ఎన్నాళ్ల కెన్నాళ్లకు?.. జగన్ కోసం వచ్చిన కొడాలి
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నాని.. తన సొంత పేరుతో కంటే.. బూతుల నానిగానే ఎక్కువ గుర్తింపు పొందారు. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం నాని నోరు విప్పితే అనుచిత వ్యాఖ్యలు, అసభ్య కామెంట్లు, ప్రత్యర్థులపై సభ్య సమాజం కూడా సిగ్గుపడేలా ఇష్టారీతిన కామెంట్లు చేస్తూ చెలరేగిపోయారు. మరీ ముఖ్యంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, జనసేనాని పవన్ కల్యాణ్ లను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమే కాకుండా, వారి కుటుంబ సభ్యులపై కూడా అనుచిత వ్యాఖ్యలతో ఇష్టారీతిగా చెలరేగిపోయారు.
ఆ తరువాత గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయంతో కొడాలి నాని పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఆ తరువాత అనారోగ్యానికి గురై.. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్న తరువాత ఆయన కనిపించి, వినిపించి చాలా చాలా కాలమైంది. గత కొన్ని నెలలుగా కొడాలి నాని ఎక్కడా కనిపించలేదు, వినిపించలేదు. అయితే తాజాగా ఆయన వైసీపీ నేతలతో పాటు కనిపించారు. దీంతో ఆయన తన రాజకీయ అజ్ణాతానికి తెరదించేశారా అన్న చర్చ ఏపీ రాజకీయవర్గాలలో ఆరంభమైంది.
ఇంతకీ కొడాలి నాని కనిపించిన సందర్భం ఏంటయ్యా అంటే.. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ తన లండన్ పర్యటనను ముగించుకుని బెంగళూరు చేరుకున్నారు. అక్కడ నుంచి ఆయన గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకులు పేర్నినాని సహా పలువురు ఆయన స్వాగతం పలికారు. అలా స్వాగతం పలికిన వారిలో కొడాలి నాని కూడా ఉన్నారు. ఇటీవలి కాలంలో కొడాలి నాని ఏ సందర్భంలోనూ బహిరంగంగా కనిపించిన దాఖలాలు లేవు. వైసీపీ చేపట్టిన ఆందోళనా కార్యక్రమాలకు కూడా ముఖం చాటేశారు. అటువంటి కొడాలి నాని తాజాగా జగన్ కు స్వాగతం పలకడానికి వైసీపీ నేతలతో కలిసి రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కేసుల భయంతో కలుగులో దాగినట్లుగా ఇంత కాలం వ్యవహరించిన నాని ఇప్పుడు ఏ ధైర్యంతో బయటకు వచ్చారా? అన్న చర్చ రాజకీయవర్గాలలో ప్రారంభమైంది.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సంక్షేమ, అభివృద్థి పథకాల ప్రారంభం, అమలు కార్యక్రమాలతో దూకుడు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో వైసీపీ శ్రేణులను సమాయత్తం చేయడానికి జగన్ తన వంతు ప్రయత్నంగా గతంలో పార్టీలో ఫైర్ బ్రాండ్ లుగా చెలామణి అయ్యి.. ఇప్పుడు కేసుల భయంతో ముఖం చాటేస్తున్న వారిని ఒక్కొక్కరుగా బయటకు తీసుకువస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీద కొడాలి నాని తన రాజకీయ అజ్ణాతం నుంచి బయటకు వచ్చినట్లేనా? ఇక ఆయనపై ఉన్న కేసుల దర్యాప్తు వేగం పుంచుకుంటుందా? అన్న చర్చ అయితే పొలిటికల్ సర్కిల్స్ లో ఓ రేంజ్ లో జరుగుతోంది.