ఎదురుగా వస్తున్న రైలుతో సెల్పీ.. ఇద్దరు మృతి
posted on Apr 16, 2016 @ 2:48PM
సెల్ఫీ తీసుకోవడం మామూలే.. కానీ ఎంత వెరైటీగా సెల్ఫీ తీసుకున్నామా అన్నది ముఖ్యం అన్నట్టు తయారైంది ప్రస్తుత పరిస్థితి. ఇప్పటికే ఎంతో మంది సెల్ఫీ తీసుకుంటూ తమ ప్రాణాలు కోల్పోయారు. ఏనుగుతో సెల్ఫీ తీసుకుంటుండగా.. అది తొండంతో కొట్టి ఓ యువకుడు చనిపోయిన ఘటన రెండు రోజుల క్రితమే జరిగింది. అది మరిచిపోకముందే.. ఇప్పుడు ఈ సెల్ఫీ మోజుకు మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రైలుకి ఎదురుగా వెళ్లి సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్లో ఇద్దరు యువకులు వేగంగా వచ్చే రైలు ముందు నిల్చొని సెల్ఫీ తీసుకోవాలని అనుకున్నారు. సెల్ఫీ తీసుకుంటూ రైలు దగ్గరకొచ్చే క్రమంలో వెళ్లిపోవచ్చనుకున్నారు కానీ.. జరగాల్సింది జరిగిపోయింది. రైలు ఢీ కొట్టి ఇద్దరూ మృతి చెందారు. సెల్ఫీల వల్లే ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా.. ఇలాంటి ఘటనలు చూసినా ఇంకా రోజు రోజుకి ఎక్కువవుతుందే తప్ప తగ్గేలా కనిపించడంలేదు.