శిల్పాశెట్టికి మరో జీవితం

  నేత్రదానం చేయండి... మరోసారి జీవించండి అనేది నేత్రదానానికి సంబంధించిన సందేశం. నిజమే. మనం నేత్రదానం చేస్తే మరణించి కూడా జీవిస్తాం. రెండో జన్మ పొందుతాం. ఈ విషయాన్నే బాలీవుడ్ నటి శిల్పాశెట్టి కూడా చెబుతోంది. చెప్పడమే కాదు ఆచరించి కూడా చూపించింది. అన్ని దానాల్లో నేత్రదానం గొప్పదని చాటుతూ బాలీవుడ్ తార శిల్పాశెట్టి నేత్రదానం చేసి అందరికి ఆదర్శంగా నిలిచారు. ముంబైలోని యశ్వంత్ సమాజిక్ ప్రతిస్థాన్ సామాజిక సంస్థకు తన నేత్రాలను శిల్పాశెట్టి దానం చేశారు. శిల్ప భర్త రాజ్ కుంద్రా, సోదరి షమితాశెట్టి కూడా తన నేత్రాలను దానం చేసే డిక్లరేషన్ మీద సంతకాలు చేశారు. ఈ సందర్భంగా శిల్ప మాట్లాడుతూ, ‘‘నా మరణం తర్వాత నా కళ్ల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. నేత్రదానం చేస్తే నా మరణం తర్వాత నా నేత్రాలు మరొకరికి దృష్టిని ప్రసాదిస్తాయనే విషయం నాకు సంతృప్తిని కలిగిస్తోంది’’ అన్నారు.

యాచకవృత్తి ఏటా టర్నోవర్ అక్షరాలా 140 కోట్లు!

  తెలంగాణలో యాచకుల ద్వారా ఏటా 140 కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయనే జరుగుతున్నాయనే ఆశ్చర్యకరమైన వాస్తవం తాజాగా బయటపడింది. ఈ బిచ్చగాళ్ళ వ్యవస్థను తెలంగాణలో కొనసాగించరాదంటూ ఒక లాయర్ హైకోర్టులో వేసిన పిటిషన్ కారణంగా ఈ నిజం బయటపడింది. హైదరాబాద్‌ నగరంలో ఎక్కడ చూసినా యాచకులు కనిపిస్తూ వుంటారు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అయితే ఏదో శారీరక లోపం వున్నవారిలా నటిస్తూ యాచిస్తూ వుంటారు. హైదరాబాద్‌లో యాచించే వారిలో ఉత్తర భారతదేశం నుంచి వచ్చే వారి సంఖ్యే ఎక్కువగా వుంటుంది. వీరందరూ వందల సంఖ్యలో వుంటారు. వీరంతా ఐకమత్యంగా వుంటారు. ప్రతిరోజూ తెల్లవారగానే తమ సొంత ఆటోలలో ఎక్కి వివిధ సిగ్నల్స్ దగ్గర దిగిపోయి బాగా చీకటి పడిపోయే వరకూ అక్కడే యాచిస్తారు. చీకటి పడ్డాక వారిని ఆటో వచ్చి పికప్ చేసుకుంటుంది. ఉత్తర భారతదేశ: నుంచి వచ్చే బిచ్చగాళ్ళ టీమ్‌లు సిగ్నల్స్ దగ్గర యాచించే స్థానిక బిచ్చగాళ్ళను తన్ని తరిమేస్తూ వుంటారు. ఉత్తర భారతదేశం నుంచి వచ్చే యాచకుల సంఖ్యాబలం ఎక్కువగా వుండటం వల్ల స్థానికంగా, ఒక్కరే వుండే బిచ్చగాళ్ళు వారిని ఎదుర్కోలేక వేరే ప్రాంతాలను వెతుక్కుంటూ వెళ్ళిపోతూ వుంటారు. సినిమాల్లో చూపించినట్టుగా వడ్డీలకు డబ్బులు తిప్పే బిచ్చగాళ్ళు, లక్షల రూపాయల ఆస్తులు వున్న బిచ్చగాళ్ళు కూడా వుంటారట. హైదరాబాద్‌లో పెరిగిపోయిన బిచ్చగాళ్ళ వ్యవస్థను రూపుమాపాలనే ప్రయత్నాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. అయితే అవి ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు.

స్మితా సబర్వాల్ పర్సనల్, ఇంట్రస్టింగ్ మేటర్స్

      మెదక్ జిల్లా కలెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్న స్మితా సబర్వాల్. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. 2001లో ట్రైనీ కలెక్టర్‌గా ఐఏఎస్ విధుల్లో చేరిన ఈమె తన పనితీరుతో ప్రత్యేక గుర్తింపును పొందారు. యువతరానికి స్ఫూర్తిదాయకంగా వుండే స్మితా సబర్వాల్ పర్సనల్ విశేషాలు....     1977 సంవత్సరం జూన్ 19వ తేదీన జన్మించిన స్మిత  గ్రాడ్యుయేషన్ హైదరాబాద్‌ సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో పూర్తి చేశారు. ఈమె ఎన్ఎస్ఎస్‌లో చురుకైనవాలంటీర్. బిజినెస్ లా అకౌంటెన్సీ మార్కెటింగ్‌లో డిగ్రీ హోల్డర్.  ఏ గ్రేడులో ఉత్తీర్ణులైన ప్రతిభాశాలి. 2001  ఐఏఎస్, ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన స్మితా... 2001లో మొదట అదిలాబాద్‌లో ట్రైనీ కలెక్టర్‌గా నియమితులయ్యారు. చిత్తూరు అసిస్టెంట్ కలెక్టర్‌గా, గ్రామీణాభివృద్ధి శాఖలో ప్రాజెక్టు డైరెక్టర్‌గా, కడపలో ప్రాజెక్టు డైరక్టర్‌గా, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా, విశాఖపట్టణంలో వాణిజ్యపన్నుల శాఖలో డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. ఆ తర్వాత కర్నూలు జాయింట్ కలెక్టర్‌గా పని చేశారు. అనంతరం హైదరాబాద్‌లో జాయింట్ కలెక్టర్‌గా, 2010లో కరీంనగర్ కలెక్టర్‌గా, నిన్నటి వరకుమెదక్ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ వచ్చారు. మెదక్ జిల్లా కలెక్టర్‌గా అనేక మంచి పనులు చేసి జిల్లా వాసుల నుంచి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు. తెలుగు, బెంగాల్, ఇంగ్లీషుల్లో అనర్గళంగా మాట్లాడే స్మితా సబర్వాల్ అండర్ 16 బ్యాడ్మింటన్ విభాగంలో కర్ణాటకకు ప్రాతినిథ్యం వహించారు. అథ్లెటిక్ చాంపియన్‌షిప్ పోటీల్లో కూడా ఈమె పాల్గొన్నారు. స్మితా సబర్వాల్ భర్త పేరు అకున్ సబర్వాల్. ఆయన ఐపీఎస్ అధికారి. హైదరాబాద్ పోలీస్ అకాడమీలో ఆయన విధులు నిర్వహిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు.

కాళ్ళమీద పడొద్దు: మోడీ వార్నింగ్

      రాజకీయ రంగంలో, సినిమా రంగంలో సక్సెస్‌లో వున్న వాళ్ళ కాళ్ళమీద పడే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా వుంది. ఎవరితో అయినా ఏదైనా పనివుంటే కాళ్ళమీద పడిపోయి కాకాపట్టడం ఈ రెండు ఫీల్డులలో మామూలే. అలాగే ఈ రెండు రంగాల్లో చాలామందికి ఎదుటివారిని తమ కాళ్ళమీద పడేలా చేసుకునే అలవాటు వుంటుంది. ఎవరి కాళ్ళమీదా పడకుండా వెన్నెముక నిటారుగా పెట్టి నిలుచునేవారికి బాగుపడే అవకాశాలు ఈ రెండు రంగాల్లో చాలా తక్కువగా వుంటాయి. యు.పి.ఎ. ఛైర్ పర్సన్‌గా, కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పదేళ్ళు పదవి వెలగబెట్టిన సోనియాగాంధీ మేడమ్ గారికి కూడా ఈ పాదాభివందనాలంటే చాలా ఇష్టమని చెబుతూ వుంటారు. అయితే ఇలాంటి వ్యక్తిపూజ సంస్కృతిని ప్రధాని నరేంద్ర మోడీ వ్యతిరేకిస్తున్నారు. తనకు పాదనమస్కారం చేయొద్దని ఎంపీలకు, బీజేపీ నాయకులకు సూచించారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలను ఉద్దేశించి పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో మోడీ శుక్రవారం ప్రసంగించిన సందర్భంగా ఈ సూచన చేశారు. ఎవరూ తనకు పాదాభివందనం చేయద్దని ఆయన కోరారు. వ్యక్తిపూజకు తాను వ్యతిరేకమని తేల్చిచెప్పారు. కష్టపడి పనిచేయాలని ఎంపీలకు ఆయన సూచించారు. ప్రతిభ, సామర్థ్యాలు పెంచుకుని మంచి పార్లమెంటేరియన్లుగా గుర్తింపు తెచ్చుకోవాలని ఎంపీలకు మోడీ చెప్పారు.

కాంగ్రెస్‌లో శశిథరూర్ కలకలం

        కాంగ్రెస్ పార్టీ నాయకుడు, తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ, మాజీ మంత్రి శశిథరూర్ నరేంద్రమోడీని పొగడ్డం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగింది. హఫింగ్‌టన్ పోస్ట్ అనే అమెరికన్ వెబ్‌సైట్‌లో రాసిన ఒక వ్యాసంలో శశిథరూర్ నరేంద్రమోడీని పొగడ్తలతో ముంచెత్తారు. ఆ పొగడ్తలన్నీ కేవలం మోడీని పొగిడినట్టు మాత్రమే కాకుండా కాంగ్రెస్ పార్టీని తిట్టినట్టు ఉన్నాయని కాంగ్రెస్‌లో చాలామంది ముఖాలు మాడ్చుకున్నారు. ‘‘మోడీ 1.0 వెర్షన్ నుంచి 2.0 వెర్షన్‌కు అప్‌గ్రేడ్ అయ్యారు. రాజకీయాలలోకి ప్రవేశించిన మొదటి దశలో కొన్ని వర్గాలకు మాత్రమే ప్రతినిధిగా ఉన్న మోడీ.. ఇప్పుడు రెందో దశలో ప్రధానమంత్రిగా అందరినీ సమానంగా ఆదరిస్తుండడం, ప్రజలందరినీ కలుపుపోయేలా చర్యలు తీసుకుంటుండం ఆయనలోని మార్పుకు నిదర్శనం ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆధునిక అవతారం అభ్యుదయశీలంగా ఉంది. అందరినీ కలుపుకుని పోయేందుకు మోడీ చేస్తున్న ప్రయత్నాలను గుర్తించకపోవడం అమర్యాదకరం’’ అంటూ శశిథరూర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల విషయంలో మణిశంకర్ అయ్యర్ లాంటి నాయకులు శశిథరూర్‌కి వ్యతిరేకంగా చాలా ఘాటుగా స్పందించారు. అయ్యర్ శశిథరూర్‌‌ని ఏకంగా ‘ఊసరవెల్లి’ అని సంభోదించి మాట్లాడారు. థరూర్ పరిపక్వత లేని రాజకీయ నాయకుడని, ఆయన ఇలాంటి ఊసరవెల్లి రాజకీయాలు నడపటం మంచిది కాదని అయ్యర్ వ్యాఖ్యానించారు. థరూర్ చేసిన వ్యాఖ్యలు తనను బాధకు గురిచేశాయని అయ్యర్ అన్నారు. కాంగ్రెస్‌లో రేగిన ఈ కలకలం ఎటు దారి తీస్తుందో చూడాలి.

మోడీ పర్యటించే దేశాలు ఏవి?

      ప్రధానమంత్రి విదేశాలలో పర్యటించడం అనేది మామూలు విషయం. ప్రధానమంత్రి హోదాలో నరేంద్రమోడీ పర్యటించనున్న మొదటి దేశం ఏదో తెలుసా? మన దేశం పక్కనే వున్న బుజ్జి దేశం భూటాన్. ఆ తర్వాతి దేశం ఏమిటో తెలుసా? అది ఆషామాషీ దేశం కాదు.. అభివృద్ధిలో ప్రపంచం మొత్తానికీ ఆదర్శంగా నిలిచే జపాన్. యుపిఎ ప్రభుత్వం హయాంలో నాశనమైపోయిన దేశాన్ని మళ్ళీ అభివృద్ధి పథం వైపు నడిపించడానికి నడుం కట్టుకున్న మోడీ తన విదేశీ పర్యటనకు జపాన్‌‌ని ఎంపిక చేసుకోవడం సమయోచితంగా వుంది. జూలైలో మోడీ జపాన్కు వెళ్లనున్నారు. ప్రధాని కార్యాలయం శుక్రవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.మోడీ తొలి విదేశీ పర్యటనకు ఈ నెలాఖరులో భూటన్ వెళ్లనున్నారు. ఇక సెప్టెంబర్ చివర్లో అమెరికాకు వెళ్లనున్నారు.

కాశ్మీరీ పండిట్లకు మోడీ అండ

      కాశ్మీరీ పండిట్లకు అండగా నిలవటానికి మోడీ సర్కార్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. కాశ్మీర్‌లో చాలామంది కాశ్మీరీ పండిట్లు తీవ్రవాదులకు భయపడి కాశ్మీర్ నుంచి వెళ్ళిపోయి పక్క రాష్ట్రాల్లో జీవిస్తున్నారు. వారికి భరోసా ఇచ్చి, వారిని మళ్ళీ కాశ్మీర్‌కి తీసుకువచ్చేలా ప్రయత్నించాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. దీంతోపాటు జమ్ము, లఢక్ ప్రాంతాల అభివృద్ధికి క‌ృషి చేయాలని మోడీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. 1990లో తీవ్రవాదుల భయంతో రాష్ట్రం విడిచి వెళ్లిన పండిట్లు తిరిగి స్వస్థలాలకు రావాలంటే ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. అలాగే ఇప్పటి వరకూ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌గా వ్యవహరిస్తున్న ప్రాంతాన్ని ఇక నుంచి పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌గా పిలవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కాశ్మీర్ సమస్యను అత్యంత ప్రాధాన్యత గల అంశంగా మోడీ ప్రభుత్వం గుర్తించినట్లయింది. ఒక ప్రాంతాన్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని మాత్రమే పిలవడం వల్ల ఇతర ప్రాంతాలకు అన్యాయం జరుగుతోందని ఎన్డీయే ప్రభుత్వంఅభిప్రాయపడుతోంది.

టీఆర్ఎస్, కాంగ్రెస్ వల్లే హైదరాబాద్ నాశనం: బాబు

      హైదరాబాద్ నగరాన్ని టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు భ్రష్టు పట్టించాయని తెలుగుదేశం అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆరోపించారు. తెలంగాణలో అభివ‌ృద్ధి తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందని, తెలుగుదేశం హయాంలోనే తెలంగాణ మిగులు బడ్జెట్‌లోకి వచ్చిందని ఆయన చెప్పారు. ఈ ఘనత అంతా తెలుగుదేశం పార్టీకే చెందుతుందని, ఈ అభివృద్ధిలో టీఆర్ఎస్, కాంగ్రెస్ సహకారంగానీ, తోడ్పాటు గానీ లేదని చంద్రబాబు అన్నారు. ఈ రెండు పార్టీలు హైదరాబాద్‌ని ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేశాయని ఆయన విమర్శించారు. తెలంగాణ సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశామని, బాబ్లిపై మహారాష్ట్రానికి వెళ్లి పోరాటం చేశామని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ కోసం పరాయి రాష్ట్రంలో జైలులో ఉన్నది తెలుగుదేశం నేతలేనని ఆయన అన్నారు. తెలంగాణ టిడిపి విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎన్నడూ రాజీ పడలేదని ఆయన అన్నారు. తాను ఆంధ్రప్రదేశ్‌‌కి ముఖ్యమంత్రిగా వున్నప్పటికీ తెలంగాణ మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తానని, వచ్చే ఎన్నికలలో తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు చెప్పారు.

ముష్టోళ్ళమీద హైకోర్టులో కేసు

      తెలంగాణలో ముష్టోళ్ళు ఏడా 140 కోట్ల రూపాయల లావదేవీలు జరుగుతున్నాయని వెల్లడిస్తూ, ఈ ముష్టి వ్యవస్థను రూపు మాపాలని కోరుతూ హైకోర్టులో ఒక న్యాయవాది ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. హైదరాబాదులోనే దాదాపు 11 వేల మంది యాచకులున్నారని సదరు న్యాయవాది డి.వి.రావు తన పిల్‌లో చెప్పారు. తెలంగాణలో చాలా ఇబ్బందికరంగా మారిన భిక్షగాళ్ల వ్యవస్థను రూపమాపాలని ఆయన తన పిటిషన్’లో కోరారు. బిచ్చగాళ్ళని పునరావాస కేంద్రాల్లో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన హైకోర్టును కోరారు. హోంశాఖ కార్యదర్శిని, మహిళా శిశు సంక్షేమ శాఖను ఆయన తన పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చారు.

అవి బూటకపు ఎన్‌కౌంటర్లే: సీబీఐ కోర్టు

      పోలీసులు ఎప్పడైనా ఎన్‌కౌంటర్‌ చేశారంటే, అది తప్పకుండా బూటకపు ఎన్‌కౌంటరే అని నోట్లో వేలేసుకునే అమాయకులు కూడా చెబుతూ వుంటారు. పోలీసుల ఎన్ కౌంటర్లు జనం దృష్టిలో అంత చీపైపోయాయి. ఈ విషయాన్నే ఢిల్లీ సీబీఐ కోర్టు కూడా అంటోంది. ఐదేళ్ల క్రితం జరిగిన ఓ బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో ఢిల్లీ సీబీఐ కోర్టు 17 మంది పోలీసులను దోషులుగా నిర్ధారించింది. 18 మంది భద్రతా సిబ్బందిపై ఆరోపణలు రాగా ఒకరు మాత్రం కేసు నుంచి బయటపడ్డారు. నిందితులకు సీబీఐ కోర్టు శనివారం శిక్షలను ఖరారు చేసే అవకాశముంది. ఈ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే, 2009లో ఉత్తరాఖండ్లోని డూన్లో రణ్బీర్ అనే ఎంబీఏ విద్యార్థిని ఎన్కౌంటర్ పేరుతో పోలీసులు కాల్చిచంపారు. అమాయకుడైన రణ్బీర్‌ని అన్యాయంగాచంపడంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ బూటకపు ఎన్కౌంటర్పై బాధితుడి బంధువులు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం 17 మందిపై హత్య, కిడ్నాప్, కుట్ర అభియోగాలు రుజువయ్యాయి. ఈ సందర్భంగా రణ్బీర్ తండ్రి మాట్లాడుతూ.. కోర్టు తీర్పు వల్ల తన కొడుకు తిరిగిరాడని, ఆ నష్టం పూడ్చలేనిదని అన్నారు.అయితే నిందితులను కఠినంగా శిక్షించడం వల్ల ఇలాంటి నేరాలు జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయని చెప్పారు.

వైకాపా ఎమ్మెల్యేని లోపలేశారు

      ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు చంద్రబాబు మీద మాటల దాడి చేయడానికి, ఆయన చేసే ప్రతి పనిలో తప్పులు వెతికి నానా యాగీ చేయడానికి సిద్ధంగా వున్నారు. ఎక్కడ చిన్న మేటర్ దొరికినా కోతి పుండును బ్రహ్మరాక్షసి చేయడానికి రెడీగా వున్నారు. దీనిలో భాగంగా గుంటూరులో ఒక ఇష్యూ లేవదీశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం సందర్భంగా గుంటూరు బస్టాండ్ సెంటర్లోని దుకాణాలు అడ్డొచ్చే అవకాశం ఉందంటూ వాటిని తొలగించేందుకు స్థానిక అధికారులు పోలీసుల సహకారంతో ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే షేక్ మహ్మద్ ముస్తఫా తన అనుచరులతో అక్కడకు చేరుకుని వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు, ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దాంతో ఎమ్మెల్యేను గుంటూరు పోలీసులు అరెస్టు చేసి లోపలేశారు.

స్మితా సబర్వాల్: కలిసొచ్చిన కన్నీరు

      మెదక్ జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్‌కి కన్నీరు కలిసొచ్చింది. మొన్నీమధ్య తెలంగాణ ఆవిర్భావం రోజున మెదక్ జిల్లాలో స్మితా సబర్వాల్ ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆకార్యక్రమానికి హాజరైన ఒక అమరవీరుడి తల్లికి తన కొడుకు గుర్తొచ్చి భోరున విలపించారు. అది చూసిన సున్నిత మనస్కురాలైన స్మితా సబర్వాల్ కన్నీరు పెట్టుకున్నారు. ఆ విషయం మీడియాలో వచ్చింది. అది చూసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్మితా సబర్వాల్ చాలా మంచి కలెక్టర్ అని ప్రశంసించారు. ఆ ప్రశంసలతో ఆగకుండా తన అదనపు కార్యదర్శిగా ప్రమోట్ కూడా చేసేశారు. ఆ విధంగా గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన స్మితా సబర్వాల్ శుక్రవారం కేసీఆర్ను కలిశారు. అనంతరం సీఎం అదనపు కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. పరిపాలనా వ్యవహారాల్లో స్మితా సబర్వాల్ ప్రతిభావంతురాలన్న పేరు వుంది. అలాగే ఆమెకు రెండుసార్లు ఉత్తమ కలెక్టర్‌గా అవార్డులు కూడా వచ్చాయి.

క్రమశిక్షణ లేని కానిస్టేబుళ్ళకి పోస్టింగ్

      సీమాంధ్రుల మీద తన కడుపులో వున్న విషాన్ని కేసీఆర్ సందర్భం వచ్చినప్పుడల్లా కక్కుతూ వుంటారు. ఆయన తెలంగాణకు ముఖ్యమంత్రి అయినా తర్వాత కూడా అలా విషం కక్కడం మానలేదు. సీమాంధ్రులను గిల్లే పనులను ఆపలేదు. హైదరాబాద్‌లో ఏపీ ఎన్జీవోల సభలు జరిగిన సమయంలో ఆ సభల్లో దూరిపోయి తెలంగాణ నినాదాలు చేస్తూ క్రమశిక్షణ తప్పిన ఇద్దరు కానిస్టేబుళ్ళను కేసీఆర్ అక్కున చేర్చుకున్నారు. వారిద్దరి మీద విధించిన సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ అధినేత హోదాలో ప్రకటించారు. ఆ ఇద్దరు కానిస్టేబుళ్ళ పేర్లు శ్రీనివాస్, శ్రీశైలం. కేసీఆర్ వారిద్దరి మీద సస్పెన్షన్ ఎత్తివేయడంతో ఆగకుండా ఆగకుండా వారిద్దరిని సచివాలయంలోనే పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశించారు. రైతుల రుణ మాఫీకి సంబంధించిన అంశంలో తెలంగాణ రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న కేసీఆర్ జనం దృష్టిని అటువైపు నుంచి మళ్ళించడానికే ఈ ఇద్దరు కానిస్టేబుల్స్ మీద సస్పెన్షన్ ఎత్తివేసి, సచివాలయంలో పోస్టింగ్ ఇచ్చారని పరిశీలకులు భావిస్తున్నారు. క్రమశిక్షణ లేకుండా వ్యవహరించిన ఈ ఇద్దరు కానిస్టేబుల్స్ మీద సస్పెన్షన్ వేటు ఎత్తేయడం ఒక తప్పయితే, ఇలాంటి క్రమశిక్షణ లేనివాళ్ళని డైరెక్టుగా సచివాలయంలోకి తీసుకురావడం మరో పెద్ద తప్పు అని పరిశీలకులు అంటున్నారు.

అత్యాచారాలకి ఐటమ్ సాంగ్‌లకి మంత్రిగారి లింక్

      ఉత్తర ప్రదేశ్‌లో మహిళల మీద అత్యాచారాల పరంపర కొనసాగుతూ వుండటం, దీని మీద దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతూ వుంటడం, అత్యాచారాల విషయంలో సానుభూతి ప్రకటించాల్సిన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆయన పార్టీ అయిన సమాజ్ వాది పార్టీ నాయకులు విచిత్రమైన వాదనలు చేస్తూ, అత్యాచారాలకు గురవుతున్న వారి పట్ల వెటకారంగా మాట్లాడుతూ టైమ్ పాస్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి తోడుగా మరో వ్యక్తి కూడా జత చేరాడు. ఆ వ్యక్తి ఉత్తర ప్రదేశ్‌కి చెందిన వ్యక్తి కాదు. మధ్యప్రదేశ్ హోం మంత్రి బాబూలాల్ గౌర్.   అత్యాచారాల మీద ఆయన మాట్లాడుతూ, ఏ ప్రభుత్వమూ అత్యాచారాల్ని నిరోధించలేదని, ఆ ఘటన జరిగిన తరువాతే చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుందంటూ వెరైటీ కామెంట్లు చేశారు. అంతేకాకుండా, రేప్ అనేది కొన్నిసార్లు ఒప్పవుంది, కొన్నిసార్లు తప్పువుతుదంటూ వివాదస్పద వాఖ్యలు చేశారు. అత్యాచారం అనేది ఒక సామాజిక నేరమని.. అది స్త్రీ, పురుషులపై ఆధారపడి ఉంటుందన్నారు. పురుషుడు మానసిక సమతుల్యం తప్పినప్పుడే అత్యారానికి పాల్పడతాడని ఆయన ఓ పెద్ద మానసిక శాస్త్రవేత్త తరహాలో పోజిస్తూ విశ్లేషించారు. దాంతోపాటు మహిళలు కరాటే, జూడో లాంటి స్వీయరక్షణ విద్యలు నేర్చుకోవాలని ఉచిత సలహాయిచ్చారు. సినిమాల్లోని ఐటం నెంబర్ పాటల వల్ల కూడా వతావరణం పాడవుతోందని చెప్పి ఆయన గారు తెగ ఫీలైపోయారు.  సినిమాలు, టీవీల్లోని అంగాంగ ప్రదర్శనలు కూడా అత్యాచారాలకు కారణమవుతున్నాయన్నది సదరు మంత్రిగారు అంటున్నారు. ఇప్పుడు ఈయన చేసిన వ్యాఖ్యల మీద కూడా దేశంలో దుమారం రేగుతోంది.

చెప్పుల్లో గంజాయి.. పేషెంట్ల ఎంజాయ్!

      సర్వ రోగాలు వచ్చి ఆస్పత్రిలో చేరినా కొంతమందికి బుద్ధి రాదు. అలాంటి రోగులు సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో ఫుల్లుగా వున్నారు. రోగాలతో సతమతవుతూ ఇన్ పేషెంట్లుగా వున్నప్పటికీ గంజాయి తాగడం కోసం తంటాలు పడుతూ వుంటారు. అలాంటి రోగులు వున్న సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి ప్రస్తుతం గంజాయి సరఫరాకు అడ్డాగా మారింది. చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి వచ్చే ఖైదీలకు గంజాయి సరఫరా చేసే ఒక వ్యక్తి పోలీసులకు అడ్డంగా దొరికపోయాడు. తాను గంజాయి రవాణా చేస్తూ దొరికిపోకూడదన్న ఉద్దేశంతో సయూమ్ అనే అతగాడు చెప్పుల్లో గంజాయిని పెట్టుకుని ఖైదీలకు అందించేందుకు గాంధీ ఆస్పత్రికి వచ్చాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అతని చెప్పుల్ని చెక్ చేస్తే వాటిలో దాచిన 20 గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అంటే ఇదేనేమో!

తెలంగాణ సంబరాలకు ప్రణబ్, మోడీ?

      తెలంగాణలో అధికారం చేపట్టిన టీఆర్ఎస్ భారీ స్థాయిలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ వేడుకలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ముఖ్య అతిథులుగా ఆహ్వానించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. తెలంగాణ ప్రాంతం పారిశ్రామికంగా మరింత అభివృద్ధి సాధించబోతోందని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్లో రూ.300 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఎల్జేఎస్ సిస్టమ్స్ ముందుకు వచ్చిందని ఆయన వెల్లడించారు. పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్ అనువైన ప్రాంతమని, త్వరలో తెలంగాణ పారిశ్రామిక పాలసీని ప్రకటించబోతున్నామని అప్పుడు తెలంగాణ ప్రాంతంలోకి పెట్టుబడులు వెల్లువలా వచ్చి పడతాయని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో పెట్టుబడులు, ఉపాధి కల్పనపై పూర్తి స్తాయిలో దృష్టి పెడతామని కేటీఆర్ చెప్పారు.

బాలకృష్ణకి మంత్రి పదవి చేదా?

      నందమూరి బాలకృష్ణ మంత్రి పదవిని స్వీకరించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన బాలకృష్ణ అసెంబ్లీకి ఎన్నికైన తొలి ప్రయత్నంలోనే మంత్రి కూడా అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే బాలక‌ృష్ణ మంత్రివర్గంలో చేరదలుచుకోవడం లేదన్న వార్తలు వస్తున్నాయి. ఎవరైనా మంత్రిపదవి కావాలని అనుకుంటారు. ఆయన మంత్రి పదవి వద్దంటున్నారంటే ఆయనకి మంత్రి పదవి చేదా అనే అనుమానాలు అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం బాలక‌‌ృష్ణ మాట్లాడుతూ, తనకు మంత్రి పదవి అనేది పార్టీ ఇష్టం ప్రకారమే జరుగుతుందని వ్యాఖ్యానించారు.అంతకుముందు కూడా పార్టీ ఏ బాధ్యత అప్పగించినా తీసుకుంటానని అన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. బాలకృష్ణ మంత్రి పదవిని ఆశిస్తున్నట్టు ఎప్పుడూ చెప్పిన దాఖాలు లేవు. అయితే టీడీపీ వర్గాలు మాత్రం బాలకృష్ణ ఇప్పుడు మంత్రి పదవి వద్దంటున్నారని ప్రచారం చేస్తున్నారు. తన తాజా సినిమా ‘లెజెండ్’ హిట్ అవడం వల్ల కూడా ఆయన మరికొంత కాలం సినీ జీవితం కొనసాగించాలని కోరుకుంటున్నారని అందువల్లే మంత్రి పదవి కోరుకోవడం లేదని పార్టీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అయితే ఏ విషయం 8వ తారీఖుకి తేలుతుంది.