హంద్వారాలో కొనసాగుతున్న ఉద్రిక్తత.. ఆందోళనల మధ్యే ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ
posted on Apr 16, 2016 @ 3:24PM
కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలోని హంద్వారా పట్టణంలో ఓ అమ్మాయిని జవాన్ వేధించాడంటూ స్థానికులకు, జవాన్లకు మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఆందోళనకారులు ఆర్మీ పికెట్ పై దాడి చేసి, నిప్పు పెట్టేందుకు ప్రయత్నించగా.. జవాన్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. ఈ ఘటనపై ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఇంటర్నెట్, మొబైల్ సేవలను నిలిపివేయగా.. ఇప్పుడు శ్రీనగర్ తో పాటూ సున్నితమైన ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు.
మరోవైపు ఆందోళనలతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న అక్కడి కుప్వారా జిల్లాలో నేడు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ పర్యటించనున్నారు. దీంతో ముఖ్యమంత్రి పర్యటన అనంతరం నాలుగు రోజులుగా వేడెక్కిన అక్కడి వాతావరణం చల్లబడుతుందని భావిస్తున్నారు.