తెలంగాణ సంబరాలకు ప్రణబ్, మోడీ?

      తెలంగాణలో అధికారం చేపట్టిన టీఆర్ఎస్ భారీ స్థాయిలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ వేడుకలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ముఖ్య అతిథులుగా ఆహ్వానించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. తెలంగాణ ప్రాంతం పారిశ్రామికంగా మరింత అభివృద్ధి సాధించబోతోందని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్లో రూ.300 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఎల్జేఎస్ సిస్టమ్స్ ముందుకు వచ్చిందని ఆయన వెల్లడించారు. పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్ అనువైన ప్రాంతమని, త్వరలో తెలంగాణ పారిశ్రామిక పాలసీని ప్రకటించబోతున్నామని అప్పుడు తెలంగాణ ప్రాంతంలోకి పెట్టుబడులు వెల్లువలా వచ్చి పడతాయని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో పెట్టుబడులు, ఉపాధి కల్పనపై పూర్తి స్తాయిలో దృష్టి పెడతామని కేటీఆర్ చెప్పారు.

బాలకృష్ణకి మంత్రి పదవి చేదా?

      నందమూరి బాలకృష్ణ మంత్రి పదవిని స్వీకరించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన బాలకృష్ణ అసెంబ్లీకి ఎన్నికైన తొలి ప్రయత్నంలోనే మంత్రి కూడా అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే బాలక‌ృష్ణ మంత్రివర్గంలో చేరదలుచుకోవడం లేదన్న వార్తలు వస్తున్నాయి. ఎవరైనా మంత్రిపదవి కావాలని అనుకుంటారు. ఆయన మంత్రి పదవి వద్దంటున్నారంటే ఆయనకి మంత్రి పదవి చేదా అనే అనుమానాలు అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం బాలక‌‌ృష్ణ మాట్లాడుతూ, తనకు మంత్రి పదవి అనేది పార్టీ ఇష్టం ప్రకారమే జరుగుతుందని వ్యాఖ్యానించారు.అంతకుముందు కూడా పార్టీ ఏ బాధ్యత అప్పగించినా తీసుకుంటానని అన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. బాలకృష్ణ మంత్రి పదవిని ఆశిస్తున్నట్టు ఎప్పుడూ చెప్పిన దాఖాలు లేవు. అయితే టీడీపీ వర్గాలు మాత్రం బాలకృష్ణ ఇప్పుడు మంత్రి పదవి వద్దంటున్నారని ప్రచారం చేస్తున్నారు. తన తాజా సినిమా ‘లెజెండ్’ హిట్ అవడం వల్ల కూడా ఆయన మరికొంత కాలం సినీ జీవితం కొనసాగించాలని కోరుకుంటున్నారని అందువల్లే మంత్రి పదవి కోరుకోవడం లేదని పార్టీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అయితే ఏ విషయం 8వ తారీఖుకి తేలుతుంది.

మోడీకి అమెరికా ఆహ్వానం.. వస్తానన్న మోడీ!

      అగ్రరాజ్యం అమెరికా భారత ప్రధాని నరేంద్రమోడీని ఆహ్వానించింది. గతంలో మోడీకి వీసా నిరాకరించిన అమెరికా ఇప్పుడు మోడీ దేశానికి ప్రధాని కాగానే అర్జెంటుగా ఆహ్వానించేసింది. ఆ ఆహ్వానాన్ని మన్నించి వచ్చే సెప్టెంబర్‌లో ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామాతో శిఖరాగ్ర సమావేశాన్ని జరుపుతానని మోడీ వర్తమానం పంపారు. మామూలుగా అయితే న్యూయార్క్‌లో జరగబోయే ఐక్యరాజ్యసమితి సమావేశాలకు మోడీ వెళ్తున్నారు. అలాంటి సందర్భాల్లో మన ప్రధాని అమెరికా అధ్యక్షుణ్ణి కలవడం సాధారణంగా జరిగేదే. కానీ, అందుకు భిన్నంగా ఈసారి వాషింగ్టన్‌లో ఇరు దేశాల అధినేతలూ శిఖరాగ్ర సమావేశం జరపబోతున్నారు. 2005లో అమెరికా నరేంద్రమోడీకి ఉన్న వ్యక్తి గత వీసాను రద్దుచేయడంతోపాటు ఆయనకు దౌత్యపరమైన వీసాను నిరాకరించింది. అప్పుడు చేసిన తప్పును అమెరికా మోడీని ఆహ్వానించడం ద్వారా దిద్దుకుంది.

మోడీ తల్లికి నవాజ్ షరీఫ్ కానుక

      భారత ప్రధాని నరేంద్రమోడీ తన ప్రమాణ స్వీకారోత్సవానికి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌‌ని ఆహ్వానించి తన స్నేహధర్మాన్ని చాటారు. ఇప్పుడు నవాజ్ షరీఫ్ కూడా ఆ స్నేహధర్మాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన మోడీ తల్లికి ఒక అందమైన చీర పంపించారు. ఈ విషయాన్ని మోడీ వెల్లడించారు. ‘పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ మా అమ్మ కోసం అందమైన తెల్ల చీర పంపారు’ అని నరేంద్ర మోడీ ట్విట్టర్లో వెల్లడించారు. నవాజ్ షరీఫ్ ఇండియాకి వచ్చినప్పుడు ఆయన తల్లికి మోడీ ఒక అందమైన శాలువా పంపించారు. దానికి బదులుగా ఇప్పుడు షరీఫ్ మోడీ మాతృమూర్తి హీరాబెన్‌కు షరీఫ్ అద్భుతమైన తెల్లని చీరను బహూకరించారు. ఇదిలా వుంటే, మోడీ తన నానమ్మకు పంపిన షాల్ చాలా బాగుందంటూ నవాజ్ షరీఫ్ కూతురు మార్యమ్ నవాజ్ షరీఫ్ కూడా గతంలో ఒక ట్వీట్ పోస్ట్ చేశారు. ‘మీరు నానమ్మకు పంపిన బహుమతికి థాంక్యూ వెరీమచ్ పీఎం నరేంద్రమోడీ.. మా నాన్నగారు దాన్ని స్వయంగా మా నానమ్మకి ఇచ్చారు’ అని ఆమె ట్వీట్ చేశారు.

లోక్‌సభ స్పీకర్‌గా సుమిత్రా మహాజన్ ఏక్రగీవం!

      లోక్‌సభకు వరుసగా రెండోసారి మహిళా స్పీకర్ ఎన్నికయ్యారు. ఇండోర్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికైన బీజేపీకి చెందిన సుమిత్రా మహాజన్‌ను స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 15వ, 16వ లోక్‌సభలకు మహిళా స్పీకర్లే వుండటం విశేషం. శుక్రవారం లోకసభ సమావేశాల్లో ఆమెను సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. సుమిత్రా మహాజన్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి 8వసారి ఎంపిగా ఎన్నికయ్యారు. వాజ్‌పాయ్ ప్రభుత్వంలో సుమిత్రా మహాజన్ సహాయ మంత్రిగా పని చేశారు. లోకసభ స్పీకర్‌గా ఎన్నికైన సుమిత్రా మహాజన్‌కు ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే, ఇతర పార్టీల సభ్యులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. సుమిత్రా మహాజన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అతిపెద్ద ప్రజాస్వామిక దేవాలయంలో స్పీకర్‌గా మరోసారి మహిళ ఎంపిక కావడం దేశానికి గర్వకారణమని అన్నారు.

పంజాబ్ స్వర్ణదేవాలయంలో ఉద్రిక్తత!

      స్వర్ణ దేవాలయంలో ఆపరేషన్‌ బ్లూస్టార్‌ జరిగి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో నివాళి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రెండు సిక్కు వర్గాలయిన సిక్‌ రాడికల్‌ గ్రూపు, శిరోమణి గురుద్వారా ప్రబంధ్‌ కమిటీ మధ్య జరిగిన ఘర్షణ స్వర్ణ దేవాలయంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడటానికి కారణమైంది. సిక్కులలోని రెండు వర్గాలు దేవాలయ ఆవరణలోనే కత్తులతో దాడులు చేసుకోవడంతో 12 మందికి గాయాలయ్యాయి. 1984 జూన్ నెలలోజరిగిన ఆపరేషన్ బ్లూస్టార్పై ఐక్యరాజ్యసమితితో విచారణ జరిపించాలనేది సిక్కు రాడికల్ గ్రూప్ డిమాండ్ కాగా, శిరోమణి గురుద్వారా ప్రబంధ్ కమిటీ దీనిని వ్యతిరేకిస్తోంది. ఈ విషయంలోనే రెండు గ్రూపుల మధ్య గొడవ జరిగింది. ఆపరేషన్ బ్లూ స్టార్ మృతులకు నివాళి అర్పిస్తున్న సమయంలోనే రాడికల్‌ గ్రూపు సభ్యులు ఐక్యరాజ్య సమితి విచారణ జరిపించాలని నినాదాలు చేశారు. ఇక్కడ గొడవ ప్రారంభమైంది. మాటామాటా పెరిగి గునపాలు, కత్తులతో దాడి చేసుకున్నారు. వివాదాన్ని నివారించడానికి సిక్కు మతపెద్దలు ప్రయత్నించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

రుణమాఫీ ఆంక్షలు: గుండెపోటుతో రైతు మృతి!

      టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక రైతు నిండు ప్రాణాన్ని తీసింది. ఎన్నికల సందర్భంగా కేసీఆర్ రైతుల రుణాలు మాఫీ చేస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చారు. కేసీఆర్ అధికారంలోకి రాగానే తమ రుణాలన్నీ మాఫీ చేస్తాడు, తమ కష్టాలన్నీ తీరుస్తాడని ఆశగా ఎదురు చూసిన రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. మంచినీళ్ళు తాగినంత ఈజీగా మాట తప్పే కేసీఆర్ రైతుల రుణమాఫీ విషయంలో కూడా తన టాలెంట్ ప్రదర్శించారు. రైతుల రుణ మాఫీ పాయింట్ మీద బోలెడన్ని మెలికలు పెట్టారు. దాంతో రైతులు షాకయ్యారు. తమ బతుకులు ఇలా అప్పుల్లో కూరుకుపోవలసిందేనని బాధపడ్డారు. కేసీఆర్ తన రుణం మాఫీ చేస్తాడని ఆశగా ఎదురుచూస్తున్న ఒక రైతు కేసీఆర్ ఇచ్చిన షాక్‌తో ఆవేదన చెంది గుండెపోటుతో మరణించారు. మెదక్ జిల్లా జహీరాబాద్ మండలం కాశీపూర్‌ గ్రామానికి చెందిన భద్రన్న అనే రైతు గుండెపోటుతో మరణించారు. భద్రన్న ప్రాణాలు పోవడానికి కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని స్థానికులు విమర్శిస్తున్నారు. కేసీఆర్‌కి రైతుల ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెడుతున్నారు.

జూన్ 8న చంద్రబాబు ఒక్కరే ప్రమాణ స్వీకారం?

  చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార సమయం దగ్గరపడుతున్న కొద్దీ, ఆయనతో బాటు ఎంతమంది, ఎవరెవరు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు? అనే అంశంపై మీడియాలో చాలా ఊహాగానాలు వెలువడుతున్నాయి.   ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి దేశం నలుమూలల నుండి అనేక మంది ప్రముఖులు రాబోతున్నందున, వారి భద్రత దృష్ట్యా కేవలం చంద్రబాబు ఒక్కరే జూన్ 8న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని, జూన్ 9 లేదా 10వ తేదీలలో మిగిలినవారు హైదరాబాదులో గవర్నర్ నరసింహన్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేయవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ చంద్రబాబు మంత్రివర్గంలో చేరబోయేవారు, తాము కూడా ఆయనలాగే దేశం నలుమూలల నుండి వచ్చిన ప్రముఖులు, లక్షలాది ప్రజల సమక్షంలో ప్రమాణస్వీకారం చేయాలని కోరుకోవడం సహజమే గనుక జూన్ 8న చంద్రబాబుతో బాటు మిగిలినవారు కూడా ప్రమాణస్వీకారం చేయవచ్చును. అయితే చంద్రబాబు మంత్రివర్గంలో ఎంతమంది ఉండబోతున్నారు? ఎవరెవరికి మంత్రులుగా అవకాశం దక్కబోతోంది? అనే విషయాలపై మరో రెండు మూడు రోజులు సస్పెన్స్ కొనసాగవచ్చును. బహుశః జూన్ 8 ఉదయం చంద్రబాబు మంత్రివర్గం సభ్యుల పేర్ల జాబితాను గవర్నర్ కు పంపినప్పుడు ఆ వివరాలు తెలిసే అవకాశం ఉంది.

నెలజీతం ఇచ్చిన ఎమ్మెల్సీ...ఇదొక బోడి త్యాగం!

      ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం విరాళాల సేకరణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విరాళాల సేకరణ ఎవరు చేయమన్నారో, విరాళాలు సేకరిస్తు్న్న వారికి వున్న అర్హత ఏమిటో, సేకరించిన విరాళాలు ఏమవుతాయో... ఇదంతా వేరే టాపిక్. అయితే ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఒక ఎమ్మెల్సీ గారు ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం తనవంతు కర్తవ్యంగా చేసిన త్యాగం గురించి చెప్పుకుందాం. సదరు ఎమ్మెల్సీగారు ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ తనకి ఎమ్మెల్సీగా వచ్చే జీతంలో ఒక నెల జీతాన్ని విరాళంగా ఇచ్చారు. నెల జీతం విరాళంగా ఇవ్వడంతో ఆగకుండా, దాన్ని పబ్లిసిటీ కూడా చేసుకుంటున్నారు. ఈ పబ్లిసిటీ సందర్భంగా తాను నెల జీతాన్ని కాదు.. వందేళ్ళ జీవితాన్నే త్యాగం చేసేసినట్టు ఎక్స్ ప్రెషన్ ఇచ్చారు. ఆయన తన మొత్తం పదవీకాలంలో తన జీతం, వసతుల కోసం ఖర్చు చేసే మొత్తంతో పోలిస్తే ఇప్పుడు ఇచ్చిన నెల జీతం నథింగ్! అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి కావల్సింది ఇలాంటి బిల్డప్పులు, బోడి త్యాగాలు కాదు.. నిజమైన త్యాగాలు. అవును... కొత్త ఆంధ్రప్రదేశ్ మళ్ళీ గతంలో మాదిరిగా తలెత్తుకోవాలంటే నిజమైన త్యాగాలు అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద వేలాది కోట్ల రూపాయల భారం వుంది. ఎవరో ఒక ఎమ్మెల్సీ నెలజీతాన్ని త్యాగం చేసేసి చేతులు దులుపుకుని తనని ఆంధ్రప్రదేశ్ మొత్తం త్యాగజీవిగా గుర్తించాలంటే కుదరదు. ఆంధ్రప్రదేశ్‌లో వున్న ప్రజా ప్రతినిధులందరూ తమ జీతాలు, వసతులు వదులుకోవాలి. ప్రజా ప్రతినిధుల జీతాలు, వసతులకే వేల కోట్ల రూపాయలు ఖర్చయిపోతున్నాయి. ఆ ఖర్చును కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మళ్ళించాలంటే ప్రజా ప్రతినిధులందరూ తమ జీతాలు, వసతులు వదులుకోవాలి. అది కూడా ఒక్క సంవత్సరం పాటు వదులుకుంటే చాలు.. ఒక్కసారి ఈ త్యాగం చేసి చూడండి.. దానివల్ల జరిగే అభివృద్ధి చూసి మీకే ఆశ్చర్యం కలుగుతుంది. వుందా? ఈ త్యాగం చేసే శక్తి ప్రజా ప్రతినిధులకు వుందా?

ఆంధ్ర మంత్రం జపిస్తున్న తెరాస ప్రభుత్వం

  తెరాస నేతలు తాము కోరుకోన్నట్లుగానే తెలంగాణా రాష్ట్ర అధికార పగ్గాలు చెప్పట్టినా ‘సర్వరోగ నివారిణి-ఆంద్ర మంత్రం’ పటించే అలవాటు మాత్రం వదులుకోలేకపోతున్నారు. వ్యవసాయ రుణాలమాఫిపై ప్రతిపక్షాలు చేస్తున్న లొల్లిచూసి కలతచెందిన తెలంగాణా రాష్ట్ర ఆర్దికమంత్రి ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ, తాము అధికారం చేప్పట్టి ఇంకా నాలుగు రోజులు కూడా కాకుండానే, ఆంధ్రా పార్టీలు, ఆంధ్రా మీడియా అప్పుడే తమపై బురద జల్లడం మొదలుపెట్టాయని, కొన్ని ఆంద్ర శక్తులు తెలంగాణా రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని, రైతులు వారి మాటలు నమ్మవద్దని, రుణమాఫీ విషయంలో రైతుల కేవలం ప్రభుత్వం ఏమి చెపుతోందో దానినే పరిగణనలోకి తీసుకోవాలని ఆయన అన్నారు. మరొక వారం పదిరోజుల్లో రుణమాఫీలపై ప్రభుత్వం ఖచ్చితమయిన నిర్ణయం ప్రకటిస్తుందని అంతవరకు రైతులు ఓపికపట్టాలని ఆయన కోరారు.   నిజానికి వ్యవసాయ రుణాలమాఫీపై మొట్టమొదట ఆయనే స్వయంగా ప్రకటన చేసారు. రైతులు 2013-14 సం.లలో తీసుకొన్న లక్ష లోపు వ్యవసాయ రుణాలను మాత్రమే ప్రభుత్వం మాఫీ చేస్తుందని, (అంటే అంతకు ముందు సం.లలో తీసుకొన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేయలేమని అర్ధం), రైతులు బంగారం కుదువ పెట్టి తీసుకొన్న వ్యవసాయ రుణాలకు ఈ మాఫీ వర్తించదని ఆయనే స్వయంగా ప్రకటించారు.   అప్పటి నుండే ప్రతిపక్షాలు తెరాస ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టాయి. వారి కంటే ముందు తెరాస కార్యకర్తలే తమ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తూ కొన్ని గ్రామాలలో పార్టీ జెండా దిమ్మలు కూలద్రోసినట్లు వార్తలు వచ్చాయి. స్వయంగా తమ పార్టీ కార్యకర్తలే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తున్నపుడు, ఈ వ్యవహారంలో ఆంధ్రా శక్తులు కుట్రలు పన్నుతున్నాయని ఈటెల ఆరోపించడం ఆశ్చర్యకరమే.   తెరాస నేతలు ఉద్యమాలు చేస్తునంత కాలం తెలంగాణా ప్రజలను తమవైపు తిప్పుకోవడానికి నిత్యం ‘ఆంద్ర మంత్రం’ పటించడం సహజమే అనుకొన్నప్పటికీ, ఇప్పుడు అధికారం చేప్పట్టిన తరువాత కూడా తమ సమస్యల నుండి బయటపడటానికి ‘ఆంద్ర మంత్రం’ పటించడం చూస్తే, తెరాస నేతలు దానినే సర్వరోగ నివారిణిగా భావిస్తున్నట్లు కనబడుతోంది. ఇదే నిజమయితే బహుశః రానున్న ఐదేళ్ళు కూడా కేసీఆర్ ప్రభుత్వం ఈ ఆంధ్ర మంత్రాన్నిఅధికారిక మంత్రంగా చేసుకొని నిత్యం జపించవచ్చును.   ఉద్యోగులకు ఆప్షన్స్ ఉండవని తేల్చి చెప్పిన తెరాస ప్రభుత్వం ఈ ‘ఆంధ్రా ఆప్షన్’ ఉంచుకొన్నప్పటికీ, ఆంద్రప్రదేశ్లో అధికారంలోకి వస్తున్న తెదేపా ప్రభుత్వానికి మాత్రం ఇటువంటి ఆప్షన్ (వెసులుబాటు) లేదు. కానీ మిగులు బడ్జెట్ ఉన్న తెరాస ప్రభుత్వమే రుణమాఫీలు అమలు చేయలేనప్పుడు, లోటు బడ్జెట్ ఉన్న తామేవిధంగా అమలు చేయగలమని రైతులకు సర్దిచెపే ప్రయత్నం చేసుకొనే ఆప్షన్ మాత్రం ఉంది.

మొత్కుపల్లి రైతులను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారా?

  కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయ రుణాల మాఫీ విషయంలో వెనుకంజ వేయడంతో రైతులు నిరాశతో ఆత్మహత్యలకు పాల్పడితే దానికి కెసిఆర్‌దే బాధ్యతని తెదేపా నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఆయన కేసీఆర్ ప్రభుత్వాన్ని రైతుల రుణాల మాఫీ విషయంలో నిలదీయడం సంగతి ఎలా ఉన్నప్పటికీ, ఆయన మాటలు నిరాశతో ఉన్న రైతులను ఆత్మహత్యలకు ప్రేరేపించేవిలా ఉన్నాయి.   గతంలో తెలంగాణా ఉద్యమాలు జరుగుతున్నప్పుడు కేసీఆర్ కూడా ఇదేవిధంగా ‘తెలంగాణా కోసం విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకొంటే మీదే బాధ్యత’ అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిత్యం బెదిరించేవారు. అటువంటి మాటల వలన ఉడుకు రక్తంగల యువకులు అనేకమంది తెలంగాణా కోసం బలిదానాలు చేసుకొన్నసంగతి అందరికీ తెలుసు.   తెలంగాణా ప్రజల పట్ల తనకు చాలా బాధ్యత ఉందని భావిస్తున్న మోత్కుపల్లి కూడా ఈవిధంగా మాట్లాడటం మంచి పద్దతి కాదు. ఆయన రైతుల వ్యవసాయ రుణాల మాఫీ కోసం కేసీఆర్ ప్రభుత్వంతో పోరాడదలిస్తే, ఆ రైతులతోనే కలిసి పోరాటం చేస్తే ఏమయినా ఫలితం ఉంటుంది. లేదా శాసనసభ సమావేశాలలో కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీయవచ్చును. లేకుంటే, “ఒకవేళ ప్రభుత్వం రుణాలు మాఫీ చేయకపోతే మీ తరపున మేము పోరాడి ప్రభుత్వం మెడలువంచయినా సరే..ఒప్పిస్తామని ఆయన రైతులకు భరోసా ఇస్తూ మాట్లాడినా అందరూ హర్షిస్తారు. అంతేకానీ రుణాలు మాఫీ చేయకపోతే రైతులు ఆత్మహత్యలు చేసుకొంటారని జోస్యం చెప్పడం చాల దారుణం. ఇటువంటి మాటలు ఎవరు మాట్లాడినా, మీడియా, ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు గట్టిగా ఖండించడం చాల అవసరం. లేకుంటే ఇదొక వికృత సంస్కృతిగా మారుతుంది.

ఆ గవర్నరు చేతికే ప్రసంగపాఠం

  తెలంగాణా శాసనసభ సమావేశాలు జూన్9 నుండి నాలుగు లేదా ఐదు రోజులపాటు జరుగుతాయని తెలంగాణా శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి టీ.హరీష్ రావు ఈరోజు ప్రకటించారు. ముందుగా జూన్9 ఉదయం 9గంటలకు రాజ్ భవన్ లో ప్రోటెం స్పీకర్ గా కే.జానా రెడ్డి పదవీ ప్రమాణం చేస్తారని, 11గంటల నుండి తెలంగాణా రాష్ట్ర శాసనసభ సమావేశాలు మొదలవుతాయని తెలిపారు. మొదటి రెండు రోజులు కొత్తగా ఎన్నికయిన సభ్యుల పదవీ ప్రమాణ కార్యక్రమం ఉంటుందని, జూన్ 11న గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారని హరీష్ రావు తెలిపారు.   ఈ సమావేశాలకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత జరుగుతున్న మొట్ట మొదటి సమావేశాలివే. అదేవిధంగా ఇంతకాలం తెలంగాణా ఉద్యమాలు చేసిన తెరాస ప్రభుత్వపగ్గాలు చేప్పట్టి అధికార పక్షంలో కూర్చోబోతుండగా, గత పదేళ్లుగా అధికార పార్టీ హోదాలో కూర్చొన్న కాంగ్రెస్, తెదేపాతో బాటు ప్రతిపక్ష బెంచీలలో కూర్చోబోతోంది.   ఇక మరో విశేషమేమిటంటే ఇదివరకు కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నపుడు ఆయన చేతిలో నుండి చాలా దౌర్జన్యంగా ఉపన్యాస ప్రతులను లాక్కొని చించివేసి గవర్నరును ఘోరంగా అవమానించిన తెరాస నేతలు, ఇప్పుడు అదే గవర్నర్ నరసింహన్ చేతిలో తమ ప్రభుత్వం గురించి చెప్పవలసిన నాలుగు మంచి ముక్కలున్న ప్రసంగపాఠం పెట్టబోతున్నారు. ఒకవేళ తెదేపా, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు లేచి అభ్యంతరాలు చెపితే, ఈసారి తెరాస నేతలు వారికి సర్దిచెప్పి కూర్చోబెట్టవలసి ఉంటుంది. ఇంతవరకు అధికార పార్టీని శాసనసభలో నిలదీస్తూ వచ్చిన తెరాస, ఇప్పుడు తమను ప్రతిపక్షాలు నిలదీస్తుంటే, వారికి సమాధానాలు చెప్పుకోవలసి ఉంటుంది. ఓం ప్రధమంగా వ్యవసాయ రుణమాఫీలపైనే అధికార, ప్రతిపక్షాల యుద్ధం మొదలవుతుంది.

లేడీ కండక్టర్ని బట్టలు చించి కొట్టిన దుర్మార్గుడు!

      దేశం నాశనమైపోతోంది. మహిళల మీద వుండాల్సిన గౌరవం మంటగలిసిపోతోంది. ఎన్ని చట్టాలు వచ్చినా అవి మహిళలకు ఎంతమాత్రం రక్షణ కల్పించలేకపోతున్నాయి. మహిళల మీద దాడులు చేసే ఉన్మాదులకు భయం పుట్టించలేకపోతున్నాయి. అలాంటి ఉన్మాది ఒకడు ముంబైలో బయటపడ్డాడు. బస్సులో ప్రయాణిస్తున్న అభిషేక్ సింగ్ అనే ఉన్మాది ఆ బస్సుకు కండక్టర్‌గా వున్న మహిళను బట్టలు చించి దారుణంగా అవమానించడమే కాకుండా, ఆమెని దారుణంగా కొట్టాడు. ఈ సంఘటన వెనుక పూర్తి వివరాలు ఇలా వున్నాయి. థానే జిల్లాలో కల్యాణ్-పన్వేల్ మధ్య తిరిగే బస్సులో ప్రయాణిస్తున్న అభిషేక్ సింగ్ (30)కు, ఆ బస్సు డ్రైవర్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో బస్సులోని మహిళా కండక్టర్ (34) అతనిని బస్సుదిగాల్సిందిగా ఆదేశించింది. పట్టలేని ఆవేశంతో ఆ యువకుడు లేడీ కండక్టర్‌ను కిందకు లాగి, ఆమె దుస్తులు చించి కొట్టడం మొదలుపెట్టాడు. అతన్ని వెనుక బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులు వచ్చి అడ్డుకున్నారు. దీనిపై లేడీ కండక్టర్ స్థానికంగా వున్న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, అతడిని పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

కేసీఆర్.. ఇది పద్ధతి కాదు: జానా

      రైతుల రుణాల మాఫీ విషయంలే కేసీఆర్ వేసిన మెలికలు తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ ప్రభుత్వం మీద రెండు రోజుల్లోనే వ్యతిరేకత వచ్చేలా చేసింది. తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు కేసీఆర్ని విమర్శల వెల్లువలో ముంచేస్తున్నాయి. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కొంతమంది రైతులు కేసీఆర్‌కి వ్యతిరేకంగా నిరసనలు కూడా తెలిపారు. ఇదిలా వుంటే, రైతుల రుణాల మాఫీ విషయంలో కేసీఆర్ వెనక్కి తగ్గడం పద్ధతి కాదని తెలంగాణ కాంగ్రెస్ శానసనభ పక్ష నేత జానారెడ్డి అన్నారు. రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు వెనక్కి తగ్గితే టీఆర్ఎస్ ప్రభుత్వం అపఖ్యాతిని మూటగట్టుకోక ఆయన చెప్పారు. రైతు రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం కాలపరిమితి విధించడం సబబు కాదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాలపరిమితితో సంబంధం లేకుండా రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇప్పటికే పలుచోట్ల రైతులు ఆందోళనకు దిగారని, రైతులకి ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంలో ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుందని చెప్పారు.

బాబు ప్రమాణానికి మోడీ రాకపోవచ్చా?

      ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఈనెల 8వ తేదీన గుంటూరు సమీపంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనాల్సిందిగా చంద్రబాబు చాలామందికి ఆహ్వానాలు పంపారు. చాలామందికి వ్యక్తిగతంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించారు. తన రాజకీయ ప్రత్యర్థులైన కేసీఆర్, జగన్‌ని కూడా చంద్రబాబు ఆహ్వానించారు. తాజాగా ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో హాజరు కావాల్సిందిగా దేశ ప్రధాని నరేంద్ర మోడీని కూడా చంద్రబాబు ఆహ్వానించారు. పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు నేతృత్వంలో తెలుగుదేశం ఎంపీలు గురువారం నాడు ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసి చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రాన్ని కూడా అందించారు. అయితే నరేంద్రమోడీ చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్ళే అవకాశం లేదని ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు అంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున, మోడీకి ఇది మొదటి పార్లమెంట్ సమావేశాలు అయినందున ఆయన పార్లమెంట్ సమావేశాలను వదిలి చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేది కష్టమేనని అంటున్నారు. అయితే చంద్రబాబు మీద ప్రత్యేక అభిమానం వున్న నరేంద్రమోడీ ఏదో రకంగా వీలు చేసుకుని ప్రమాణ స్వీకారోత్సవానికి వస్తారేమో చూడాలి.

తెరాస కొంపముంచుతున్న రుణమాఫీ

  కేసీఆర్ ప్రభుత్వం రైతు రుణమాఫీలపై వెనకడుగు వేయడంతో కేవలం ప్రతిపక్షాలే కాక స్వంత పార్టీ కార్యకర్తలు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇంతకాలం ఎవరినిపడితే వారిని నోటికి వచ్చినట్లు తిట్టిపోసిన కేసీఆర్ మరియు ఆయన మంత్రివర్గ సభ్యులకు, ఇప్పుడు తమను ప్రతిపక్షాలు జాడించి వదిలిపెడుతుంటే ఆ కష్టం ఏమిటో బాగా తెలిసివస్తోంది. ఎన్నికల సమయంలో రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పిన కేసీఆర్, ఇప్పుడు కేవలం 2013-14 సం.లలో లక్షరూపాయలలోపు తీసుకొన్న వ్యవసాయ రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని, బంగారు నగలు తాకట్టుపెట్టి తెచ్చిన వ్యవసాయ రుణాలను మాఫీ చేయలేమని అప్పుడే తేల్చి చెప్పేయడంతో, తీవ్ర ఆగ్రహం చెందిన కొందరు తెరాస కార్యకర్తలు ఆర్మూరు మండలంలో మందని గ్రామంలో తెరాస జెండా దిమ్మను కూల్చి వేసారు. అదేవిధంగా మాచారెడ్డి మండలంలో కూడా తెరాస జెండా దిమ్మను కూల్చి వేసినట్లు తాజా సమాచారం. ఇక నిజామాబాద్ జిల్లాలో గాంధారి గ్రామంలో మాతు సంఘం రైతులు కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికలలో హామీ ఇచ్చినట్లుగా, రుణాలన్నిటినీ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్లమీడకు వచ్చి ధర్నాలు చేసారు.కేసీఆర్ ప్రభుత్వంపై అప్పుడే తీవ్ర ఒత్తిడి మొదలయినట్లు కనబడుతోంది.   ప్రతిపక్షంలో ఉన్నంత కాలం ఉద్యమాలు, ధర్నాలు చేస్తూ ప్రజలను, ఉద్యోగులను కేసీఆర్ వెంట తిప్పుకోగలిగారు. కానీ ఇప్పుడు స్వయంగా ప్రభుత్వం నడపడం మొదలు పెట్టేసరికి, ఇంతవరకు వెంట నడిచిన ప్రజలే ఇప్పుడు ఆయనకు ఎదురు తిరుగుతున్నారు. కేసీఆర్ మొదటి హామీపై వెనక్కి తగ్గితేనే ఇంత రగడ మొదలయింది. ఆయన ఇంకా చాల చాలా హామీలు ఇచ్చారు. వాటి విషయంలో కూడా ఇలాగే వెనక్కు తగ్గినట్లయితే మరిన్ని విమర్శలు ఎదుర్కోక తప్పదు. బహుశః అందుకే ‘కేసీఆర్ ప్రభుత్వానికి ముందుంది ముసళ్ళ పండుగ’ అని తెదేపా నేత రేవంత్ రెడ్డి మొదటిరోజే అనేసారు.

తెలంగాణలో మావోయిస్టుల సమస్య లేదట!

      తెలంగాణ రాష్ట్ర హోం మంత్రిగా గురువారం నాడు బాధ్యతలు తీసుకున్న నాయని నర్సింహారెడ్డి మావోయిస్టుల విషయంలో ఇచ్చిన స్టేట్‌మెంట్ విని నవ్వాలో, ఏడవాలో, జాలిపడాలో అర్థంకాని స్థితికి ప్రజలు చేరుకున్నారు. నాయిని అంచనా ప్రకారం తెలంగాణలో మావోయిస్టుల సమస్య అస్సలు లేదట.  ఈ సందర్భంగా తెలంగాణ భద్రత గురించి ఆయనేమన్నారంటే... 1. హైదరాబాద్ భద్రతకు పెద్దపీట వేస్తాం. 2. అడుగడుగునా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షిస్తాం. 3.  అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే ఉద్యమకారులపై కేసులను ఎత్తివేస్తాం. 4. హైదరాబాదులో సీమాంధ్రులకు పూర్తి రక్షణ కల్పిస్తాం. 5. తెలంగాణ పోలీసు వ్యవస్థను ఆధునీకరిస్తాం. 6. హైదరాబాద్‌లో భద్రతను కట్టుదిట్టం చేస్తాం. 7. కేసుల సత్వర పరిష్కారానికి సీఐడీని బలోపేతం చేస్తాం.

రేప్‌లు మామూలే: సమాజ్‌వాది బలుపు

      ఏదో వాషింగ్ పౌడర్ ప్రకటనలో ‘మరక మంచిదే’ అని చెప్పినంత ఈజీగా ఉత్తర ప్రదేశ్‌లో అధికారంలో వున్న సమాజ్‌వాది పార్టీ ‘పెద్ద రాష్ట్రాల్లో రేప్‌లు మామూలే’ అని బాధ్యతారహితమైన ప్రకటన ఇచ్చింది. యు.పి.లోని బదౌన్‌లో ఇద్దరు అక్కాచెల్లెళ్ళ మీద అత్యాచారం చేసి చెట్టుకి ఉరేసి చంపిన సంఘటన దేశవ్యా్ప్తంగా సంచలనం సృష్టించింది. దేశమంతా ఈ సంఘటన గురించి దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుంటే, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం, సమాజ్‌వాది పార్టీ నాయకులు మాత్రం ఈ సంఘటని చాలా తేలిగ్గా తీసిపారేస్తూ రోజుకో విచిత్రమైన ప్రకటన ఇస్తున్నారు.   తాజాగా ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాల్లో అత్యాచారాలు, హత్యలు సహజమని సమాజ్‌వాది పార్టీ నేతలు ఎంతమాత్రం సిగ్గుపడకుండా చెబుతున్నారు.  దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో అతిపెద్ద రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ ఉంది. అలాంటి రాష్ట్రంలో అత్యాచారాలు సహజమేనంటూ సమాజ్వాదీ పార్టీ నాయకుడు మొహిసిన్ ఖాన్ గురువారం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో చెప్పి అందరికీ జ్ఞానోదకం కలిగించాడు.  అత్యాచారాలు ఒక్క ఉత్తరప్రదేశ్లో మాత్రమే జరగడం లేదని, దేశవ్యాప్తంగా జరుగుతున్నాయంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తరువాత ఆయన అనుకూల వర్గం మొత్తం ఇంకా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తమ నాయకుడి దృష్టిలో పడే ప్రయత్నాలు చేస్తున్నారు.  

మెదక్ ఎంపీ స్థానం నుంచి సీఎల్ రాజం పోటీ?

      నమస్తే తెలంగాణ పత్రిక ఛైర్మన్ సి.ఎల్.రాజం మెదక్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెదక్ ఎంపీ స్థానం నుంచి, గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ తర్వాత మెదక్ ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. ఈ స్థానం నుంచి పోటీ చేయాలని టీఆర్ఎస్‌లో ఎంతోమంది ఉవ్విళ్ళూరుతున్నారు. భారతీయ జనతా పార్టీ కూడా ఈ స్థానాన్ని తానే గెలుచుకోవాలని భావిస్తోంది. ఈ స్థానంలో పోటీ చేయగల బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. ఇది వుంటే, తెలంగాణ ఉద్యమానికి, టీఆర్ఎస్ పార్టీ బలోపేతం కావడానికి సీఎల్ రాజం ఛైర్మన్‌గా వున్న నమస్తే తెలంగాణ పత్రిక ఎంతో సహకరించింది. ఓ సందర్భంలో కేసీఆర్ కూడా ఈ విషయాన్ని చెబుతూ, సీఎల్ రాజంని టీఆర్ఎస్ తరఫున ఎన్నికలలో పోటీ చేయించడం గానీ, ఒకవేళ అది కుదరకపోతే రాజ్యసభకు పంపడం గానీ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఎంతోమందిని పక్కన పెట్టేశారు. పట్టించుకోవడమే మానేశారు. ఆ లిస్టులో సీఎల్ రాజం కూడా వున్నారు. ఆ బాధ సీఎల్ రాజంలో వుంది. అలాగే కేసీఆర్ ఖాళీ చేసిన మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున తాను పోటీ చేస్తానని సీఎల్ రాజం కోరగా కేసీఆర్ నో చెప్పినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో కేసీఆర్ తీరు సీఎల్ రాజంను బాధించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సీఎల్ రాజం బీజేపీలో చేరారు. నరేంద్రమోడీ నాయకత్వంలో ‘జాతీయ స్థాయిలో సేవా కార్యక్రమాలు’ చేయాలని వుందని అన్నారు. రాజం బీజేపీలో చేరడానికి ముందే మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ నుంచి పోటీ చేయడానికి ఒప్పందం కుదిరినట్టు సమాచారం.