ప్రధాని నరేంద్ర మోడిపై ఉగ్రవాదుల గురి?
posted on Dec 7, 2015 8:57AM
దేశంలో మెట్రో నగరాల మీద, ప్రముఖ పుణ్యక్షేత్రాల మీద, ముఖ్యంగా డిల్లీలో రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రి వంటి ప్రముఖులు నివసించే భవనాల మీద ఉగ్రవాదులు దాడులు చేయవచ్చని నిఘా వర్గాలు గత కొంత కాలంగా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఉగ్రవాదులు అత్యంత పటిష్టమయిన భద్రత కలిగిన ప్రధాని నరేంద్ర మోడినే హత్య చేసేందుకు పధకాలు రచించినట్లు నిఘా వర్గాలు కనిపెట్టాయి. అందుకోసంపాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కర్ ఉగ్రవాద సంస్థకు చెందిన నలుగురు ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం గుండా భారత్ లోకి ప్రవేశించగా వారిలో ఇద్దరినీ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ అధికారులు అరెస్ట్ చేశారు. వారు ఇచ్చిన ఆధారాలతో మిగిలిన ఇద్దరి కోసం వెతుకుతున్నారు. వారిచ్చిన సమాచారం ప్రకారం లష్కర్ ఉగ్రవాదులు రెండు ప్రణాళికలు సిద్దం చేసుకొన్నారు.
వాటిలో మొదటిది ప్రధాని నరేంద్ర మోడి బహిరంగ సభలో పాల్గొన్నప్పుడు ఆయనపై నేరుగా ఆత్మాహుతి దాడికి పాల్పడటం. ఒకవేళ అది విఫలమయినట్లయితే సభలో గ్రెనేడ్లు విసరడం ద్వారా భారీ ప్రాణ నష్టం కలిగించడం. అలాగే రెండవ పధకంలో డిల్లీలో ప్రముఖులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడం. ఈ రెండు పధకాలలో కూడా ముంబై కంటే చాలా తీవ్రంగా ప్రజలలో భయోత్పాతం సృష్టించే విధంగా ఉండాలని లష్కర్ ఉగ్రవాదులు పధకం పన్నారు. ఈ కుట్రలను అమలుచేసే బాధ్యత అబూ దుజన్ అనే ఉగ్రవాదికి అప్పగించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. జమ్మూలో లష్కర్ ఉగ్రవాది షబ్బీర్ అహ్మద్ ని, అతనికి ఆశ్రయం కల్పించిన అమీర్ ఆలం గుజ్జర్ అనే వ్యక్తిని స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ అధికారులు అరెస్ట్ చేసి వారి ద్వారా మిగిలినవారి సమాచారం తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు.