మిథున్ రెడ్డికి జగన్ అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదా?
posted on Oct 3, 2025 @ 11:14AM
రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని జగన్ పక్కన పెట్టేశారా? తనకు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన మిథన్ రెడ్డిని కనీసం కలిసేందుకు కూడా జగన్ ఇష్టపడటం లేదా? అంటే పార్టీ వర్గాలే కాదు.. పరిశీలకులు సైతం ఔననే అంటున్నారు. అందుకు ఉదాహరణగా మిథన్ రెడ్డి లిక్కర్ కుంభకోణంలో అరెస్టై నెలల తరబడి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నప్పటికీ.. జగన్ ఒక్కటంటే ఒక్కసారి కూడా మిథున్ రెడ్డిని పరామర్శించిన పాపాన పోలేదు.
అయితే.. మిథున్ రెడ్డి అరెస్టుకు ముందు.. వివిధ కేసులలో అరెస్టైన పార్టీ కింది స్థాయి నాయకుల నుంచి కార్యకర్తల వరకూ అందరినీ జగన్ పనిగట్టుకు వెళ్లి మరీ పరామర్శించారు. అలా పరామర్శించిన వారిలో గంజాయి కేసుల్లో, వేధింపుల కేసుల్లో అరెస్టైన పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారు. అయితే మిథున్ రెడ్డి ని మాత్రం జగన్ పరామర్శించడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. జైలుకు వెళ్లి పరామర్శించలేదు సరే.. ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేసేందుకు మిథున్ రెడ్డి మధ్యంతర బెయిలుపై బయటకు వచ్చినప్పుడు కానీ, ఇప్పుడు రెగ్గ్యులర్ బెయిలుపై విడుదలైన తరువాత కానీ జగన్ మిథున్ రెడ్డిని పలకరించ లేదు.
మిథున్ రెడ్డి జగన్ తో భేటీకి చేసిన ప్రయత్నం ఫలించలేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. మిథున్ రెడ్డికి జగన్ అప్పాయింట్ మెంట్ ఇవ్వడం లేదని అంటున్నాయి. ఒక్క మిథున్ రెడ్డి అనే కాదు.. అసలు మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన ఏ ఒక్కరినీ కూడా జగన్ ఇంత వరకూ పరామర్శించలేదు. పలకరించలేదు. దీంతో మద్యం కుంభకోణం విషయంలో జగన్ లో భయం పేరుకుపోయిందనీ, ఆ కేసులో అరెస్టైన వారికి ఎంత దూరంగా ఉంటే... ఆ కేసు దర్యాప్తు తనను చేరడానికి అంత ఆలస్యం అవుతుందనీ జగన్ భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.