రజనీ కాంత్ పై విజయకాంత్ కామెంట్లు.. రజనీకాంత్ లా పిరికివాడిని కాదు
posted on Apr 16, 2016 @ 5:37PM
తమిళనాడులో రజనీ కాంత్ ను అభిమానులు దాదాపు దేవుడు లాగానే చూస్తారు. ఒక్క తమిళనాడులోనే కాదు తెలుగులో కూడా రజనీకాంత్ అంటే అందరూ అభిమానిస్తారు. అలాంటి రజనీకాంత్ పైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి లేనిపోని ఇబ్బందులు తెచ్చుకున్నాడు డీఎండీకే అధినేత విజయకాంత్. తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఓ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. రాజకీయ నాయకులు భయపెడితే భయపడటానికి తానేమీ రజనీకాంత్ మాదిరిగా పిరికివాడిని కాదంటూ.. నా పేరు విజయకాంత్ నేను ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని నోటికొచ్చినట్టు వ్యాఖ్యానించాడు. అంతే ఇంక రజనీ ఫ్యాన్స్ ఊరుకుంటారా.. వెంటనే విజయకాంత్ దిష్టిబొమ్మలు తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. అంతేకాదు విజయకాంత్ చేసిన వ్యాఖ్యలకు సొంత పార్టీ నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో అభిమానులు మనసు చూరగొనేలా వ్యాఖ్యానించాలే కానీ.. ఇలా వారినుండి వ్యతిరేకత వచ్చేలా వ్యాఖ్యానించడం ఏం బాలేదని అంటున్నారు. మరి దీనిపై విజయకాంత్ ఎలా స్పందిస్తారో చూడాలి.