప్పుడు ఆయన చెపుతున్న వాటిలో ఏ ఒక్కటీ చేయాలని కాంగ్రెస్ ఎందుకు భావించలేదు? అవి చేయకుండా కాంగ్రెస్ పార్టీని ఎవరు అడ్డుకొన్నారు? ఇవన్నీ ఇప్పుడే చేయాలని ఎందుకు భావిస్తోంది? అంటే ప్రజలను మభ్యపెట్టి ఎన్నికలలో గెలిచేందుకేనని ఎవరికయినా అర్ధం అవుతుంది. ఒకవేళ కాంగ్రెస్ అదృష్టం బాగుండి ఎన్నికలలో గెలిచినా గత పదేళ్లలలో చేయని పనులు అప్పుడు మాత్రం ఎందుకు చేస్తుంది?     వైజాగ్ కు రైల్వే జోన్ కావాలని, కనీసం ఒకటి రెండు కొత్త రైళ్ళు కావాలని గత పదేళ్లుగా యంపీలు, కేంద్రమంత్రులు కోరుతున్నపటికీ వారి అభ్యర్ధనలను  పెడచెవిన పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం, ఇప్పుడు ఊరికొక మెట్రో రైలుని ఊరకే పంచిపెట్టేస్తామని, జిల్లాకో రైల్వే జోన్ ఇచ్చేస్తానని వాగ్దానం చేయడం హాస్యాస్పదం.   ఇంతకాలం సీమాంధ్ర ప్రజలను, వారి ప్రతినిధులను, వారి అభిప్రాయాలను పూచిక పుల్లెత్తు విలువీయని కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు సీమాంధ్ర పై ఇంత అవ్యాజమయిన ప్రేమ కురిపించేయడం చాలా ఆహేతుకంగా, అసంబద్దంగా నాటకీయంగా ఉంది. ఈ ప్రేమ, వరాలు అన్నీ కూడా ఎన్నికలలో గెలవడం కోసమే. ఎన్నికలలో గెలిస్తే ఇక మళ్ళీ సీమాంధ్ర ప్రతినిధులు కాంగ్రెస్ అధిష్టానం కాళ్ళ దగ్గర పడి బ్రతకవలసిందే. వారు చెప్పే పోసుకోలు కబుర్లు వింటూ ప్రజలు మళ్ళీ ఎన్నికలు వచ్చేవరకు ఐదేళ్ళు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడాల్సిందే.

పెట్రోల్ బంక్ సమ్మె..గవర్నర్ ఫైర్

      రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడంతో గవర్నర్ నరసింహన్ తన పవర్ చూపిస్తున్నారు. అనూహ్యంగా మొదలైన పెట్రోల్ బంకుల బంద్‌ను గంటల వ్యవధిలో ఆయన ఉపసంహరింపజేశారు. అంతకుముందు సమ్మె సాకుతో లీటరు పెట్రోలు ఏకంగా 220 వరకు అమ్ముడైంది. దీంతో గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకుని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో, తూనికలు, కొలతల డెరైక్టర్ జనరల్‌తో మాట్లాడారు. సాయంత్రానికల్లా పెట్రోల్ బంకులు తెరుచుకునేలా చర్యలు తీసుకోవాలని, లేదంటే చర్యలు తీవ్రంగా ఉంటాయనే సంకేతాలను గవర్నర్ ఇచ్చారు. దీంతో పెట్రోల్ బంకుల యజమాన్యాలతో అధికారులు చర్చలు జరిపారు. గంటల వ్యవధిలోనే బంద్‌ను యాజమాన్యాలు ఉపసంహరించుకున్నాయి. అంతేకాదు, సర్కారుతో కాళ్లబేరానికి కూడా వచ్చాయి.

కాంగ్రెస్ పార్టీకి పాలన చేత కాదు: చంద్రబాబు

  మునిసిపల్ ఎన్నికల విషయంలో హైకోర్టు కలుగజేసుకోదని తేల్చి చెప్పడంతో ఇక ఎన్నికలు అనివార్యమయ్యాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇటువంటి అగ్ని పరీక్షలు ఎదుర్కోవడం ఏ పార్టీకయినా ఇబ్బందే. ఎన్నికలలో ఓడిపోతే ఆ ప్రభావం తరువాత వచ్చే ఎన్నికలపై పడుతుంది గనుక అధికారంలో ఉన్న పార్టీకయితే మరీ ఇబ్బంది. అయినా ఎదుర్కోక తప్పడం లేదు. కోర్టులు చేత మొట్టికాయలు వేయించుకొంటే తప్ప మునిసిపల్ ఎన్నికలను కూడా నిర్వహించలేని దుస్థితిలో కాంగ్రెస్ ఉందని చంద్రబాబు ఎద్దేవా చేసారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టినా అది పూర్తి కాలం సుస్థిరంగా పాలించలేదని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విదించడంతో అది మరోమారు స్పష్టమయిందని చంద్రబాబు విమర్శించారు. ఆయన కాంగ్రెస్ హయాంలో పెరిగిన ధరలను, అదుపు తప్పిన పాలనను ఎత్తి చూపుతూ, ఒకప్పుడు దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచిన రాష్ట్రాన్ని, హైదరాబాదుని కాంగ్రెస్ ప్రభుత్వం తన అవినీతి, అసమర్ధ పాలన కారణంగా అట్టడుగు స్థానానికి చేర్చి చేతులు దులుపుకొని వెళ్లిపోతోందని ఆయన కాంగ్రెస్ పార్టీని దుయ్యబట్టారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ పట్టాల మీదకు ఎక్కించాలంటే ఒక్క తెలుగుదేశం పార్టీ వల్లనే సాధ్యమవుతుందని ఆయన అన్నారు.   చంద్రబాబు కాంగ్రెస్ పార్టీపై ఈవిధంగా దాడి చేయడం కొత్తేమీ కాకపోయినా, కేవలం కాంగ్రెస్ అసమర్ధత కారణంగానే రాష్ట్రంలో మళ్ళీ నలబై ఒక్క ఏళ్ల తరువాత రాష్ట్రపతి పాలన విదించబడిన నేపధ్యంలో ఆయన చేస్తున్న ఆరోపణలు, విమర్శలు వాస్తవ పరిస్థితులకి అద్దం పడుతున్నాయి గనుక ఆయన విమర్శలకు కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడి ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి.

తెరాసను చూసి జడుసుకొంటున్న టీ-కాంగ్రెస్ నేతలు

  ఊహించినట్లుగానే కేసీఆర్ ‘హస్తం’ పార్టీకి హ్యాండిచ్చి విలీనం బాధ నుండి బయటపడ్డారు. ఆయన కావాలనుకొంటే పొత్తులు కూడా ఉండవని నిన్ననే ప్రకటించి ఉండవచ్చును. కానీ ప్రకటించలేదు. కాగల కార్యం గంధర్వులే చేస్తారన్నట్లుగా, నేటి నుండి కాంగ్రెస్ నేతలందరూ కేసీఆర్, తెరాసను లక్ష్యం చేసుకొని దాడికి దిగి ఇక తెరాసతో పొత్తులు అవసరం లేదని వారే చెపుతారు గనుక ఆయన ఆశ్రమ తీసుకోలేదు. కేసీఆర్ ఆడిన మాట తప్పి మోసం చేసారని, తెరాస విలీనం కాకపోయినా కాంగ్రెస్ కు వచ్చే నష్టం ఏమీ లేదని, తెలంగాణా ఇచ్చినందుకు ప్రజలందరూ తమ వెంటే ఉంటారని కాంగ్రెస్ నేతలందరూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించవచ్చు గాక, కానీ తెరాస విలీనం కాలేదనే వారి ఆక్రోశమే వారు తెరాసను చూసి ఎంత భయపడుతున్నారో అద్దం పడుతోంది. టీ-కాంగ్రెస్ నేతల సామర్ధ్యాన్ని ఎవరూ తక్కువగా అంచనా వేయకపోయినప్పటికీ, తెరాస విలీనం గురించి పదేపదే మాట్లాడుతూ తమ సామర్ధ్యంపై తమకే నమ్మకం లేనట్లుగా చాటుకొంటున్నారు.

కాంగ్రెస్ పార్టీలో తెరాస విలీనం కాబోదు: కేసీఆర్

  దాదాపు నాలుగు గంటలకు పైగా సాగిన తెరాస పోలి బ్యూరో సమావేశంలో కాంగ్రెస్ పార్టీలో తెరాస విలీనం, పొత్తులపైనే ప్రధానం చర్చ జరిగింది. సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ తెరాస కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోదని ప్రకటించారు. సమావేశంలో మాట్లాడిన దాదాపు 85మంది పార్టీ నేతలు పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడాన్ని వ్యతిరేఖించినందున ఇక విలీనం ప్రసక్తి లేదని ఖరాఖండీగా ప్రకటించేశారు. ఇక కే.కేశవ్ రావు అధ్యక్షతన ఏర్పడే కమిటీ కాంగ్రెస్ పార్టీతో సహా వివిధ పార్టీలతో ఎన్నికల పొత్తుల గురించి ఒక నిర్ణయం తీసుకొంటుందని ఆయన ప్రకటించారు. అందువల్ల ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో విలీనం కానీ, ఎన్నికల పొత్తులు కూడా లేనట్లే స్పష్టమయింది. కాంగ్రెస్ పార్టీ విలీనం కాకూడదని నిర్ణయం వెనుక బలమయిన కారణాలు చాలానే ఉన్నాయని కేసీఆర్ చెప్పారు. అవి ప్రధానంగా:   1. రాష్ట్రవిభజన/తెలంగాణా ఏర్పాటు ప్రక్రియ మొదలుపెట్టిన నాటి నుండి కాంగ్రెస్ పార్టీ ఏనాడు తెరాసను పరిగణనలోకి తీసుకోలేదు. అన్నీ ఏకపక్ష నిర్ణయాలే తీసుకొంది.   2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించినట్లే, తెలంగాణాలో వెనుకబడిన 8 జిల్లాలకు మేము ప్రత్యేక ప్రతిపత్తి కోరితే కాంగ్రెస్ అధిష్టానం మా మాట పట్టించుకోలేదు.   3. అదేవిధంగా పోలవరానికి జాతీయ హోదా కల్పించినట్లే తెలంగాణాలోని చేవెళ్ళ-ప్రాణహిత ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించమని మేము చేసిన విజ్ఞప్తిని కూడా కాంగ్రెస్ పట్టించుకోలేదు.   4. తెలంగాణా రాష్ట్రం ఏర్పరుస్తూ గెజిట్ నోటిఫికేషన్ కూడా వెలువడిన తరువాత కేంద్ర ప్రభుత్వం ఖమ్మం జిల్లాలో పోలవరం ప్రాజెక్టు క్రింద వచ్చే ఏడూ మండలాలను సీమంధ్రలో కలుపుతూ ఏకపక్షంగా ఆర్డినెన్స్ జారీ చేసింది. ఇది రాజ్యాంగ ఉల్లంఘనే.   5. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తూనే ఉమ్మడి రాజధానిగా ఉండే హైదరాబాదుపై సర్వాదికారాలను గవర్నర్ చేతికి అప్పగించావద్దని మేము చేసిన విజ్ఞప్తులను కాంగ్రెస్ అధిష్టానం పేద చెవిన పెట్టింది.   6. ఇక మా పార్టీపై కేంద్రమంత్రి జైరాం రమేష్ చేసిన అనుచిత వ్యాక్యలు మమ్మల్ని చాలా భాదించాయి.   కలిసి పనిచేద్దామని కోరుతూనే, మా పార్టీ నుండి బహిష్కరించిన నేతలని కాంగ్రెస్ లో చేర్చుకోవడం మేము ఖండిస్తున్నాము. “చెప్పాలంటే ఇంకా ఇటువంటి వంద కారణాలున్నాయి. ఇంతకాలంగా కాంగ్రెస్ నేతలు మా పార్టీని మమ్మల్నీ ఎంతగా అవమానించినప్పటికీ, మావల్ల తెలంగాణా బిల్లు ఆగిపోకూదదనే ఉద్దేశ్యంతోనే భరించాము. కానీ, కాంగ్రెస్ పార్టీ నేతలు మాపట్ల ఇంత అనుచితంగా,నిర్లక్ష్యంగా వ్య్వహరిస్తున్నపుడు మేము వారితో కలవాల్సిన అవసరం లేదు. అందువల్ల ఇక ముందు కూడా తెరాస స్వంతంత్రంగా పనిచేస్తూ ఎన్నికలలో పోటీ చేస్తుంది. తెలంగాణా పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాంగ్రెస్ పార్టీతో పొత్తుల విషయం కేశవ్ రావు అధ్యక్షతన పనిచేసే కమిటీయే నిర్ణయిస్తుంది,” అని కేసీఅర్ స్పష్టం చేసారు.

ఏడు జిల్లాలకే ప్రత్యేక హోదా

  సీమాంధ్రలోని మొత్తం 13 జిల్లాలకు ప్రత్యేక హోదా వర్తిస్తుందని ఇన్నాళ్లూ భావించిన వారి ఆశల మీద కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్ నీళ్లు చల్లారు. రాయలసీమలోని 4 జిల్లాలు, ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలు కలిపి మొత్తం 7 జిల్లాలకు మాత్రమే ప్రత్యేక హోదా అమలవుతుందని ఆయన విశాఖపట్నంలో చెప్పారు. బుందేల్ఖండ్ మాదిరిగానే సీమాంధ్రకు కూడా ప్రత్యేక హోదా ఉంటుందని జైరాం రమేష్ తెలిపారు. కొత్తగా ఏర్పాటుచేయబోయే పరిశ్రమలకు మాత్రమే పన్నురాయితీలు వర్తిస్తాయని, ఇప్పటికే ఉన్న పరిశ్రమలకు వర్తించబోవని స్పష్టం చేశారు. సీమాంధ్రలో రైల్వే జోన్ ఏర్పాటుచేస్తామని కూడా ఆయన తెలిపారు.

నరసింహన్ గవర్నర్ గిరీ

  పైకి చాలా సౌమ్యంగా కనిపించే గవర్నర్ నరసింహన్ రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలు చేప్పట్టిన మొదటి రోజునే శాంతి భాద్రాల విషయంలో చాలా కటినంగా వ్యవహరిస్తానని ప్రకటించారు. ఆ తరువాత మాకీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసే ముందు సంతకాలు చేసిన అనేక ఫైళ్ళను పునః సమీక్షించబోతున్నట్లు సూచనప్రాయంగా తెలిపారు. అదేవిధంగా నామినేటడ్ పదవులలో కిరణ్ కుమార్ రెడ్డి నియమించిన వారందరూ స్వచ్చందంగా తప్పుకోమని కోరారు. రాజీవ్ యువకిరణాలు ప్రాజెక్టుకి చైర్మన్ గా కిరణ్ చేత నియమింపబడ్డ కేసీ రెడ్డి ఇప్పటికే తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు అందజేయగా మరోకొంతమంది త్వరలోనే తప్పుకోవచ్చును. ఆ తరువాత సమ్మె చేస్తున్న పెట్రోల్ బ్యాంకులపై ఆయన దృష్టి సారించారు. వారు వెంటనే సమ్మె విరమించకపోతే తీవ్ర చర్యలు తీసుకొంటానని గట్టిగా హెచ్చరించి వారిచే ఒకే ఒక్కరోజులో సమ్మె విరమింపజేసారు. ఈ రోజు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతీతో సమావేశమవాదం గమనిస్తే బహుశః ఆయన ఇక గాడి తప్పిన ప్రభుత్వనిర్వహణను తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నం చేయవచ్చును. నరసింహన్ అధికారం చెప్పటిన రెండు రోజుల్లోనే ఇంత చురుకుగా వ్యవహరిస్తూ పాలన చక్కబెట్టడం అభినందనీయం.

తెలంగాణాకు తెదేపా ప్రత్యేక కమిటీ

  టీ కప్పులో తుఫానులా మొదలయిన తెదేపా-తెలంగాణా ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు అలకపాన్పు సీను ప్రశాంతంగా ముగిసింది. తెదేపాను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే వార్తలను ఖండిస్తూ తను తెదేపాలోనే ఉంటానని, తెలంగాణాలో పార్టీని బ్రతికించుకోవాలని తపన పడుతున్నానని ముక్తాయింపు ఇవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకొన్నారు. మరొకటి రెండు రోజుల్లో తెదేపా-తెలంగాణా కోసం ప్రత్యేకంగా ఎర్రబెల్లి, మోత్కుపల్లి, రేవూరి, మండవ, మరియు యల్.రమణలతో కూడిన ఐదుగురు సభ్యుల కమిటీని నియమించనున్నారు. ఈ కమిటీ తెలంగాణాలో పార్టీ శాఖకు కార్యవర్గం, ఎన్నికల కమిటీ, ఏర్పాటులో పార్టీ అధినేత చంద్రబాబుకి సహకరించవచ్చును. త్వరలో జరగనున్న ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరుగబోతున్నాయి గనుక, తాత్కాలికంగా ఈ ఐదుగురు సభ్యుల కమిటీ నేతృత్వంలోనే పోటీచేసి, రాష్ట్రం అధికారికంగా విభజింప బడిన తరువాత రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా శాఖలు ఏర్పాటు చేసేందుకు తెదేపా యోచిస్తున్నట్లు సమాచారం.

పార్టీని వీడను..బ్రతికించుకుంటా:ఎర్రబెల్లి

      తెలుగుదేశం పార్టీ తెలంగాణ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ పార్టీని వీడుతారని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తాను తెలుగుదేశం పార్టీని వీడనని, తెలంగాణలో పార్టీని బ్రతికించుకుంటానని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి టిడిపితోనే సాధ్యమని అన్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి అధినాయకత్వానికి సూచనలు చేసినట్లు తెలిపారు. అయితే తెలంగాణ టిడిపి కి ప్రత్యేక కమిటీ వేయనందుకు నిరసనగా ఈ రోజు తెలంగాణ టిడిపి పోరం కన్వీనర్ పదవికి రాజీనామా కూడా చేశారు. పార్టీని కూడా వీడేందుకు సిద్దమయ్యారని వార్తలు కూడా వచ్చాయి. దీంతో తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక కమిటీపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కసరత్తు ప్రారంభించారు. తెలంగాణ సీనియర్లు మోత్కుపల్లి నరసింహులు, రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు,ఎల్.రమణ,మండవ వెంకటేశ్వరరావులతో కమిటీ వేయవచ్చని భావిస్తున్నారు. వారంలోగా ప్రత్యేక కమిటీపై ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

సీమాంధ్రలో చక్కర్లు కొడుతున్న డిల్లీ నేతలు

  గత మూడునాలుగేళ్ళుగా రాష్ట్రం రావణకాష్టంలా రగులుతున్నా, లక్షలాది ప్రజలు రోడ్లమీధకు వచ్చి ఉద్యమాలు చేస్తున్నా ఏ మాత్రం పట్టించుకోని కాంగ్రెస్, బీజేపీ అగ్ర నేతలు, ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతుండటంతో, డిల్లీ నుండి రెక్కలు కట్టుకొని వచ్చి రాష్ట్రంపై వాలిపోయారు. ఒకరు రాష్ట్రవిభజనలో కీలక పాత్ర పోషించిన జైరాం రమేష్ కాగా, మరొకరు రాజ్యసభలో తెలంగాణా బిల్లుకి మద్దతు ఇచ్చిన వెంకయ్య నాయుడు. గత మూడు నాలుగు సంవత్సరాలుగా తెలంగాణా కోసం తెలంగాణా ప్రజలు పోరాడుతున్నపుడు ఈ ప్రజా ప్రతినిధులు ఇద్దరూ ఈ సమస్య పరిష్కారానికి ఏమాత్రం చొరవ చూపలేదు. వందలాది అమాయకులయిన యువకులు తెలంగాణా కోసం బలిదానాలు చేసుకొంటున్నపుడయినా స్పందించిన పాపానపోలేదు. కానీ ఇప్పుడు తెలంగాణా మేమే ఇచ్చామంటే, కాదు మేమే తెచ్చామని క్రెడిట్ కోసం కొట్లాడుకొంటున్నారు.   ఏనాడూ సీమాంధ్ర ప్రజలను పరమార్శించడానికి కూడా రాని జైరాం రమేష్ ఇప్పుడు సీమాంధ్రలోనే చక్కర్లు కొడుతున్నారు. రాష్ట్ర విభజన సంగతి పక్కనబెట్టి, తాము విదిలించబోయే తాయిలాలు కావాలంటే తమ పార్టీకే ఓటేసి గెలిపించాలని కోరుతున్నారు. సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలకు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రికి, శాసనసభకు, కేంద్రమంత్రులకు పూచికపుల్లెత్తు విలువీయకపోయినా సీమాంధ్ర ప్రజలందరూ తమ కాంగ్రెస్ పార్టీకే ఓటేసి గెలిపించమని కోరుతున్నారు. ఇంక వెంకయ్య నాయుడు మరొక అడుగు ముందుకు వేసి తన ప్రాస బాషలో అలవోకగా ఉపన్యాసాలు దంచుతూ, గతంగతః అని జరిగినదంతా ఒక పీడకలగా మరిచిపోయి, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం బీజేపీకే ఓటేయమని కోరుతున్నారు. రాష్ట్ర విభజన జరుగుతున్నంత కాలం రాష్ట్రంలో అడుపెట్టని   ఈ ఇద్దరు నేతలు, ఇప్పుడు రాష్ట్రంలోనే ఎందుకు తిరుగుతున్నారంటే వారి అగ్ర నేతలు నరేంద్ర మోడీ, సోనియా రాహుల్ గాంధీలు పర్యటనకు రంగం సిద్దం చేయడానికే. త్వరలో మోడీ రాష్ట్ర పర్యటన చేయబోతున్నట్లు ఖరారయింది. ఇక సోనియా, రాహుల్ గాంధీలు ఎప్పుడు తెలుగు ప్రజలను అనుగ్రహిస్తారో చూడాలి.

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

      మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 30వ తేదీన ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మొత్తం 146 మునిసిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతాయి. వీటి ఫలితాలు ఏప్రిల్ 2వ తేదీన వెల్లడిస్తారు.నామినేషన్ల ప్రక్రియ ఈనెల 10వ తేదీన ప్రారంభమై 14వ తేదీ వరకు ఉంటుంది. పార్టీ గుర్తులపైనే జరిగే ఈ ఎన్నికలలో మొత్తం 11వేల ఈవీఎంలు ఉపయోగిస్తారు.

మండలాలు సీమాంధ్రలో.. ఓట్లు తెలంగాణలో

      పోలవరం ముంపు ప్రాంతాల కింద ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను సీమాంధ్రలో కలిపినా.. అక్కడి ప్రజలు మాత్రం తెలంగాణలోనే ఓట్లు వేస్తారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2014ను రాష్ట్రపతి ఆమోదించిన అనంతరం ప్రచురించిన భారత ప్రభుత్వ గెజిట్‌లో పేర్కొన్నారు. ఈ గెజిట్ ప్రకారం జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంటు నియోజకవర్గాలు యథాతథంగా కొనసాగుతాయి. పోలవరం ముంపు పరిధిలోకి వచ్చే భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాల్లోని మండలాల్లోనూ ఎలాంటి మార్పు లేదు. అంటే త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలలో ముంపు మండలాల ఓటర్లు తెలంగాణలోనే ఓటు వేస్తారు.

తెలుగువన్ ఫౌండేషన్ అధ్వర్యంలో వైద్య శిబిరం

  గత రెండు దశాబ్దాలుగా తాజా సినీ,రాజకీయ, సామాజిక వార్తా విశ్లేషణలను అందిస్తూ తెలుగు ప్రజలను ఆకట్టుకొన్న తెలుగువన్.కమ్ సంస్థ యాజమాన్యం ‘తెలుగువన్ ఫౌండేషన్’ స్థాపించి సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటోంది. తెలుగు ఫౌండేషన్ ప్రతినిధులు, మణిపాల్ ఆసుపత్రి వైద్యనిపుణులతో కలిసి నాగాయలంక మండలంలో ఎదురుమొండి, నాచుగుంట గ్రామాలలో పర్యటించి వివిధ వ్యాధులతో బాధపడుతున్న గ్రామస్తులకు వైద్యసేవలు అందించేందుకు వారి వివరాలు సేకరించింది. గ్రామస్తులలో ప్రధానంగా ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యాధులు, కీళ్ళనొప్పులు, సీజనల్ జ్వరాలు వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించామని మణిపాల్ ఆసుపత్రి వైద్య నిపుణుల బృందం తెలిపారు. త్వరలోనే ఈ రెండు గ్రామాలలో ఒక మెగా వైద్య శిబిరం నిర్వహించి గ్రామస్తులకు వైద్యం చేస్తామని తెలుగువన్ ఫౌండేషన్ ప్రతినిధి శ్రీ కంఠమనేని రవిశంకర్  మరియు మణిపాల్ ఆసుపత్రి ప్రధాన వైద్యులు డా.రాజమోహన్ తెలిపారు. ప్రముఖ సామాజికవేత్త వీవీ ఆర్. కృష్ణం రాజు, కృష్ణ మూర్తి, మణిపాల్ మార్కెటింగ్ హెడ్ ఉదయ కిరణ్, గ్రామ సర్పంచులు నాయుడు బాబురావు, సైకం నాగేశ్వర రావు తదితరులు ఈ బృందంలో ఉన్నారు.