టీవీకే చీఫ్ విజయ్ కీలక నిర్ణయం
posted on Oct 1, 2025 @ 3:56PM
తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టీవీకే అధ్యక్షుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు వారాల పాటు రాష్ట్ర వ్యాప్త పర్యటనలు వాయిదా వేసుకున్నారు. మరోవైపు వచ్చే వారం పోలీసుల అనుమతితో ఆయన బాధితులను పరామర్శిస్తారని టీవీకే పార్టీ పేర్కొన్నారు.
కరూర్‌లో సెప్టెంబర్ 27న విజయ్ నిర్వహించిన రాజకీయ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, 60 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషాదం విజయ్‌ను తీవ్రంగా కలచివేసింది. అనంతరం ఆయన రాష్ట్రవ్యాప్త పర్యటనలను రద్దు చేశారు.
టీవీకే నాయకులు ఈ ఘటనపై ఆరోపణలను ఖండిస్తూ, గతంలో పెద్దఎత్తున ర్యాలీలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించామని చెప్పారు. దీనిని డీఎంకే కుట్రగా కూడా ఆరోపించారు. అయితే అధికార పార్టీ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది.
విజయ్ నిన్న భావోద్వేగంతో ఒక వీడియో విడుదల చేస్తూ, "ఇలాంటి పరిస్థితిని నేను ఎప్పుడూ ఎదుర్కోలేదు" అన్నారు. కరూర్ వెంటనే ఎందుకు వెళ్లలేదన్న ప్రశ్నకు సమాధానంగా, "ఆ నిర్ణయం అసాధారణ పరిస్థితికి దారి తీస్తుందని భావించాను. త్వరలోనే బాధిత కుటుంబాలను కలుస్తాను" అని స్పష్టం చేశారు.