జీహెచ్ఎంసీ ఎన్నికలు.. వైసీపీతో టీఆర్ఎస్ పొత్తు..?

తెలంగాణ అధికార పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికలను వచ్చే ఏడాది జనవరిలో నిర్వహిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి అప్పుడే పార్టీలు ఎవరి వ్యూహాల్లో వారు ఉన్నారు. ఇక టీఆర్ఎస్ అయితే ఇప్పటికే హైదరాబాద్లో తాము చేపట్టిన పథకాలతో భారీ ఫ్లేక్సీలు ఏర్పాటు చేశారు కూడా. అయితే ఈ గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్ర‌భావం చాలా త‌క్కువే అని చెప్పొచ్చు. దానికి తోడు టీఆర్ఎస్ పై వస్తున్న ఆరోపణలు ఒకవైపు.. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ ను కూడా మార్చివేశారు. కానీ గ్రేటర్ లో టీడీపీ, బీజేపీ, ఓల్డ్ సిటీలో ఎంఐఎం పార్టీలు కాస్త బలంగానే ఉన్నాయి. ఇక వైసీపీ పరిస్థితి కూడా పర్వాలేదు. అయితే టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఏదో పైకి గెలుపు తమదే అని చెబుతున్నా ఆపార్టీకి అంత సీన్ లేదని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కానీ టీఆర్ఎస్ కు కూడా తమ పరిస్థితి తెలిసి ఎంఐఎం, వైకాపాతో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. మరి వైకాపా.. టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటుందో లేదో చూడాలి. ఒకవేళ వైకాపా తో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే వైకాపా పార్టీ తన బలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ పొత్తు పెట్టుకోకపోతే వైకాపా ఎన్ని సీట్లు గెలుచుకుంటుందో చూడాలి. మొత్తానికి ఏది తెలియాలన్నా ఎన్నికల వరకూ ఆగాల్సిందే.

ఒక్కసారే 45 మంది కాంగ్రెస్ అభ్యర్థులపై సస్పెండ్ వేటు..

బీహర్ ఎన్నికల్లో మహాకూటమిగా ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేసి ఊహించని మెజార్టీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన ఈఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాత్రం కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఎందుకంటే ఎన్నికల్లో పార్టీ టిక్కెట్లిచ్చిన కొంతమంది కాంగ్రెస్ నేతలు రెబల్స్ గా పోటీ చేశారు. పార్టీ పెద్దలు ఎంతగా బుజ్జగించినా వినకుండా పలుచోట్ల రెబెల్స్ ఓట్లను చీల్చి కాంగ్రెస్ అధికారిక అభ్యర్థుల గెలుపును అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రెబల్స్ గా బరిలో దిగిన కాంగ్రెస్ నేతలపై ఇప్పుడు వేటు వేసింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 45 మంది తిరుగుబాటు నేతలను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండు చేస్తూ తీసుకున్న నిర్ణయం తీసుకుంది. మాజీ ఎమ్మెల్యే జగన్నాథ్ ప్రసాద్ రాయ్ నేతృత్వంలో సమావేశమైన పార్టీ డిసిప్లినరీ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

అమీర్ కు షారుక్ మద్దతు.. తప్పుగా చిత్రీకరించారు..!

అమీర్ ఖాన్ దేశ అసహనంపై వ్యాఖ్యలు చేసి ఊహించని విధంగా విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అమీర్ వ్యాఖ్యలపై ఎవరికి తోచిన రీతిలో వారు స్పందింస్తున్నారు. అయితే అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలకు బాలీవుడ్ లోనే కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా.. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ అమీర్ కు మద్దతు పలికారు. అసహనంపై ఆయన ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారు అంటూ మద్దతు పలికారు. దేశభక్తి అనేది మనసులో ఉంచుకోవాల్సిన భావన అని.. దేశానికి మంచి జరగాలని ఆలోచించడం.. దేశానికి మంచి చేయడం తప్ప.. దేశభక్తిని ఏ మార్గం ద్వారా నిరూపించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఏ విషయంపైన అయినా తనకు మాట్లాడే హక్కు ఉందని షారుక్ వెల్లడించారు.

మోడీపై లాలు కొడుకు విమర్శ.. బట్టలు ఉతుక్కోవడానికి వచ్చారు

ప్రధాని నరేంద్రమోడీపై విదేశీ పర్యటన నేపథ్యంలో విమర్శలు చేస్తుంటారు. అది అందరికీ తెలిసిన విషయమే.  విదేశీ పర్యటనల ద్వారా మోడీ భారత్ కీర్తి ప్రతిష్ఠల్ని పెద్ద ఎత్తున పెంచుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులకు సంబంధించి ఫ్రాన్స్ లో జరుగుతున్న అంతర్జాతీయ సమావేశానికి హాజరైన ప్రధాని మోడీ.. వాతావరణ మార్పుల విషయంలో అభివృద్ధి చెందిన దేశాల పాప ఫలితమే అన్న వాదనను వారికి వినిపించి ఈ రోజు ఢిల్లీకి చేరుకున్నారు. అయితే మోడీ పర్యటనను ఉద్దేశించి.. ఇప్పుడే రాజకీయాల్లో ఆరంగేట్రం చేసిన లాలు పుత్రరత్నాలు విమర్శించారు. బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ మోడీ పర్యటనను ఉద్దేశించి మాట్లాడుతూ.. విదేశీ పర్యటనలు చేసే మోడీ తన బట్టలను ఉతుకున్నేందుకు ఢిల్లీ వచ్చారని విమర్శించారు. ఏది ఏమైనా నిన్నకాక మొన్న రాజకీయాల్లోకి వచ్చి.. ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయానుభవం ఉన్నంత వయస్సు కూడా లేని వారు ఆయన విదేశీ పర్యటనపై కామెంట్లు చేయడం విచిత్రంగా ఉంది.

ఆరెస్సెస్‌ నేతలపై ఆజం ఖాన్ సంచలన వ్యాఖ్యలు.. ఆ నేతలంతా స్వలింగ సంపర్కులు

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఉత్తర ప్రదేశ్ మంత్రి ఆజం ఖాన్ తర్వాతే ఎవరైనా.. అప్పుడు దేశంలో బీఫ్ గురించి అలాగే వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ నేతలంతా స్వలింగ సంపర్కులని అందువల్లే వారు పెళ్లి పెటాకులు చేసుకోకుండా కాలం వెళ్లదీస్తున్నారంటూ మండిపడ్డారు. దీంతో అజంఖాన్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి. ఆరెస్సెస్‌ నేతలతో పాటు విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నేతలు అజంఖాన్ చేసిన వ్యాఖ్యలపై భగ్గుమన్నారు. అజంఖాన్ కు పిచ్చిపట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని.. అతనికి మతిస్థిమితంలేదు.. తక్షణం పిచ్చాసుపత్రిలో చేర్పించి తగిన వైద్యం చేయించాలని అంతేకాకుండా, తక్షణం ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.  

ఆ వ్యాఖ్యలు రాజ్‌నాథ్ సింగ్‌ చేయలేదు.. ఔట్‌లుక్‌ సారీ

కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ ఔట్‌లుక్‌లో చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్ సమావేశాల్లో రగడ జరిగింది. 800 ఏళ్ల తర్వాత హిందూ వ్యక్తి ప్రధాని అయ్యారని రాజ్‌నాథ్ సింగ్‌ ఔట్‌లుక్‌లో వ్యాఖ్యానించారని.. సీపీఎం మహ్మద్ సలీం పార్లమెంట్ లో ప్రస్తావించగా.. రాజ్‌నాథ్ సింగ్‌ అనవసరంగా తనపై ఆరోపణలు చేయవద్దని.. అలాంటి వ్యాఖ్యలు నేను చేయలేదని.. తనకు సలీం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో రాజ్‌నాథ్ సింగ్‌, మహ్మద్ సలీం ల మధ్య వివాదం తలెత్తింది. అయితే జరగాల్సిన రచ్చ అంత జరిగిన తరువాత ఔట్‌లుక్‌ ఇప్పుడు స్పందించి ఆ వ్యాఖ్యలు రాజ్‌నాథ్ చేసినట్లుగా పొరపాటుగా ప్రచురించితమయ్యాయని.. నిజానికి అవి దివంగత విశ్వహిందూ పరిషత్ నేత అశోక్ సింఘాల్ చేశారని తెలిపింది. పొరపాటున అశోక్ సింఘాల్ పేరుకు బదులు రాజ్‌నాథ్ సింగ్‌ పేరు పడిందని..తాము చేసిన పొరపాటుకు క్షమించాలని.. అనవసరంగా మావల్ల పార్లమెంట్ లో రగడ జరిగిందని.. దానికి సారీ చెబుతున్నామని ట్వీట్టర్లో పేర్కొంది.

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు.. టీడీపీతో పొత్తుకు కాంగ్రెస్

ఇప్పటికే వరంగల్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇప్పుడు తెలంగాణలో జరగబోయే స్టానిక సంస్థల కోటా ఎన్నికల్లో మాత్రం ఎలాగైనా సీటు సంపాదింటుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే టీఆర్ఎస్ దూకుడికి.. తాము ఒంటరిగా పోరాటం చేస్తే మళ్లీ ఓడిపోతామని భావించి ఈసారి టీడీపీతో కలిసి పోటీ చేయాలని భావిస్తున్నారు నేతలు. అయితే టీ కాంగ్రెస్ నేతల ప్రతిపాదనకు కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పుకోకపోవచ్చని సంకేతాలు వినిపిస్తున్న నేపథ్యంలో.. స్థానికంగా అవసరాలను బట్టి టీడీపీ మద్దతు తీసుకోవాలని టి కాంగ్రెస్ ముఖ్యనేతలు భావిస్తున్నారట. అంతేకాదు టీడీపీ సహకారం తీసుకోకుండా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించే అవకాశం లేదని… కాబట్టి ఎలాగైనా టీడీపీతో ఇచ్చే పుచ్చుకునే ధోరణితోనే నడవాలని టి కాంగ్రెస్ దాదాపుగానే ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. మరి రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే టీడీపీకి ఇవ్వాల్సిన సీట్లు గురించి కూడా కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారట. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ మాత్రం టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. మరి టీడీపీ కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు అంగీకరిస్తుందో లేదో చూడాలి.

పార్టీ ఎందుకు మారాంరా దేవుడా.. నిన్న బొత్స.. నేడు డీఎస్

కాంగ్రస్ ను వీడి వేరే పార్టీలోకి మారిన నేతలకు ఇప్పుడిప్పుడే నిజాలు తెలుస్తున్నట్టుంది. రాష్ట్రం విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీకి రెండు రాష్ట్రాల్లో సరైన ఉనికి లేకపోవడంతో.. ఆపార్టీలో ఉంటే సరైన రాజకీయ భవిష్యత్తు ఉండదని ఆలోచించుకొని చాలామంది సీనియర్ నేతలు కాంగ్రెస్ ను వీడి పలు పార్టీల కండువాలు కప్పుకున్నారు. కానీ ఆపార్టీలోకి చేరినప్పుడు బానే ఉన్న ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే అసలు ఎందుకు పార్టీ మారామా అని ఆలోచించుకునే సంగ్ధిగ్దంలో పడినట్టు తెలుస్తోంది. మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించిన బొత్స సత్యనారాయణ కూడా అనవసరంగా వైకాపాలో చేరి ఇరుక్కుపోయానే అని తన సన్నిహితుల దగ్గర అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. పార్టీలో చేరిన కొత్తలో అంతా తానై హడావుడి చేసిన బొత్సకు ఆ తరువాత నిదానంగా జగన్ వ్యూహాలు అర్ధమయినట్టున్నాయి. కోస్తాలో తన పెత్తనం చూపించాలని అనుకున్న బొత్సకు జగన్ అంత ఛాన్స్ ఇవ్వడం లేదట. తన తరువాత ఏ ఒక్క లీడ‌ర్నీ ఆ.. స్థాయిలోకి రానివ్వ‌డంలేద‌ట దీంతో ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది అన్న పంథాలో.. బొత్స ఏదో అనుకుంటే ఆఖరికి ఇలా జరిగింది. దీంతో అనవసరంగా పార్టీ మారానే అని బాధపడిపోతున్నారట. ఇప్పుడు మరో కాంగ్రెస్ సీనియర్ నేత కూడా సేమ్ ఇలానే ఫీలవుతున్నారట. అది ఎవరో కాదు.. ఉమ్మడి రాష్ట్రానికి రెండు సార్లు పీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్. ఈయన కూడా పార్టీ మారి టీఆర్ఎస్ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ కూడా సీనియర్ నేత అయిన డీఎస్ ను చాలా సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి ఓ కేబినెట్ ర్యాంకుతో కూడిన పదవిని కూడా ఇచ్చారు. దీంతో డీఎస్ కూడా చాలా కుష్ అయ్యారు. కానీ కేసీఆర్ అసలు అంతరార్ధం మాత్రం వేరని డీఎస్ కు చాలా లేట్ గా అర్ధమయి ఇప్పుడు ఫీల్ అవుతున్నారట. తన కూతురు కవితకు నిజామాబాద్ లో సరైన ప్రతిపక్షం లేకుండా చేసేందుకే కేసీఆర్… తనను టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారని… ఆ విషయం అర్ధంకాక తాను అనవసరంగా టీఆర్ఎస్ లోకి వచ్చానని సన్నిహితుల దగ్గర వాపోతున్నారట డీఎస్. అంతేకాదు తను ఎప్పటినుండో కలగంటున్న రాజ్యసభ సీటు గురించి కూడా డీఎస్ టెన్షన్ పడుతున్నారట. ఎందుకంటే తనకు కనుక ఎమ్మెల్సీ గా పోటీ చేసే అవకాశం ఇస్తే తన రాజ్యసభ సీటు ఆశలు ఆవిరైనట్టే అని మదనపడుతున్నారట. మొత్తానికి నేతలకు తమ పార్టీనుండి వేరే పార్టీలోకి వస్తే పరిస్థితి ఎంటని ఇప్పుడిప్పుడే అర్ధమవుతున్నట్టుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి మరో ఇద్దురు రాజకీయ ఉద్దండులు ఆనం బ్రదర్స్ టీడీపీలోకి చేరుతున్నారు. మరి వారికైనా గౌరవప్రధమైన పదవులు దక్కుతాయా.. లేదా? వారు కూడా ఎందుకు పార్టీ మారాంరా దేవుడా అనే పరిస్థితి వస్తుందా?.. ఇవన్నీ తెలియాలంటే కొంత సమయం ఆగాల్సిందే.

రాహుల్ కు సుప్రీంలో రిలీఫ్

రాహుల్ గాంధీ పౌరసత్వంపై వస్తున్న వివాదాలు మనకు తెలిసిందే. రాహుల్ గాంధీ భారతీయుడు కాదని.. అతనికి లండన్ పౌరసత్వం ఉందని పలు ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు అతని పౌరసత్వంపై వెంటనే చర్యలు తీసుకోవాలని అంటూ ప్రముఖ న్యాయవాది ఎం.ఎల్. శర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే అప్పుడు ఈ పిటషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇంత అర్జెంట్ గా విచారించవలసిన అవసరం లేదంటూ తోసిపుచ్చింది. కానీ ఈ వ్యవహారంపై ఇప్పుడు రాహుల్ కు కాస్త ఊరట కలిగినట్టు తెలుస్తోంది. సోమవారం ఈపిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ పిటిషన్ కు అర్హత లేదంటూ కొట్టిపారేసింది. అంతేకాదు ఇలాంటి పిటిషన్లు వేసేప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని కూడా పిటిషనర్ ను సుప్రీంకోర్టు మందలించినట్టు తెలుస్తోంది. మరి ఇప్పుడైనా రాహుల్ పై విమర్శలు చేయకుండా ఆపుతారో? లేదో? చూడాలి.

రేపు తెదేపా తీర్ధం పుచ్చుకోనున్న ఆనం బ్రదర్స్

  మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఆయన సోదరుడు వివేకానంద రెడ్డి బుదవారంనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెదేపాలో చేరబోతున్నారు. వారిలో ఆనం రామనారాయణ రెడ్డి తెదేపాతోనే తన రాజకీయ జీవితం ప్రారంభించారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేసారు. తరువాత కాంగ్రెస్ పార్టీలోకి మారి డా. రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాలలో మంత్రిగా పనిచేసారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ అద్వానంగా తయారవుతుండటంతో ఆ పార్టీ నుండి చాలా మంది నాయకులు వేరే పార్టీలలోకి వెళ్ళిపోయారు. ఇప్పడు ఆనం వారి వంతు వచ్చింది అంతే! కానీ వారి రాకను నెల్లూరు జిల్లా తెదేపా నేతలు నేటికీ తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉన్నారు. కానీ జిల్లాలో పార్టీని బలోపేతం చేసుకోవలసిన అవసరం ఉన్నందున చంద్రబాబు నాయుడు వారినిరువురినీ పార్టీలోకి ఆహ్వానించాలని నిర్ణయించుకొన్నారు. రేపు ఉదయం విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో వారిరువురూ తమ అనుచరులతో కలిసి తెదేపాలో చేరబోతున్నారు.

వీరేశలింగం ఫోటో పెట్టి గురజాడకి నివాళులు అర్పించిన వైకాపా!

  తెలుగు బాషోద్యమానికి నాంది పలికిన మహాకవి గురజాడ అప్పారావు గారి శత వర్ధంతిని నిన్న భాషాభిమానులు అందరూ చాలా ఘనంగా జరుపుకొన్నారు. వైకాపా కూడా జరుపుకొంది. కాకపోతే గురజాడవారి చిత్రానికి బదులు ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులుగారి చిత్రం ప్రచురించి, గురజాడవారికి నివాళులు అర్పించింది. దానిపై స్పందించిన నారా లోకేష్, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై ట్వీట్ బాణాలు సందించారు. “వైకాపా నేతలకు కుంభకోణాలు చేసేవారిని తప్ప వేరెవరినీ గుర్తించలేరు. జగన్!ఈ చిత్రం కందుకూరి వీరేశలింగం గారిది. క్షమించండి గురజాడ గారు!” అని ట్వీట్ చేసారు.

సలీం vs రాజ్‌నాథ్: లోక్‌సభలో గందరగోళం

  లోక్‌సభలో అసహనం అంశంపై చర్చ మొదలైన వెంటనే గందరగోళ వాతావరణం నెలకొంది. సభలో చర్చను మొదలుపెట్టిన సీపీఎం ఎంపీ సలీం చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. 800 సంవత్సరాల తర్వాత ఒక హిందూవు ప్రధాని అయ్యారని రాజ్ నాద్ సింగ్ వ్యాఖ్యానించారని ఆయన చెప్పడంతో ఒక్కసారిగా బీజేపీ నేతలు మండిపడ్డారు. వెంటనే రాజ్ నాద్ సింగ్ కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. అయితే సలీం తనవాదనకు కట్టుబడి మాట్లాడారు.తాను అవుట్ లుక్ పత్రికలో వచ్చిన విషయాన్నే చెబుతున్నానని, ఒకవేళ రాజ్ నాద్ ఆ మాటలు అనకపోతే , ఆ విషయాన్ని అవుట్ లుక్ ఎడిటర్ తో మాట్లాడుకోవాలని సలీం సూచించారు. కాగా.. మహ్మద్ సలీం చేసిన వ్యాఖ్యలకు తాను తీవ్రంగా మనస్తాపం చెందానని, తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదని రాజ్‌నాథ్ సింగ్ తన ప్రసంగంలో చెప్పారు.

తెలంగాణ హోంమంత్రి చంద్రబాబును బెదిరిస్తున్నారా?

  తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్లాన్ పైనే చంద్రబాబు మూడు నెలల తర్వాత  హైదరాబాద్ వచ్చారని, బాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే ఆయనకు ధన్యవాదాలు చెబుతామని అన్నారు. అలాగే ఓటుకు నోటు కేసు పెండింగులోనే వున్నదని, ఏమి చేయాలో తమకు తెలుసునని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన అన్నారు. అలాగే టిఆర్ఎస్ ప్రభుత్వం చట్టం విషయంలో జోక్యం చేసుకోదని చెప్పారు. నాయిని సడన్ ఇలాంటి ప్రకటన ఎందుకు చేశారు? గ్రేటర్ ఎన్నికల కోసం ముందుగానే బాబుని హెచ్చరిస్తున్నారా? అనే దానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి.

కడప జిల్లాలను వణికిస్తున్న గుంతలు

కడప జిల్లాలోని పలు గ్రామాలలో గత కొద్ది రోజులుగా భూమి కుంగి పెద్ద పెద్ద గుంతలు పడడంతో ఆ గ్రామాలలోని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురి అవుతున్నారు. అదేంటి గుంతలు పడితే భయపడాల్సిన అవసరం ఏముంది అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు సమస్య..ఈ గుంతలు మాములు స్థాయిలో పడడటం లేదు. ఒక్కో గుంత ముప్పై నుంచి యాభై అడుగుల లోతు.. 20 నుంచి 25 అడుగుల వెడల్పు లో ఉండటం విశేషం. అయితే లేటెస్ట్ గా ఆదివారం చింతకొమ్మ దిన్నె మండలంలోని గూడవాడ్ల పల్లె.. బుగ్గలపల్లెల్లో ఇలాంటివే మూడు గోతులు ఏర్పడ్డాయి. దీంతో ఆ పల్లెలలోని జనాలు ఎందుకు ఇలా జరగుతుందో తెలియక భయపడుతున్నారు. అయితే భూమిలో సడన్ గా ఈ మార్పులు ఎందుకు వచ్చాయి? ఇంత పెద్ద ఎత్తున గోతులు పడటానికి కారణం ఏమిటి? అనేది అధికారులకు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. అయితే ముందుముందు ఏం జరగబోతుందోనని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురి అవుతున్నారు.