తెలంగాణ నుండి రూ. 2,500 కోట్లు వసూలు చేయండి.. చంద్రబాబు

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఉద్యోగ సంఘాలు (ఏపీఎస్ఈబీ) భేటీ ఆయ్యాయి. ఈ సందర్బంగా వారు రూ.1000 కోట్లకు పైగా విలువైన హైదరాబాద్ లోని ఏపీ ట్రాన్స్ కో, జెన్ కో లకు చెందిన ఆస్తులను కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతేకాదు ఏపీ, తెలంగాణా విద్యుత్ సంస్థలకు చెందిన ఆస్తుల విభజనకు ప్రత్యేకంగా ఒక జాయింట్ కమిటీని నియమించేందుకు చొరవ తీసుకోవాలని సూచించింది. దీంతో చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ. 2,500 కోట్లను వసూలు చేయడంతో పాటు, రూ. 1000 కోట్లకు పైగా విలువైన ఆస్తులను పరిరక్షించాలని సీఎం చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. కాగా ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఏపీఎస్ఈబీ ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు ఎం వేదవ్యాసరావు, సీహెచ్ విజయభాస్కర్ తదితరులు వున్నారు.

స్కార్ప్ కట్టుకున్న వాళ్లకి రైల్లో అనుమతి లేదు..!

  ఢిల్లీలోని రాజేంద్ర ప్లేస్ మెట్రో స్టేషనులో రూ. 12 లక్షల దోపిడీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ మెట్రో రక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న సీఐఎస్ఎఫ్ ఓ సరికొత్త నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇకనుండి ముఖం కనిపించకుండా స్కార్ప్ కానీ, మఫ్లర్, దుప్పట్టా కట్టుకున్న వారికి రైల్లో ప్రవేశించడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. అయితే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మాత్రం దీని నుండి మినహాయింపు ఇస్తున్నామని అధికారులు తెలిపారు. మెట్రో స్టేషన్లలోకి ప్రవేశించే ముందు చెకింగ్ చేసే సమయంలో ముఖం ముసుగులు తీసివేయమని చెబుతారని, దీని ద్వారా వారి ముఖాలు సీసీకెమెరాల్లో నిక్షిప్తమవుతాయని తెలిపారు. ఆ విధంగా దొంగలను పట్టుకోవడం కొంతవరకూ సాధ్యమవుతుందని తెలిపారు.

జ్యోతుల నెహ్రూ స్థానంలో కన్నబాబు..

వైసీపీ పార్టీ నుండి జ్యోతుల నెహ్రూ టీడీపీ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.  అయితే వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు జ్యోతుల నెహ్రూ తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగేవారు. ఇప్పుడు ఆయన టీడీపీలోకి చేరడంతో ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబుకు జిల్లా బాధ్యతలను అప్పగించనున్నట్టు తెలుస్తోంది. అయితే అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ.. ఆయన పేరు మాత్రం ఖరారైందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. జిల్లాలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి వచ్చిన ప్రతినిధులు, వివిధ కమిటీల నేతలతో లోటస్ పాండ్ లో సమావేశమైన జగన్, ఒక్కొక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడి చివరకు కన్నబాబు పేరును ఖరారు చేశారని సమాచారం.

అమ్మాయిల దుస్తులపై ప్రధాని కామెంట్లు.. పొట్టిబట్టల్లో యువతులు రేపర్ లేని కాండీ

రాజకీయ నేతలు అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కామన్. అప్పుడప్పుడు ఏదో ఒకవిషయంపై నోరు జారుతుంటారు. ఇప్పుడు థాయ్ లాండ్ ప్రధాని ప్రయూత్ చానోచా కూడా యువతుల వస్త్రధారణపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. థాయ్ లాండ్ 'సాంగ్ క్రాన్' అనే పేరుతో జరుపుకునే నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ఆయన అమ్మాయిల దుస్తుల గురించి మాట్లాడుతూ.. అంగసౌష్టవం బయటకు కనిపించేలా కురచ, బిగుతైన దుస్తులు ధరించవద్దని.. పొట్టిబట్టల్లో ధరిస్తే యువతులు రేపర్ లేని కాండీ(ఆచ్చాదన లేని చాక్లెట్)లా ఉంటారని వ్యాఖ్యానించారు.   సాధారణంగా ఆ వేడుకల్లో యువతే ఎక్కువ ఉత్సాహంగా రెయిన్ డాన్సులు చేస్తుంటారు. దీంతో వారిపై వేధింపులు ఎక్కువవుతాయి. అందుకే దేశ ఆచారాలకు అనుగుణంగా దుస్తులు ధరించాలని థాయ్ లాండ్ సైనిక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

నిన్న నలుగురు ఎమ్మెల్యేలు .. నేడు మరో ఎమ్మెల్యే.. జగన్ కు షాకులమీద షాకులు

వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పార్టీ నేతలు మామూలుగా షాకులివ్వట్లేదు. నిన్ననే నలుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడే ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వినిపించాయి. ఇప్పుడు మరో ఎమ్మెల్యే జగన్ కు షాకివ్వడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి టీడీపీ లోకి చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కూడా కలిసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే అశోక్ రెడ్డి పార్టీలోకి చేరుతున్నారన్న వార్తలు రాగానే.. ఆ నియోజకవర్గ టీడీపీ నేతలు రంగంలోకి దిగి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తో భేటీ అయ్యేందుకు యత్నించారు. అయితే లోకేశ్ హైదరాబాదులో లేరని, విజయవాడలో ఉన్నారని తెలుసుకుని అక్కడికీ పయనమయ్యారు. ఎట్టకేలకు అక్కడ లోకేశ్ తో భేటీ అయి.. అశోక్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవద్దని.. పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జీ అన్నే రాంబాబు బాగానే పనిచేస్తున్నారని, ఆయన నేతృత్వంలో పార్టీ బాగానే బలపడిందని, కొత్తగా అశోక్ రెడ్డి పార్టీలోకి రావడంతో ఒరిగేదేమీ లేదని చెప్పారు.   అయితే లోకేశ్ మాత్రం పార్టీలోకి చేరతామంటూ ఎవరు ముందుకు వచ్చినా కాదనవద్దని వారికి సూచించారు. అయినా పార్టీలో చేరుతున్న విపక్ష ఎమ్మెల్యేలకు చెందిన నియోకవర్గాలకు సంబంధించిన పార్టీ నేతలకు సర్దిచెప్పిన తర్వాతే ముందడుగు వేస్తున్నాం కదా అని కూడా లోకేశ్ వారికి చెప్పారు. దీంతో అశోక్ రెడ్డి పార్టీ మార్పు పై స్పష్టత వచ్చినా.. ఎప్పుడు పార్టీ మారుతారో ఇంకా అధికారికంగా మాత్రం ప్రకటించలేదు.

కాశ్మీర్లో జవాన్ల కాల్పులు.. వర్ధమాన క్రికెటర్ మృతి

  ఉత్తర కాశ్మీర్లోని హంద్వారాలో కాల్పుల కలకలం రేగింది. ఆందోళనకారులపై జవాన్లు దాడివలన ముగ్గురు మృతి చెందారు. వీరిలో ఓ వర్ధమాన క్రికెటర్ నయీం అనే యువకుడు మరణించినట్టు సమాచారం. వివరాల ప్రకారం.. కళాశాల నుండి ఇంటికి వెళ్తున్న ఓ విద్యార్ధిని పట్ల జవాన్లు అసభ్యంగా ప్రవర్తించారంటూ స్థానికులు ఆందోళనలు చేపట్టారు. దీంతో జవాన్లు వారిపై కాల్పులు జరపగా ముగ్గురు మృతి చెందారు. అయితే జవాన్లు మాత్రం ముందుగా స్థానికులే తమపై రాళ్లతో దాడి చేశారని.. ఆ తర్వాతే మేం కాల్పులు జరిపామని చెబుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా మూడేళ్ల కింద జాతీయ స్థాయిలో అండర్19 జట్టులో నయీం  ఆడాడని అతని స్నేహితుడు తెలిపాడు.

తెలంగాణ సర్కారుకు సుప్రీం అక్షింతలు.. కొత్త రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఏంటీ..

  తెలంగాణ ప్రభుత్వానికి కోర్టులో చేతిలో మొట్టికాయలు తినడం కొత్తేమికాదు. ఏదో ఒక విషయంలో ఎప్పుడూ కోర్టుల చేత తిట్లు తిట్టించుకుంటునే ఉంటుంది. ఇప్పుడు కూడా ప్రభుత్వ పాఠశాలలో విషయంలో సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి చివాట్లు పెట్టింది. తెలంగాణ రాష్ట్రంలో 398 ప్రభుత్వ పాఠశాల్లో 'సున్నా' శాతం అడ్మిషన్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కొత్త రాష్ట్రమైన తెలంగాణలో ఇలాంటి పరిస్థితి ఏమిటని ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులు లేని పాఠశాలలు ప్రాణం లేని మనిషితో సమానమని వ్యాఖ్యానించింది. విద్యార్థుల ప్రవేశాలు జరగకపోవడానికి గల కారణాలతో నివేదికను నాలుగు వారాల్లో సమర్పించాలని కోర్టు ప్రభుత్వానికి ఆదేశించింది. తదుపరి విచారణను ధర్మాసనం మే 10కి వాయిదా వేసింది.

ప్రత్యూష బెనర్జీ బాయ్ ఫ్రెండ్ కు ఊరట.. అరెస్ట్ చేయవద్దు

  బాలిక వధు సీరియల్ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో రాహుల్ కు కోర్టులో ఊరట లభించింది. రాహుల్ ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ముంబై సెషన్స్ కోర్టు దానిని తిరస్కరించిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు దీనిపై విచారించి.. ఈ నెల 18 వరకు రాజ్సింగ్ను అరెస్ట్ చేయవద్దంటూ బాంబే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా బుధవారం నుంచి 18 వరకు ప్రతిరోజు ముంబైలోని బంగుర్నగర్ పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని రాజ్సింగ్ను ఆదేశించింది.

చంద్రబాబుకు చిరంజీవి ఆఫర్.. నేను కూడా వస్తా..

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సినీ నటుడు.. రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఓ ఆఫర్ ఇచ్చారు. ఇంతకీ ఏం ఆఫర్ అనుకుంటున్నారా..? అల్లు అర్జున్ నటించిన సరైనోడు సినిమా ఆడియో రిలీజ్ విశాఖలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి వచ్చిన చిరంజీవి మాట్లాడుతూ.. నాడు చెన్నై నుండి సినీ పరిశ్రమ హైదరాబాద్ కు వచ్చిందని.. అలాగే విశాఖపట్నంలో కూడా  విశాఖలో అదే విధంగా సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని సూచించారు. అంతేకాదు విశాఖలో సినిమా స్టూడియోలకు భూములు గుర్తించి.. వాటి నిర్మాణానికి.. మౌలిక సదుపాయాలు కల్పించాలని.. విశాఖలో చిత్రపురి కాలనీని నిర్మించాలని సూచించారు. చంద్రబాబు సినిమా పరిశ్రమ అభివృద్ధికి దృష్టి సారిస్తే నేను కూడా విశాఖకు వస్తానని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో సినిమా పరిశ్రమ కళకళలాడాలని చిరంజీవి అభిప్రాయపడ్డారు.

కరువు ఎఫెక్ట్..ఐపీఎల్ మ్యాచ్‌లకు మురుగునీరు

మహారాష్ట్రలో కరువు ఎఫెక్ట్ ఐపీఎల్ మ్యాచ్‌లపై గట్టిగా పడుతోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు తీసుకుంటున్న చర్యలపై బీసీసీఐ బాంబే హైకోర్టుకు వివరణ ఇచ్చింది. మహారాష్ట్రలో కరువు పరిస్థితుల వల్ల ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం నీటి వృథాపై లోక్‌సత్తా మూవ్ ‌మెంట్, ఫౌండేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ సంస్థలు బాంబే హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై న్యాయస్థానం సీరియస్ అయింది. మ్యాచ్‌ల ఏర్పాట్లపై వివరణ ఇవ్వాల్సిందిగా బీసీసీఐని ఆదేశించింది.   ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం మురుగునీటిని రీసైకిల్ చేసి ఉపయోగిస్తామని బీసీసీఐ కోర్టుకు తెలిపింది. అంతేకాకుండా నాగ్‌పూర్‌లో జరిగే మ్యాచ్‌లను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్టు వివరించింది. పంజాబ్ కింగ్స్ తాము ఆడబోయే మ్యాచ్‌లను ఇతర ప్రాంతాలకు తరలించాలని కోరడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. పూణే, ముంబైలలో జరిగే మ్యాచ్‌ల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేసింది. ఈ రెండు స్టేడియాల్లో 17 మ్యాచ్‌లు జరగనున్నాయి.  

ఆదినారాయణ రెడ్డి మమ్మల్ని చంపేస్తారు.. రామసుబ్బారెడ్డికి ఫిర్యాదు

ఒకే పార్టీలో ఉన్నప్పటికీ టీడీపీ నేతలు ఆదినారాయణ రెడ్డి, రామ సుబ్బారెడ్డిల మధ్య అంతగా సత్సంబంధాలు లేవన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. గతం నుండే వీరిద్దరి మధ్య విబేధాలు ఉంటున్నప్పటికీ.. తాజా వివాదాల వల్ల ఇంకా దూరం పెరుగుతున్నట్టు తెలుస్తోంది. పెద్దదండ్లూరు గ్రామంలో ఇటీవలే దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ గ్రామాన్ని సందర్సించడానికి గాను రామసుబ్బారెడ్డి అక్కడికి వెళ్లారు. అలా వెళ్లిన ఆయనకు ఆదినారాయణ రెడ్డి, ఆయన సోదరుడు రామాంజనేయ రెడ్డి తమపై దాడులు చేశారని పలువురు రామసుబ్బారెడ్డి వద్ద వాపోయారు. ఈ క్రమంలో దాడికి గురైన సుబ్బారాయుడి భార్య ఆయన వద్దకు వచ్చి జరిగిన ఉదంతాన్ని కన్నీళ్లతో చెప్పింది. అభివృద్ధి పనులు చేయించాలని కోరినందుకే, చెప్పులతో కొట్టుకుంటూ ఈడ్చుకు వెళ్లారని వాపోయింది. తాము కేసులు పెట్టలేమని, ఇప్పుడు మీరు వచ్చినందుకు, తర్వాత మమ్మల్ని చంపేస్తారని భయపడుతూ చెప్పింది. ట్రాక్టర్లలో వచ్చిన జనాలు ఊరిపై దాడి చేసి డబ్బులు దోచుకెళ్లారని, ఇళ్లల్లోకి దూరి ఫర్నీచర్ ధ్వంసం చేశారని బాధితులు ఆరోపించారు. దీనిపై స్పందించిన ఆది నారాయణరెడ్డి..తనపై కావాలనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని.. జిల్లా అభివృద్దికి రామసుబ్బారెడ్డితో కలిసి పనిచేయడానికి తాను సిద్దమే అని చెప్పారు. మరి రామసుబ్బారెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.

పాశ్వాన్ ప్రతిపాదన..కాంగ్రెస్ మద్ధతు

సంపన్న దళితులు, ఇతర కులాల వారు స్వచ్ఛందంగా రిజర్వేషన్లు వదులుకోవాలంటూ కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ కుమారుడు, లోక్‌జన శక్తి పార్టీ నాయకుడు చిరాగ్ పాశ్వాన్ చేసిన ప్రతిపాదనలకు అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన వస్తోంది. ఆర్థికంగా సమాజంలో నిలదొక్కుకున్న దళితులు, తమకు హక్కుగా వస్తున్న రిజర్వేషన్‌ను తిరస్కరించాలని కోరారు. దీని వల్ల ఆర్ధికంగా బలహీనంగా ఉన్న వారికి ప్రయోజనం కలుగుతుందని చిరాగ్ అన్నారు. ఇది వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన నిర్ణయమని చట్టాల ద్వారా కాదని చిరాగ్ స్పష్టం చేశారు. చిరాగ్ ప్రతిపాదనను కాంగ్రెస్ స్వాగతించింది. రిజర్వేషన్ల వల్ల వస్తున్న ప్రయోజనాలను ధనిక దళితులు స్వచ్ఛందంగా వదులుకుంటే నిజమైన పేదలకు లబ్థి కలుగుతుందని కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ అన్నారు.  

కొల్లం ఘటన ఎఫెక్ట్.. మనసు మార్చుకున్న కర్ణాటక

మొత్తానికి కేరళ కొల్లం పుట్టింగల్ దేవి ఆలయంలో జరిగిన ప్రమాదం వల్ల పలు రాష్ట్రాలు కళ్లు తెరిచినట్టు కనిపిస్తున్నాయి. ఈ ప్రమాదంలో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. వందలమందికి గాయాలయ్యాయి. ఈనేపథ్యంలోనే ఇలాంటి ఘటనలు జరగకుండా కర్ణాటక వాసులు ముందుగానే జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది. పాత బెంగళూరులోని ధర్మారాయస్వామి ఆలయంలో శక్తిమాతకు పూజలు జరిపి నిర్వహించే కరగ ఉత్సవాల్లో ఈ సంవత్సరం టపాకాయలు కాల్చరాదని నిర్వాహకులు నిశ్చయించారు. అయితే ముందు దాదాపు లక్ష రూపాయల టపాసులు కాల్చాలని అనుకున్నా.. ఆలయ నిర్వాహకులు ఆ తరువాత నిర్ణయాన్ని మార్చుకున్నారు. దాదాపు 9 రోజులు జరిగే ఈ కరగ ఉత్సవాల్లో టపాసులు కాల్చడం ఆనవాయితీ. ఈ సంప్రదాయం 500 ఏళ్ల నుండి ఉందని.. కానీ ఈసారి మాత్రం టపాసులు కాల్చకుండానే ఉత్సవాలు నిర్విహంచాలని చూస్తున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.

సల్మాన్, ధోని అర్థ్రరాత్రి మీటింగ్.. ఎందుకబ్బా..?

  ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే.. సల్మాన్ ఖాన్ ను.. టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని కలవడం. అందులో ఆశ్చర్యం ఏంటంటారా.. అక్కడే ఉంది అసలు ట్విస్ట్.. వారిద్దరూ కలిసింది ఏదో పగలు అయితే అంత చర్చ ఉండకపోయేది.. ఇద్దరూ కలిసింది అర్థ్రరాత్రి.. సల్మాన్ ఖాన్ ను మహేంద్రసింగ్ ధోనీ సతీసమేతంగా కలిశాడు. నిన్న అర్ధరాత్రి సల్మాన్ నివాసానికి మహేంద్రసింగ్ ధోనీ, భార్య సాక్షి, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ కుమార్తె పూర్ణ పటేల్ కూడా రావడం విశేషం. ధోనీ కారు సల్మాన్ ఇంటికి చేరగానే, ఎదురెళ్లి ధోనీని సల్మాన్ ఇంట్లోకి తీసుకెళ్లాడు. అయితే సల్మాన్ ను ధోనీ అంత అర్ధరాత్రి ఎందుకు కలవాల్సి వచ్చింది? అనే విషయాన్ని ఇద్దరూ వెల్లడించకపోవడం విశేషం. దీంతో వీరిద్దరి మీటింగ్ పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఎవరు మొదట నోరు విప్పుతారో చూడాలి.

అన్ని నియోజక వర్గాల్లో అగ్నిమాపక కేంద్రాలు..

  కేరళ కొల్లాం ఘటన వల్ల అందరూ ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలో తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఓ నిర్ణయం తీసుకున్నారు. కేరళలో జరిగిన అగ్ని ప్రమాదం లాంటి ఘటనలు రాష్ట్రంలో ఎక్కడా జరగకుండా చూస్తామని చెప్పారు. అంతేకాదు.. ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి అగ్నిప్రమాదాలు జరగకుండా  ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పిస్తామ‌ని.. రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల్లో అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈనెల 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు పేర్కొన్నారు