మళ్ళీ లిక్కర్ సిండికేట్ మూత తెరిచినా ఏసీబీ
posted on Jun 7, 2014 @ 9:41PM
కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఒకవెలుగు వెలుగుతున్న రోజులలో తనకు పక్కలో బల్లెంలా తయారయిన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను దారికి తెచ్చుకోవడానికి, మద్యం సిండికెట్లపై ఏసీబీ దర్యాప్తుకు ఆదేశించారు. ఏసీబీ అధికారులు రాష్ట్రంలో మిగిలిన జిల్లాల కంటే బొత్స వ్యాపారాలు సాగుతున్న విజయనగరం జిల్లాపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి, కేసు మూలాల వరకు చొచ్చుకుపోయారు. దానితో బొత్స సత్యనారాయణ ఉరుకుల పరుగుల మీద డిల్లీ వెళ్లి అధిష్టానంతో మొరపెట్టుకోవడం వెంటనే ఏసీబీ అధికారులు వెనక్కి తగ్గి కేవలం కొంతమంది ఎక్సయిజ్ శాఖా అధికారులపై కేసులు నమోదు చేసి చేతులు దులుపుకోవడం జరిగింది.
కానీ మళ్ళీ ఇప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో కూడా ప్రభుత్వాలు మారడంతో ఏసీబీ అధికారులు అటకెక్కించిన ఆ మద్యం ఫైళ్ళను దుమ్ము దులుపి బయటకు తీస్తున్నారు. అయితే ఈసారి వారు మొదట విజయనగరం నుండి కాక, శ్రీకాకుళం జిల్లా నుండి పని మొదలుపెట్టడం విశేషం.
వైకాపా నేతలు ధర్మాన ప్రసాదరావు వ్యక్తిగత కార్యదర్శులు రవి శంకర్ మరియు పొన్నాడ అప్పరావులను, ధర్మాన క్రిష్ణదాసు యొక్క అనుచరుడు సాయి శ్రీనివాస్ శర్మ ముగ్గురినీ మద్యం సిండికేట్ వ్యవహారంలో ప్రశ్నించేందుకు తమ ముందు హాజరుకమ్మని ఏసీబీ అధికారులు సమన్లు జారీచేసినట్లు సమాచారం. అంతే గాక ధర్మాన ప్రసాదరావు కుమారుడు ధర్మాన రామమనోహర్ నాయుడు (చిన్ని), శ్రీకాకుళంలో మద్యం సిండికేట్ నడిపిస్తున్న ఓరుగంటి ఈశ్వర్రావులను అరెస్ట్ చేసి జైలుకి తరలించినట్లు తాజా సమాచారం. అంతేగాక ఈ కేసుతో సంబంధం ఉన్న ధర్మాన ప్రసాదరావుకి చెందిన వర్జిన్ రాక్స్ గ్రనైట్ కంపెనీలో డైరెక్టరు అప్పారావుకు కూడా సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది.
దీనిపై ధర్మాన స్పందిస్తూ చంద్రబాబు ఇంకా అధికారం చెప్పట్టక మునుపే తన రాజకీయ ప్రత్యర్ధులను వేధించడం ఆరంభించారని విమర్శించారు. కానీ వాన్ పిక్ భూముల వ్యవహారంలో ఆయనపై కాంగ్రెస్ పార్టీలో ఉండగానే సీబీఐ చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఆకేసులో ఆయనను కాపాడేందుకు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చివరి నిమిషం వరకు చాల కష్టపడ్డారు, కానీ మంత్రిపదవి పోయింది. ఆ కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశించిన మద్యం సిండికేట్ వ్యవహారమే ఇప్పుడు ధర్మాన తలకు చుట్టుకోవడం విచిత్రమయితే, అందుకు ఆయన కిరణ్ కుమార్ ని బదులు ఇంకా అధికారం చెప్పటని చంద్రబాబును నిందించడం మరో విచిత్రం.