కమల్ హాసన్ కంటే అల్లు అర్జునే నయం: పన్నీర్ సెల్వం

  చెన్నైలో వరద పరిస్థితి చూసి తీవ్రంగా చలించిపోయిన నటుడు కమల్ హాసన్, “నా సురక్షితమయిన ఇంట్లో కూర్చొని మా ఇంటి కిటికీలో నుంచి నీళ్ళలో మునిగిపోతున్న చెన్నై నగరాన్ని, అందులో ప్రజలు పడుతున్న ఇక్కట్లను చూస్తుంటే నాకు చాలా సిగ్గుగా అనిపిస్తోంది. ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. అయినా ప్రభుత్వం ఏమి చేస్తోందో తెలియడం లేదు. మొత్తం వ్యవస్థ అంతా కుప్పకూలిపోయింది. ప్రజలు కోట్లాది రూపాయలు పన్నులు చెల్లిస్తున్నా కూడా ఇంకా ఇటువంటి సందర్భాలలో మావంటి వారు విరాళాలు అందజేయవలసి వస్తోందంటే, ప్రజలు కట్టిన డబ్బు అంతా ఎక్కడికి వెళ్లిపోతోందో...దేనికి ఖర్చు పెడుతున్నారో అర్ధం కావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కార్పోరేట్ ప్రాజెక్టులపై రూ.4,000 కోట్లు ఖర్చు పెడుతోంది. వాటి వలన ప్రజలకు ప్రయోజనం కలగనపుడు ఆ డబ్బుని నేరుగా ప్రజలకే పంచిపెట్టేస్తే అందరూ లక్షాధికారులు అయ్యేవారు కదా?” అని అన్నారు.   కమల్ హసన్ ఆవేదన ప్రజలందరికీ సహజమయిన ప్రతిక్రియగా మాత్రమే చూసారు. కానీ అధికార అన్నాడీ.ఎం.కె. ప్రభుత్వానికి ఆయన మాటలు తమను అవమానిస్తున్నట్లు, అనుమానిస్తున్నట్లుగా అనిపించాయి. ముఖ్యమంత్రి జయలలిత నిప్పులో దూకేయమంటే దూకేసే ఆమె వీర భక్తుడు, ప్రస్తుత రాష్ట్ర ఆర్ధిక మంత్రి పన్నీర్ సెల్వం కమల్ హాసన్ పై మండి పడ్డారు.   “మేమేమి ఆయనని విరాళం ఇమ్మని అడగలేదు. చెన్నై పరిస్థితిని చూసి ఇరుగు పొరుగు రాష్ట్రాలు, అనేకమంది ప్రముఖులు, కేంద్రప్రభుత్వం స్వచ్చందంగా విరాళాలు అందజేస్తున్నారు. పొరుగు రాష్ట్రంలోని తెలుగు సినీ పరిశ్రమకి చెందిన నటుడు అల్లు అర్జున్ చెన్నై పరిస్థితి చూసి చలించిపోయి రూ.25 లక్షలు విరాళం ప్రకటించారు. తెలుగు చిత్ర పరిశ్రమకి చెందిన చాలా మంది స్వచ్చందంగా విరాళాలు అందజేస్తున్నారు. కానీ రాష్ట్రానికి చెందిన కమల్ హాసన్ని ఎవరూ విరాళం అడగకపోయినా అనవసరమయిన మాటలు చాలా మాట్లాడారు. ప్రజలు కట్టిన డబ్బు అంతా ఎక్కడికి పోతోందో...అని ఆయన అనుమానం వ్యక్తం చేయడం మా అమ్మ (ముఖ్యమంత్రి జయలలిత)ని అవమానించడమే. 2015-16 ఆర్ధిక సంవత్సరం బడ్జెటులో ఇటువంటి ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు కేటాయించిన రూ.679 కోట్లు ఇప్పుడు వినియోగిస్తున్నాము. అయినా సరిపోవడం లేదు. కేంద్రప్రభుత్వం కూడా సహాయం అందిస్తోంది."   "ఎన్నడూ ఊహించని విధంగా 40 సెంటీమీటర్ల వర్షం కురిస్తే, ప్రకృతి ముందు ఎవరయినా తలవంచవలసిందే. ఇదేమీ సినిమా కాదు ఎంత పెద్ద ప్రకృతి విపత్తునయినా ఒక పాటలో పరిష్కారం చేసేయడానికి. సినిమాలలో జరిగినట్లు ప్రకృతి విపత్తులు మన నియంత్రణలో ఉండవనే సంగతి ఆయన తెలుసుకొంటే బాగుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తన శాయశక్తులా ప్రజలను, ఆస్తులను కాపాడేందుకు ప్రయత్నిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 40,000 మంది ఉద్యోగులు రేయింబవళ్ళు కష్టపడుతున్నారు. కొన్ని రోజుల వ్యవధిలోనే వరుసగా భారీ వర్షాలు కురిసాయి. సుమారు 12 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాము.55 లక్షల ఆహార పొట్లాలు అందజేసాము. ఇంకా ముమ్మరంగా సహాయ చర్యలు చేస్తూనే ఉన్నాము. వేలాదిమంది స్వచ్చంద సేవా కార్యకర్తలు, సైనికులు, వాయుసేన, నావికాదళానికి చెందిన బృందాలు సహాయ చర్యలలో పాల్గొంటున్నారు. ఇవన్నీ కమల్ హాసన్ కి తన ఇంటి కిటికీలో నుండి చూస్తే కనిపించేవి కావు. ఆయన ఇల్లు వదిలి బయటకు వచ్చి చూస్తే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో, ప్రభుత్వం ఎంత కష్టపడుతోందో అర్ధమవుతుంది."   "ఆయన నటించిన విశ్వరూపం సినిమా విడుదలకి అవరోధాలు ఏర్పడినపుడు ఆయన దేశం విడిచి వెళ్ళిపోతానని బెదిరించారు. కానీ అప్పుడు అమ్మ చొరవ చూపడం వలననే ఆ సమస్య పరిష్కారం అయ్యి సినిమా రిలీజ్ అయిన సంగతి కమల్ హాసన్ మరిచిపోయినట్లున్నారు. అందుకు అప్పుడు ఆయన అమ్మకి కనీసం కృతజ్ఞత కూడా తెలపాలనుకోలేదు. కానీ ఇప్పుడు అమ్మను విమర్శిస్తున్నారు. తెలిసీ తెలియకుండా ఈవిధంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదు,” అని పన్నీర్ సెల్వం అన్నారు.

చౌదరులు జగన్ వలలో పడతారా?

ప్రతిపక్షం స్థానంలో వున్న వైసీపీ తాను చేతులారా చేసుకున్న స్వయం కృతాపరాధాల కారణంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏకపక్షంగా, అధికారపక్షంగా సాగిపోతున్నాయి. చంద్రబాబు నాయకత్వానికి, తెలుగుదేశం పార్టీకి ఎదురు లేకుండా వుంది. ప్రభుత్వానికి, టీడీపీని ఇబ్బందుల్లో నెట్టడానికి జగన్ అండ్ కో ఎన్ని వ్యూహాలు పన్నినా అవి వర్కవుట్ కావడం లేదు. ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తన పార్టీ పరిస్థితి ఔట్ అయిపోతుందేమోనన్న భయం జగన్‌ని వెంటాడుతోంది. అందుకే ఆయన ఎప్పటికప్పుడు టీడీపీని దెబ్బ తీయడానికి కొత్త వ్యూహాలను రచిస్తూ వస్తున్నారు. అలాంటి వ్యూహ రచనలో భాగంగా ఆయన ఇప్పుడు టీడీపీకి పెట్టని కోటలా వున్న కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారు. ఆ సామాజికవర్గం నాయకులను ఆకర్షించే పనిలో పడ్డారు. కమ్మ సామాజిక వర్గం టీడీపీకి ఎప్పుడూ అండగా నిలిచింది. పార్టీ అధికారంలో వున్నా, అధికారంలో లేకపోయినా ఆ సామాజిక వర్గం టీడీపీని అంటిపెట్టుకునే వుంది. ఆ పార్టీ బలాన్ని పెంచడానికి ఆ సామాజిక వర్గం చేసిన కృషి, త్యాగాలు విస్మరించలేనివి. ఆంధ్రప్రదేశ్‌లో ఆ సామాజికవర్గంలోని నాయకత్వ లక్షణాలున్న అనేకమంది టీడీపీలోనే వున్నారు. అయితే చాలా కొద్దిమంది మాత్రం టీడీపీకి దూరంగా వున్నారు. అలాగే టీడీపీలో వున్నప్పటికీ తమకు సరైన ప్రాధాన్యం లభించడం లేదని అలకపాన్పు ఎక్కి కూర్చున్నవాళ్ళు కూడా కొంతమంది వున్నారు. ఇప్పుడు జగన్ దృష్టి అలాంటి వారిమీద పడింది. టీడీపీలో వున్నవారితోపాటు ఇతర పార్టీల్లో వున్న బలమైన కమ్మ నాయకులను వైసీపీలోకి ఆహ్వానించడం ద్వారా  ఆ సామాజిక వర్గాన్ని ఆకర్షించాలని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో వున్న చంద్రబాబుకు బద్ధ వ్యతిరేకి దేవినేని నెహ్రూని వైసీపీలోకి తీసుకోవాలని ఆశిస్తున్నారు. చంద్రబాబు నాయుడు తమకు కామన్ శత్రువనే కార్డును ఉపయోగించి దేవినేని నెహ్రూను బుట్టలో వేయాలని భావిస్తున్నారు.  దేవినేని నెహ్రూ వైసీపీలోకి రావడం వంగవీటి రాధాకు ఎంతమాత్రం ఇష్టం లేదు. అందుకే ఆయన ఈ విషయంలో చాలా ఆందోళనకు గురవుతున్నట్టు సమాచారం. నీ సొంత మనిషి అని పేరున్న టీడీపీ నాయకుడు యలమంచిలి రవిని వైసీపీలోకి తీసుకురా అని వంగవీటి రాధాని ఆదేశించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వంగవీటి రాధాని దేవినేని నెహ్రూ వైసీపీలోకి ఎంటరైతే తనకు చాలా సమస్య అని బాధ వేధిస్తున్నప్పటికీ ప్రస్తుతానికి యలమంచిలి రవిని వైసీపీలోకి తెచ్చే బృహత్కార్యంలో మునిగి తేలుతున్నారు. వైసీపీ రాజకీయాలు అలా వుంటే, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ మధ్యకాలంలో చాలామందిని టీడీపీలోకి చేర్చుకున్నారు. వారందరూ గతంలో టీడీపీని, చంద్రబాబు నాయుడిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టినవారే.  అలాంటి వారిని పార్టీలోకి చేర్చుకోవద్దు మహాప్రభో అని పార్టీలోని నాయకులు ఎంత మొత్తుకున్నా వినకుండా చంద్రబాబు వాళ్ళని పార్టీలోకి చేర్చుకుని ఉన్నత పదవులు ఇచ్చారు. అయితే చంద్రబాబు ఇదే రాజనీతిని దేవినేని నెహ్రూ విషయంలో మాత్రం ప్రదర్శించడం లేదు. కమ్మ సామాజిక వర్గంలో బలమైన నాయకుడిగా వున్న దేవినేని నెహ్రూను పార్టీకి తీసుకోవాలన్న ఆలోచన ఆయనకు ఎంతమాత్రం రావడం లేదు. ఎందుకంటే... దేవినేని నెహ్రూ అంటే చంద్రబాబుకు ఎంతమాత్రం పడదు. పార్టీలోని ఇతర నాయకులకు పడని వారిని ఎంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నా పార్టీలోకి తీసుకుంటున్న చంద్రబాబు  దేవినేని నెహ్రూ విషయంలో మాత్రం తన పట్టుదలను వదులుకోవడం లేదు. ఈ విషయంలో తనకో నీతి, పార్టీలోని నాయకులు, కార్యకర్తలకు ఒక నీతిలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్న ఆవేదన పార్టీలో వుంది.

చంద్రబాబు పేరు తొలగించండి.. హైకోర్ట్

ఎర్ర చందనం స్మగ్లర్ గంగిరెడ్డిని పోలీసులు మారిషన్లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతనిని పోలీసులు కడప సెంట్రల్ జైలులో గంగిరెడ్డి విచారణ ఖైదీగా ఉంచారు. అయితే గంగిరెడ్డి భార్య కొద్దిరోజుల క్రింత తన భర్త గంగిరెడ్డికి ప్రాణహాని ఉందని.. అది కూడా చంద్రబాబు వల్ల అని ఆరోపించింది. అంతేకాదు దీనిపై హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. తన భర్తను ప్రాణహాని ఉందని.. తెలంగాణలోని ఏదైనా జైలుకు తరలించాలని ఆమె పిటిషన్లో పేర్కొంది. అయితే దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు పిటిషన్‌లో రెస్పాండెంట్‌గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేరును తొలగించాలని ఆదేశించింది. అంతేకాదు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా.. అత్యున్నత స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు పేరును చేర్చడం తగదని సూచించింది. కాగా ఈనెల 7వ తేదీన హైకోర్టు ఈ పిటిషన్ పై విచారణ చేయనుంది.

సూదిగాడు మళ్లీ వచ్చేశాడు..

మూడు నెలల క్రితం సూది సైకో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కనీసం జనాలు బయటకు వెళ్లాలంటే బయపడే పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు ఎటునుండి వస్తాడో.. ఎలా దాడి చేస్తాడో తెలియక అందరూ బయపడేవాళ్లు. పోలీసులు అతని కోసం వెతికి ఆఖరికి ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉండిపోయారు. అయితే కొద్దిరోజుల నుండి  సూది సైకో సైలెంట్ అయిపోయాడు. దీంతో పోలీసులు కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కాన్ని ఇప్పుడు సూది సైకో మరోసారి కలకలం రేపాడు. హైదరాబాద్ లో సూది సైకో ఓ మహిళపై దాడి చేయడంతో కలకలం రేగింది. వనస్థలీ పురంలో ఓ మహిళకు సూది గుచ్చి సూది సైకో పరారయ్యాడు. దీంతో మహిళకు తీవ్ర గాయాలవ్వగా ఆమెను ఆస్పత్రికి తరలించారు.  దీంతో పోలీసులు మళ్లీ అలెర్ట్ అయి సూది సైకో కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. 

తమను కవర్ చేసుకోవడానికి లోకేశ్ ను బుక్ చేస్తున్నారా?

తెలంగాణలో ప్రస్తుతం వలసల పర్వం నడుస్తోంది. టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ అనే మంత్రానికి అందరూ పడిపోయి కారెక్కడానికి సిద్దమవుతున్నారు. ఇప్పటికే నేతలు టీఆర్ఎస్ పార్టీలోకి మారడం మొదలుపెట్టారు. రెండు రోజుల క్రితమే.. టీడీపీ ఎమ్మెల్యే సాయన్న, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్ టీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు. దీంతో ఇప్పుడు నేతలు ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉన్నారు. దీనిలో భాగంగానే త్వరలో జరగబోయే గ్రేటర్ ఎన్నికల్లో లోకేశ్ ను బరిలో దించడానికి టీ టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్బంగా టీడీపీ ముఖ్యనేతలు ఎర్రబెల్లి, రేవంత్, ఎల్.రమణ ఇంకా కొంతమంది లోకేశ్ తో సమావేశమైనట్టు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధించాలన్న.. టీఆర్ఎస్ దూకుడిని తట్టుకోవాలన్నా మీరు రంగంలోకి దిగాలని లోకేశ్ పై నేతలు ఒత్తిడి తెస్తున్నారట. అయితే లోకేశ్ మాత్రం తాను ఒక్కడినే నిర్ణయం తీసుకోలేనని.. తన తండ్రి.. పార్టీ అధినేత చంద్రబాబుని అడిగి ఏ నిర్ణయమైన తీసుకుంటానని చెప్పారంట. అయితే చంద్రబాబు మాత్రం తన కొడుకుని గ్రేటర్ ఎన్నికలకు దూరంగా ఉంచాలని చాలా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఈ ఎన్నికల ప్రభావం లోకేశ్ సామర్థ్యంపై ప్రభావం చూపుతాయని.. అందుకే ఎన్నికలకు తనను దూరంగా ఉంచాలని చూస్తున్నారు. కానీ నేతలు మాత్రం లోకేశ్ ను రంగంలోకి తీసుకురావాలని చూస్తున్నారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. రాజకీయాల్లో ఎక్కువ అనుభవం లేని లోకేశ్ ను గ్రేటర్ ఎన్నికల బాధ్యత తీసుకోమని టీ టీడీపీ నేతలు ఒత్తిడి తీసుకురావడం. అంటే రేపు ఏది జరిగినా వారు చేతులు దులుపుకొని లోకేశ్ ను బుక్ చేయడానికా అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మొత్తానికి టీ టీడీపీ నేతలు లోకేశ్ ను బుక్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టున్నారు.

మే ఒంటరిగానే పోటీ చేస్తున్నాం.. కాంగ్రెస్

  ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ ఢిల్లీలో జరిగిన హిందూస్థాన్ టైమ్స్ సదస్సులో  చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ స్పందించింది. కాంగ్రెస్ పార్టీ పొత్తు గురించి అఖిలేష్ యాదవ్ ను విలేకరులు ప్రశ్న అడిగారు. దీనికి అఖిలేష్ యాదవ్ ములాయం సింగ్ ను కనుక ప్రధాన మంత్రి చేస్తానంటే పొత్తుకు అంగీకరిస్తామని సమాధానం చెప్పారు. దీంతో కాంగ్రెస్ పార్టీ స్పందించి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో తాము ఒంటరిగానే పోటీ చేస్తున్నామని.. ఎవరితో పొత్తు పెట్టుకోవడం లేదని అన్నారు. అంతేకాదు అసలు 2017 లో జరిగేది లోక్ సభ ఎన్నికలు కాదు.. అసెంబ్లీ ఎన్నికలు అని వారు గుర్తుపెట్టుకోవాలని సూచించారు.

పార్టీ నేతల టెంపర్ తో జగన్ కు చిక్కులు..

వైఎస్ జగన్ కు పార్టీ నేతల దూకుడు వల్ల లేనిపోని తలనొప్పులు వస్తున్నట్టు కనిపిస్తున్నాయి. ఒక పక్క పార్టీలోని రోజుకో నేత ఇతర పార్టీలోకి వెళుతుంటే మరోపక్క నేతల అతి దూకుడితో అరెస్ట్లులు.. ఇవన్నీ జగన్ కు కష్టాలు తెచ్చిపెడుతున్నారు. ఇంతకు ముందు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ నేత భూమా నాగిరెడ్డి.. ఓ పోలీసుతో వాగ్వాదానికి దిగి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అది అయిపోయింది అనుకుంటే ఆతరువాత వెంటనే కొడాలి నాని వ్యవహారం. విజయవాడలో ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయం వివాదం. కొడాలి నాని టీడీపీలో ఉన్నప్పుడు అది టీడీపీ కార్యలయంగా ఉండేది..ఎప్పుడైతే తాను పార్టీ మారి వైకాపా పార్టీలోకి చేరారో టీడీపీ కార్యలయాన్ని జగన్ పార్టీ కార్యలయంగా మార్చి అద్దె చెల్లింపు వ్య‌వ‌హారంలో ఇంటి య‌జ‌మానితో దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఆ యజమానురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడం.. పోలీసులు ఎంట్రీ ఇవ్వడం.. రచ్చ రచ్చ అయింది ఈవ్యవహారం. ఇది అయిపోయిందనుకుంటే మళ్లీ ఇప్పుడు చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి వ్యవహారం.  తిరుప‌తి ఏయిర్‌పోర్ట్‌లో మేనేజ‌ర్ రాజ‌శేఖ‌ర్‌పై దాడి చేశార‌న్న అభియోగంపై వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డిపై కేసు న‌మోద‌యింది. అంతేకాదు చెవిరెడ్డినే స్వయంగా వెళ్లి లొంగిపోయాడు కూడా. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఇంత దూకుడిగా ప్రవర్తించినా నేతలు మాత్రం తమ తప్పేమి లేదన్నటూ.. అధికారపార్టీని విమర్శిస్తున్నారు. ఇక వైకాపా పార్టీ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజా ఊరుకుంటుందా.. తమ పార్టీ నేతలు చేసిన పనులు కప్పిపుచ్చుకోవడానికి.. అధికార పార్టీని విమర్శిస్తూ రెచ్చిపోయింది. మొత్తానికి పార్టీలో నేతలు దూకుడు తగ్గించుకునేంతవరకూ జగన్ కు కష్టాలు తప్పవు.

దుర్గ గుడి ఫ్లైఓవర్ శంకుస్థాపన.. గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు

విజయవాడలోని దుర్గ గుడి ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి నితిన్  గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ దుర్గాదేవి కొలువై ఉన్న విజయవాడకు రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. దాదాపు రూ 65 వేల కోట్ల పనులకు అనుమతి లభించిందని.. రాష్ట్రం భూములు ఇచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని అన్నారు. చంద్రబాబు ఎన్డీఏకు అత్యంత సన్నిహితుడు.. ఆయనకు సహకరించాల్సిన అవసరం మాకు ఉందని వ్యాఖ్యానించారు. అంతేకాదు నాని లాంటి నిబద్ధత ఉన్న ఎంపీ దేశానికి కావాలని గడ్కరీ నానిని అభినందించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ 65 వేల ప్రాజెక్టులు ప్రకటించిన గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణ పుష్కరాలలోగ దుర్గగుడి ఫ్లైఓవర్ ను పూర్తి చేస్తామని తెలిపారు. దుర్గ గుడి ఫ్లైఓవర్ నిర్మాణానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములిచ్చారని వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు.

చంద్రబాబును ఆహ్వానించడానికి విజయవాడకి కేసీఆర్..?

ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇంటికి వెళ్లి ఆహ్వానించి.. శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన కేసీఆర్ కు అత్యంత గౌరవమర్యాదలు అందించి మరీ పంపించారు. ఇప్పుడు కేసీఆర్ కూడా అదే విధంగా చంద్రబాబుకు అతిథి మర్యాదలు చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. తాను నిర్వహిస్తున్న ఆయుత చండీయాగానికి చంద్రబాబును స్వయంగా పిలిచి మర్యాదలు అందించాలని చూస్తున్నారట. దీనిలో భాగంగానే రావుల చంద్రశేఖర్ రెడ్డి కుమారుడు పెళ్లికి వచ్చిన చంద్రబాబును కలిసి ఆహ్వానం అందించాలని కేసీఆర్ చూశారు కానీ అప్పుడు ఇద్దరికీ కుదురలేదు. అయితే ఇప్పుడు మళ్లీ ఆదివారం హైదరాబాద్ లో ఎన్టీఆర్ మునిమనమరాలి పెళ్లికి చంద్రబాబు వస్తారని..అప్పుడు ఆహ్వానం ఇవ్వాలని అనుకుంటున్నారని వినిపిస్తోంది. అంతేకాదు కేసీఆర్ నేరుగా విజయవాడ వెళ్లి చంద్రబాబును ఆహ్వానిస్తారు అని కూడా మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు అపాయింట్ మెంట్ తీసుకుని విజయవాడ వెళ్తానని కేసీఆర్ తన సన్నిహితుల వద్ద అన్నట్లు టీఆరెస్ వర్గాల్లో వినిపిస్తోంది. నిజంగా కేసీఆర్ విజయవాడ వెళ్లి చంద్రబాబును ఆహ్వానిస్తే అది రెండు రాష్ట్రాలకు శుభపరిణామమే.

కేజ్రీవాల్ క్రేజీ డెసిషన్.. నెటిజన్ల సెటైర్లు

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఓ ఆచరణ సాధ్యంకాని నిర్ణయం తీసుకొని ఇప్పుడు అందరిచేత విమర్శలు పొందుతున్నారు. ఢిల్లీలో వాయుకాలుష్యం బాగా పెరిగిపోయిందని.. గ్యాస్ ఛాంబర్లో ఉన్నట్లు బతుకుతున్నామని.. ఢిల్లీ ప్రభుత్వం కాలుష్యాన్ని తగ్గించకుండా ఏంచేస్తుందని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో హడావుడిగా కేజ్రీవాల్ మీటింగ్ పెట్టి.. ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయంతో ఢిల్లీ ప్రజలందరూ ఒక్కసారిగా షాకయ్యారు. అదేంటంటే.. దిల్లీలో ఇకపై ఒక రోజు సరిసంఖ్య ఉన్న వాహనాలే తిరగాలట. ఇంకో రోజు బేసి సంఖ్య వాహనాలే రోడ్డు మీదికి రావాలట. దీంతో కాలుష్యాన్ని తగ్గించవచ్చంట. ఇక అంతే కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయంతో నెటిజన్లు సెటైర్ల మీద సెటైర్ల వేయడం మొదలుపెట్టారు. ఇక ప్రతి ఇంట్లోనూ రెండు కార్లు రెండు బైకులు పెట్టుకోవాలని.. ఒకదాన్ని బేసి సంఖ్యతో ఇంకోదాన్ని సరిసంఖ్యతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఒకరంటే..కార్లు బైకుల కంపెనీల సేల్స్ పెంచడానికి కేజ్రీవాల్ పన్నిన కుట్ర ఇదని ఒంకొకరు... అర్రే నా కారుది ప్రైమ్ నంబరే మరి నేనేం చేయాలని ఇంకొకరు అలా కామెంట్లు విసురుతున్నారు. మొత్తానికి కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయం పాటించడమేమో కాని.. జోకులు పేల్చుకోవడానికి మాత్రం పనికొచ్చింది. మరి కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తారో.. లేక వెనక్కి తీసుకుంటారో చూడాలి.

దానం పార్టీ మారనిది అందుకేనా..?

తెలంగాణ కాంగ్రెస్ నేత దానం నాగేందర్ పార్టీ మార్పుపై  అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. దానం కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ చేరుతాడని వార్తలు జోరుగానే సాగాయి. కానీ తాను మాత్రం కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని దానం నిన్న తేల్చి చెప్పారు. అయితే ఇప్పుడు అందరి సందేహం ఒక్కటే.. నిన్న తను ప్రకటన చేయడానికి ముందు అంటే గురువారం రాత్రి దానం కొంత మంది టీఆర్ఎస్ నేతలతో మంతనాలు జరిపారు. అది ఎవరో కాదు, మంత్రి హరీశ్ రావు, కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయిన సీనియర్ నేత డీఎస్, జగదీశ్వర్ రెడ్డి.. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డిలు. ఈ సమావేశంతో దానం టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అవడం ఖాయమని అనుకున్నారు. ఇక నిన్న ఉదయం దానం తన ముఖ్య అనుచరులతో కూడా సమావేశమయ్యేసరికి ఇక టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లడానికి ముహూర్తం ఖరారు చేయడమే అని అభిప్రాయపడ్డారు అందరూ. కానీ సమావేశం అనంతరం దానం ట్విస్ట్ ఇస్తూ తాను కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని అన్నారు. ఇక్కడి వరకూ బానే ఉన్నా అసలు టీఆర్ఎస్ నేతలు, దానం ఏం మాట్లాడుకున్నారు.. అని అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ నేతలతో భేటీ అయిన దానం కొన్ని షరతులు పెట్టగా వాటికి టీఆర్ఎస్ సానుకూలంగా స్పందించకపోవడంతో పార్టీ మార్పుకు అవాంతరం ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. అందుకే మళ్లీ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు అంటూ వ్యాఖ్యానిస్తున్నారని అంటున్నారు. ఇదిలా ఉండగా టీఆర్ఎస్ మాత్రం దానం విషయంలో సీరియస్ గా ఉన్నారని.. దానం మాత్రం పార్టీ మారడం ఖాయమని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే కొంత సమయం ఆగాల్సిందే.

గంగిరెడ్డి భార్య పిటిషన్ పై హైకోర్టు ఆగ్రహం

  గంగిరెడ్డి..పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ఎర్రచందనం స్మగిలింగ్ మొదలుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై హత్యా ప్రయత్నం వరకు అనేక తీవ్ర నేరాలలో ప్రధాన నిందితుడు. చాలా రోజులుగా పోలీసులను తప్పించుకొని విదేశాలలో తిరుగుతున్న అతనిని కొన్ని రోజుల క్రితమే అరెస్ట్ చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకు వచ్చెరు. పోలీసులు అతనిని కోర్టులో హాజరుపరచగా కోర్టు అతనికి రిమాండ్ విధించింది. ప్రస్తుతం అతను కడప జైల్లో ఉన్నాడు. చేయకూడని నేరాలన్నీ చేసిన అతనిని చట్ట ప్రకారం శిక్షించడానికే పోలీసులు జైల్లో నిర్బంధించారు.   గంగిరెడ్డి భార్య కొల్లం మాళవిక తన భర్తకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుండి ప్రాణహాని ఉందని, కనుక తన భర్తని తెలంగాణాలో ఏదయినా జైలుకి మార్చాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, అది రాజ్యాంగ విరుద్దమని ప్రకటించ వలసిందిగా హైకోర్టును అభ్యర్ధించారు. ఆయన వలన తన భర్తకు ప్రాణహాని ఉందని భావిస్తున్నానని కనుక తన భర్తకు జైల్లో ప్రత్యేక రక్షణ ఏర్పాటు చేయాలని ఆమె తన పిటిషన్ లో కోరారు.   ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై ఆమె ఇటువంటి తీవ్ర ఆరోపణలు చేసినందుకు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు తన పిటిషన్ లో ప్రతివాదుల పేర్ల నుండి చంద్రబాబు నాయుడు పేరు తొలగించాలని, ఆ తరువాతే పిటిషన్ నెంబరు కేటాయించాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. హైకోర్టు సూచించిన మార్పులు చేసిన తరువాత సోమవారం ఈ పిటిషన్ని విచారణకు స్వీకరించే అవకాశం ఉంది.

మళ్ళీ మరో వడ్డింపుకి సిద్దమయిన రైల్వే శాఖ

  గత ఏడాదిన్నరగా రైల్వే శాఖ ఏదో ఒక విధంగా ప్రజల వద్ద నుండి డబ్బులు పిండుకొంటూనే ఉంది. ఒకసారి ప్లాట్ ఫారం టికెట్ ధరలు పెంచుతుంది. మరొకసారి ఆన్ లైన్ టికెట్లను రద్దు చార్జీలను పెంచుతుంది. లేకుంటే తత్కాల్ చార్జీలు పెంచుతుంది. తత్కాల్ అంటేనే అప్పటికికప్పుడు అత్యవసరంగా కొనుకొనే విధానం. మళ్ళీ దానిలో ప్రీమియం తత్కాల్, రైల్వే టికెట్ల వేలం పాటలు అంటూ రకరలుగా ప్రజలను దోచుకోంటోంది. రైల్వే శాఖ ఇలాగ చట్టబద్దంగా ప్రయాణికులను దోచుకొంటుంటే, దొంగలు పట్టపగలే రైళ్ళలో ఎక్కి దోపిడీలు చేస్తున్నారు. ఇప్పుడు రైల్వే శాఖ మళ్ళీ వడ్డనకి సిద్దమయింది. ఇంతవరకు 5-12సం.ల వయసు గల పిల్లలకు ప్రయాణ చార్జీలలో ఇస్తున్న రాయితీని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్, 2016 నుండి ఈ నిర్ణయం అమలు లోకి వస్తుందని రైల్వే శాఖ ప్రకటించింది.

దావూద్ పై అమెరికా కన్ను..?

అండర్ వరల్డ్ డాన్.. ముంబై వరుస పేలుళ్ల కారకుడు దావుద్ ఇబ్రహీంను పట్టుకోవడానికి భారత్ ప్రభుత్వం చాలా తీవ్రతరంగా కృషిచేస్తుంది. కానీ పాక్ సహకారం సరిగ్గా లేకపోవడంతో దావూద్ ను ఇండియాకి రప్పించలేకపోతుంది మన ప్రభుత్వం. కానీ ఇప్పుడు దావుద్ ను పట్టుకోవడానికి మార్గం సులువైనట్టు తెలుస్తోంది. అదెలా అంటే.. అగ్రరాజ్యాలపై ఐసిస్ కన్నేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అగ్రరాజ్యాలు ఐసిస్ అంతు తేల్చే పనిలో పడింది. అయితే ఐసిస్ కు దావూద్ సహాయం అందుతోందన్న అనుమానంతో ఇప్పుడు దావుద్ పై నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. ఐతే గతంలో పాక్ తో ఉన్న సత్సంబంధాలు కారణంగా అగ్రరాజ్యాలు ఐసిస్ ను చూసి చూడనట్టు వదిలేశాయి. కానీ తమపైనే దాడి చేసేసరికి కోపంతో ఉన్న అగ్రరాజ్యాలు ఇప్పుడు ఐసిస్ పై.. దానికి సహరిస్తున్నారన్న కారణంగా దావుద్ పై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దావూద్ ముఖ్య అనుచరుడు.. ఆయన ఆర్థిక వ్యవహారాల సలహాదారు అల్తాఫ్ ఖనానీని అమెరికా అరెస్టు చేసింది. ఖనాని అరెస్ట్ చేసినందుకుగాను అమెరికా దావూద్ ను టార్గెట్ చేసిందని అనుకుంటున్నారు. దీంతో మన దేశ ప్రభుత్వం ఎప్పటినుండో ఎదురుచూస్తున్న దావుద్ త్వరలోనే కలుగు నుండి బయటకు రావడం ఖాయమని తెలుస్తోంది.

"మోస్ట్ ఇన్ఫిరేషనల్ ఐకాన్ ఆఫ్ ద ఇయర్" గా కేటీఆర్..

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కు అరుదైన అవార్డు దక్కింది. ప్రముఖ లైఫ్ స్టైల్ మ్యాగజైన్ "రిట్జ్" ప్రముఖ సీఎన్ఎన్ఐబిఎన్ ఛానల్ రెండు సంయుక్తంగా నిర్వహిస్తున్న "ఆడి రిట్జ్ ఐకాన అవార్డ్ 2015" కింద "మోస్ట్ ఇన్ఫిరేషనల్ ఐకాన్ ఆఫ్ ద ఇయర్" అవార్డ్  కేటీఆర్ కు దక్కింది. ఐటీ మంత్రిగా కేటీఆర్ ఎన్నో వినూత్న పథకాలు ప్రజలకు చేరవేయడానికి కృషి చేస్తున్న నేపథ్యంలో ఈ అవార్డ్ దక్కింది. ఈ నెల 13న బెంగుళూరులో తాజ్ వెస్టండ్ హోటల్లో జరిగే ఈకార్యక్రమంలో కేటీఆర్ కు అవార్డు అందజేయనున్నారు. కేటీఆర్ తో పాటు మరికొంత మంది.. వివిధ విభాగాల్లో అవార్డులు అందజేయనున్నారు. వారిలో సినీ నటుడు రాం చరణ్ కూడా ఉన్నారు. సినీ రంగానికి చెంది టాలీవుడ్ నుండి రాం చరణ్, బాలీవుడ్ నుండి విద్యాబాలన్, వ్యాపార రంగంలో గ్రంథి మల్లిఖార్జునరావు, ఫ్యాషన్ రంగానికి గౌరంగ్ షాకి.. సాంకేతిక రంగంలో నందన నిలేకనిలకు అవార్డులు దక్కాయి.

అందుకు దానం చేయలేదు.. జుకెర్ బర్గ్

విమర్శించే వాళ్లు మంచి పని చేసినా.. చెడు చేసినా విమర్శిస్తునే ఉంటారు. అలాంటి పరిస్థితే ఇప్పుడు ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు జుకెర్ బర్గ్ కు ఎదురైంది. జుకెర్ బర్గ్, అతని సతీమణికి ప్రిసిల్లా చాన్ కు పాప పుట్టిన సందర్భంగా తనకున్న షేర్లలో 99 శాతం షేర్లను అంటే దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలను స్వచ్ఛంద సంస్థలకి ఇస్తున్నట్టు ప్రకటించాడు. అయితే జుకెర్ బర్గ్ చేసిన ఈ పనికి అందరూ అతనిపై ప్రశంసలు కురిపించారు. అయితే కొంతమంది మాత్రం పన్నుల నుంచి మినహాయింపులు పొందేందుకు జుకెర్ బర్గ్ ఈ మార్గాన్ని ఎంచుకున్నారని విమర్శిస్తున్నారు. దీనిక జుకెర్ బర్గ్ స్పందించి.. తాము ఎలాంటి పన్ను మినహాయింపు పొందబోమని.. తమ షేర్లను అమ్మినపుడు ఇతరుల మాదిరిగా పన్నులు చెల్లిస్తామని జుకర్బర్గ్ తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. మొత్తానికి మంచి పనిచేసినా కూడా విమర్శలు తప్పవని మరోసారి రుజువైంది.

పార్టీ మార్పుపై దానం ట్విస్ట్.. పార్టీ మారే ప్రసక్తే లేదు..

దానం నాగేందర్ పార్టీ మార్పుపై ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఎదురవుతున్నాయి. ఆయన సన్నిహితుడు ఎంఎస్ ప్రభాకర్ టీఆర్ఎస్ లోకి మారే సరికి ఆయన పార్టీ మార్పు వార్తలపై ఇంకా ఆసక్తి రేగింది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ ముఖ్య అనుచరులతో భేటీ అయ్యేసరికి ఇంకా అనుమానాలు వ్యక్తమయ్యాయి. తను టీఆర్ఎస్ పార్టీలోకి మారడం పక్కా అని అనుకున్నారు అందరూ. ఇక మరో కాంగ్రెస్ పార్టీ నేత షబ్బీర్ అలీ అయితే దానంను కలిసి భేటీ అయారు. అయితే భేటీలో ఏమైందో ఏమో తెలియదు కానీ దానం నాగేందర్ మాత్రం తాను కాంగ్రెస్ పార్టీని మారే ప్రసక్తే లేదని అందరికీ షాకిచ్చాడు. అంతేకాదు నేను పార్టీ మారుతున్నట్టు దుష్ర్పచారం జరుగుతుంది.. డివిజన్ల వారిగా పార్టీ బలోపేతం కోసం సమావేశాలు నిర్వహిస్తున్నా అంతే అని చెప్పారు. ఇలాంటి ప్రచారాన్ని కార్యకర్తలు నమ్మెద్దని కూడా సూచించారు. అంతేకాదు షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. దానం కాంగ్రెస్ పార్టీ మారుతున్నాడంటూ అతనిపై కుట్ర జరుగుతుందని.. దానం కరడుకట్టిన కాంగ్రెస్ వాది అని.. అతను కాంగ్రెస్ పార్టీని వీడడని అన్నారు. మొత్తానికి దానం పార్టీ మార్పుపై హై డ్రామా జరుగుతున్నట్టు కనిపిస్తుంది.