యుపిఎకి ములాయం వార్నింగ్
posted on Sep 20, 2012 @ 6:08PM
యుపిఎలో సంక్షోభం ముదురుతోంది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ యుపిఎ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు. తృణమూల్ కాంగ్రెసు అధినేత మమతా బెనర్జీ బాటలోనే ఆయన నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎఫ్‌డిఐలపై యుపిఎ ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ప్రత్యామ్నాయం చూసుకుంటామని ఆయన కాంగ్రెసు నాయకత్వాన్ని హెచ్చరించారు. తాజాగా ములాయం యుపిఎ ప్రభుత్వానికి దూరం జరిగి, తృతీయ కూటమికి పునాదులు వేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. యుపిఎకు ఇప్పటి వరకు ఎస్పీ వెలుపలి నుంచి మద్దతు ఇస్తూ వస్తోంది. ఎస్పీకి 22 మంది లోకసభ సభ్యులున్నారు. వీరి మద్దతు యుపిఎకు కీలకం.
అయితే మద్దతు ఉపసంహరించుకునే విషయంపై మమతా బెనర్జీ వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేరు. ఎస్పీ, తెలుగుదేశం, వామపక్షాలు గురువారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద యుపిఎ ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తాయి. ఢిల్లీ ర్యాలీలో పాల్గొనడానికి ములాయం సింగ్ యాదవ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఆహ్వానించారు. ఈ ర్యాలీలో ములాయం సింగ్, వామపక్షాల నేతలు ప్రకాష్ కారత్, సీతారాం ఏచూరి, ఎబి బర్దన్‌లతో పాటు చంద్రబాబు నాయుడు కూడా పాల్గొన్నారు.