అపర భగీరథుడు చంద్రబాబు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన దార్శనికుడు!
posted on Aug 30, 2025 @ 4:58PM
గంగానదిని భూమికి తీసుకువచ్చిన పౌరాణిక రాజు భగీరథుడైతే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంకు ఆధునిక భగీరథుడిగా మారారు. రాయలసీమలోని తన సొంత నియోజకవర్గం కుప్పానికి కృష్ణా జలాలను తీసుకురావడం ద్వారా ముఖ్యమంత్రి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. గతంలో కృష్ణాజలాలు అన్నది ఎన్నటికీ నెరవేరని కలలా అనిపించినది.. ఇప్పడు వాస్తవంగా మారింది. ఇది చంద్రబాబు దార్శనికతకు, ఆయన పట్టుదలకు, అనుకున్నది సాధించేందుకు ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగే తీరుకు కుప్పం చేరుకున్న కృష్ణాజలాలే ప్రత్యక్ష, సజీవ నిదర్శనంగా చెప్పవచ్చు.
ఈ సందర్భంగా చంద్రబాబు కృష్ణా జలాల్లో పడవ ప్రయాణం చేస్తున్న దృశ్యాలు తెగ వైరల్ అయ్యాయి. కృష్ణా జలాలు కుప్పం చేరుకున్న క్షణాలు స్థానికులను ఉద్విగ్నతకు గురి చేశాయి. శ్రీశైలం నుండి హంద్రీ-నీవా కాలువ ద్వారా కుప్పంకు చేరుకున్నాయి. కేప్పం చేరుకున్న కృష్ణా జలాలను పూజలు చేసి, జలహారతి ఇచ్చిన అనంతరం సీఎం మాట్లాడుతూ.. రాయలసీమకు నీటిని తరలించడం అన్నది తెలుగుదేశం వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు లక్ష్యం, కల అని చెప్పారు.
శ్రీకృష్ణదేవరాయలు ఏలిన రాయలసీమ ఒకప్పుడు రత్నాల సీమ.. అయితే ఇప్పుడది రాళ్ల సీమగా, కరవు సీమగా మారిపోయింది. ఈ పరిస్థితి మార్చాలన్న చంద్రబాబు కృతనిశ్చయమే ఇప్పుడు ఈ జలసిరి. 1999లో చంద్రబాబు హంద్రీనీవాకు పునాది వేశారు. 2025 నాటికి కృష్ణ జలాలను తీసుకురావగలిగారు. భద్రతా సమస్యలు ఉన్నప్పటికీ, ఈ విజయాన్ని, ఈ ఆనందాన్ని అందరితో పంచుకోవాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు కృష్ణా జలాలలో పడవ ప్రయాణం చేశారు.