జగన్ లా తుగ్లక్ ను కాను... ఈ మాటన్నదెవరో తెలుసా?
posted on Oct 1, 2025 @ 5:02PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమ ప్రభుత్వ ప్రాధామ్యాలపై స్పష్టమైన వైఖరితో ఉన్నారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రగతి, మెరుగైన జీవన ప్రమాణాలు లక్ష్యంగా పాలనలో ముందుకు సాగుతున్నారు. ఇదే విషయాన్ని ఆయన పదే పదే చెబుతుంటారు. సంపద సృష్టితో పాటు ఆ సృష్టించిన సంపదను ప్రజలకు పంచడం ద్వారా సమాజంలో ఆర్థిక అంతరాలు తగ్గించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇదే విషయాన్ని ఆయన దాదాపు ప్రతి సంరద్భంలోనూ చెబుతూనే ఉంటారు.
సాధారణంగా ఆయన ప్రత్యర్థులపై చేసే విమర్శలన్నీ అంశాల ప్రాతిపదికనే ఉంటాయి. పరుషంగా మాట్లాడటం చాలా చాలా అరుదు. అటువంటి చంద్రబాబు నాయకుడు బుధవారం (అక్టోబర్ 1) విజయనగరం జిల్లాలో ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ జగన్ ను తుగ్లక్ గా అభివర్ణించారు. జగన్ హయాంలో రాష్ట్రం భ్రష్టుపట్టిన తీరును వివరిస్తూ.. 2024 ఎన్నికలలో విజయం సాధించి తన నాయకత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత రాష్ట్రంలో ప్రగతి ఎలా పరుగులు తీస్తున్నదో వివరించిన చంద్రబాబు.. తాను జగన్ లాంటి తుగ్లక్ ను కాదని చెప్పారు. జగన్ పాలనా విధ్వంసాన్ని, తన పాలనలో పరుగులు పెడుతున్న ప్రగతిని వివరించారు.
జగన తన ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజల ఆనందాన్ని హరించేశారని విమర్శించారు. జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు తీవ్రమైన నిర్బంధాన్ని ఎదుర్కొన్నారనీ, 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం విజయం సాధించి పదవీ పగ్గాలు అందుకున్న తరువాతనే రాష్ట్ర ప్రజలలో మళ్లీ ఆనందం కనిపిస్తోందన్నారు. సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలతో ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కూడా కలిగిందన్నారు. జగన్ తుగ్లక్ పాలనకు పూర్తి భిన్నంగా తన పరిపాలన అభివృద్ధి, స్థిరత్వం, ప్రజల సంతృప్తి స్థాయిని పెంచడంపై దృష్టిపెట్టిందని వివరించారు.