మంత్రిగారి సెల్పీతో వచ్చిన కష్టాలు..

  ఈ రోజుల్లో సెల్ఫీలు తీసుకోవడం చాలా కామన్ థింగ్. సామాన్య ప్రజల నుండి సెలబ్రిటీలు దాకా అందరూ సెల్ఫీలు తీసుకొని తమ ముచ్చటను తీర్చుకుంటున్నారు. ఇప్పుడు అలాగే సెల్ఫీ తీసుకొని చిక్కుల్లో పడ్డారు ఓ మంత్రిగారు. మహారాష్ట్రలో నీటి పారుదల శాఖా మంత్రిగా ఉన్న పంకజా ముండే లాతూర్ పర్యటనలో ఉన్నారు. ఈనేపథ్యంలో ఆమె లాతూర్ లోని కరువు ప్రాంతాల్లో తిరుగుతూ సెల్ఫీలు తీసుకుంది. అక్కడితో ఆగకుండా ఆ ఫొటోలని సోషల్ మీడియా సైట్లో పోస్ట్ చేసింది. అంతే అది చూసిన నెటిజన్లు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.  ఎండిపోయిన మంజీరా నది ముందు సెల్ఫీలు దిగడం ఏంటంటూ.. ఆమె వైఖరి రైతులను అవమానపరిచేదిగా ఉందంటూ మండిపడుతున్నారు. అయితే వీటికి స్పందించిన  పంకజా ముండే ఆ విమర్సలను పట్టించుకోకుండా..  లాతూరుకు నీటిని అందించేందుకు ఏన్నో ఏర్పాట్లూ శరవేగంగా సాగుతున్నాయని మరో పోస్టును పెట్టారు.

కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఉంది.. అందుకే జగన్ ని కలిశా.. ఆర్.కృష్ణయ్య

  తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో వీరిద్దరి భేటీపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న సంగతి కూడా విదితమే. అయితే ఇప్పుడు వీటిపై స్పందించిన ఆర్.కృష్ణయ్య కొన్ని షాకింగ్ వ్యాఖ్యలు కూడా చేశారు. బీసీల సంక్షేమం కోసం.. వారికి యాభైశాతం రిజర్వేషన్లకోసం.. ప్రధానికి లేఖ రాయమని జగన్ కు చెప్పానని.. దీనిలోభాగంగానే ఆయనను కలిశానని అన్నారు. అంతేకాని ఏదో పదవులు ఆశించికాదు.. అసలు తనకు ఎమ్మల్యే పదవి గడ్డిపోచతో సమానమని.. తాను ఏ పార్టీలో భాగం కాదని, తనకు పార్టీ పెట్టే ఆలోచన ఉందని, అవసరమైనప్పుడు ముందుకు వెళ్తానని అన్నారు. అంతేకాదు.. ముఖ్యమంత్రి పదవి ఇస్తానంటేనే తాను ఎమ్మెల్యేగా పోటీ చేశానని.. ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రి పదవి ఇస్తానంటే నిరాకరించానని చెప్పారు. పార్టీ మారే ప్రసక్తే లేదు.. టీడీపీ లోనే ఉంటూ బీసీల సంక్షేమానికి కృషి చేస్తా.. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ నిలదీస్తానని చెప్పారు. మొత్తానికి ఆర్. కృష్ణయ్య చేసిన వ్యాఖ్యలు పార్టీ నేతలకే కాదు.. ముఖ్యమంత్రికి కూడా షాకింగ్ ఇచ్చేలా ఉన్నాయి. మరి ఆయన వ్యాఖ్యలకు నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

"గిఫ్ట్" తిరిగిచ్చేసిన యడ్యూరప్ప..!

కోటి రూపాయల కారుపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తుండటంతో మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప ఆలోచనలో పడ్డారు. తన అనుచరుడు, వ్యాపారవేత్త మురుగేశ్ నిరానీ ఇచ్చిన కారును తిరిగి ఆయనకే ఇచ్చేశారు. మండే ఎండల్లో పార్టీ అధ్యక్షుడు పర్యటించడం కష్టమని భావించిన ఆయన అభిమాని కమ్ అనుచరుడు మురుగేశ్ ఆయనకు కోటీ పదిహేను లక్షల రూపాయల విలువైన టయోటా ల్యాండ్ క్రూయిజర్ కారును బహుమతిగా అందజేశారు. దీనిపై కాంగ్రెస్, జేడీఎస్‌లు ముప్పేట దాడి చేశాయి. రైతులు కరువుతో అల్లాడుతుంటే వారు లగ్జరీ కారులో పర్యటించడం ఏంటని విమర్శలు రేగాయి. దీనిపై వెనక్కి తగ్గిన యెడ్డీ కారును తిరిగి ఇచ్చేయడంతో పాటు రైలులో వెళ్లి కరువు ప్రాంతాలను పరామర్శిస్తానని ప్రకటించారు.

క్రికెటర్ రవీంద్ర జడేజా పెళ్లి వేడుకలో కాల్పులు..

టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా వివాహ వేడుకలో కాల్పులు జరిగాయి. రాజ్‌కోట్‌కు చెందినన రివా సోలంకితో ఇవాళ జడేజా వివాహం జరుగింది. అందరూ పెళ్లి వేడుకలో ఆనందంగా ఉన్న సమయంలో కొందరు వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. పెళ్లి వేడుక సందర్భంగా జరిగిన బరాత్‌లో తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపినట్టు కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే వేడుకలో ఆనందంతో ఎవరో తుపాకీతో గాలిలోకి మూడు రౌండ్ల వరకు కాల్చినట్టు తెలుస్తోంది. దీనిపై పోలీసుల వాదన మరోలా ఉంది. లైసెన్స్ కలిగిన తుపాకీతో కాల్పులు జరిపినా అది నేరమే..ఆత్మరక్షణ కోసమే దీనిని వాడాల్సి ఉంటుంది. ఈ నేరం రుజువైతే మూడేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశముందని స్థానిక పోలీసులు తెలిపారు. 

బీహార్‌లో రోడ్డు ప్రమాదం..ఆరుగురు తెలుగువారి మృతి

బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కైమూర్ జిల్లాలో ట్రక్కును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా తెలుగువారే. వీరి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా. వీరు వారణాసి నుంచి గయ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చంద్రబాబు దిగ్భ్రాంతి: బీహార్‌లోని కైమూరు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు తెలుగువారు మరణించిన ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని, మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు.

లక్నోలో విషాదం..కూలిన మెట్రో బ్రిడ్జి

ఇండియాలో బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లు ఎప్పుడు కూలుతాయో తెలియడం లేదు. మొన్న కోల్‌కతాలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలి 10 మంది మరణించిన సంఘటన మరవకముందే తాజాగా లక్నోలో మరో విషాదం చోటుచేసుకుంది. లక్నోలోని ఆలంబాగ్‌ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మెట్రో రైల్ పిల్లర్ ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. ఈ ఘటనలో అక్కడ పనిచేస్తున్న ఓ కార్మికుడు మరణించగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ దళాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకుని ఉండవచ్చని భావిస్తున్నారు.  

కంటతడి పెట్టిన పోప్

సిరియా అంతర్యుద్థంతో అక్కడి నుంచి గ్రీస్‌ తదితర దేశాలకు వలసలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో సిరియా నుంచి పారిపోయి గ్రీస్‌ లెస్బోస్‌లో ఓడ రేవులో తలదాచుకున్న శరణార్థులను పోప్ ఫ్రాన్సిస్ పరామర్శించారు. లెస్బోస్‌లో అడుగుపెట్టిన ఫ్రాన్సిస్‌కు శరణార్థ శిబిరంలోని చిన్నారులు, మహిళలు, వృద్థులు స్వాగతం పలికారు. శిబిరంలోని ఒకరు తమను ఆశీర్వదించమంటూ కన్నీటితో పోప్ పాదాలపై పడ్డారు. మరి కొందరు తమకు విముక్తి కల్పించమంటూ వేడుకున్నారు. వారి దురవస్థని చూసి చలించిన పోప్ కంట నీరు పెట్టారు. పోప్ వెంట ఎక్యుమెనికల్ పాట్రియార్క్, గ్రీస్ చర్చ్ హెడ్, ఆర్చిబిషప్ ఐరోనిమస్‌ తదితరులున్నారు. మేము కూడా సముద్రమనే శ్మశానానికి వెళుతున్నాం. తలదాచుకునేందుకు సముద్ర మార్గంలో బయలుదేరిన చాలామంది జాడ లేకుండా పోయారు’ అని లెస్బోస్ బయలుదేరే ముందు పోప్ ఆవేదనగా చెప్పారు.  

ఈక్వెడార్‌లో భారీ భూకంపం..28 మంది మ‌ృతి

ఈక్వెడార్‌ వరుస భూకంపాలతో వణికిపోయింది. 11 నిమిషాల వ్యవధిలో రెండు చోట్లు భారీ భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రాజధాని క్వీటోకి పశ్చిమ, ఆగ్నేయ ప్రాంతాల్లో అర్థరాత్రి 11.58 ప్రాంతంలో భారీగా ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.8, 7.8గా నమోదైంది. క్వీటోలో భూక్రంపనల తీవ్రత బలంగా ఉండటంతో అక్కడ సునామీ వచ్చే అవకాశముందని ఫసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం పేర్కొంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 28 మంది మరణించినట్టు సమాచారం. ప్రమాదం దృష్ట్యా దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్టు దేశ ఉపాధ్యక్షుడు జార్జ్ గ్లాస్ పేర్కొన్నారు.

మే నెలాఖరు కల్లా వైసీపీ ఖాళీ అవుతుందట.. బుద్ధా వెంకన్న జోస్యం

ఇప్పటికే వైసీపీ పార్టీ నుండి వరుసపెట్టి ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరుతుండటంతో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సహా మిగిలిన నేతలు కూడా ఏం చేయాలో అర్ధంకాని స్థితిలో ఉన్నారు. పార్టీ మారబోతున్న ఎమ్మెల్యేలను.. పార్టీలోని సీనియర్ నాయకులను రంగంలోకి దిగి బుజ్జగించే పనిలో ఉన్నా వారుమాత్రం పార్టీ మారుతున్నారు. అసలే ఏం చేయాలో తెలియక బెంబేలెత్తి పోతున్న సమయంలో ఇప్పుడు టీడీపీ నేతలు చేసే వ్యాఖ్యలు వైసీపీ కలవర పడుతోంది. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మాట్లాడుతూ..  మరింత హీట్ ను పెంచుతున్నాయి. మే నెలాఖరు నాటికి రాష్ట్రంలో వైసీపీ మొత్తం ఖాళీ అవుతుందని, ఏపీలో టీడీపీ ఒక్కటే అతి పెద్ద సింగిల్ పార్టీగా ఉంటుందని ఆయన జోస్యం చెప్పారు. తాము డబ్బులిచ్చి ఏ ఒక్క ఎమ్మెల్యేను కొనుగోలు చేయలేదన్నారు. అలాంటి అవసరం తమకు లేదని, టీడీపీ చేస్తున్న అభివృద్ధిని చూసే పార్టీలోకి చేరికలు జరుగుతున్నాయని తెలిపారు. దీంతో అధికార పార్టీ చేసే వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో మరింత హీట్ పెరిగింది.

రజనీ కాంత్ పై విజయకాంత్ కామెంట్లు.. రజనీకాంత్ లా పిరికివాడిని కాదు

తమిళనాడులో రజనీ కాంత్ ను అభిమానులు దాదాపు దేవుడు  లాగానే చూస్తారు. ఒక్క తమిళనాడులోనే కాదు తెలుగులో కూడా రజనీకాంత్ అంటే అందరూ అభిమానిస్తారు. అలాంటి రజనీకాంత్ పైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి లేనిపోని ఇబ్బందులు తెచ్చుకున్నాడు డీఎండీకే అధినేత విజయకాంత్. తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఓ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. రాజకీయ నాయకులు భయపెడితే భయపడటానికి తానేమీ రజనీకాంత్ మాదిరిగా పిరికివాడిని కాదంటూ.. నా పేరు విజయకాంత్ నేను ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని నోటికొచ్చినట్టు వ్యాఖ్యానించాడు. అంతే ఇంక రజనీ ఫ్యాన్స్ ఊరుకుంటారా.. వెంటనే విజయకాంత్ దిష్టిబొమ్మలు తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. అంతేకాదు విజయకాంత్ చేసిన వ్యాఖ్యలకు సొంత పార్టీ నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో అభిమానులు మనసు చూరగొనేలా వ్యాఖ్యానించాలే కానీ.. ఇలా వారినుండి వ్యతిరేకత వచ్చేలా వ్యాఖ్యానించడం ఏం బాలేదని అంటున్నారు. మరి దీనిపై విజయకాంత్ ఎలా స్పందిస్తారో చూడాలి.

టీడీపీలో చేరిన సునీల్.. నా తప్పే.. చెప్పుతో కొట్టినా భరిస్తా అంటున్న వైసీపీ నేత

  వైసీపీ పార్టీ నుండి చాలా మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అయిన సంగతి తెలిసిందే. అలా జంప్ అయిన వారిలో గూడురు ఎమ్మెల్యే సునీల్ కూడా ఉన్న సంగతి విదితమే. అయితే ఇప్పుడు సునీల్ టీడీపీలో చేరడంపై వైసీపీ పార్టీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సునీల్ బాగా పనిచేస్తాడని జగన్ కు చెప్పానని.. కానీ తనను మోసం చేసి టీడీపీలో చేరాడు.. ఈ విషయంలో తప్పు నాదే.. ఇందుకు గూడూరు ప్రజలు చెప్పుతో కొట్టినా భరిస్తానని అన్నారు. అంతేకాదు మా కుటుంబానికి ఏదో శాపం ఉంది.. అందరూ వెన్నుపోట్లు పొడుస్తారు.. ఇప్పుడు సునీల్ కూడా అదే చేశాడని అన్నారు. సునీల్ చేసిన పనికి తాను తలెత్తుకోలేకపోతున్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మాకు ఓటెయ్యకపోతే అంతే.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత బెదిరింపు

  పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ నేతలు పార్టీ ప్రచారాల్లో పాల్గొంటున్నారు. అయితే సాధారణంగా ప్రచారంలో పాల్గొన్న ఏ నేతలైనా తమకు ఓటు వేయాలని ప్రజలకి విజ్ఞప్తి చేస్తారు. కానీ ఇక్కడ ఓనేత మాత్రం ఏకంగా బెదిరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత అబ్దుల్ మన్నన్ అనే నేత ఓ బహిరంగ సభలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంవ‌త్స‌రం పొడ‌వునా ప్రజలకు కావలసిన అన్ని సౌకర్యాలూ కల్పిస్తామనీ, అయితే త‌మ‌కు ఓటు వేయకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవ‌ల‌సి వస్తుందని తాము ఆశించినంత‌గా మెజారిటీ ఇవ్వాల‌ని లేదంటే త‌మ‌లో అస‌హ‌నం చూస్తార‌ని పేర్కొన్నాడు. మరి ప్రజలు ఆయనకు ఓటు వేసి గెలిపిస్తారో లేదో చూడాలి.

మార్క్ జుకెర్ బర్గ్ కే డొమైన్ అమ్మిన కొచ్చి స్టూడెంట్..

  సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలోనే ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు ఎవరంటే మార్క్‌ జుకర్‌బర్గ్ అని తెలయని వారుండరు. ఫేస్ బుక్ తో సోషల్ మీడియా రంగంలోనే విప్లవాన్ని తీసుకొచ్చాడు. అలాంచి జుకెర్ బర్గ్ కే డొమైన్ అమ్మాడు ఏ కొచ్చి కుర్రాడు. వివరాల ప్రకారం.. అమల్ ఆగస్టిన్‌ అనే కుర్రాడు ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్‌ ఫైనలియర్‌ చదువుతున్నాడు. అతనికి డొమైన్ పేర్లను సొంతం చేసుకోవడం హాబీ. ఈ నేపథ్యంలోనే అమల్ నాలుగు నెలల క్రితం 'మాక్స్‌చాన్‌జుకర్‌బర్గ్‌.ఓఆర్‌జీ' పేరిట ఓ వెబ్‌సైట్‌ డొమైన్‌ ను రిజిస్టర్‌ చేయించుకున్నాడు. ఈ డొమైన్ లో జుకెర్ బర్గ్ కూతురి పేరు ఉండటంతో ఈ డొమైన్ హక్కులు కొనుగోలు చేసేందుకు ఫేస్‌బుక్‌ ముందుకొచ్చింది. అమల్‌తో బేరసారాలు ఆడి.. 700 డాలర్ల (రూ. 46వేల)కు ఈ వెబ్‌సైట్‌ను సొంతం చేసుకుంది. దీనికి అమల్ ఈ డొమైన్ అమ్మినందుకు ఎంత డబ్బు వచ్చిందన్నది ముఖ్యం కాదు.. ఫేస్ బుక్ లాంటి కంపెనీ తనను ఆశ్రయించి బేరసారాలు జరిపిందని ఇదే తనకు చాలా ఆనందంగా ఉందని తెలిపాడు.

బీజేపీకి ఓటు వేసినందుకు భార్యకు విడాకులు.. ఎక్కడ..?

  కొన్ని సార్లు కొన్ని సంఘటనలు వింటుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంటుంది. అసోంలో కూడా అలాంటి విచిత్రమైన ఘటనే జరిగింది. వేరే పార్టీకి ఓటు వేసిందని చెప్పి తన భార్యకు విడాకులు ఇచ్చాడు ఓ భర్త. వివరాల ప్రకారం.. అసోంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల నేపథ్యంలో సోనిత్‌పూర్‌ జిల్లాలోని దొనా అద్దాహతి గ్రామవాసులంతా కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని ఓ నిర్ణ‌యానికొచ్చారంట. కానీ అయినుద్దీన్ అనే వ్య‌క్తి భార్య దిల్వారా మాత్రం కాంగ్రెస్ కు కాకుండా బీజేపీకి ఓటు వేసింది. అనంతరం ఆ విషయాన్ని తన భర్తకు చెప్పగా కోపంతో ఊగిపోయిన అయినుద్దీన్ ఆమెకు తలాఖ్ అని విడాకులు ఇచ్చాశాడు. అయితే గ్రామస్తులు మాత్రం వారి విడాకులకు వేరే కారణాలు ఉన్నాయని చెబుతున్నారు.