విశాఖపట్నమే కావాలంటున్న ధోనీ అండ్ కో..!
మహారాష్ట్రలో కరువు కారణంగా, అక్కడి ఐపిఎల్ మ్యాచ్ లను ఆడకూడదని తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దాంతో మహారాష్ట్రలో హోమ్ గ్రౌండ్స్ ఉన్న ముంబై, పుణే జట్లకు ఐపిఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నాలుగు వెన్యూలను ఆప్షన్లుగా ఇచ్చింది. రాయ్ పూర్, జైపూర్, విశాఖపట్నం, కాన్పూర్ లలో ఒకటి ఎంచుకోమని రెండు టీం లకు కౌన్సిల్ ఆప్షన్స్ ఇచ్చింది. విశాఖపట్నం ధోనికి చాలా ఇష్టమైన గ్రౌండ్. అందుకే మరో మాట లేకుండా వెంటనే విశాఖపట్నానికి ధోనీ టీం పుణే ఓటేసింది. ముంబై మాత్రం తమకు మరికొంత సమయం కావాలని తెలిపింది. ఎక్కువశాతం పుణే హోం మ్యాచ్ లన్నీ వైజాగ్ లో జరగడానికే ఆస్కారం ఉంది. దీంతో ఇన్నాళ్లూ ఐపిఎల్ ను అప్పుడప్పుడు మాత్రమే చూసే భాగ్యం కలిగిన వైజాగ్ వాసులు, ఇక నుంచీ ఐపిఎల్ సందడిని ఆస్వాదించచ్చన్నమాట. మరోవైపు ముంబైలో జరగనున్న ఐపిఎల్ ఫైనల్ ను బెంగళూరుకు షిఫ్ట్ చేసే ఆలోచన ఐపిఎల్ కౌన్సిల్ చేస్తోంది. కౌన్సిల్ ఆమోదిస్తేనే ఇవన్నీ సాధ్యపడే అవకాశం ఉంది.