చిన్నబాబు నాడు చెప్పారు.. నేడు జరిగింది!
posted on Aug 31, 2025 @ 10:26AM
మాట ఇస్తే నిలబెట్టుకోవాలి. పని మొదలు పెడితే పూర్తి చేయాలి. ఈ విషయంలో రెండో ఆలోచనకే తావుండకూడదు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పదే పదే చెప్పే విశ్వసనీయత అంటే అదీ. కానీ జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఎన్నడూ జనం విశ్వాసం పొందేలా చెప్పింది చేసి చూపించిన పాపాన పోలేదు. నవరత్నాలంటూ ఆర్భాటంగా ప్రకటించిన పథకాల అమలు కూడా అరకొరగానే సాగింది. బటన్ నొక్కి సంక్షేమ సొమ్ము లబ్ధిదారులకు పందేరం చేశామంటూ ఘనంగా చాటుకున్నారే తప్ప.. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ఒక్క అడుగు కూడా వేయలేదు. ఫలితమే గత ఏడాది జరిగిన ఎన్నికలలో వైసీపీకి చరిత్రలో మిగిలిపోయేటంతటి ఘోర పరాజయం ఎదురైంది.
అయితే మాట ఇస్తే నిలబెట్టుకుంటాం. అంటూ తన యువగళం పాదయాత్ర సందర్భంగా ఉద్ఘాటించిన తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్.. అదే చేస్తున్నారు. పాదయాత్ర సందర్బంగా రాయలసీమ జిల్లాలకు హంద్రీ నీవాతో నీళ్ళు అందిస్తామని నారా లోకేష్ చెప్పారు. చెప్పడమే కాదు.. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గుట్టూరు గ్రామంలో ఈ హామీని ఓ శిలాఫలకంపై చెక్కి మరీ ఆవిష్కరించారు.
గోరంట్ల, మడకశిర పరిధిలోని గ్రామాలకు తాగఃగునీరు, సాగునీరు అందించి నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని లిఖితపూర్వకంగా ఆ శిలాఫలకంపై చెక్కించారు. ఇప్పుడు అది సాకారమైంది. ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు శనివారం (ఆగస్టు 30) కుప్పంలో కృష్ణమ్మకి గంగపూజ చేశారు. ఈ సందర్భంగా జనం నాడు లోకేష్ ఆవిష్కరించిన శిలా ఫలకం చూపి మరీ ఆయన తన మాట నిలబెట్టుకున్నారనీ, సాగు, తాగు నీరందించారని ఘనంగా చెప్పుకుంటున్నారు. పండుగ చేసుకుం టున్నారు.
ఒక పక్క వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలు అమలుచేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారంటూ ఆరోపణలూ, విమర్శలూ గుప్పిస్తుంటే.. మరో పక్క నారా చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఒక్కో హామీని అమలు చేస్తూ ముందుకు సాగుతోంది. ఇప్పుడు కృష్ణా జలాలను సీమకు అందించి కుప్పంలో గంగపూజ చేసి విశ్వసనీయత అంటే ఏమిటో చంద్రబాబు, లోకేష్ ను చాటారు. దీంతో వైసీపీ గళం మూతపడింది. కుప్పంకు కృష్ణాజలాలకు సంబంధించి వైసీపీ ఒక్కటంటే ఒక్క ముక్క మాట్లాడటం లేదు. మంచిని చూడటానికి వారి నేత్రాలు, పొగడడానికి వారి నోళ్లు సహకరిస్తున్నట్లు లేదంటూ వైసీపీ నేతలను నెటిజనులు తెగ ట్రోల్ చేస్తున్నారు.