క్షమాపణలా? నేను చెప్పనంతే!
posted on Dec 28, 2015 @ 10:18PM
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఆమ్ ఆద్మీ ప్రభుత్వం డీడీసీఏ అవకతవకలపై జరిపిన విచారణలో జైట్లీ పేరు లేకపోవడం ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చినట్టు కాదని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. తాను క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ దాదాపు బిచ్చం ఎత్తుకుంటున్న స్థాయిలో దేబిరిస్తేందని, అది జరగని పని అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. అరుణ్ జైట్లీ అధ్యక్షుడిగా వున్న సమయంలో డీడీసీఏలో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవల ఆరోపించింది. దానిమీద దర్యాప్తు కమిషన్ కూడా వేసింది. కేజ్రీవాల్ ఈ విషయమై జైట్లీ మీద విమర్శలు గుప్పించడంతో జైట్లీ ఆయన మీద పరువునష్టం దావా వేశారు. అవకతవకల విషయం మీద ఢిల్లీ ప్రభుత్వం విచారణ చేయించిన అనంతరం వచ్చిన నివేదికల్లో ఎక్కడా అరుణ్ జైట్లీ పేరు లేదు. దాంతో కేజ్రీవాల్ తనకు క్షమాపణ చెప్పాలని జైట్లీ డిమాండ్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు కేజ్రీవాల్ తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.