కంటతడి పెట్టిన పోప్
posted on Apr 17, 2016 @ 10:26AM
సిరియా అంతర్యుద్థంతో అక్కడి నుంచి గ్రీస్ తదితర దేశాలకు వలసలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో సిరియా నుంచి పారిపోయి గ్రీస్ లెస్బోస్‌లో ఓడ రేవులో తలదాచుకున్న శరణార్థులను పోప్ ఫ్రాన్సిస్ పరామర్శించారు. లెస్బోస్‌లో అడుగుపెట్టిన ఫ్రాన్సిస్‌కు శరణార్థ శిబిరంలోని చిన్నారులు, మహిళలు, వృద్థులు స్వాగతం పలికారు. శిబిరంలోని ఒకరు తమను ఆశీర్వదించమంటూ కన్నీటితో పోప్ పాదాలపై పడ్డారు. మరి కొందరు తమకు విముక్తి కల్పించమంటూ వేడుకున్నారు. వారి దురవస్థని చూసి చలించిన పోప్ కంట నీరు పెట్టారు. పోప్ వెంట ఎక్యుమెనికల్ పాట్రియార్క్, గ్రీస్ చర్చ్ హెడ్, ఆర్చిబిషప్ ఐరోనిమస్ తదితరులున్నారు. మేము కూడా సముద్రమనే శ్మశానానికి వెళుతున్నాం. తలదాచుకునేందుకు సముద్ర మార్గంలో బయలుదేరిన చాలామంది జాడ లేకుండా పోయారు’ అని లెస్బోస్ బయలుదేరే ముందు పోప్ ఆవేదనగా చెప్పారు.