బెజవాడలో రౌడీయిజం మళ్లీ మెల్కొంది..!

రెండు దశాబ్ధాల క్రితం రౌడీయిజం పేరు చెప్పగానే టక్కున గుర్తుక్కొచ్చే నగరం విజయవాడ. రాష్ట్ర రాజకీయాలనే శాసించే స్థాయిలో రౌడీయిజం తన విశ్వరూపాన్ని చూపించింది. కాని అదంతా ముగిసిన కథ.. రాష్ట్ర విభజన తర్వాత పొలిటికల్ అండ్ అడ్మినిష్ట్రేషన్ కాపిటల్‌గా విజయవాడ టర్న్ అవ్వడంతో రౌడీలు నిద్ర లేచారు. నిన్న అర్థరాత్రి నగరంలోని పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్లపై కత్తులు చేతబట్టుకుని స్వైర విహారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి మళ్లీ పాత రోజులను గుర్తుకు తెచ్చారు.   పోలీస్ రికార్డుల్లో రౌడీ షీటర్‌గా ఉన్న రాఘవేంద్ర అనే వ్యక్తిపై జాన్‌ బాబు అనే మరో రౌడీ షీటర్ వర్గం కత్తులతో విరుచుకుపడింది. ఈదాడిలో రాఘవేంద్రకు తీవ్ర గాయాలయ్యాయి. తమపై రాఘవేంద్ర అనుచరులు కత్తులతో దాడి చేశారని జాన్ బాబు వర్గం ఆరోపించింది. ఈ ఘటన సంచలనం సృష్టించడంతో పోలీసులు ఇరువర్గాల వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. విజయవాడకు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత పోలీసు పహారా మరింత పెరగడంతో చాలా వరకు ఇలాంటి ఘటనలు తగ్గిపోయాయి. మళ్లీ సంఘ విద్రోహ శక్తులు రెచ్చిపోతుండటంతో వీరిని అణచివేసేందుకు ఖాకీలు రెడీ అవుతున్నారు.

ఈడి ఇచ్చిన షాక్ కి దిగొచ్చిన మాల్యా.. 6వేల కోట్లు కడతా..

  ఇన్ని రోజులు ఈడీ ముందు హాజరుకాకుండా విజయమాల్యా షాకిస్తుంటే.. ఇప్పుడు ఈడీనే విజయమాల్యాకు షాకిచ్చింది. ఇప్పటికే రెండు మూడుసార్లు తమ ముందు హాజరుకావాలని ఈడీ అధికారులు మాల్యాకు నోటీసులు జారీ చేయగా.. మాల్యా మాత్రం వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా.. ఏవో కుంటిసాకులు చెబుతూ గడువు కోరుతూ వచ్చాడు. ఈనేపథ్యంలో ఆగ్రహం చెందిన ఈడీ.. మాల్యా పాస్ పోర్టు రద్దు చేయాలని ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈడీ ఇచ్చిన ఈ షాక్ కి మాల్యా స్పందించి రుణాల సెటిల్ మెంట్ కు సంబంధించి మరో కొత్త ఆఫర్ ను తెరపైకి తెచ్చారు. తను మొదటి దఫాగా చెల్లిస్తానన్న 4వేల కోట్లను పెంచుతూ ఇప్పుడు మొత్తం 6 వేల కోట్లు చెల్లిస్తానని దిగొచ్చాడు. దీంతో ఇప్పుడు మరింత చర్యలు తీసుకుంటే మాల్యా తప్పకుండా ఈడీ ముందు హాజరవుతారని అధికారులు భావిస్తున్నారు.

ముంబైని వదలని మంటలు

దేశ ఆర్థిక రాజధాని ముంబైని అగ్నిదేవుడు వదలడం లేదు. నగరంలో రోజుకోక ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంటూనే ఉన్నాయి. నిన్న భీవాండీ ప్రాంతంలో జరిగిన భారీ అగ్నిప్రమాదం మరిచిపోక ముందే ఇవాళ లోఖండ్ వాలా ప్రాంతంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. లోఖండ్‌వాలాలోని 13 అంతస్తుల రహేజా క్లాసిక్  బిల్డింగ్‌లో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. చూస్తుండగానే భవనం మొత్తాన్ని కమ్మెసాయి. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. అయితే వరుస అగ్నిప్రమాదాలు జరుగుతుండటం పట్ల ముంబై మహానగర పాలక సంస్థ, మహారాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఎస్సీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ గా కారెం శివాజీ

  ఆంధ్రప్రదేశ్ కు ఎస్సీ ఎస్టీ ఛైర్మన్ గా కారెం శివాజీని నియమించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఈ పదవిలో మూడేళ్ల పాటు కారెం శివాజీ కొనసాగనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఈ సంస్థను ఏర్పాటు చేసుకుంటూ, రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖ ఉత్తర్వులిచ్చింది. ఎస్సీ ఎస్టీ ప్రజల బాగోగులు, ప్రయోజనాలు రక్షించేందుకు ఈ కమిషన్ కృషి చేస్తుంది. ఎస్సీ ఎస్టీ చట్టం, 2003 లో అమల్లోకి వచ్చింది. 2006లో తర్వాత కమీషన్ ఛైర్మన్ పదవిని భర్తీ చేయలేదు. ఆ తర్వాత రాష్ట్రం విడిపోవడంతో, ఇప్పుడు మళ్లీ కొత్తగా కమిషన్ ఏర్పాటు చేసుకుని, దానికి ఛైర్మన్ ను నియమించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. కాగా, వెనుకబడిన వారి అభివృద్ధికి కృషి చేస్తానని, తనకు ఇలా సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతల్ని కారెం శివాజీ తెలిపారు.

గంగా ప్రక్షాళనకు జర్మనీ చేయూత..!

  భారతదేశ ప్రజలు అతి పవిత్రంగా భావించే గంగానది శుద్ధి కోసం కేంద్రప్రభుత్వం నడుం బిగించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మహత్కార్యంలో భారత్ కు సాయంగా తాముంటామంటూ జర్మనీ ముందుకొచ్చింది. రివర్ బేసిన మ్యానేజ్ మెంట్ పద్ధతి ద్వారా, గంగానదిని శుద్ధి చేసేందుకు సాయం చేస్తామని జర్మనీ పేర్కొంది. దీనికి సంబంధించి భారత కేంద్ర జలవనరుల శాఖ, జర్మనీ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ కలిసి ఒప్పందంపై సంతకాలు చేశాయి. గంగానదీ పరీవాహక తీరప్రాంతాల్లో కాలుష్యం ఎక్కువైపోవడం, ఫ్యాక్టరీ వ్యర్ధాలను గంగలోకి వదిలెయ్యడం వంటి పనుల కారణంగా, దశాబ్దాల పాటు గంగానది తీవ్రంగా కలుషితమౌతూ వస్తోంది. మోడీ అధికారంలోకి రాకముందు, గంగా ప్రక్షాళన కూడా తమ మేనిఫెస్టోలో చేర్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గంగానది ప్రక్షాళన ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. జర్మనీలోని డాన్యూబ్ నదిని శుద్ధి చేసిన రివర్ బేసిన మ్యానేజ్ మెంట్ విధానం ద్వారానే గంగను కూడా క్లీన్ చేయబోతున్నారు. 2016 నుంచి 2018 వరకూ మూడేళ్లపాటు జర్మనీ ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉంటుంది.

జగన్‌పై పరువునష్టం దావా వేస్తా:సీఎం రమేశ్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌పై పరువు నష్టం దావా వేస్తానన్నారు టీడీపీ ఎంపీ రమేశ్. కొద్ది రోజుల క్రితం రమేశ్‌కు చెందిన కంపెనీపై జగన్‌కు చెందిన సాక్షి పత్రిక కథనాలు ప్రచురించింది. దీనిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు రమేశ్. నిరాధారమైన వార్తలు రాస్తున్న సాక్షిపై చర్యలు తీసుకోవాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తానన్నారు. యూపీలో ఉన్న తన కంపెనీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టలేదని..అలా పెట్టినట్టు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని..ఒకవేళ నిరూపించలేకపోతే సాక్షిని మూసివేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. అవినీతి డబ్బుతో పత్రిక పెట్టిన జగన్‌కు, అందరూ అవినీతిపరులుగానే కనిపిస్తున్నారని సీఎం రమేశ్ ఆరోపించారు.

నన్నపనేనికి వడదెబ్బ..!

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. బయటకు రావాలంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే ఎండవేడిమికి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ ఆస్పత్రిపాలవుతున్నారు. కొద్దిరోజుల క్రితం తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి తన నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చి వడదెబ్బకి గురయ్యారు. ఇప్పుడు ఈ జాబితాలోకి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి చేరారు. వడదెబ్బకు గురికావడంతో ఆమెను కుటుంబసభ్యులు హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. అక్కడ నన్నపనేని రెండు రోజులుగా చికిత్స పొందుతున్నారు. వడదెబ్బ నుంచి కోలుకోవడానికి అవసరమైన వైద్యసేవలను నిమ్స్ వైద్యులు అందిస్తున్నారు.  

ఐపీఎల్‌కి బాంబే హైకోర్టు షాక్..!

బీసీసీఐకీ గట్టి షాక్ తగిలింది. మహారాష్ట్రలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌లను వేరే వేదికలకు తరలించాలని బాంబే హైకోర్టు బీసీసీఐని ఆదేశించింది. కరువు పరిస్థితులన్నప్పటికి నీటి ఎద్దడిని పట్టించుకోకుండా ఐపీఎల్‌ను నిర్వహిస్తున్నారని, ఇందుకు లక్షల నీటర్ల నీరు వినియోగించాల్సి ఉంటుందని, అందువల్ల మహారాష్ట్రలో జరిగే మ్యాచ్‌లను వేరే ప్రాంతాలకు తరలించాలని బాంబే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిని విచారించిన బాంబే హైకోర్టు ఈ నెల 30 తరువాత మహారాష్ట్రలో నిర్వహించాల్సిన ఐపీఎల్ మ్యాచ్‌లను వేరే వేదికలకు మార్చాలని మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది.

వరదల పాపం కొత్తజంటలదే-స్వామి స్వరూపానంద

రోజుకోక వివాదస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కుతున్న ద్వారకా శారదా పీఠం శంకరాచార్య..స్వామి స్వరూపానంద సరస్వతి మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా మూడు సంవత్సరాలు వెనక్కి వెళ్లి 2013లో కేదార్‌నాథ్ ప్రాంతంలో సంభవించిన వరదలకు హనీమూనర్లే కారణమన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి విహారయాత్రలకు వస్తుంటారని వారిలో కొత్తగా పెళ్లయిన వారు కూడా ఉంటారు. వారు పరమ పవిత్రమైన, దేవతలు సంచరించే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అపవిత్రమైన పనులు చేస్తున్నారని అందుకే అంతపెద్ద ఎత్తున వరదలు సంభవించాయని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా పవిత్ర ప్రాంతాల్లో అలాంటి అపవిత్రమైన పనులు ఆపకపోతే ఇంతకంటే భయంకరమైన విపత్తులు మళ్లీ మళ్లీ తప్పవని హెచ్చరించారు. 

పనామా పేపర్స్.. మొసాక్ ఫోన్సెకా పై పోలీసుల దాడి

  'పనామా' ఈ పేరు వింటేనే బడాబాబులకు చెమటలు పట్టిపోతున్నాయి. దఫాల వారీగా బయటపెట్టిన లిస్టుల్లో ఎంతో మంది నల్లధనం దాచుకున్న వారిపేర్లను బయటపెట్టింది పనామా పేపర్స్. అయితే ఇప్పుడు పనామా కేంద్రంగా నల్లధనాన్ని దాచుకునేందుకు సహకరించిన మొసాక్ ఫోన్సెకా సంస్థపై పోలీసులు భారీ ఎత్తున దాడులు చేస్తున్నారు. సంస్థ పత్రాలన్నింటినీ స్వాధీనం చేసుకునేందుకే దాడి చేసినట్టు పనామా అటార్నీ జనరల్ కార్యాలయం వెల్లడించింది. దాడులకు వచ్చిన అధికారులకు సహకరిస్తున్నట్టు సంస్థ తన ట్విట్టర్ ఖాతాద్వారా తెలిపింది. అయితే, తమ సంస్థ పత్రాలు హ్యాక్ అయ్యాయని, తాము కూడా బాధితులమేనని మొసాక్ ఫోన్సెకా వాదిస్తోంది.

కేజ్రీవాల్ కొత్త క్రేజీ థాట్.. లెర్నింగ్ లైసెన్స్ రద్దు..!

  ఢిల్లీలోని వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సరి, బేసి విధానాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ క్రేజీ ఆలోచనకు బాగానే మార్కులు పడ్డాయి. ఇప్పుడు కేజ్రీవాల్ మరో క్రేజీ ఆలోచనను అమలు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇకనుండి ఢిల్లీ పరిధిలో లెర్నింగ్ లైసెన్స్ విధానాన్ని తొలగించాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ట్రాన్స్ పోర్ట్ కార్యాలయాల్లో అవినీతి పెచ్చు మీరిందని.. అధికంగా ముడుపులు చెల్లించాల్సి వస్తుందని.. అనేక ఫిర్యాదులు వచ్చిన పిమ్మట కేజ్రీవాల్ ఈ రకమైన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీనిపై కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించగా.. ఆయన కూడా దానికి అనుకూలంగానే స్పందిచారని..  మంచి ఆలోచనేనని అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. చదువుకున్న వారికి రవాణా నిబంధనల గురించి తెలుసునని, వారికి లెర్నింగ్ లైసెన్స్ అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే కేజ్రీవాల్ ప్రతిపాదనను కొంత మంది అధికారులు మాత్రం వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

జయలలితకు కుష్బూ సవాల్..!

  త్వరలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ మరింత రసవత్తరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జయలలిత తన నియోజకవర్గమైన ఆర్కేనగర్ నుండి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే నియోజకవర్గం నుండి దేవి అనే హిజ్రా కూడా పోటీ చేస్తున్న సంగతి కూడా విదితమే. అయితే ఇప్పటికే ఈ పోటీపై ఆసక్తి పెరగగా.. ఇప్పుడు కాంగ్రెస్-డీఎంకే కూటమి కూడా ఆర్కే నగర్ నియోజక వర్గం నుండి కుష్బూను రంగంలోకి దించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. మరి అనుకున్నది అనుకున్నట్టు జరిగి.. కుష్బూని కనుక రంగంలోకి దింపితే పోటీ చాలా రసవత్తరంగా ఉంటుంది.

డీకే అరుణకు షాక్..కారెక్కిన సోదరుడు

తెలంగాణలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహనరెడ్డి హస్తానికి హ్యాండిచ్చారు. టీఆర్ఎస్‌లో చేరుతున్నట్టు ఆయన ప్రకటించారు. ఉదయం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి , టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో  సమావేశమైన చిట్టెం ఆ వెంటనే కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కేసీఆర్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. చిట్టెం రామ్మెహన్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ సోదరుడు. అయితే తాను నియోజకవర్గ అభివృద్ధి కోసమే గులాబీ కండువా కప్పుకున్నట్లు రామ్మోహన్ తెలిపారు.

జగన్‌ని కలిసిన తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే..!

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకి రోజుకొక వైసీపీ ఎమ్మెల్యేలంతా సీఎం క్యాంప్ ఆఫీస్‌కు క్యూకడుతుంటే ఇవాళ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఒక టీడీపీ ఎమ్మెల్యే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డిని కలిశారు. జగన్‌ని కలిసింది ఎవరో కాదు బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు, ఎల్బీనగర్ టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య.   అయితే జగన్‌ని కలిసింది ఏ పార్టీలో చేరడానికి కాదు. కాపులను బీసీల్లో చేర్చడం వల్ల బీసీలకు నష్టం జరుగుతుందని. బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కృష్ణయ్య డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ అంశంపై తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రాజకీయ పార్టీలను కలుస్తున్న ఆయన దీనిలో భాగంగానే వైఎస్ జగన్‌ని కలిసి వినతిపత్రం అందించారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాయాలని జగన్‌ని కోరారు. ఏపీలో వైసీపీ నేతలంతా టీడీపీలో చేరుతుండటంతో టీడీపీ ఎమ్మెల్యే అయిన కృష్ణయ్య జగన్‌ని కలవడంతో ఈ వార్త ప్రాధాన్యతను సంతరించుకుంది.  

నిట్ తెలుగు విద్యార్ధులు.. ఫ్యాకల్టీనే అత్యాచారం చేస్తామని బెదిరించారు..

  శ్రీనగర్ నిట్ లో స్థానికుల, స్థానికేతర విద్యార్ధుల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న తెలుగు విద్యార్ధులు తన స్వస్థలాలకు రావడానికి అనుమతి ఇచ్చిన సంగతి కూడా విదితమే. అలా అక్కడి నుండి బయటపడిన విద్యార్ధులు యూనివర్శిటీలో అనుభవించిన కష్టాల గురించి చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్శిటీ నుండి ఢిల్లీకి చేరుకోవడానికి చాలా కష్టాలు పడ్డామని.. నిరసన చేపడుతున్న సమయంలో స్థానిక విద్యార్దులు తమను బెదిరించారు.. ఆఖరికి ఫ్యాకల్టీ కూడా క్లాసులకు రాకపోతే అమ్మాయిలపై అత్యాచారాలు చేస్తామని బెదిరించారని వాపోయారు. ఈ సందర్బంగా వారు తమ డిమాండ్లను కూడా తెలియజేశారు.. ఇక మేం అక్కడ ఉండలేమని.. నిట్ ను అక్కడి నుండి తరలించాలి.. లేదా మమ్మల్ని వేరే వర్శిటీల్లోకి చేరే అవకాశం ఇవ్వాలని.. మమ్మల్ని కొట్టిన శ్రీనగర్ పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా శ్రీనగర్ నుంచి ఢిల్లీకి వచ్చిన 30 మందికి పైగా విద్యార్థులకు ఆశ్రయం కల్పించిన ఏపీ భవన్ అధికారులు, వారిని స్వస్థలాలకు పంపేందుకు చర్యలు చేపడుతున్నారు.

జగన్ తో ఆర్. కృష్ణయ్య భేటీ.. అందుకేనా?

  తెలంగాణ టీడీపీ, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో లోటల్ పాండ్ లో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని.. పార్లమెంటులో బిల్లు పెట్టేలా ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయాలని తాను జగన్‌ను కోరానని చెప్పారు. దీనికి జగన్ అనుకూలంగా స్పందిచారని.. వారంలోపులో లేఖ రాస్తానని జగన్ హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. ఇంకా కాపు రిజర్వేషన్ గురించి కూడా ఆయన మాట్లాడుతూ కాపు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నామని.. కాపులను బీసీల్లో చేర్చితే బీసీలు నష్టపోతారని ఆయన ఆరోపించారు. మరోవైపు కృష్ణయ్య, జగన్ భేటీలపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ పెద్దలు.. కృష్ణయ్య చెప్పినట్టు రిజర్వేషన్ల నేపథ్యంలోనే భేటీ అయ్యారా.. లేక ఇంకా ఏదైనా మతలబు ఉందా అంటూ సందేహిస్తున్నారు.

జగన్ ఇలాకాలో మరో వికెట్ డౌన్.. టీడీపీలోకి సుజయకృష్ణ రంగారావు..!

వైసీపీ నుండి గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడి పార్టీ నుండి జంప్ అవుతున్నారు అని వార్తలు గురించి ఇంకా మరిచిపోకముందే మరో ఎమ్మెల్యే జగన్ షాకిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు కూడా టిడిపి తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే సుజయకృష్ణ రంగారావు స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం.  తాను తెలుగుదేశం పార్టీలో చేరాలని అనుకుంటున్నానని వెల్లడించిన ఆయన.. నేతల అభిప్రాయాలను కోరారు. త్వరలోనే తాను కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీలోకి వస్తానని ఆయన తెలిపినట్టు సమాచారం. తనతో పాటు పెద్దఎత్తున కార్యకర్తలు సైతం పార్టీ మారుతారని రంగారావు వెల్లడించారట.