రాజకీయాలలోకి అప్పుడే రాను: మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి
posted on Dec 29, 2015 @ 2:26PM
మళ్ళీ చాలా కాలం తరువాత మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిన్న రాజమండ్రిలో మీడియా కంటపడ్డారు. మాజీ కాంగ్రెస్ ఎంపి హర్షకుమార్ కి చెందిన రాజీవ్ గాంధి విద్యాసంస్థల సిల్వర్ జుబ్లీ వేడుకలలో పాల్గొనేందుకు ఆయన నిన్న రాజమండ్రి వచ్చేరు.
ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన వలన రెండు తెలుగు రాష్ట్రాలు నష్టపోతాయని తాను చెప్పిన మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయని అన్నారు. రెండు ప్రభుత్వాల మధ్య సయోధ్య లేకపోతే ప్రజలు, రైతులు తాగునీరు, సాగునీరుకి ఇబ్బందులు పడవలసి వస్తుందని కనుక ఇరువురు ముఖ్యమంత్రులు గొడవలు పడకుండా పరస్పరం సహకరించుకొంటూ రెండు రాష్ట్రాలకు రావలసిన వాటి గురించి కేంద్రంతో పోరాడాలని సూచించారు. అమరావతి నిర్మాణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి పారదర్శకత పాటించాలని సూచించారు. రుణమాఫీల విషయంలో రెండు ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరు సరిగా లేదని అభిప్రాయం వ్యక్తం చేసారు.
రైతుల పంట రుణాలను ఒక పరిమిత కాలంలో పూర్తిగా మాఫీ చేయకపోవడం వలన రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇదివరకు తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులు బ్యాంకుల నుండి లక్ష రూపాయలు ఋణం తీసుకొని దానిని తిరిగి ఏడాదిలోగా చెల్లించినట్లయితే బ్యాంకులు వారి నుండి ఎటువంటి వడ్డీ వసూలు చేసేవి కావు. కానీ ఇప్పుడు రైతులు దాదాపు 14 శాతం వడ్డీ చెల్లించవలసి వస్తోందని అన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఆరు లక్షల ఇళ్ళ నిర్మాణానికి తన ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని కానీ కొత్త ప్రభుత్వాలు ఇంతవరకు వాటిలో ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేదు. ఆ పధకంలో భాగంగా ఇళ్ళు కట్టుకొన్నవారికి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని విమర్శించారు. తన రాజకీయ భవిష్యత్ గురించి నిర్ణయం తీసుకోవడానికి తొందర ఏమీ లేదని అన్నారు.