బొత్స తులసి వనంలో గంజాయి మొక్క: చంద్రబాబు
posted on Feb 26, 2014 @ 9:28PM
బుధవారం సాయంత్రం విజయనగరంలో జరిగిన ప్రజాగర్జన సభలో ఊహించని స్థాయిలో ప్రజలు భారీగా తరలిరావడంతో చంద్రబాబు నాయుడులో ఉత్సాహం కట్టలు తెంచుకొంది. ఆ ఊపులో సోనియా గాంధీ, జగన్మోహన్ రెడ్డి మొదలు జిల్లా మంత్రి బొత్ససత్యనారాయణ వరకు అందరినీ తీవ్ర పదజాలంతో ఏకి పడేసారు. దేశంలో అన్ని సమస్యలకు మూల కారకురాలు సోనియాగాంధీయేనని, ఆమె ఒక పెద్ద అనకొండవంటి అవినీతి సర్పమని, రాష్ట్రంలో కూడా ఆమె అనేక చిన్నా పెద్దా అనకొండలను తయారు చేసి ప్రజల మీదకు వదిలిందని, వారిలో జగన్మోహన్ రెడ్డి, బొత్ససత్యనారాయణ కొందరని ఆయన ఎద్దేవా చేసారు. ఎందరో మహానుభావులు పుట్టి నడయాడిన విజయనగరం వంటి పవిత్రమయిన స్థలంలో బొత్ససత్యనారాయణ వంటి వారు తులసి వనంలో గంజాయి మొక్కలా పెరిగిపోయారని అందుకు విజయనగరం ప్రజలందరూ చాలా బాధపడుతున్నారని ఆయన అన్నారు. అటువంటి అవినీతి అనకొండలను ప్రజలందరూ బెబ్బులి పులిలా, జస్టిస్ చౌదరిలా ఎదుర్కొని ఓడించాలని ఆయన హితవు పలికారు. అసలు కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతీ వ్యక్తిని కూడా సమాజం నుండి వెలేయవలసిన అవసరం ఉందని అన్నారు.
తెదేపాను ఎన్నికలలో ఎదుర్కోలేక దొంగచాటుగా దెబ్బతీసేందుకు రాష్ట్ర విభజన చేసి తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టిన కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు రాజధాని అంశంతో సీమాంధ్ర ప్రజల మధ్య చిచ్చుపెట్టి ఎన్నికల గండం గట్టెక్కాలని కుట్రలు పన్నుతోందని ఆయన ఆరోపించారు. హైదరాబాదుని అభివృద్ధి చేసి రాష్ట్రానికి, దేశానికి అంతులేని సంపద సృష్టించిన తాను, అధికారం ఇస్తే హైదరాబాదును తలదన్నేలా గొప్ప రాజధాని నగరం నిర్మిమించగలనని హామీ ఇచ్చారు.
రాష్ట్ర విభజనతో తెలుగు ప్రజలను ఘోరంగా అవమానించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వేర్వేరు వేషాలు వేసుకొని ప్రజల ముందుకు వస్తోందని అందువల్ల ప్రజలందరూ అప్రమత్తతతో ఉంటూ వాటిని ఓడించాలని కోరారు. కాంగ్రెస్, జగన్ కాంగ్రెస్, కిరణ్ కాంగ్రెస్, తెరాసలలో ఏ ఒక్క పార్టీకి వేసిన తిరిగి అవి కాంగ్రెస్ పార్టీ ఖాతాలోనే జమా అవుతాయనే సంగతి ప్రజలు మరిచిపోరాదని ఆయన హెచ్చరించారు. కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే తెలుగు ప్రజలకు జవాబు దారీగా ఉంటుందని మిగిలిన అన్ని పార్టీలు డిల్లీ నుండి సోనియాగాంధీ ఏవిధంగా ఆడిస్తే ఆవిధంగానే ఆడుతాయని, ఆమెకు కానీ, ఆమె సృష్టించిన పార్టీలకు గానీ తెలుగు ప్రజల అభిప్రాయలు, సమస్యలు పట్టవని ఆక్షేపించారు.
స్వర్గీయ నందమూరి తారకరామారావు తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడటం కోసం కేంద్రంతో అలుపెరుగని పోరాటం చేస్తే, బొత్ససత్యనారాయణ వంటి నేతలు ముఖ్యమంత్రి పదవి కోసం తెలుగు ప్రజల గౌరవాన్ని సోనియా గాంధీ కాళ్ళ ముందు పెడుతున్నారని ఆక్షేపించారు. అందువల్ల అటువంటి సిగ్గుమాలిన, స్వార్ధ, అవినీతి రాజకీయ నేతలకు రానున్న ఎన్నికలలో డిపాజిట్లు కూడా దక్కనీయకుండా ఓడించి గుణపాటం చెప్పాలని ఆయన ప్రజలను కోరారు.