సమైక్యమనగా తెలంగాణాలో కూడా వైకాపా ఉండుట

  రాజకీయనాయకులూ, పార్టీలు చెప్పే మాటలని సరిగ్గా, పూర్తిగా అర్ధం చేసుకోవాలంటే తెలుగు ప్రజలు, ముఖ్యంగా తెలంగాణా ప్రజలందరూ కూడా తెలుగు భాషపై మరికొంత పట్టు సాధించవలసి ఉంది. ఒక రాజకీయ నాయకుడు, లేదా పార్టీ ఏదయినా ఒక అంశం లేదా పదం పలికితే, దానిని ప్రజలు ఒకలా అర్ధం చేసుకొంటే, నేతలు వేరొకలా భాష్యం చెపుతున్నారు. ఉదారణకి వైకాపా తెలంగాణా సెంటిమెంటుని గౌరవిస్తామంటే, పాపం! తెలంగాణా ప్రజలు తెలంగాణా ఏర్పాటుకి వైకాపాకి అభ్యంతరం లేదని అ(పా)ర్ధం చేసుకొన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా తమకు తెలంగాణాను ఇచ్చేశక్తి, ఆపే శక్తి కూడా లేదని ముక్తాయింపు ఇవ్వడంతో తాము ఈ విషయంలో మాత్రం పొరబడలేదనే భ్రమలో షర్మిలమ్మ పాదయత్రలో పదం కలిపి, విజయమ్మ రచ్చబండ ముచ్చట్లు ఓపికగా విన్నారు. వాళ్ళిరువురూ కూడా రాజన్న రాజ్యం తెస్తామన్నారే తప్ప ఏనాడు తెలంగాణా ఇవ్వొద్దని అనలేదు.   కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు ‘సై’ అనడంతో వైకాపా తెలంగాణా నుండి రాత్రికి రాత్రి హై-జంపులు, లాంగు జంపులు చేసుకొంటూ సీమాంధ్రలో వచ్చిపడి ‘సమ న్యాయం’ అంది. సమన్యాయం అంటే వివరించమని ఆ పార్టీకే చెందిన కొండా సురేఖ వంటివారు విజయమ్మను కోరితే, ఆమె సమ న్యాయం అంటే ‘సమైక్యాంధ్ర’ అని వివరించడంతో వైకాపాకి కొండంత అండగా నిలబడ్డ సురేఖమ్మ కూడా కంగుతిన్నారు. అయినా తనకు తెలుగు భాష మీద సరయిన పట్టులేకపోవడం వలననే ఈ ఇబ్బంది అంతా అని గొణుక్కొంటూ ఆమెతో సహా అనేకమంది వైకాపా నుండి శలవు తీసుకొన్నారు.   ఆ తరువాత ‘సమైక్యాంధ్ర’కి ‘శంఖారావం’ కూడా జోడించి జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలు, బస్సు యాత్రలు, దేశ యాత్రలు, దీక్షలు, ధర్నాలు వగైరాలు చేసారు. అయితే ఆయన ఏమి చేసినా, ఏమి మాట్లాడినా కూడా అటు తెలంగాణా ప్రజలు, ఇటు సీమాంధ్ర ప్రజలు కూడా అనుమానంగానే చూస్తున్నారు. కారణం వారెవరికీ తెలుగు భాష మీద సరయిన పట్టులేకపోవడమే. ఆయన తెలంగాణా ఏర్పాటుని అడ్డుకొంటున్నాడని తెలంగాణా ప్రజలు భావిస్తే, ఆయన సమైక్య ముసుగులో రాష్ట్ర విభజన కోసం శ్రమిస్తున్నాడని సీమాంధ్ర ప్రజలు అ(పా)ర్ధం చేసుకొన్నారు తప్ప ఆయన మాటలని, వాటిలో భావాన్ని ఎవరూ సరిగ్గా అర్ధం చేసుకోలేకపోయారు.   ఆయన సమైక్యవాదో, విభజనవాదో ప్రజలకి అర్ధంయ్యేలోగానే రాష్ట్ర విభజన జరిగిపోయింది. అందువలన ఇప్పుడు ఇక ఆ ప్రసక్తి అనవసరం. కానీ, ఇప్పుడు ఆయన మళ్ళీ తెలంగాణాలో ఓదార్పు యాత్రతో రీ-ఎంట్రీ ఇచ్చేందుకు కమిట్ అయినందున, తనను ఇంతగా అ(పా)ర్ధం చేసుకొన్న తెలంగాణా ప్రజలకు సమైక్యం గురించి కొంచెం బ్రీఫింగ్ ఇవ్వాలని అనుకోవడంతో ఈరోజు మరో రెండు పాత పదాలకు కొత్త అర్ధం చెప్పారు.   సమైక్యాంధ్ర, సమైక్యం అంటే అర్దం అన్ని ప్రాంతాల ప్రజలు కూడా తనవారేనని, అన్ని ప్రాంతాలలో ప్రేమ,ఐక్యతలు ఉన్నాయని అర్దమని వివరించారు. అన్ని ప్రాంతాలలో ప్రజలూ తనవాళ్ళే అయినప్పుడు మరి వారి సంక్షేమం కోసం తపించే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కూడా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి శలవిచ్చారు. తన జీవితంలో తన తల్లి, చెల్లి, భార్య అందరూ భాగమే గనుక త్వరలోనే తన ఓదార్పు యాత్రలతో బాటు, షర్మిలమ్మ పాద యాత్రలు, విజయమ్మ రచ్చబండ ముచ్చట్లు కూడా ఉంటాయని ఆయన ప్రకటించారు. గనుక, తెలంగాణా ప్రజలందరూ ఈలోగా తెలుగుభాషపై మరికొంత పట్టు సాధించగలిగితే, వాళ్ళు ముగ్గురూ వద్ద మరికొన్ని సరికొత్త తెలుగు పదాలు, అర్ధాలు నేర్చుకొనే అదృష్టం దక్కుతుంది.

కేసిఆర్ హైదరాబాద్ ర్యాలీలో మార్పులు

      టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసిఆర్ ఈ రోజు రాష్ట్రానికి చేరుకోనున్న నేపథ్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు సిద్దమవుతున్నారు. రాష్ట్రవిభజన తరువాత తొలిసారిగా తెలంగాణ గడ్డపై అడుగుపెడుతున్న కేసిఆర్ స్వాగతం పలకడానికి వివిధ జిల్లాల నుండి వేల సంఖ్యలో కేసీఆర్ అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు హైదరాబాద్‌కు చేరుకున్నారు. అయితే కేసిఆర్ ఢిల్లీ నుంచి రానున్న విమాన౦ ఆలస్యం కావడంతో విజయోత్సవ ర్యాలీ టైంలో మార్పులు చేశారు. మధ్యాహ్నం 2:45 గంటలకు కేసీఆర్ శంషాబాద్ విమానాశ్రయంకు చేరుకునే అవకాశముందని సమాచారం. సాయంత్రం 4గంటలకు బేగంపేట విమానాశ్రయం నుండి ఆయన ర్యాలీ ప్రారంభమయ్యే అవకాశముందని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెపుతున్నాయి.    బేగంపేట నుండి విజయోత్సవ ర్యాలీలో కేసీఆర్ పాల్గొంటారు. గన్‌పార్క్ వరకు ఆయన ర్యాలీ కొనసాగుతుంది. గన్‌పార్క్ చేరుకున్న ఆయన అక్కడ అమరవీరుల శ్ధూపాలకు ఘన నివాళులు అర్పించనున్నారు. తర్వాత అక్కడ నుండి తెలంగాణ భవన్‌కు చేరుకుని తెలంగాణ తల్లి విగ్రహానికి, అలాగే ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేస్తారు. అనంతరం ఇంటికి బయల్దేరుతారు. 

టీఆర్ఎస్ వీలినంపై వివాదం

      గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ లో టీఆర్ఎస్ వీలినం పై జోరుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా వీలినం పై రాష్ట్ర టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల వైఖరిలో మార్పు రావడంతో కొత్త వివాదానికి తెరలేచింది. కాంగ్రెస్ లో వీలినం పై టీఆర్ఎస్ అధినేత కేసిఆర్ మీడియాతో మాట్లాడారు. మీడియాలో వీలినంపై వస్తున్న వార్తలన్నీ కల్పితమేనని కొట్టిపారేశారు. పార్టీ వీలిన౦పై కాంగ్రెస్ పార్టీ నేతలతో చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ నేతలెవరు ఈ వార్తలను నమ్మవద్దని సూచించారు. అయితే రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ మాత్రం వీలినంపై చర్చలు జరుగుతున్నాయని ప్రకటించడం విశేషం. కేసిఆర్ తో వీలిన౦పై ప్రాధమిక చర్చలు జరిగాయని, విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదని అన్నారు. త్వరలో దీనిపై ఓ నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు.

చివరి సీఎంగా చిరంజీవి!

      ఒకప్పుడు మెగా స్టార్ గా కోట్లాది ప్రజల నీరాజనాలు అందుకొని, ప్రజా రాజ్యం పార్టీ అధినేతగా అనేకమంది సీనియర్ రాజకీయ నాయకులను శాసించిన చిరంజీవి, కాంగ్రెస్ పట్ల, సోనియా, రాహుల్ గాంధీల పట్ల చూపిన వినయ విదేయతలకు మెచ్చి ఆయనను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసేందుకు సోనియమ్మ అనుగ్రహించినట్లు తాజా సమాచారం. ఆయనకున్న ప్రజాకర్షణను ఉపయోగించుకొని ప్రజలలో ఉన్న కాంగ్రెస్ వ్యతిరేఖతను అధిగమించి ఎన్నికల గండం గట్టెక్కాలని కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇక ఆయనను ముఖ్యమంత్రిని చేసినట్లయితే ఎన్నికలలో కాపు కులస్థుల ఓట్లు అన్ని గంపగుత్తగా తమకే పడిపోతాయని కాంగ్రెస్ అడియాసకు పోతోంది. అయితే గతంలో ఆయన పార్టీ పెట్టిన్నపుడు ఆయనను నమ్ముకొని వెళ్ళిన వారందరి పరిస్థితి ఏమయిందో, ఆ తరువాత ఆయన తను రాజకీయంగా ఏవిధంగా పైకెదిగేరో, ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావడం కోసం రాష్ట్ర విభజన వ్యవహారంలో కోట్లాది సీమాంధ్ర ప్రజల మనోభావాలను కించపరుస్తూ వారి ఆత్మగౌరవాన్ని ఏవిధంగా సోనియమ్మ పాదాల చెంతపెట్టారో కళ్ళార చూసిన తరువాత కూడా ప్రజలు, ఆయన అభిమానులు, ముఖ్యంగా కాపు కులస్తులు ఆయనని చూసి కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారని భావించడం అడియాసే అవుతుంది.

కొత్త పార్టీ స్థాపనకు కూడా అధిష్టానం అనుమతి కావాలా?

  కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన తరువాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మళ్ళీ అధికారం చేప్పట్టి సీమాంధ్రలో పార్టీని కాపాడుకోవాలని చాలా ఆరాటపడుతోంది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తగినంత మంది శాసనసభ్యులు లేనందున, కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన అనుచరులు, పార్టీ నుండి బహిష్కరింపబడిన సీమాంధ్ర నేతలు మళ్ళీ పార్టీలోకి వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని నిన్న దిగ్విజయ్ సింగ్ సిగ్గు విడిచి ప్రకటించినా సానుకూల స్పందన రాలేదు. అందుకే ఆయన మళ్ళీ తన విధేయులైన సీమాంధ్ర మంత్రులతో వార్ రూమ్ లో తలుపులేసుకొని మంతనాలు మొదలుపెట్టారు.   ఇక కిరణ్ కుమార్ రెడ్డి గూటికి చేరుకొన్న సబ్బంహరి ఆయన స్థాపించబోయే కొత్త పార్టీకి అ(న)ధికార ప్రతినిధిలా ఎప్పటికప్పుడు మీడియాకు తాజా సమాచారం తెలియజేస్తూ చాలా పుణ్యం కట్టుకొంటున్నారు. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ “డిల్లీలో పరిణామాలను మేము చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాము. వాటిని బట్టే మేము కూడా మా భవిష్యత్ ప్రణాళికలను రూపొందించుకొంటామని” తెలిపారు. కొత్త పార్టీ పెట్టడానికి డిసైడ్ అయిపోయిన తరువాత కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఇంకా డిల్లీ వైపు ఎందుకు చూస్తున్నారు? అనే అనుమానం ఎవరికయినా కలగడం సహజం.   కొత్త పార్టీ పెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం నుండి ఇంకా గ్రీన్ సిగ్నల్ రానందునే కిరణ్ కుమార్ రెడ్డి ముందుకు వెళ్ళడం లేదని ఆయన ప్రత్యర్ధులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయదలిస్తే, ఆయన స్వయంగా వెళ్లలేకపోయినా, కనీసం తన అనుచరులను పంపి ప్రభుత్వాన్ని నిలబెట్టే అవకాశం ఉంది. అదే ఇప్పుడే ఆయన కొత్తపార్టీ పెట్టేస్తే ఇక కాంగ్రెస్ అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డిని వెనక్కిరమ్మని సిగ్గు విడిచి పిలిచినా ఆయన కానీ, ఆయన వెంట వెళ్ళినవారు గానీ వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదుకోలేరు.   బహుశః అందుకే “డిల్లీలో పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నామని” సబ్బం హరి శలవిస్తున్నరేమో! కాంగ్రెస్ అధిష్టానం తెరాస, మజ్లిస్ పార్టీల మద్దతు కన్ఫర్మ్ చేసేసుకొని, కొత్త ముఖ్యమంత్రి పేరు ఫైనల్ చేసేసుకోగానే ఇక కిరణ్ కుమార్ రెడ్డి నిశ్చింతగా కొత్త పార్టీ పెట్టేసుకోవచ్చును. ఎంతయినా ఆయన కూడా కాంగ్రెస్ ఉప్పు తిన్న మనిషే కదా!

రాష్ట్రాన్ని గాలికొదిలేసిన కాంగ్రెస్

  ఈ రోజు చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ “డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసిన 24గంటలలోనే డిల్లీలో రాష్ట్రపతి పాలన విదించిన కాంగ్రెస్ పార్టీ, కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసి వారం రోజులయినా ఎందుకు పట్టించుకోవడం లేదు?” అని కాంగ్రెస్ పార్టీని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అన్ని రాజ్యాంగ నిబంధనలని తుంగలో త్రొక్కి తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంటే తెదేపా చూస్తూ కూర్చోదని ఆయన హెచ్చరించారు.   “ఎన్నికలు ముంచు కొస్తున్న ఈ తరుణంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తే, అధికార దుర్వినియోగం చేసేందుకు వీలుపడదు గనుకనే, తనకు తగినంత మెజార్టీ లేకపోయినా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ కాలయాపన చేస్తోందని” తేదేపాకు సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు.   డిల్లీలో తను అధికారంలోకి వచ్చే అవకాశం లేదు గనుకనే కాంగ్రెస్ పార్టీ వెంటనే రాష్ట్రపతి పాలన విదించింది. కానీ, ఇప్పుడు రాష్ట్రంపై రాష్ట్రపతి పాలన విదించాలంటే పార్లమెంటు ఆమోదం అవసరమనే సాంకేతిక కారణాన్ని సాకుగా చూపి కాంగ్రెస్ వారం రోజులుగా రాష్ట్రాన్నిగాలికొదిలేసింది. తెరాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవాలనే శ్రద్ధ, రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడంలో చూపించడం లేదు. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ నుండి నిష్క్రమించడంతో ఆయనతో బాటు కొంతమంది పార్టీని వీడివెళ్లిపోయారు. మరి కొంతమంది కాంగ్రెస్ నేతలు ఇతర పార్టీలలో చేరేందుకు తరలిపోయారు. అందువలన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమయిన మెజార్టీ లేకపోవడంతో మద్దతు కోసం కొత్త మిత్రుడు కేసీఆర్ వైపు దీనంగా చూస్తోంది. అయితే ఆయన సోనియాగాంధీ తో కలిసి గ్రూప్ ఫోటోలు దిగారే తప్ప విలీనం, పొత్తుల సంగతి ఇంకా తేల్చేలేదు. ఆ సంగతి తేల్చకపోయినా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకి సిద్దపడితే దానికి మద్దతు ఇస్తారో లేదో అనే సంగతయినా తేల్చిచెప్పితేనే కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు గురించి ఆలోచన చేయగలదు. లేకుంటే అంతవరకు ముఖ్యమంత్రి అభ్యర్ధులని ఇంటర్వ్యూలు చేసుకొంటూ వారితో వార్ రూమ్ సమావేశాలు నిర్వహించుకొంటూ కాలక్షేపం చేయక తప్పదు. అంతవరకు ప్రజలు, చంద్రబాబు కూడా కొంచెం ఓపిక పట్టక తప్పదు మరి.

శాసనసభ ఎన్నికలు వాయిదా పడవు: ఈసీ

      రాష్ట్రంలో ఎట్టి పరిస్థితులలోనూ గడుపులోపే శాసనసభ ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. రాష్ట్ర విభజనతో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో శాసనసభ ఎన్నికలు వాయిదా పడుతాయని వార్తలు వస్తుండడంతో...ఎన్నికల కమిషన్ మీడియాకు ఓ లేఖను విడుదల చేసింది.   రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు వాయిదా వేసే ప్రసక్తే లేదని పేర్కొంది. త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల సీట్లు పెరగవని ఎన్నికల కమిషన్ పేర్కొంది. రాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలం జూన్ రెండుతో ముగుస్తుందని, లోక్‌సభ పదవీ కాలం మే 20తో ముగుస్తుందని ఈసీ పేర్కొంది. రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాతే మార్పులు చేర్పులకు అవకాశముంటుందని ఈసీ వర్గాలు పేర్కొన్నాయి.

సీఎం సీటు కోరిన చిరు

      ఢిల్లీలో రాష్ట్ర రాజకీయాలు మరోసారి జోరందుకున్నాయి. రాష్ట్ర విభజనకి నిరసనగా రాజీనామా చేసిన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్థానాన్ని భర్తీ చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం కసరత్తులు మొదలు పెట్టింది. సీఎం సీటు కోసం ఇరుప్రాంత కాంగ్రెస్ నేతలు ఢిల్లీ లో లాబీయింగ్ లు మొదలుపెట్టారు. ఈ రోజు దిగ్విజయ్ సింగ్ తో భేటి అయిన కేంద్ర మంత్రి చిరంజీవి ముఖ్యమంత్రి పదవి ఇస్తే పార్టీకి పునరుత్తేజం కల్పిస్తానని హామి ఇచ్చారట. ఎన్నికలలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, భవిష్యత్ కార్యాచరణ ఆయనకి వివరించినట్లు సమాచారం. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్య నారాయణ కూడా దిగ్విజయ్ తో సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యవహారాలపై వారు చర్చించినట్లు తెలుస్తోంది.

జేసి సోదరులకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

      జేసి సోదరులు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారని గత కొంతకాలంగావార్తలు వస్తున్నాయి. అయితే వీరి రాక ఇప్పుడు ఖాయమైనట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వీరి చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. బాబు జిల్లా నేతలతో చర్చలు జరిపి అందరిని ఒప్పించారట. జేసి సోదరుల రాకను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న పరిటాల సునీతను కూడా రాజీపడ్డారని అంటున్నారు.   సోమవారం టిడిపి సీమాంధ్ర విస్తృతస్థాయి సమావేశం నిర్వహించిన చంద్రబాబు, ఆ తరువాత అనంతపురం జిల్లా నేతలతో ప్రత్యేకంగా భేటి అయ్యారు. ఈ సమావేశంలో బాబు జిల్లాలో పార్టీ స్థితిగతులను సమీక్షించారు. అలాగే నేతలతో జేసి సోదరులు చేరికపై చర్చించి..నేతలను ఒప్పించారు. తాడిపత్రి అసెంబ్లీ స్థానం నుంచి జేసీ ప్రభాకర్‌రెడ్డి, అనంతపురం లోక్‌సభ స్థానం నుంచి దివాకర్ రెడ్డిని బరిలోకి దించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.  

సోషల్ మీడియాకే షిండే హెచ్చరిక

      ఓ వర్గం ఎలక్ట్రానిక్ మీడియాను అణచివేస్తానని హెచ్చరికను జారీ చేసిన కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే వెనక్కి తగ్గారు. తాను ఎలక్ట్రానిక్ మీడియాను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాను ఉద్దేశించి మాత్రమే ఆ వ్యాఖ్యలను చేసినట్లు వివరణ ఇచ్చారు.   తన స్వంత జిల్లాలో యువజన కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడుతూ..  ఎలక్ట్రానిక్ మీడియాకి హెచ్చరికలు జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి. తనపైన, కాంగ్రెస్ పార్టీ పైన ఓ వర్గం మీడియా పనికట్టుకొని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. గత కొన్ని నెలలుగా ఒక మీడియా ఆధారాలు లేని తప్పుడు ప్రసారాలు ప్రచారం చేస్తూ..తమ పార్టీని రెచ్చగొట్టాలని చూస్తున్నారని అన్నారు. ఈ తరహా ప్రసారాలను వెంటనే ఆపకపోతే ఆ మీడియాను అణచివేస్తానని వార్నింగ్ ఇచ్చారట. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలపై దూమారం చెలరేగడంతో వివరణ ఇచ్చారు. తాను సోషల్ మీడియాను మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఆ వ్యాఖ్యలు చేశానని చెప్పారు.         

కాంగ్రెస్ లో విలీనానికి కేసిఆర్ సిద్దం..!!

      కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విలీన౦ దాదాపు ఖాయమైందని వార్తలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ విలీనానికి సుముఖంగా వున్నట్లు సమాచారం. నిన్న ఢిల్లీలో వరుస భేటిలతో బిజీగా గడిపిన కేసిఆర్, దిగ్విజయ్ సింగ్ తో విలీనం, పొత్తులపై చర్చించారు. గతంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ లో పార్టీని వీలినం చేస్తారని ప్రకటించారు. ఈ అంశంపై ఇరు వర్గాల మధ్య ఒక అవగాహన కూడా కుదిరినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటులో కేసీఆర్ కీలక పాత్ర పోషిస్తారని, ఎన్నికల్లో పార్టీకి ఆయనే విజయ సారథ్యం వహిస్తారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అయితే కేసిఆర్ ముఖ్యమంత్రి పదవి ఇవ్వలా లేక కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలా అనే దానిపై ఇద్దరి మధ్య ఇంకా స్పష్టతా రాలేదని అంటున్నారు. మరో రెండు రోజుల్లో దీనిపై స్పష్టతా వచ్చే అవకశాలు కనిపిస్తున్నాయి. ఆ తరువాత తెలంగాణలో భారీ బహీరంగసభ ఏర్పాటు చేసి వీలినం ప్రకటన చేయనున్నారు.

ఎలక్ట్రానిక్ మీడియాకి షిండే హెచ్చరిక

      కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఓ వర్గం ఎలక్ట్రానిక్ మీడియాను అణచివేస్తానని హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్ర షోలాపూర్ జిల్లా పర్యటనలో యువజన కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడుతూ.. ఎలక్ట్రానిక్ మీడియాకి హెచ్చరికలు జారీ చేశారట. తనపైన, కాంగ్రెస్ పార్టీ పైన ఓ వర్గం మీడియా పనికట్టుకొని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. గత కొన్ని నెలలుగా ఒక మీడియా ఆధారాలు లేని తప్పుడు ప్రసారాలు ప్రచారం చేస్తూ..తమ పార్టీని రెచ్చగొట్టాలని చూస్తున్నారని అన్నారు. ఈ తరహా ప్రసారాలను వెంటనే ఆపకపోతే ఆ మీడియాను అణచివేస్తానని వార్నింగ్ ఇచ్చారట. అయితే ఆయన వ్యాఖ్యలు తీవ్ర దూమారాన్ని రేపుతున్నాయి. కొంతమంది నేతలు షిండే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

మార్చి 2న సీఎం కిరణ్ కొత్త పార్టీ !

      ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు చేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. సోమవారం మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలతో భేటి అయిన పార్టీ విధి, విధానాలు ఎలా వుండాలనే అంశపై చర్చించినట్లు తెలుస్తోంది. మాదాపూర్‌లోని ఓ ప్రైవేటు కార్యాలయంలో మంత్రులు శైలజానాథ్, పితాని సత్యనారాయణ, ఎమ్మెల్యేలు జేసీ దివాకరరెడ్డి, గాదె వెంకటరెడ్డి, కొర్ల భారతి, రౌతు సూర్యప్రకాశ రావు, వంగా గీత, పంతం గాంధీ, అంజిబాబు, ఎమ్మెల్సీలు పాలడుగు వెంకటరావు, ఇందిర, లక్ష్మీశివకుమారి, రెడ్డప్పరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తి రెడ్డి, విజయరామిరెడ్డి, ప్రభాకర రెడ్డి, వెంకటరమణలతో కిరణ్ సమావేశమయ్యారు. ఒక్కొక్కరి నుంచి వ్యక్తిగతంగా అభిప్రాయాలు సేకరించారు. దాదాపు ఇంటర్య్వూ స్థాయిలో సాగిన ఈ అభిప్రాయ సేకరణలో కొత్త పార్టీ స్థాపన అంశం ప్రస్తావించారు. యువత, మహిళలు, ఉద్యోగులే లక్ష్యంగా కిరణ్ కొత్త పార్టీని స్థాపించనున్నారు. మార్చి 2న తిరుపతి లేదా రాజమండ్రిలో భారీ బహీరంగసభ ఏర్పాటు చేసి పార్టీని ప్రకటించే అవకాశం ఉంది.

ఏక్ దిన్ కా సుల్తాన్ ఎవరో?

  రాష్ట్ర విభజన వ్యవహారాన్ని చక్కబెట్టేసిన తరువాత కాంగ్రెస్ అధిష్టానం ప్రధానంగా ముందు మూడు అంశాలపై దృష్టి కేంద్రీకరించింది. 1. తెరాసను విలీనం చేసుకోవడం.2. రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిని నియమించడం.3. సీమాంధ్రలో మళ్ళీ పార్టీని బలోపేతం చేసుకోవడం.   వీటిలో మొదటి అంశంపై ఇప్పటికే కాంగ్రెస్-తెరాస అగ్రనేతల మధ్య చర్చలు, గ్రూప్ ఫోటోలు దిగడంవంటివి పూర్తయిపోయాయి. ప్రస్థుత పరిస్థితుల్లో తెరాసను విలీనం చేయడం కంటే రెండు పార్టీలు ఎన్నికల పొత్తులు పెట్టుకొంటేనే ఇరువురికీ లాభం ఉంటుందని కేసీఆర్ కాంగ్రెస్ యువరాజు గారికి బ్రెయిన్ వాష్ చేసే ఉంటారు. ఒకవేళ తెరాస విలీనానికి ఒప్పుకోకుండా పొత్తులకే పట్టుబట్టినా కాంగ్రెస్ పార్టీకి అంతకంటే వేరే గత్యంతరం లేదు గనుక, తప్పని సరిగా దానికే అంగీకరించవలసి ఉంటుంది. కనుక ఇక పొత్తుల ప్రకటన లాంచనమే అనుకోవచ్చును.   మొదట తెలంగాణాకు చెందిన వ్యక్తికే ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం భావించినప్పటికీ, ఇప్పుడు తెరాస కొండంత అండగా నిలబడి ఉన్నందున అక్కడ పార్టీకి వచ్చేఇబ్బందేమీ లేదు గనుక, సీమాంధ్రలో బలహీనంగా ఉన్న పార్టీ పరిస్థితిని చక్క దిద్దుకోవడానికి అక్కడి నేతనే ముఖ్యమంత్రిగా నియమించేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిశ్చయించుకొన్నట్లు సమాచారం. ఏక్ దిన్ కా సుల్తాన్ (ఒక్క రోజు రాజుగారు) పదవిలాంటి మూడు నెలలు ముఖ్యమంత్రి పదవి కోసం కూడా చాలా మందే అర్రులు చాస్తున్నారని కాంగ్రెస్ అధిష్టానానికి తెలుసు. ముఖ్య మంత్రి పదవి, పీసీసీ అధ్యక్ష పదవి కోసం చొంగలు కార్చుకొంటున్న తన వీరవిధేయ నేతలకి అవి పడేస్తే, వారే సీమాంధ్రలో పార్టీని బలపరిచే బాధ్యత కూడా తమ నెత్తి మీద వేసుకొంటామని హామీ ఇస్తున్నారు గనుక ఒకే దెబ్బకి రెండు సమస్యలు పరిష్కారం అవుతాయని కాంగ్రెస్ అధిష్టానం ఈరోజు వారందరినీ డిల్లీకి పిలిచి పదవుల పంపకాలు, వారి కుటుంబ సభ్యులకు టికెట్స్ కేటాయింపులు వగైరాలు చేసి రాష్ట్రానికి ఆఖరి కొత్త ముఖ్యమంత్రి పేరు ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పుడు తెరాస, టీ-కాంగ్రెస్ నేతలందరూ కూడా సోనియాగాంధీ గీసిన గీత దాటబోరని రూడీ అయింది గనుక, సీమాంధ్రకు చెందిన వ్యక్తినే ఏక్ దిన్ కా సుల్తాన్ గా ప్రకటించేందుకు ఇబ్బందేమీ ఉండదు.అందువలన బహుశః ఈ రోజే కొత్త ముఖ్యమంత్రి పేరు ప్రకటించవచ్చును.

లాలూ కొంపముంచిన నేతలు

      రాష్ట్రీయ జనతా దళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు సొంత పార్టీ నేతలే షాకిచ్చారు. ఆర్జెడి పార్టీకి 13మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 9కి పడిపోయింది. ఎమ్మెల్యేలు రాజీనామాలను అసెంబ్లీ స్పీకర్ కి సోమవారం మధ్యాహ్నం అందజేశారు. తాము ఆర్జెడి పార్టీకి మాత్రమే రాజీనామా చేసినట్లు ప్రకటించాలని వారు స్పీకర్ ని కోరగా... స్పీకర్ వారి అభ్యర్థనను వెంటనే అంగీకరించినట్లు సమాచారం. వీరంతా అధికార పార్టీ అయిన జెడియూలో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఏదో జరుగుతున్నదని తాను విన్నానని, అది నిజమా? కాదా? అనేది ఇంకా తెలియదని ఆర్జేడీ అధినేత లాలూ వ్యాఖ్యానించారు. త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న తరుణంలో లాలూ ప్రసాద్ కి ఎమ్మెల్యేల రాజీనామా గట్టి ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

హరికృష్ణను దూరంగా పెడుతున్నారా!

      తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ తాజాగా చేసిన వ్యాఖ్యలు బట్టి చూస్తే, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆయన మధ్య అంతరం పెరిగినట్లే కనిపిస్తోంది. సమైక్య రాష్ట్రం కోసం రాజీనామా చేశాననే తనని దూరంగా వుంచుతున్నట్లు అనుమానంగా ఉందని అన్నారు. పార్టీలో జరిగే కార్యక్రమాలన్ని మీడియాలో చూసి తెలుసుకునే దుస్థితి ఏర్పడిందని ఆవేదన చెందారు. ఈ రోజు జరిగిన పార్టీ విస్తృతాస్థాయి సమావేశానికి తనను ఆహ్వానించలేదని అన్నారు. అసలు తాను పార్టీలో ఉన్నానో, లేనో తెలియని అయోమాయ పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. అయితే గత కొంతకాలంగా పార్టీ నాయకత్వంపై హరికృష్ణ అసంతృప్తిగా ఉన్నారు.

జగన్ ఓదార్పు యాత్రా..ఎందుకు?

      వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి త్వరలో తెలంగాణలో మళ్ళీ ఓదార్పు యాత్రలు మొదలు పెట్టబోతున్నారనే వార్తలు రావడంతో, తెలంగాణ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సంబరాలు చేసుకుంటున్న తెలంగాణ ప్రజలకు ఇప్పుడు జగన్ ఓదార్పు అనడం హాస్యాస్పదమని హరీష్ రావు అన్నారు. తెలంగాణలో నేతలు లేకుండా పోయినందుకు ఆయనకే ఓదార్పు అవసరమని అన్నారు. పలు సీనియర్ల రాజకీయ జీవితాలను దెబ్బ తీసిన జగన్ ఓదార్పులు చేయడం దురదృష్టకరమని అన్నారు. జగన్ ను తెలంగాణ ప్రజలు ఆదరించరని, గతంలో ఎదురైనా అనుభవాలు గుర్తుచేసుకోవాలని అన్నారు. తెలంగాణలో ఏ ముఖం పెట్టుకొని ఓదార్పు యాత్ర చేస్తారని ప్రశ్నించారు.