రుణమాఫీ చేస్తాం: లోకేష్
posted on Jun 7, 2014 @ 10:07PM
చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్, ఈరోజు మధ్యాహ్నం నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద తన తండ్రి ప్రమాణ స్వీకారోత్సవానికి జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చేరు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తను కేవలం అక్కడ జరుగుతున్నఏర్పాట్లను పరిశీలించేందుకే వచ్చేనని అన్నారు. తాను ప్రభుత్వ వ్యవహారాలలో ఎన్నడూ జోక్యం చేసుకొనే ప్రయత్నం చేయనని అన్నారు. తన తండ్రి రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెపుతుంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంత బాధపడిపోతున్నారు అని ప్రశించారు. ఎవరు ఎంతగా ఏడ్చినప్పటికీ తన తండ్రి రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం రుణాలు మాఫీ చేయబోతున్నారని ప్రకటించారు. ఇంతవరకు తెదేపా సీనియర్ నేతలు అనేకమంది ఇదే విషయాన్ని దృవీకరించారు. కానీ ఇప్పుడు స్వయంగా చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ కూడా రుణాలు మాఫీ చేయబోతున్నట్లు చెప్పడం చూస్తే, చంద్రబాబు నాయుడు అందుకు పూర్తి సంసిద్దంగా ఉన్నట్లు భావించవచ్చును. అయితే అన్ని వేల కోట్ల రూపాయలు ఇటువంటి క్లిష్ట సమయంలో ఏవిధంగా మాఫీ చేస్తారనేది చాలా ఆసక్తికరంగా మారింది. తాజా సమాచారం ప్రకారం ఆయన రైతుల రుణాలు పూర్తిగా మాఫీ చేసి అందుకు బదులుగా బ్యాంకర్లకు ప్రభుత్వ బాండ్లు జారీచేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బహుశః అందుకే లోకేష్ తో సహా తెదేపా నేతలందరూ రునమాఫీపై అంత దృడంగా, నమ్మకంగా పదేపదే హామీ ఇవ్వగలుగుతున్నారు. ఏమయినప్పటికీ రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారం తరువాత అయన అనుసరించే విధానం బట్టి ఈ రుణమాఫీలపై తెదేపా, వైకాపాల నడుమ జరుగుతున్న యుద్ధం పతాక స్థాయికి చేరుకోవచ్చును లేదా వైకాపా మళ్ళీ భంగపడవచ్చును.