కమల్ హాసన్ కంటే అల్లు అర్జునే నయం: పన్నీర్ సెల్వం
చెన్నైలో వరద పరిస్థితి చూసి తీవ్రంగా చలించిపోయిన నటుడు కమల్ హాసన్, “నా సురక్షితమయిన ఇంట్లో కూర్చొని మా ఇంటి కిటికీలో నుంచి నీళ్ళలో మునిగిపోతున్న చెన్నై నగరాన్ని, అందులో ప్రజలు పడుతున్న ఇక్కట్లను చూస్తుంటే నాకు చాలా సిగ్గుగా అనిపిస్తోంది. ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. అయినా ప్రభుత్వం ఏమి చేస్తోందో తెలియడం లేదు. మొత్తం వ్యవస్థ అంతా కుప్పకూలిపోయింది. ప్రజలు కోట్లాది రూపాయలు పన్నులు చెల్లిస్తున్నా కూడా ఇంకా ఇటువంటి సందర్భాలలో మావంటి వారు విరాళాలు అందజేయవలసి వస్తోందంటే, ప్రజలు కట్టిన డబ్బు అంతా ఎక్కడికి వెళ్లిపోతోందో...దేనికి ఖర్చు పెడుతున్నారో అర్ధం కావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కార్పోరేట్ ప్రాజెక్టులపై రూ.4,000 కోట్లు ఖర్చు పెడుతోంది. వాటి వలన ప్రజలకు ప్రయోజనం కలగనపుడు ఆ డబ్బుని నేరుగా ప్రజలకే పంచిపెట్టేస్తే అందరూ లక్షాధికారులు అయ్యేవారు కదా?” అని అన్నారు.
కమల్ హసన్ ఆవేదన ప్రజలందరికీ సహజమయిన ప్రతిక్రియగా మాత్రమే చూసారు. కానీ అధికార అన్నాడీ.ఎం.కె. ప్రభుత్వానికి ఆయన మాటలు తమను అవమానిస్తున్నట్లు, అనుమానిస్తున్నట్లుగా అనిపించాయి. ముఖ్యమంత్రి జయలలిత నిప్పులో దూకేయమంటే దూకేసే ఆమె వీర భక్తుడు, ప్రస్తుత రాష్ట్ర ఆర్ధిక మంత్రి పన్నీర్ సెల్వం కమల్ హాసన్ పై మండి పడ్డారు.
“మేమేమి ఆయనని విరాళం ఇమ్మని అడగలేదు. చెన్నై పరిస్థితిని చూసి ఇరుగు పొరుగు రాష్ట్రాలు, అనేకమంది ప్రముఖులు, కేంద్రప్రభుత్వం స్వచ్చందంగా విరాళాలు అందజేస్తున్నారు. పొరుగు రాష్ట్రంలోని తెలుగు సినీ పరిశ్రమకి చెందిన నటుడు అల్లు అర్జున్ చెన్నై పరిస్థితి చూసి చలించిపోయి రూ.25 లక్షలు విరాళం ప్రకటించారు. తెలుగు చిత్ర పరిశ్రమకి చెందిన చాలా మంది స్వచ్చందంగా విరాళాలు అందజేస్తున్నారు. కానీ రాష్ట్రానికి చెందిన కమల్ హాసన్ని ఎవరూ విరాళం అడగకపోయినా అనవసరమయిన మాటలు చాలా మాట్లాడారు. ప్రజలు కట్టిన డబ్బు అంతా ఎక్కడికి పోతోందో...అని ఆయన అనుమానం వ్యక్తం చేయడం మా అమ్మ (ముఖ్యమంత్రి జయలలిత)ని అవమానించడమే. 2015-16 ఆర్ధిక సంవత్సరం బడ్జెటులో ఇటువంటి ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు కేటాయించిన రూ.679 కోట్లు ఇప్పుడు వినియోగిస్తున్నాము. అయినా సరిపోవడం లేదు. కేంద్రప్రభుత్వం కూడా సహాయం అందిస్తోంది."
"ఎన్నడూ ఊహించని విధంగా 40 సెంటీమీటర్ల వర్షం కురిస్తే, ప్రకృతి ముందు ఎవరయినా తలవంచవలసిందే. ఇదేమీ సినిమా కాదు ఎంత పెద్ద ప్రకృతి విపత్తునయినా ఒక పాటలో పరిష్కారం చేసేయడానికి. సినిమాలలో జరిగినట్లు ప్రకృతి విపత్తులు మన నియంత్రణలో ఉండవనే సంగతి ఆయన తెలుసుకొంటే బాగుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తన శాయశక్తులా ప్రజలను, ఆస్తులను కాపాడేందుకు ప్రయత్నిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 40,000 మంది ఉద్యోగులు రేయింబవళ్ళు కష్టపడుతున్నారు. కొన్ని రోజుల వ్యవధిలోనే వరుసగా భారీ వర్షాలు కురిసాయి. సుమారు 12 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాము.55 లక్షల ఆహార పొట్లాలు అందజేసాము. ఇంకా ముమ్మరంగా సహాయ చర్యలు చేస్తూనే ఉన్నాము. వేలాదిమంది స్వచ్చంద సేవా కార్యకర్తలు, సైనికులు, వాయుసేన, నావికాదళానికి చెందిన బృందాలు సహాయ చర్యలలో పాల్గొంటున్నారు. ఇవన్నీ కమల్ హాసన్ కి తన ఇంటి కిటికీలో నుండి చూస్తే కనిపించేవి కావు. ఆయన ఇల్లు వదిలి బయటకు వచ్చి చూస్తే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో, ప్రభుత్వం ఎంత కష్టపడుతోందో అర్ధమవుతుంది."
"ఆయన నటించిన విశ్వరూపం సినిమా విడుదలకి అవరోధాలు ఏర్పడినపుడు ఆయన దేశం విడిచి వెళ్ళిపోతానని బెదిరించారు. కానీ అప్పుడు అమ్మ చొరవ చూపడం వలననే ఆ సమస్య పరిష్కారం అయ్యి సినిమా రిలీజ్ అయిన సంగతి కమల్ హాసన్ మరిచిపోయినట్లున్నారు. అందుకు అప్పుడు ఆయన అమ్మకి కనీసం కృతజ్ఞత కూడా తెలపాలనుకోలేదు. కానీ ఇప్పుడు అమ్మను విమర్శిస్తున్నారు. తెలిసీ తెలియకుండా ఈవిధంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదు,” అని పన్నీర్ సెల్వం అన్నారు.