హరీష్ రావుది దింపుడు కళ్లెం ఆశేనా?!
posted on Aug 31, 2025 @ 9:57AM
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు, అవకతవకల వ్యవహారంలో బీఆర్ఎస్ గాభరా పడుతోంది. భయపడుతోంది. మాజీ మంత్రి హరీష్ రావు కంగారు పడుతున్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బీఆర్ఎస్ ను మరీ ముఖ్యంగా ఆ పార్టీ అగ్రనేతలు కేసీఆర్, హరీష్ రావులను బెంబేలెత్తిస్తోంది. దీంతో కాళేశ్వరం రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా ఆదేశించాలని కోరుతూ హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. ఒక వేళ ప్రవేశపెట్టినా.. ఎలాంటి చర్యా తీసుకోవద్దనైనా ఆదేశించాలని ఆ పిటిషన్ లో కోరారు.
సరే కోర్టు నిర్ణయం ఏమిటన్నది పక్కన పెడితే.. అసలు కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేపెట్టి చర్చిస్తామన్న రేవంత్ సర్కార్ నిర్ణయంపై హరీష్ రావు, కేసీఆర్, బీఆర్ఎస్ లు ఎందుకు అంత గాభరాపడిపోతున్నారు? హరీష్ రావు శనివారం (ఆగస్టు 30) హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం ఆదివారం (ఆగస్టు 31) కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుంది. శనివారం సాయంత్రం వరకూ హరీష్ రావు పిటిషన్ కోర్టులో విచారణకు రాలేదు. అదలా ఉంచితే.. కళేశ్వరం కమిషన్ నివేదికను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలంటూ గతంలోనే హరీష్ రావు, కేసీఆర్ లు పిటిషన్లు వేశారు. కానీ కోర్టు వాటిని నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టి సమగ్రంగా చర్చించిన తదుపరి మాత్రమే చర్యలు తీసుకుంటామని అప్పట్లో ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీంతో నివేదికపై స్టే ఇవ్వడానికి అప్పట్లో కోర్టు నిరాకరించింది.
అయినా హరీష్ రావు కాళేశ్వరం రిపోర్టునున అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా ఆదేశాలివ్వాలంటూ మరో సారి కోర్టును ఆశ్రయించారు. . ఆయన గాభరా ఏమిటంటే.. ఒక సారి కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెడితే.. ఆ తరువాత ఆ నివేదిక చట్టబద్ధతపై కోర్టులు నిర్ణయం తీసుకోజాలవు. అంత మాత్రాన అంతా అయిపోయినట్లు కాదు... ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలంటే మాత్రం చట్టబద్ధంగానే తీసుకోవాలి. అంటే చర్యల అంశం కోర్టు పరిధిలోకి వస్తుంది.
అయినా కూడా అసెంబ్లీలో నివేదిక ప్రవేశపెడతారంటేనే హరీష్ కంగారు పడుతున్నారు. అంటే కాళేశ్వరంలో అవకతవకలు, అక్రమాలు, అవినీతి జరిగిందని పరోక్షంగా అంగీకరించేస్తున్నారా అన్నచర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. అందుకే కాళేశ్వరం కమిషన్ నివదిక అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకోవాలంటూ పదే పదే కోర్టును ఆశ్రయిస్తున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.