అమ్మకానికి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్..

  అదేదో పాత వస్తువును కనుక ఈ కామర్స్ సైట్లో పెట్టి అమ్మేసినట్టు అమ్మకానికి పెట్టారు పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ ను. ఈ విచిత్రమైన ఘటన పాకిస్థాన్ లోనే జరగడం ఆశ్చర్యకరం. పాకిస్థాన్ కు చెందిన ఓ వ్యక్తి 'యూస్ లెస్ పాకిస్థాన్ పీఎం నవాజ్ షరీఫ్ ఫర్ సేల్' అంటూ ఆయన ఫొటోను ఈ 'బే'లో  పెట్టి ఒక ప్రకటన ఇచ్చాడు. అంతేకాదు ఆయన ప్రాథమిక ధర 66,200 పౌండ్ల అంటూ ఆయన ధరను కూడా ఫిక్స్ చేశాడు. ఇంకా ఆయన గురించి చెబుతూ.. ఇప్పటికే వాడేసిన ప్రధాని షరీఫ్‌ను అమ్మేస్తున్నాం. ఇంక ఎంతమాత్రం మాకు అవసరం లేదు. ఈ అమ్మకం కోసం బాక్స్ గానీ, ఇన్‌స్ట్రక్చన్స్ గానీ ఇవ్వబడవు. కొనుగోలుదారుడే వచ్చి కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐటెం అమ్మకందారుడు ఇంతవరకు టచ్ చేయలేదు. సెంట్రల్ లండన్ నుంచి ఐటెంను కలెక్ట్ చేసుకోవచ్చు. కొనుగోలు పూర్తికాగానే పూర్తి చిరునామా తెలియజేస్తాం. కొనుగోలుదారుడే రవాణా ఏర్పాట్లు చేసుకోవాలి అని ప్రకటనలో పేర్కొన్నాడు.  

నా బట్టలు చించేశారు.. తృప్తీ దేశాయ్

భూమాతా బ్రిగేడ్ సంఘం అధ్యక్షురాలు తృప్తీ దేశాయ్ కొత్త ఆరోపణలు చేశారు. ఆమె కొల్హాపూర్ లోని మహాలక్ష్మీ దేవాలయానికి వెళ్లగా అక్కడ ఆమెను పోలీసులు అడ్డుకొని.. చీర కట్టుకున్న వారికే ఆలోయంలోకి ప్రవేశం ఉంటుందని అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఇప్పుడు దీనిపై ఆమె కొల్హాపూర్ లో కొందరు తన బట్టలు చించివేశారని, తనను నోటితో చెప్పలేని విధంగా తూలనాడారని.. హిందూ సంస్థలు తనను హత్య చేయాలని ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. అంతేకాదు ఆందోళనకారులు తనను ప్రాణాలతో బయటకు పోనీయరాదని మాట్లాడుకున్నారని, స్వయంగా ఆలయ పూజారి తనను అడ్డుకున్నారని అన్నారు. ఈ విషయంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కల్పించుకుని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా తప్తీ దేశాయ్ పై కొంతమంది మతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రైతులకు మరితం లాభదాయకంగా మోడీ "నామ్"

అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ('నామ్') ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు మరితం లాభదాయక ధరను దగ్గర చేయడమే దీని లక్ష్యమని అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి రాదా మోహన్ సింగ్ మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులకు ఒకే ధరను అందించే ఆలోచనతో తయారైన ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ పోర్టల్ ఈ నామ్.. 8 రాష్ట్రాల్లోని, 21 ప్రధాన మండీ( వ్యవసాయ మార్కెట్)లను 585 రెగ్యులేటెడ్ హోల్ సేల్ మార్కెట్లను భాగం చేస్తూ రూపొందించిన ఈ ఆన్ లైన్ ఫ్లాంట్ ఫాం ద్వారా రైతులు లాభపడవచ్చని.. దీని ద్వారా రైతులు తమ ఉత్పత్తులను పోటీ ధరలకు విక్రయించుకోవచ్చని, వినియోగదారులకు స్థిరమైన ధరలకు వ్యవసాయ ఉత్పత్తులు లభిస్తాయని తెలిపారు.

కన్నయ్య కుమార్ పై చెప్పు దాడి.. ఎండలు మండిపోతున్నాయి జాగ్రత్త

  జైఎన్యూ సంఘ నేత కన్నయ్య కుమార్ కు చేదు అనుభవం ఎదురైంది. నాగపూర్ లోని ఓ సభలో పాల్గొన్న ఆయనపై భజరంగ్ దళ్, ఏబీవీపీ కార్యకర్తలు చెప్పు విసిరి దాడి చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో కన్నయ్య సభికులను ఉద్దేశించి మాట్లాడుతూ.. శాంతించాలని, తనపై చెప్పు విసిరిన వ్యక్తి చెప్పులు పోగొట్టుకున్నాడని అన్నారు. అంతేకాదు వారిని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ.. జెఎన్యూ, హెచ్ సీయూలో జరిగిన ఘటనల్లో నా చెప్పులు పోయాయని.. అది గమనించిన భజరంగ్ దళ్, ఏబీవీపీ సోదరులు తనకు చెప్పులు తెచ్చారని.. కానీ ఇక్కడ వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే.. ఇక కన్నయ్య కుమార్ పై బయట ఎండలు మండిపోతున్నాయి. ఇలా ఒక్కో చెప్పు పారేసుకుంటే కాళ్లు కాలుతాయి, నాపై ద్వేషం పెంచుకున్నా పర్లేదు. కానీ, మీ కాళ్లు కాలకుండా చూసుకోండి. నా మీద ప్రేమతో చెప్పులు పోగొట్టుకోకండి' అని ఆయన చమత్కరిస్తూ మాట్లాడారు. ఇదిలా ఉండగా కన్నయ్యపై దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ట్రైన్‌లో బెర్త్ ఇవ్వలేదని ఎమ్మెల్యే రచ్చరచ్చ

ట్రైన్‌లో బెర్త్ ఇవ్వలేదని ఒక ఎమ్మెల్యే రచ్చ రచ్చ చేశాడు. నాందేడ్‌కు చెందిన శివసేన ఎమ్మెల్యే హేమంత్ పాటిల్ ముంబై నుంచి తన సొంతఊరు వెళ్లేందుకు ఛత్రపతి శివాజీ టెర్మినల్‌కు చేరుకున్నాడు. దేవగిరి ఎక్స్‌ప్రెస్ ఏసీ కోచ్‌లో ఆయనకు సైడ్ బెర్త్ కేటాయించారు. అయితే తనకు సైడ్ బెర్త్ వద్దని వేరే చోట బెర్త్ ఇవ్వాలని టీసీతో వాగ్వివాదానికి దిగాడు. అలా సాధ్యం కాదని టీసీ చెప్పడంతో ఆయనలో ఆవేశం కట్టలు తెంచుకుంది అంతే కార్యకర్తలతో కలిసి నానా గందరగోళం చేశాడు. రైలు కదిలే సమయానికి చైన్ లాగి దాన్ని ఆపించాడు. ఆయన నిర్వాకం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేవగిరి ఎక్స్‌ప్రెస్‌తో పాటు మంగళూరు, సిద్దేశ్వర్ ఎక్స్‌ప్రెస్‌లు 20 నిమిషాలు ఆలస్యంగా నడిచాయి. వీఐపీల నుంచి ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు గానూ వివిధ రైళ్లకు అదనంగా వీఐపీ కోచ్‌లను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేపై చర్య తీసుకోవాల్సిందిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర  ఫడ్నవీస్‌ను, అసెంబ్లీ స్పీకర్‌ను కోరారు సెంట్రల్ రైల్వే అధికారులు.  

మహారాష్ట్ర నీటి కరువు.. ఒక‌ టోకెన్‌కు ఒకే బింద నీళ్లు

  మహారాష్ట్రలో తీవ్రమైన నీటి కరువు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నీటి కరువు వల్లే అక్కడ ఈసారి ఐపిఎల్ మ్యాచ్ లు కూడా జరగడానికి హైకోర్టు అనుమతి ఇవ్వడంలేదు. ఇదిలా ఉండగా ఇప్పుడు అక్కడి బీడ్ గ్రామంలో టోకెన్ సర్వీసును పెట్టే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే.. నీటి కరువు వల్ల బీడ్ గ్రామంలోని ప్రజలు ఓ దిగుడుబావి నుండి నీళ్లు తెచ్చుకుంటున్నారు. అయితే బావి నుండి నీళ్లు తెచ్చుకునే క్రమంలో.. అధికంగా నీళ్లు తీసుకునే ప్ర‌య‌త్నంలో ఆ దిగుడుబావిలో రాళ్లు, దుమ్ము ప‌డుతోందట. దీంతో పరిస్థితిని గమనించిన గ్రామస్థులు దానిని నివారించేందుకు బావి ద‌గ్గ‌ర టోక‌న్ సిస్ట‌మ్ ప్ర‌వేశ‌పెట్టారు. దీని ప్ర‌కారం ఆ దిగుడు బావి నుంచి ఒక‌ టోకెన్‌కు ఒకే బింద నీళ్లు తీసుకునే నిబంధన విధించారు. దీన్ని ఉల్లంఘించిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్పవ‌ని హెచ్చ‌రించారు.

అంబేద్కర్ జయంతి.. విగ్రహ రాజకీయం..

  అంబేద్కర్ 125వ జయంతి సందర్బంగా పలు చోట్ల ఆయన వేడుకలు నిర్వహించారు. అయితే ఈ వేడుకలను రాజకీయం చేశారు నేతలు. అనంతపురం జిల్లా హిందూపురంలో అంబేద్కర్ జయంతి సందర్బంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన విగ్రహానికి పూలమాల వేయడానికి వచ్చిన  వైపీసీ నియోజక వర్గ ఇంఛార్జి నవీన్ నిశ్చల్‌ను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. తన నియోజక వర్గ ఎమ్మెల్యే బాలకృష్ణ వచ్చేంత వరకు ఎవరూ పూలమాల వేయడానికి కుదరదంటూ అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నేతల తీరుపై నవీన్ నిశ్చల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పరిస్థితి గమనించిన పోలీసులు వెంటనే జోక్యం చేసుకొని నవీన్ నిశ్చల్‌ను పూలమాల వేయనివ్వడంతో గొడవ సద్దుమణిగింది.

సోదరుడి టీఆర్ఎస్ చేరికపై డీకే అరుణ ఫైర్.. కుటుంబంలో చిచ్చుపెట్టడానికే..

  మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తన సోదరుడు టీఆర్ఎస్ లో చేరడంపై గద్వాల్ ఎమ్మెల్యే డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ తన కుటుంబంలో చిచ్చుపెట్టడానికే ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. అంతేకాదు.. పార్టీ మారేవాళ్లందరూ రాజీనామా చేసి పార్టీ మారాలని.. అది నా సోదరుడైనా కానీ ఎవరైనా కానీ రాజీనామా చేసి పార్టీ మారాల్సిందే అని ఆమె మండిపడ్డారు. చిట్టెం రామ్మోహన్ రెడ్డి నిర్వాహకంతో తన తండ్రి ఆత్మ క్షోభిస్తోందన్నారు.

సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర కూడా టీడీపీలోకి..?

వైసీపీ నేతలు ఒక్కోక్కరుగా టీడీపీలోకి జంప్ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఇప్పటికే బొబ్బిలి ఎమ్మెల్యే వెంకట సుజయ కృష్ణ రంగారావు టీడీపీలోకి చేరుతున్నారు అని తెలుస్తోంది. ఇప్పుడు మరో ఎమ్మెల్యే కూడా టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. అది ఎవరో కాదు సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర. అయితే పార్టీ మార్పుపై సుజయతో మాట్లాడటానికి విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి, ధర్మాన, పెద్దిరెడ్డి అతనితో మాట్లాడటానికి బొబ్బిలి వెళ్లగా.. సుజయ మాత్రం వారితో మాట్లాడటానికి అంగీకరించలేదు. దీంతో వారు నేరుగా రాజన్న దగ్గరికి వెళ్లి ఆయనతో మాట్లాడారు. టీడీపీ పెట్టే ప్రలోభాలకు లొంగొద్దని.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ అధినేత జగన్ తో మాట్లాడాలని చెప్పగా..దీనికి రాజన్న తాను పార్టీ మారాలనుకోవడం లేదని చెప్పినట్టు సమాచారం.

ఇండియాలో పాగా వేశాం.. ఎప్పుడైనా దాడి చేయోచ్చు... ఐసిస్

ఉగ్రవాదుల ఆగడాలు రోజు రోజుకు పేట్రేగిపోతున్నాయి. ఇప్పటికే వారి ఆకృత్యాల వల్ల ఎంతో మంది ప్రాణాలు బలిగొన్నారు. అయితే ఇప్పుడు ఐసిస్ ఇండియాపై దాడులు చేసేందుకు సిద్దంగా ఉన్నామని బహిరంగంగానే సంచలనమైన ప్రకటన చేసింది. 'దబీక్' అనే ఆన్ లైన్ పత్రికకు.. షేక్ అబూ ఇబ్రహీం అల్-హనీఫ్ అనే ఉగ్రవాది ఇచ్చిన ఇంటర్య్వూలో ఈ రకమైన సంచలన వ్యాఖ్యలు చేయడం అందరినీ భయానికి గురిచేస్తుంది. ఇండియాలో ఇప్పటికే తాము పాగా వేశామని.. బంగ్లాదేశ్, పాకిస్థాన్ ప్రాంతాల్లోని ఉగ్రవాద సంస్థల సహకారంతో దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని..విలాయత్ ఖురాసన్ (ఆఫ్గనిస్థాన్, పాక్ కేంద్రాలుగా పనిచేస్తున్న ఇస్లామిక్ మిలిటెంట్ విభాగం) సాయం తీసుకునే భారత ముజాహిద్దీన్ లు దాడులకు దిగుతారని చెప్పాడు. మరి ఉగ్రవాదులు ఇంత బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుందో చూడాలి.

అంబేద్కర్ జయంతి.. రోహిత్ తల్లి, సోదరుడు బౌద్ధ మత స్వీకరణ..

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పీహెచ్‌డీ స్కాలర్, దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి తెలిసిందే. జాతి వివక్షత వల్లే రోహిత్ చనిపోయాడని అతని తల్లిదండ్రులు..విద్యార్ధులు..పలువురు నేతలు కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. అయితే ఈ రోజు అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా రోహిత్ తల్లి, అతని సోదరుడు రాజా ముంబైలో బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ.. వివ‌క్ష‌కు తావులేని బౌద్ధమతాన్ని తాము స్వీక‌రించామ‌న్నాడు. అంబేద్క‌ర్ కూడా ఈ ఉద్దేశంతోనే త‌న జీవిత చివ‌రి కాలంలో బౌద్ధ మతాన్ని స్వీకరించారని అన్నాడు.

పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు వెళతా.. జానారెడ్డి

  పాలమూరు జిల్లా మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి మండిపడుతున్నారు. పార్టీ మారే ఎమ్మెల్యేలందరూ.. పార్టీలో గెలిచి పదవి వచ్చిన తరువాత వేరే పార్టీలోకి చేరడం కాదు.. పార్టీ మారాలనుకున్నవారు ముందుగా తమ పదవులకు రాజీనామా చేసి వేరే పార్టీలోకి వెళ్లాలని అన్నారు. అంతేకాదు తాము ఎందుకు పార్టీ  మారాలనుకుంటున్నారో కూడా నియాజకవర్గాల ప్రజలకు వెల్లడించి మరీ పార్టీ మారాలని సూచించారు. అయినా పార్టీ ఫిరాయింపులను నిరోధిస్తూ చేసిన చట్టం... ఇటీవలి కాలంలో అభాసుపాలవుతోందని.. ఫిరాయింపుల నిరోధక చట్టం సక్రమంగా అమలు కావడం లేదని..  ఈ ఉల్లంఘనలను ఇకపై ఎంతమాత్రం సహించబోమని చెప్పిన జానారెడ్డి... ఫిరాయింపులపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నామని చెప్పారు. మొత్తానికి ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న జానాకు కూడా పార్టీ ఫిరాయింపులవల్ల కోపం వచ్చిందన్నమాట.  

అవును ప్రత్యూషను కొట్టాను.. రాహుల్ రాజ్ సింగ్ మాజీ లవర్

ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో రోజుకో ఆసక్తికరమైన అంశం వెలుగుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసు విషయంలో ఆమె బాయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్ పై అనేక ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు.. అతని మాజీ ప్రియురాలు సలోనీ శర్మపై కూడా ఆరోపణలు తలెత్తాయి. అసలు ప్రత్యూష ఆత్మహత్య చేసుకోవడానికి కారణం రాహుల్ రాజ్ సింగ్, సలోని శర్మలే కారణమని కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఈ ఘటనపై ఆమె మొదటిసారి నోరు విప్పారు. ఓ ఇంటర్య్వూలో ఆమె దీనిపై స్పందించి.. అవును నేను ప్రత్యూషన్ కొట్టాను.. కానీ దాని వెనుక అసలు కారణం వేరే ఉందని జరిగిన ఉదంతం చెప్పుకొచ్చింది. నేను రాహు్ల్ కు కొంత డబ్బు ఇచ్చానని.. అది తీసుకెళ్లి ప్రత్యూషకి ఇచ్చాడని..  తిరిగి ఇవ్వడానికి రాహుల్ నిరాకరించాడని.. దీంతో డబ్బు కోసం నిలదీసేందుకు ఫిబ్రవరి 11న రాహుల్ ఉండే కాండివ్లీ అపార్టు మెంటుకు వెళ్లానని.. అయితే అక్కడ నన్ను చూడగానే రాహుల్, ప్రత్యూషలు రెచ్చిపోయారు.. ఇద్దరూ కలసి దాడి చేశారు. ఫ్లాట్ బయటకు నన్ను నెట్టేశారు. అందుకే కోపంతో నేను ఆమెను కొట్టాను" అని చెప్పారు.

ఇకనుండి బస్సుల్లో ఫ్రీ వైఫై..

హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల ఉచిత వైఫై సేవను అందుబాటులోకి తీసుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఇక నుండి ఈ సేవను బస్సులకు కూడా అందిచాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్ట్‌కు నడుపుతున్న ఏసీ బస్సుల్లో ఈ వైఫై సేవలు అందించడానికి ఓ ప్రైవేటు సంస్థ ముందుకొచ్చిందని.. ముందుగా ఒక బస్సులో ప్రయోగించామని.. తరువాత అన్ని ఏసీ బస్సుల్లో ఉచితవైఫై సేవలు ప్రారంభమవుతాయని గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ ఈడీ పురుషోత్తం తెలిపారు. అంతేకాదు బస్సుల సమయాలు తెలిపేవిధంగా బస్టాపుల్లో డిస్‌ప్లే బోర్డులను అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని.. పుష్పక్‌ బస్సుల్లో వెహికిల్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ అందుబాటులోకి వస్తే ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పారు. 

ఎన్‌ఐఏ అధికారి భార్య కూడా మృతి..

  పఠాన్‌కోట్ ఉగ్రదాడిపై విచారణ జరుపుతున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారి మొహ్మద్ తంజిల్ అహ్మద్ కుంటుంబంపై దుండగులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఓ వివాహా కార్యక్రమానికి వెళ్లి వస్తున్న వీరిపై ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నూర్‌లో మోటార్ సైకిళ్లపై దుండగులు వచ్చి కాల్పులు జరపగా.. ఈ దాడిలో తంజిల్ ఆయన భార్య ఫర్జానా తీవ్రంగా గాయపడ్డారు.  వీరికి ఒక బాబు, ఒక పాప ఉండగా వారు మాత్రం సీటు వెనుక దాక్కొని ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే గాయపడిన తంజిల్ ఆయన భార్యను చికిత్స నిమిత్తం ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలించగా రెండు రోజుల క్రితమే మొహ్మద్ తంజిల్ అహ్మద్ మరణించాడు. ఇప్పుడు ఆయన భార్య ఫర్జానా కూడా పదిరోజులపాటు మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచారు.   కాగా ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన నిందితుల్లో రెహాన్, జైనుల్‌ను అరెస్టు చేసిన పోలీసులు తాజాగా రిజ్వాన్, తంజీమ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వీరికి కోర్టు 14రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ప్రధాన నిందితుడు మునీర్ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.

శ్రీనగర్ నిట్ క్యాంపస్ ను తరలించేది లేదు.. స్మృతీ

  శ్రీనగర్ నిట్ లో స్థానికేతర, స్థానిక విద్యార్ధుల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తెలుగు విద్యార్ధులు మండిపడుతున్నారు. శ్రీనగ్ నిట్ ను అక్కడి నుండి తరలించాలని.. లేదా తమకైనా వేరే వర్శిటీలో చేరే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే కొంతమంది విద్యార్ధులు తమ క్యాంపస్‌లో భద్రతను పటిష్టం చేయాలంటూ కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను కలిశారు. అనంతరం మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీని కలిసి ఎన్‌ఐటీ ప్రాంగణాన్ని మరోచోటికి తరలించాలని విజ్ఞప్తి చేశారు. అయితే దీనికి మాత్రం ఆమె అంగీకరించలేదని.. క్యాంపస్‌ను మరోచోటికి తరలించేది లేదని చెప్పినట్టు సమాచారం.  

రేపే టీడీపీలోకి బొబ్బిలి సోదరులు.. జగన్ కు పెద్ద ఎదురుదెబ్బ

వైసీపీ పార్టీ నుండి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బొబ్బిలి ఎమ్మెల్యే వెంకట సుజయ కృష్ణ రంగారావు టీడీపీలోకి మారుతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు సుజయ కృష్ణతో పాటు ఆయన సోదరుడు, వైసీపీ జిల్లా అధ్యక్షుడు బేబి నాయన కూడా టీడీపీలో చేరుతున్నారు. పార్టీ అనుచరులతో సమావేశమైన వీరిద్దరూ రేపు అంటే (15-4) న టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించినట్టు తెలుస్తోంది. కాగా ఇప్పటికే వైసీపీ నుండి 11 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరారు. మరోవైపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైసీపీకి బలమైన నేతలుగా ఉన్న వీరిద్దరు పార్టీకి దూరమైతే... వైసీపీకి పెద్ద ఎదురు దెబ్బ తప్పదన్న భావన వ్యక్తమవుతోంది. మరి జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.

బొత్సది ఐరెన్ లెగ్ అంటున్న వైసీపీ నేతలు..!

  టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ మాంత్రానికి వైసీపీ నేతలు ఒక్కోక్కరుగా టీడీపీలో చేరడానికి ఆకర్షితులవుతున్నారు. ఇప్పటివరకూ 11 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరగా.. ఇప్పుడు గిద్దలూరు ఎమ్మెల్యే ఆశోక్ రెడ్డి, బొబ్బిలి ఎమ్మెల్యే వెంకట సుజయకృష్ణ రంగారావు కూడా లిస్టులో చేరినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు అనే సామెత ప్రకారం.. వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరడానికి కారణం బొత్స సత్యనారాయణ అంటూ కొంతమంది వైసీపీ నేతలు అనడం ఆశ్చర్యకరం.. బొత్స సత్యనారాయణది ఐరెన్ లెగ్ అని ఆయన వచ్చిన తరువాతే వైసీపీ నేతలు టీడీపీలోకి వెళుతున్నారని అంటున్నారు. అంతేకాదు వెంకట సుజయకృష్ణ రంగారావు ముందు నుండే బొత్స రాకును వ్యతిరేకిస్తున్నారని.. అయినా జగన్ వినకుండా పార్టీలోకి ఆహ్వానించారు.. ఇప్పుడు అనుకున్నట్టుగానే రంగారావు టీడీపీలో చేరడానికి సన్నాహాలు చేస్తున్నారని అంటున్నారు. మరి వైసీపీ నేతలు అన్నట్టు నిజంగానే బొత్సది ఐరెన్ లెగ్గా..

తృప్తి దేశాయ్ కొత్త వివాదం.. దేవాలయంలోకి చీరలా..?

  నిన్న మొన్నటి వరకూ దేవాలయాల్లో ప్రవేశించడానికి లింగ వివక్షతపై ఆందోళనలు జరిగాయి. ఒక దేవాలయంలో స్త్రీలకు ప్రవేశం లేకపోతే.. మరో దేవాలయం గర్భగుడిలోకి పురుషుల ప్రవేశానికి అనుమతి లేదు. ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న ఈ ఆచారాలను సైతం తొలగించి మహిళలు పోరాటం చేసి ఆఖరికి ఆలయంలో ప్రవేశించడానికి అనుమతి తెచ్చుకున్నారు. ఇక ఈగొడవలకు ముగిసిపోయాయి కదా అని ఆలోచించే లోపే మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఇప్పుడు వచ్చిన వివాదం.. దేవాలయంలో స్త్రీలు వేసుకునే దుస్తుల గురించి.   సాధారణంగా పలు ఆలయాల్లో స్ర్తీలు సంప్రదాయ దుస్తులు వేసుకునే రావాలన్న నిబంధనలు ఉంటాయి. ఇక పురుషుల విషయానికి వస్తే కొన్ని దేవాలయాలను బట్టి వారు పంచెతో వచ్చే ఆనవాయితీ ఉంటుంది. అయితే ఇప్పుడు భూమాతా బ్రిగేడ్ నాయకురాలు తృప్తీ దేశాయ్ దీనిపై ఆరోపిస్తున్నారు. ఆమె ప్యాంటు, కోటు వేసుకొని కొల్హాపూర్ మహాలక్ష్మీ దేవాలయంలోకి వెళుతుండగా అక్కడ ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. దేవాలయ నిబంధనల ప్రకారం చీరతోనే రావాలని సూచించారు. దీంతో ఆమె వేసుకునే దుస్తులపై నిబంధనలేంటని.. ఇది వివక్షతే నంటూ ఆమె మండి ఆలోయంలోకి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పుడు మరో  వివాదం తెరపైకి వచ్చింది. మరి దీనిపై ఎంత రచ్చ జరుగుతుందో చూడాలి.