చంద్రబాబు ప్రమాణానికి తరలివస్తున్న ప్రముఖులు
posted on Jun 8, 2014 @ 5:12PM
చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి యావత్ నందమూరి కుటుంబ సభ్యులు గుంటూరు తరలివచ్చేరు. ఇంతవరకు ఎడమొహం, పెడమొహంగా వ్యవహరిస్తున్నబాలకృష్ణ, హరికృష్ణ అయన కుమారుడు జూ.యన్టీఆర్ అందరూ కలిసి సభా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తుండటంతో తెదేపా కార్యకర్తల చాలా సంబరపడుతున్నారు. చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో సహా ప్రత్యేక విమానంలో మధ్యాహ్నమే గన్నవరం చేరుకొని అక్కడి నుండి సభాస్థలి వరకు రోడ్డు మార్గం ద్వారా వచ్చి అక్కడ నాగార్జున విశ్వవిద్యాలయ భవనంలో బస చేసారు. కొందరు కేంద్రమంత్రులు, గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారేకర్ తదితరులు సభాస్థలి వద్ద విడిది గృహాలకు చేరుకొన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా సభాస్థలి వద్దకు చేరుకొన్నారు. ప్రముఖుల రాకతో గుంటూరు విజయవాడ మధ్య ట్రాఫిక్ పూర్తిగా స్థంబించిపోయింది. మండే ఎండను సైతం లెక్కజేయకుండా వేలాది ప్రజలు తరలివస్తున్నారు. అప్పుడే సభావేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయిపోయాయి.