తమను కవర్ చేసుకోవడానికి లోకేశ్ ను బుక్ చేస్తున్నారా?
posted on Dec 5, 2015 @ 3:47PM
తెలంగాణలో ప్రస్తుతం వలసల పర్వం నడుస్తోంది. టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ అనే మంత్రానికి అందరూ పడిపోయి కారెక్కడానికి సిద్దమవుతున్నారు. ఇప్పటికే నేతలు టీఆర్ఎస్ పార్టీలోకి మారడం మొదలుపెట్టారు. రెండు రోజుల క్రితమే.. టీడీపీ ఎమ్మెల్యే సాయన్న, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్ టీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు. దీంతో ఇప్పుడు నేతలు ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉన్నారు. దీనిలో భాగంగానే త్వరలో జరగబోయే గ్రేటర్ ఎన్నికల్లో లోకేశ్ ను బరిలో దించడానికి టీ టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్బంగా టీడీపీ ముఖ్యనేతలు ఎర్రబెల్లి, రేవంత్, ఎల్.రమణ ఇంకా కొంతమంది లోకేశ్ తో సమావేశమైనట్టు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధించాలన్న.. టీఆర్ఎస్ దూకుడిని తట్టుకోవాలన్నా మీరు రంగంలోకి దిగాలని లోకేశ్ పై నేతలు ఒత్తిడి తెస్తున్నారట. అయితే లోకేశ్ మాత్రం తాను ఒక్కడినే నిర్ణయం తీసుకోలేనని.. తన తండ్రి.. పార్టీ అధినేత చంద్రబాబుని అడిగి ఏ నిర్ణయమైన తీసుకుంటానని చెప్పారంట.
అయితే చంద్రబాబు మాత్రం తన కొడుకుని గ్రేటర్ ఎన్నికలకు దూరంగా ఉంచాలని చాలా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఈ ఎన్నికల ప్రభావం లోకేశ్ సామర్థ్యంపై ప్రభావం చూపుతాయని.. అందుకే ఎన్నికలకు తనను దూరంగా ఉంచాలని చూస్తున్నారు. కానీ నేతలు మాత్రం లోకేశ్ ను రంగంలోకి తీసుకురావాలని చూస్తున్నారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. రాజకీయాల్లో ఎక్కువ అనుభవం లేని లోకేశ్ ను గ్రేటర్ ఎన్నికల బాధ్యత తీసుకోమని టీ టీడీపీ నేతలు ఒత్తిడి తీసుకురావడం. అంటే రేపు ఏది జరిగినా వారు చేతులు దులుపుకొని లోకేశ్ ను బుక్ చేయడానికా అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మొత్తానికి టీ టీడీపీ నేతలు లోకేశ్ ను బుక్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టున్నారు.