తెరాస కాదంటే కాంగ్రెస్ ఖేల్ ఖతం?
posted on Feb 28, 2014 @ 11:59AM
తెరాస, కాంగ్రెస్ పార్టీలో విలీనం కాకపోయినా కనీసం పొత్తులకయినా అంగీకరిస్తుందని నిన్నటి వరకు కూడా అందరూ భావించారు. కానీ ఒక్క రోజులోనే పరిస్థితులు, వ్యూహాలు అన్నీ మారిపోయాయి. ఇప్పుడు రెండు పార్టీలు ఒకదానిపై మరొకటి కత్తులు నూరుకొంటున్నాయి. అందుకు ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ తన సీమాంధ్ర శాఖను పణంగాపెట్టి మరీ తెలంగాణా రాష్ట్రం మంజూరు చేసినప్పటికీ, కేసీఆర్ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయకుండా, కనీసం ఎన్నికల పొత్తులకి కూడా అయిష్టత చూపడమే. పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదం పొందిన తరువాతనే విలీనాలు, పొత్తుల గురించి ఆలోచిద్దామని ఇంతకాలం చెపుతూ వచ్చిన కేసీఆర్, ఇప్పుడు బిల్లు ఆమోదం పొందిన తరువాత కాంగ్రెస్ పార్టీతో కనీసం పొత్తులకి కూడా అంగీకరించకుండా ఉండేందుకు ఏవో కుంటి సాకులు చెప్పి తప్పించుకొనే ఆలోచనలు చేస్తున్నారని కాంగ్రెస్ ఆగ్రహంగా ఉంది. అందుకే నిన్న కేంద్రమంత్రి జైరాం రమేష్ తెరాసపై తీవ్రంగా విరుచుకు పడ్డారు.
అయితే, కేసీఆర్ మరియు ఆయన అనుచరులు కూడా ఏదో విధంగా కాంగ్రెస్ పార్టీని వదిలించుకోనేందుకే చూస్తున్నారు గనుక, జైరాం రమేష్ చేసిన విమర్శలు అందిపుచ్చుకొని ప్రతివిమర్శలు చేస్తూ, పద్ధతి ప్రకారం తెగతెంపులకి సిద్దమయిపోయారు. రాష్ట్ర విభజన చేసి తెలంగాణాలో అనుకూల ఓటుతోను, సీమాంధ్రలో కిరణ్ కుమార్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిల ద్వారా వ్యతిరేఖ ఓటుతోను కేంద్రంలో మళ్ళీ అధికారం చేజిక్కించుకొనేందుకు కీలకమయిన యంపీ సీట్లు పోగేసుకోవాలని అడియాసకు పోయి కాంగ్రెస్ అధిష్టానం రచించిన వ్యూహం బెడిసికొట్టినట్లు కనబడుతోంది ఇపుడు పరిస్థితులు చూస్తుంటే. ఒకవేళ తెరాస ఇప్పుడు గిల్లి కజ్జాలు ఇప్పుడు తెరాస గిల్లి కజ్జాలు పెట్టుకొని దూరమయిపోయినట్లయితే తెలంగాణాలో తెరాసను డ్డీకొని ఎదురునిలవలేక అక్కడా తుడిచిపెట్టుకు పోవడం ఖాయం. కాంగ్రెస్ పార్టీయే తెలంగాణా ఇచ్చినప్పటికీ ఆవిషయాన్ని ప్రజలలోకి తీసుకు వెళ్ళడంలో ఘోరంగా విఫలమయిన టీ-కాంగ్రెస్ నేతలు, ఇక విజయోత్సాహంతో ఉన్న తెరాసను ఏవిధంగా ఎదుర్కొని నిలువగలరు?
ఒకవేళ తెరాస కనుక బీజేపీతో చేతులు కలిపినట్లయితే ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో ఒక్కసీటు కూడా సాధించడం కల్ల. ఆ రెండు పార్టీలు చేతులు కలిపినట్లయితే ఆధాటికి కాంగ్రెస్ పార్టీ గడ్డిపోచలా కొట్టుకుపోవడం ఖాయం. వారికి నరేంద్ర మోడీ కూడా వచ్చి జేరితే ఇక తెలంగాణాలో కాంగ్రెస్ పరిస్థితి ఏవిధంగా తయారవుతుందో చాలా తేలికగానే ఊహించుకోవచ్చును.
ఆరిపోయే దీపం మరింత ఎక్కువ వెలిగినట్లు బహుశః కాంగ్రెస్ పార్టీకి చివరి ఘడియలు వచ్చినందునే ఇటువంటి అతితెలివికిపోయి తన భస్మాసుర హస్తాన్ని తన నెత్తి మీదే పెట్టుకొంది పాపం!