ప్రత్యూష బెనర్జీ కేసులో ట్విస్ట్.. రాహుల్ లాయర్ చేతిలోకి

ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసు మరో ట్విస్ట్ తిరిగింది. ఇప్పటికే ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్యకు ముందే గర్భవతి అని షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పుడు మరో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. అదేంటంటే.. ప్రత్యూష బెనర్జీకి న్యాయం జరగాలంటూ ప్రయత్నిస్తున్న ఆమె తరపు లాయర్ సడెన్ గా బ్రహ్మభట్ ఈ కేసు నుండి వైదొలగినట్టు తెలుస్తోంది. దీనికి కారణం ప్రత్యూష తల్లిదండ్రులు ఈ కేసు వాదించాల్సిందిగా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నీలేష్‌ను కోరడమేనట. ఈ నేపథ్యంలోనే నీలేష్‌తో కలిసి పని చేయడం ఇష్టం లేకే బ్రహ్మభట్ వైదొలగినట్లుగా తెలుస్తోంది. ఇక్కడ మరో ట్విస్ట్ ఎంటంటే నీలేష్‌ ఎవరో కాదు ప్రత్యూష బాయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్ తరపు మొదట వాదించిన లాయర్. అయితే ఆయన రాహుల్ తరుపు వాదించనని తప్పుకున్న సంగతి విదితమే. మరి ఇంకెన్ని ట్విస్ట్ లు వస్తాయో చూడాలి.

పెళ్లికి వెళ్లిన బీజేపీ ఎంపీ.. చెంప చెళ్ళుమనిపించిన యువకుడు

  అప్పుడప్పుడు రాజకీయ నేతలు తమ అధికారం చూపిస్తూ సామాన్య ప్రజలపై తమ ప్రతాపాన్ని చూపిస్తుంటారు. అయితే ఇక్కడ మాత్రం ఓ యువకుడు ఏకంగా ఎంపీనే చెంపదెబ్బ కొట్టాడు. వివరాల ప్రకారం.. రాజస్థాన్ కు చెందిన బీజేపీ పార్లమెంటు సభ్యుడు సొనారామ్ బార్మెర్ లో ఈరోజు జరిగిన ఒక వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇదే వివాహానికి ఒక యువకుడు ఖర్తారామ్ కూడా హాజరయ్యాడు. అయితే ఖర్తారామ్ ఎంపీ వద్దకు వచ్చి ఒక విషయంపై మాట్లాడుతూ ఆఖరికి వాగ్వాదానికి దిగాడు. ఇదే క్రమంలో సహనం కోల్పోయిన ఖర్తారామ్ బీజేపీ ఎంపీ చెంప ఛెళ్లుమనిపించాడు. అనంతరం అక్కడి నుండి పారిపోయాడు. ఈ సంఘటనపై ఎంపీ వ్యక్తిగత సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఖర్తారామ్, అతని స్నేహితుడు ప్రేమరామ్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు.

రోజాపై బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు.. ఎంతమంది మగాళ్లున్నారో మీకే తెలుసు..

వైసీపీ పార్టీ నుండి వరుసపెట్టి ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యో రోజా స్పందించి టీడీపీ పై విమర్శలు గుప్పించిన సంగతి కూడా విదితమే. టీడీపీలో మగాళ్లు లేరని.. అందుకే వైసీపీ నుండి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని అన్నారు. రోజా చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా స్పందించి రోజాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘అమ్మా రోజారెడ్డి గారు, మీరు కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. పది సంవత్సరాల పాటు మాతో ఉన్నారు. ఎంతమంది మగవాళ్లతో ఉన్నారో మీకు తెలుసు? ఎంతమంది మగవాళ్లను చూశారో మీకు తెలుసు. తెలుగుదేశం పార్టీలో మగవాళ్లున్నారో లేదో అందరికన్నా ఎక్కువ తెలిసిన వారు మీరే రోజారెడ్డిగారు’ అని బోండా ఉమా వ్యాఖ్యా నించారు. మరి ఉమా చేసిన వ్యాఖ్యలకు రోజా ఎలా స్పందిస్తారో చూడాలి.

ఒరిస్సా.. మరో లాతూర్..?

దేశంలోని పలు ప్రాంతాల్లో నీటి కొరత తీవ్ర రూపం దాల్చుతోంది. ఇప్పటికే కరువు కారణంగా మహారాష్ట్రలోని లాతూర్‌లో ప్రజలు నీటి కోసం అల్లాడిపోతుండగా ఈ ప్రాంతానికి నీటిని రైళ్లలో సరఫరా చేస్తున్నారు. ఈ జాబితాలోకి ఒరిస్సా కూడా చేరే పరిస్థితి కనిపిస్తోంది. ఒడిశాలోని పలు నగరాల్లో సగటున 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోనేపూర్‌లో అత్యధికంగా 46 డిగ్రీలు, సుందర్‌గఢ్‌లో 45 డిగ్రీలు, రుర్సుగూడలో 44.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్ 22 నుంచి భానుడి ప్రతాపం మరింత పెరుగుతుందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే వడదెబ్బకు మరణించిన వారి సంఖ్య 45కి చేరింది. ఈ నేపథ్యంలో పిల్లల భద్రతపై దృష్టిసారించిన ప్రభుత్వం ఏప్రిల్ 26 వరకు పాఠశాలలు మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. తీవ్రమైన నీటి ఎద్దడితో పాటు వడగాల్పులు వీస్తుండటంతో సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది.

హై వే వెంబడించి మహిళపై కాల్పులు..

  ఢిల్లీలో ఓ ఘోరమైన సంఘటన వెలుగుచూసింది. తాము చేసిన వ్యాఖ్యలకు అభ్యంతరం చెప్పినందుకు మహిళపై కాల్పులు జరిపి చంపారు. వివరాల ప్రకారం.. సిద్దాంత్ ఠాకూర్, దేవిశ్రీ, అసిస్టెంట్ జైలర్ సునీల్ కుమార్, ఆడిటర్ సంజీవ్ కుమార్ ఇంకా ఇద్దరు మహిళలతో స్కార్పియో వాహనంలో వెలుతున్నారు. అయితే మార్గమధ్యంలో వీరు ఓ పబ్ దగ్గర ఆగగా.. ఆక్రమంలో అక్కడ ఉన్న ముగ్గురు దుండగులు కారులో ఉన్న మహిళలపై కామెంట్లు విసిరారు. ఈ నేపథ్యంలో కారులో ఉన్న మహిళ వారు చేసిన వ్యాఖ్యలపై ఎదురు తిరిగి దుండగుల మీద మండిపడింది. ఆ సందర్బంలో మీ అంతు చూస్తామని చెప్పిన దుండగులు అక్కడి నుంచి వెళ్లి పోయారు. అనంతరం మరో ఇద్దరిని వెంటపెట్టుకొని వచ్చి.. స్కార్పియో కారును ఎక్స్ ప్రెస్ హై వే మీద వెంబడించారు. ఐఫ్కో చౌక్ దగ్గర బేస్ బాల్ బ్యాట్ లతో స్కార్పియో కారు అద్దాలు పూర్తిగా ద్వంసం చేశారు. తుపాకులు తీసుకుని కారులో ఉన్న సిద్దాంత్, దేవిశ్రీలపై కాల్పులు జరిపారు. నిందితులు అక్కడి నుంచి వచ్చిన కారులో తప్పించుకుని పారిపోయారు. తీవ్రగాయాలైన సిద్దాంత్, దేవిశ్రీ గురుగ్రామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు చెప్పారు. సందీప్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.

బెంగుళూరులో కార్మికుల ఆందోళన..తీవ్ర విధ్వంసం

ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే బెంగుళూరు ఇవాళ యుద్ధరంగాన్ని తలపించింది. ఎక్కడ చూసినా పెనుగులాటలు, ఘర్షణలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనంతటికి కారణం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే. పీఎఫ్ విత్‌డ్రా చేసుకునేందుకు కేంద్రం ఒక షరతు పెట్టింది.  దీనిపై ఉద్యాన నగరంలోని కార్మిక లోకం భగ్గుమంది.   అందరూ రోడ్లెక్కి తమ నిరసనను తెలియజేశారు. ప్రధాన రహదారులను దిగ్బంధించారు. జంక్షన్ల వద్ద గుంపులు గుంపులుగా చేరుకుని మానవహారాలు నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఆందోళన ఉధృతమైంది. పోలీసుల చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన కార్మికులు పోలీస్ స్టేషన్‌కు నిప్పుపెట్టారు. కనిపించిన ప్రతి బస్సును ధ్వంసం చేసి తగులబెట్టారు. పోలీసులు తప్పనిసరి పరిస్థితుల్లో లాఠీలు ఝుళిపించడంతో అందుకు కౌంటర్‌గా కార్మికులు రాళ్లు రువ్వారు. ఈ లోగా అదనపు బలగాలు చేరుకుని దొరికిన వారిని దొరికినట్టు బాది పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఆందోళనకు పాల్పడిన వారంతా గార్మెంట్ కార్మికులే.

సెల్ఫీ తంటాలు.. కేరళ సీఎం ఉమెన్ చాందీకి గాయాలు

  సెల్ఫీలు తీసుకుంటూ ఈ మద్య చాలా మంది చనిపోతున్నారు. అయితే ఇప్పుడు ఈ సెల్ఫీల తంటా వల్ల కేరళ సీఎం ఉమెన్ చాందీకి స్వల్ప గాయాలయ్యాయి. అసలు సంగతేంటంటే.. పెరింతల్మన్న ప్రాంతంలోని షిఫ్పా ఆడిటోరియంలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉమెన్‌చాందీ అక్కడకు వెళ్లారు. అయితే అక్కడ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అది ముగిసిన అనంతరం తిరిగి వెళ్తున్న సమయంలో  కొందరు యువకులు ఆయనతో సెల్ఫీ దిగేందుకు ఒక్కసారిగా ముందుకొచ్చారు. అదేసమయంలో పక్కనున్న గ్లాస్ డోర్ బద్దలవడంతో వాటి ముక్కలు ఉమెన్ కాలుకి కుచ్చుకపోయాయి. దీంతో ఆయనకు దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సనందించారు.

చంద్రబాబు ర్యాంకులపై రచ్చ.. స్పీడ్ తగ్గించే ప్రయత్నం చేశారా

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు వారి పనితీరును బట్టి ర్యాంకింగ్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ర్యాంకింగ్స్ పైనే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఈ ర్యాంకింగ్ లో పీతల సుజాతకు మొదటి ర్యాంకు రాగా.. తన కొడుకు చేసిన పనికి ఆరోపణలు ఎదుర్కొంటున్న రావెల కిశోర్ ఆరో స్థానం సంపాదించుకున్నారు. ఇంక ఎంతో రాజకీయానుభవం ఉన్న ఉద్దండులు యనమల అచ్చేన్నాయుడు లు కూడా వారి తరువాత స్థానాలు పొందారు. ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే.. చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న మంత్రి నారాయణ అందరికంటే ఆఖరి స్థానంలో ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అంతేకాదు ఈ ర్యాంకులకు వైసీపీ నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారట. దీనిపై వైసీపీ నేత స్పందించి.. మంత్రి నారాయణకు చివరి స్థానం రావడం చాలా ఆశ్చర్యంగా ఉందని.. బహుశా రాజధాని విషయంలో నారాయణ స్పీడ్ ఎక్కువైందనే చివరి స్థానం ఇచ్చి... ఆయన స్పీడ్ తగ్గించే ప్రయత్నం చేశారా అంటూ ఎద్దేవ చేశారు. ఇంకా ఈ ర్యాంకులపై  పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ర్యాంకుల గురించి తనకు మీడియా ద్వారానే తెలిసింది, మంత్రి నారాయణ రేయింబవళ్లు కష్టపడుతున్నారని, అతనికి చివరి ర్యాంకు రావడంపై తాను ఆశ్చర్యపోతున్నట్లు చెప్పారు.   ఇదిలా ఉండగా ర్యాంకుల విషయంలో పొరపాటు జరిగిందనే వాదన కూడా వినిపిస్తుంది. పది అంశాల ప్రాతిపదికన మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరును మదింపు చేసి ర్యాంకులు ఇవ్వాలని చంద్రబాబు ఆదేశిస్తే, కేవలం వారు చేసిన పర్యటనలు, నిర్వహించిన మీడియా సమావేశాల ఆధారంగా హడావిడిగా ర్యాంకులు ఇచ్చారంటున్నారు. ఇది తెలిసి చంద్రబాబు కూడా ర్యాంకులు అసమగ్రమని తేల్చి చెప్పారని అంటున్నారు. కాగా చంద్రబాబు మంత్రులుకు ఇచ్చిన ర్యాంకులు ఇవే. 1.       పీతల సుజాత 2.       దేవినేని ఉమామహేశ్వరరావు 3.      పత్తిపాటి పుల్లారావు 4.      కామినేని శ్రీనివాసరావు 5.      పరిటాల సునీత 6.      రావెల కిశోర్ బాబు 7.      అచ్చెన్నాయుడు 8.      గంటా శ్రీనివాసరావు 9.      కొల్లు రవీంద్ర 10.     చింతకాయల అయ్యన్నపాత్రుడు 11.     పల్లె రఘునాథ రెడ్డి 12.     మాణిక్యాలరావు 13.     కిమిడి మృణాళిని 14.     యనమల రామకృష్ణుడు 15.     పైడికొండల మాణిక్యాల రావు 16.     కేఈ కృష్ణమూర్తి 17.     నారాయణ

సీఎం కటౌట్‌కి గాజులు..

మధ్యప్రదేశ్‌లో మహిళల ఆత్మాభిమానం దెబ్బతింది. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కటౌట్‌కే గాజులు తొడిగారు.  రాష్ట్రంలో మగువలపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలతో పాటు నీటి సంక్షోభంపై మహిళా కాంగ్రెస్ సభ్యులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన మహిళలు సీఎం నివాసం ముందు గాజులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సేకరించిన మూడు లక్షల గాజులను ప్రదర్శనగా తీసుకొచ్చి వాటిని సీఎం కటౌట్లకి తొడిగి ప్రదర్శించారు. తాగునీటి సరఫరాలోనూ, మహిళల భద్రత పట్ల సీఎం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.  ఆందోళన చేస్తున్న మహిళలను పోలీసులు అడ్డుకుని పలువురిని అరెస్ట్ చేశారు.

నేను నోరు విప్పితే రహస్యాలు బయటపడతాయి... జగన్‌కు జలీల్ ఖాన్ హెచ్చరిక

  తమ పార్టీలోని ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసే పనిలో పడ్డారని..దమ్ముంటే వారితో రాజీనామా చేయించి ఎన్నికలకు దిగాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. అయితే ఆ సవాల్ చంద్రబాబు స్పందించలేదు కానీ.. ఇటీవలే వైసీపీ పార్టీ నుండి టీడీపీలోకి జంప్ అయిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మాత్రం స్పందించి తిరిగి జగన్ కు ప్రతి సవాల్ విసిరారు. విజయవాడలో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నతో కలిసి జలీల్‌ఖాన్‌ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన 'మమ్మల్ని రాజీనామా చేయమని వైసీపీ నాయకులు కోరుతున్నారు. రాజీనామాకు సిద్ధంగా ఉన్నాను. ఆతర్వాత జరిగే ఎన్నికల్లో నేను గెలిస్తే వైసీపీని మూసేస్తారా' అంటూ జలీల్‌ఖాన ప్రతిపక్ష నేత జగన్‌కు సవాల్‌ విసిరారు. 'నాలుగేళ్లలో వైసీపీ కోసం రెండు కోట్లు ఖర్చు పెట్టాను. నేను నోరు విప్పితే రహస్యాలు బయటపడతాయి'అని జలీల్ ఖాన్ హెచ్చరించారు.

మాల్యా కేసుపై జాయింట్ ఇన్వెస్టిగేషన్..

  వేలకోట్ల రూపాయలు బ్యాంకులకు టోకరా వేసి విదేశాల్లో ఉన్న విజయ్ మాల్యాకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వల్ల పాస్ పోర్ట్ రద్దయింది. అంతేకాదు మాల్యాకు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయమని కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దానిని విచారించిన కోర్టు ఈడీ వాదనలతో ఏకీభవించి నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. ఇప్పుడు ఏకంగా మాల్యా కేసులపై అటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తోపాటు ఆదాయపు పన్ను, సీబీఐలు జాయింట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి. మాల్యా కంపెనీల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. పరోక్షంగా 20 కంపెనీల్లో మాల్యాకు వాటాలు ఉన్నట్లు గుర్తించారు. అమెరికా, యూకే, సౌతాఫ్రికాలోని లిక్కర్ కంపెనీల్లో మాల్యాకు బినామీ ఆస్తులున్నట్లు గుర్తించారు. మొత్తానికి మాల్యాకు రోజు రోజుకు ఉచ్చు బిగుస్తున్నట్టు కనిపిస్తోంది.

పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగులకూ వృద్ధాప్య పింఛన్లు

  కార్మిక శాఖ ఈపీఎఫ్ ఖాతాలు కలిగి ఉన్న వారికీ ఓ గుడ్ న్యూస్. బడ్జెట్ ప్రతిపాదనల్లో భాగంగా పీఎఫ్ ఖాతాలో కంపెనీ యజమాని వాటాను 58 ఏళ్ల తరువాత మాత్రమే విత్ డ్రా చేసుకునేలా కొత్త నిబంధనలు చేసిన సగంతి తెలిసిందే. దీనికి గాను ఉద్యోగ సంఘాలు తమ వ్యతిరేకతను ప్రదర్శించాయి. ఈ నేపథ్యంలోనే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)  పీఎఫ్ విత్ డ్రా నిబంధనలను సరళీకృతం చేస్తూ తాజాగా కొన్ని మార్పులు చేసింది. మారిన నిబంధనల ప్రకారం.. పీఎఫ్ ఖాతాదారు ఇల్లు కొనాలన్నా, తనకు లేదా తన కుటుంబ సభ్యులకు ఏదైనా రోగసమస్యలు వచ్చినా, లేక పిల్లల పెళ్లి లేదా పై చదువులకు డబ్బు అవసరమైనా మొత్తం డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. అంతేకాదు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసిన వారు, ప్రభుత్వాలు అందించే వృద్ధాప్య పెన్షన్లనూ అందుకోవచ్చు. ఈ మార్పులు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయి.

మరో వివాదంలో సిద్ధూ..!

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకి టైం అస్సలు బాగున్నట్టు లేదు. ఆయన ఏది పట్టుకున్నా రివర్స్ అవుతోంది. వాచీ, ఏసీబీ, కొడుకు కంపెనీకి లబ్థి.. ఇలా వరుస వివాదాలతో సతమతమవుతున్న సిద్దూ తనకు తెలియకుండానే పరోక్షంగా వివాదాన్ని కొని తెచ్చుకున్నారు. అసలు మ్యాటరేంటంటే కరువుతో అల్లాడుతున్న ఉత్తర కర్ణాటకని సీఎం సందర్శించాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఆ హాడావుడి మామూలుగా ఉండదు. సీఎం ప్రయాణించే మార్గంలో భద్రతా చర్యలు ఇలా ప్రతి దానిలోనూ హాడావుడే. అలాగే సీఎం కాన్వాయ్‌ ముందు దుమ్ము, ధూళి లేవకుండా ఉండేందుకు ట్యాంకర్లతో నీటిని పోశారు అధికారులు. దీనిపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నీటి కొరతతో ప్రజలు అల్లాడుతుంటే..ముఖ్యమంత్రి మాత్రం నీటిని దర్జాగా దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.

తలాక్ పద్ధతిని నిషేదించవద్దు..

  ముస్లీం సంప్రదాయం ప్రకారం తలాక్ అని మూడుసార్లు చెబితే ఆ భార్యభర్తలిద్దరికీ విడాకులైపోయినట్టే. అయితే అనతి కాలంగా వస్తున్న ఈ ఆచారం వల్ల ఎంతో మంది ముస్లీం మహిళలు ఒంటరివారైపోతున్నారని.. ఈపద్దతి ద్వారా మహిళలకు అన్యాయం జరుగుతుందని ముస్లీం మహిళలే పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ పద్దతికి స్వస్తి చెప్పాలని కోరుతూ ఉత్తరాఖండ్ కు చెందిన షరయా భానో అనే మహిళ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అయితే దీనిపై విచారించిన సుప్రీంకోర్టు ఆ మతానికి సంబంధించిన పద్దతులు, నియమ నిబంధనలు అన్నీ తెలిసిన తరువాతే నిర్ణయం తీసుకోవాలని చూస్తోంది. మరోవైపు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తలాక్ పద్దతికి మద్దతివ్వాలని నిర్ణయించింది. తలాక్ చెబుతూ విడాకులిచ్చే సంప్రదాయాన్ని రద్దు చేసే నిర్ణయాన్ని వ్యతిరేకించాలని నిశ్చయించుకుంది. ఈమేరకు ఆ బోర్డు కూడా సుప్రీంకోర్టులో విచారణకు హాజరై... తమ అభిప్రాయాలను చెప్పనుంది. కానీ ఆల్ ఇండియా ముస్లిం ఉమెన్ పర్సనల్ లా బోర్డు చీఫ్ షైస్తా అంబార్ కూడా 'తలాక్'ను రద్దు చేయాలని కోరుతున్నారు.

పాపం ట్రంప్.. 9/11 విషయాన్నే మరచిపోయాడు..

  అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న డొనాల్ట్ ట్రంప్ అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కామన్. అలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే డొనాల్డ్ ట్రంప్ కు కొన్ని విషయాలు తెలియదు అని ఒబామా అంటుంటారు. ఇప్పుడు చూడబోతే అది నిజమేనేమో అనిపిస్తుంది ట్రంప్ చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే. 9/11 అంటే మనందరికి వెంటనే గుర్తొచ్చేది.. ఉగ్రవాదులు ట్విన్ టవర్స్ పై దాడి జరపడం.. వేలాది మంది మృతి చెందడం. అయితే డొనాల్డ్ ట్రంప్ ఆ విషయం మరిచిపోయినట్టున్నారు. బుఫాలోలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన 9/11 కాకుండా 7/11 దాడులు అంటూ మాట్లాడుకుంటూ పోయారు. ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఆ దాడి గురించి మాట్లాడుతున్నంతసేపు 7/11 నాడు అని ట్రంప్ వ్యాఖ్యానించడం ఆశ్చర్యం. 7/11 నాడు తాను దాడి జరిగిన ప్రాంతానికి దగ్గర్లోనే ఉన్నానని, పోలీసులు, ఫైర్ మన్లు పడ్డ కష్టాన్ని చూశానని చెప్పారు. ఆయన మాట్లాడుతున్నంత సేపూ తప్పును సరిదిద్దాలని ఆయన టీం ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదట. ఏదో చిన్న విషయం అయితే సరే కాని.. మొత్తానికి అమెరికా వాసులు మరిచిపోలని ఘటన గురించి ట్రంప్ మరిచిపోయి వ్యాఖ్యలు చేశారు. మరి దీనిపై ట్రంప్ ఎన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందో చూడాలి.

పోలీసులకే మస్కా..చైన్ కొట్టేసి పోలీసుల బైక్‌పై పరార్?

హైదరాబాద్‌లో చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. పోలీసుల కఠిన చర్యలు, నిఘా తదితర కారణాలతో గత కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్న చైన్ స్నాచర్స్ తాజాగా సరూర్‌నగర్‌లో అలజడి స‌ృష్టించారు. సరూర్‌నగర్ పోలీస్ ‌స్టేషన్ పరిధిలో చైన్‌ స్నాచింగ్‌ జరిగింది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు బైక్‌పై పారిపోతున్న చైన్ స్నాచర్లను వెంబడించారు. అయితే కొంతదూరం వెళ్లిన తర్వాత స్నాచర్ల బండిలో పెట్రోల్ అయిపోవడంతో ఆగిపోయింది. వారిని వెంబడిస్తూ వచ్చిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దుండగులు వారి వద్దవున్న మారణాయుథాలతో బెదరించి పోలీసుల బైక్‌ లాక్కొన్నారు. అదే వాహనంపై అక్కడి నుంచి పారిపోయారు. ఈ ట్విస్ట్‌తో పోలీసులకు మైండ్ బ్లాంక్ అయ్యింది. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. పరారైన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

మోడీ సర్కార్, గవర్నర్ పై ఉత్తరాఖండ్ కోర్టు ఆగ్రహం..

  ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతిపాలన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై సుప్రీంకోర్టు గవర్నర్, కేంద్ర ప్రభుత్వ తీరుపై సంచలన వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రపతి పాలనపై ఆ రాష్ట్ర సీఎం హరీశ్ రావత్ సుప్రీంకోర్టులో పిటషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధమైన పదవులు పొంది విధులు నిర్వ‌హిస్తున్నవారు వారి పరిధులు మించి మ‌రొక‌రి అధికారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండాల‌ని సూచించింది. గవర్నర్ కేంద్రానికి ఏజెంట్ కాదని..  కేంద్ర ప్ర‌భుత్వం ఈ విష‌యంలో ఆస‌క్తిని క‌న‌బ‌ర్చ‌డం అనవసరమ‌ని వ్యాఖ్యానించింది. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే విషయంలో కేంద్రం అతిగా ప్రవర్తించిందని.. అసాధారణ పరిస్థితుల్లో మాతమ్రే రాష్ట్ర వ్యవహారాలలో జోక్యం చేసుకోవాలని మందలిచింది.

ఆత్మహత్య ముందు ప్రత్యూష బెనర్జీ గర్భవతే..

  చిన్నారి పెళ్లికూతురు నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య వ్యవహారం కూడా డైలీ సీరియల్ మాదిరి కొనసాగుతూనే ఉంది. ఈ ఆత్మహత్యపై ఇప్పటికే ఎన్నో ఆసక్తికర విషయాలు బయటకి వచ్చాయి. ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ బయటకి వచ్చింది. ఆత్మహత్యముందు ప్రత్యూష బెనర్జీ రెండు నెలల గర్భవతి అయివుంటుందన్న ఆరోపణలు తలెత్తాయి. ఇప్పుడు ఆవార్తలు నిజమే అని తేలింది. ముంబైలోని జేజే ఆసుపత్రి వైద్యులు ప్రత్యూష బెనర్జీ మృతదేహానికి పోస్ట్ మార్టం చేశారు. దీనికి సంబంధించిన నివేదికను పోలీసులకు అందజేయగా అందులో వైద్యులు ప్రత్యూష గర్భవతి అయిందన్న విషయాన్ని తేల్చి చెప్పారు. అయితే ఆమె ఆత్మహత్యకు కొన్ని రోజుల ముందే అబార్షన్ జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రి డీన్ డాక్టర్ టీపీ లహానే మాట్లాడుతూ ప్రత్యూష శరీరంలో చనిపోయిన పిండానికి సంబంధించిన కణాలు లభించాయని.. వాటి ద్వారా ఆమె గర్భవతి అయిన విషయం తెలిసిందని.. అయితే దీనికి కారణం ఎవరో అన్న విషయం చెప్పడం మాత్రం చాలా కష్టమైన పని అని చెప్పారు. ఇంకా ఇంతకు మించి ఎక్కువ వివరాలు చెప్పలేం.. మిగిలిన విషయాలు పోలీసులు తెలుపుతారు అని లహానే అన్నారు. మరి ముందు ముందు ఇంకెన్ని విషయాలు బయటపడతాయో చూడాలి.