కాంగ్రెస్ కి, సీఎం పదవికి కిరణ్ రాజీనామా
సీట్ల కోసం, ఓట్ల కోసం, అధికారం కోసం తెలుగుజాతిని విడగొట్టి, తీవ్రనష్టం కలిగించిన దానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీకి, సీఎం పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. తమ పార్టీల లాభం కోసం, ప్రజల ఓట్ల కోసం అన్ని పార్టీలు కాంగ్రెస్, జగన్, చంద్రబాబు, బిజెపి, కేసిఆర్ లు తెలుగు జాతికి నష్టం చేశారని మండిపడ్డారు.
రాష్ట్ర విభజన వల్ల తెలంగాణ, సీమాంధ్ర ప్రజలు కష్టాలు ఎదుర్కొంటారని అన్నారు. విభజన వల్ల ప్రజలకు లాభం చేకురాలి కాని ఈ విభజన వల్ల విద్యార్ధుల, రైతుల, ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్తు అంధకారంగా మారుతుందని అన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి రాజ్యంగా, సంప్రదాయ ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆరోపించారు.
దొంగలమాదిరి టీవీ ప్రత్యక్ష ప్రసారాలు ఆపివేసి,బిల్లు ఆమోదించడంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విభజన ప్రక్రియతో సిగ్గుతో తలవంచుకోవల్సి వచ్చిందని అన్నారు. నాకు నా భవిష్యత్తు ముఖ్యం కాదు, తెలుగు ప్రజల భవిష్యత్తు ముఖ్యమని అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలకి నేను వ్యతిరేఖం కాదు. ఇరుప్రాంత ప్రజల మేలు కోసమే ఇన్ని రోజులు పోరాటం చేశానని, ఎవరినైనా నొప్పించి వుంటే క్షమించాలని కిరణ్ కోరారు.