Read more!

అతి విశిష్టం - తొలి ఏకాద‌శి

 

అతి విశిష్టం - తొలి ఏకాద‌శి

భార‌తీయులు జ‌రుపుకొనే పండుగ‌లు ఆషామాషీగా ఏర్ప‌డిన‌వి కావు. భ‌క్తితో, తాత్విక‌త‌తో జ‌రుపుకొనే ఆ పండుగ‌లని త‌ర‌చి చూస్తే మ‌న జీవ‌న విధానానికి కూడా అనుగుణంగా క‌నిపిస్తాయి. వ‌ర్షాకాలం కాస్త ఊపందుకుని, నేల త‌డిసి, చెరువులు నిండే కాలాన్ని మ‌న పూర్వీకులు పొలం ప‌నుల‌కు అనువైన స‌మ‌యంగా భావించారు. అందుక‌ని ఆషాఢ‌మాసంలో వ‌చ్చే మొద‌టి ఏకాద‌శిని `తొలి ఏకాద‌శి`గా పేర్కొన్నారు. ఆ రోజున త‌ప్ప‌నిస‌రిగా ప‌శువుల‌కు, నాగ‌లికీ పూజ జ‌రిపి పొలంప‌నుల‌ను ఆరంభించేవారు. మ‌రి ఏద‌న్నా సంద‌ర్భాన్ని తీపితో జ‌రుపుకోవ‌డం మ‌న అల‌వాటు క‌దా! కానీ పొలం ప‌నులు ఇప్ప‌డు మొద‌ల‌య్యాయి కాబ‌ట్టి, పిండివంట‌లు చేసుకునే స్తోమ‌త అంద‌రికీ ఉండ‌ద‌య్యే! అందుక‌ని ఆ కాలంలో తేలిక‌గా, పుష్క‌లంగా ల‌భించే పేలాల‌పిండిని బెల్లంతో క‌లుపుకుని తింటారు.

ఇక ఈ ఏకాద‌శినాడు విష్ణుమూర్తి యోగ‌నిద్ర‌లోకి వెళ్లి నాలుగు నెల‌ల త‌రువాత వ‌చ్చే క్షీరాబ్ది ద్వాద‌శినాడు మేల్కొంటాడ‌ని ఓ న‌మ్మ‌కం. ఈ న‌మ్మ‌కం వెనుక కూడా ఒక భౌతిక సూత్రం ఉంది. జులై నుంచి రాత్రివేళ‌లు పెరుగుతాయి కాబ‌ట్టి, దీనిని విష్ణుమూర్తి యోగ‌నిద్ర‌కు ఆపాదించారు మ‌న పూర్వీకులు. ఈ ఏకాద‌శిని తొలి అన‌డంలో మ‌రో విశేషం ఉంది. తొలి ఏకాద‌శినుంచే హిందువుల పండుగ‌ల‌న్నీ ప్రారంభం అవుతాయి. వ‌ర‌ల‌క్ష్మీవ్ర‌తం, శ్రావ‌ణ‌పౌర్ణ‌మి, వినాయ‌క‌చ‌వితి.... ఇలా ప్ర‌తి ప‌దిహేను రోజుల‌కీ ఏదో ఒక ముఖ్యపండుగ వ‌స్తూనే ఉంటుంది. కాబట్టి దీనిని తొలిపండుగ‌గా కూడా చెప్పుకోవ‌చ్చు.

ఏకాద‌శి అన‌గానే ఉప‌వాస దీక్ష గుర్తుకువ‌స్తుంది. ఏకాద‌శినాడు ఉప‌వాసం ఉండాల‌నుకునేవారు, అంత‌కు ముందురోజైన ద‌శ‌మినాటి మ‌ధ్యాహ్నం మాత్రమే భుజిస్తారు. మ‌రుస‌టి రోజైన ఏకాద‌శినాడు పూర్తి ఉప‌వాసం ఉండి, పూజ‌ల‌తోనూ, ధ్యానంతోనూ కాలాన్ని గ‌డుపుతారు. ఆ రాత్రి జాగ‌ర‌ణ‌తో గ‌డిపి, తెల్లవారుఝామున ద‌గ్గ‌ర‌లోని ఆల‌యాల‌ను సంద‌ర్శిస్తారు. త‌న మ‌న‌సు ప‌ట్ల పూర్తి ఎరుక‌ను సాధించేంద‌కు ఆలోచ‌న‌లు నిల‌క‌డ‌గా ఉండ‌టం చాలా అవ‌స‌రం. ఉప‌వాసం ఉండ‌టం ద్వారా మ‌న‌సుని ప్రభావితం చేసే ప్రలోభాల నుంచి దూరంగా ఉండ‌వ‌చ్చు. రాత్రిపూట జాగర‌ణ చేయ‌డం అనేది మ‌న‌సులోని భావాల ప‌ట్ల జాగ‌రూక‌త‌ను క‌లిగిస్తుంది. మ‌న‌సు ప‌ట్ల జాగ‌రూక‌త వ‌హిస్తే అది నిశ్చల‌మ‌వుతుంది. ఉప‌వాస, జాగ‌ర‌ణ‌ల ద్వారా భ‌గ‌వంతుని ద‌ర్శించ‌డం అన్న మాట‌లోని ప‌ర‌మార్థం ఇదే! ఇక మ‌రునాడు ద్వాద‌శినాడు కూడా అతిగా భుజించ‌రాదు.

ఇలా ఏకాద‌శి ఉప‌వాసాన్ని ఆచ‌రించ‌డం వెనుక కూడా ఒక లౌకిక అర్థం ఉంది. భూమి మీద చంద్రుని ప్ర‌భావం ఏకాద‌శి నుంచి తీవ్రంగా ఉంటుంది. అది పౌర్ణ‌మి అమావ‌స్య‌కి అధిక‌మ‌వుతుంది. ఆ సంద‌ర్భంలో మాన‌సిక ఆందోళ‌న‌లు, జీర్ణ‌కోశ‌స‌మ‌స్య‌లు మ‌న లౌకిక‌, పారమార్థిక జీవితాన్ని చికాకు ప‌రుస్తాయి. అలాంటి ఇబ్బందుకు శ‌రీరం లొంగ‌కుండా... ఉప‌వాసం ద్వారా శ‌రీరాన్నీ, జ‌ప‌జాగ‌ర‌ణ‌ల ద్వారా మ‌న‌సునీ సిద్ధ‌ప‌రిచేందుకే ఏకాద‌శి దీక్ష! ఇక చాతుర్మాస వ్ర‌తాన్ని కూడా ఈ ఏకాద‌శి మ‌రుస‌టి రోజు నుంచే మొద‌లుపెడ‌తారు. ఈ వ్ర‌త సంద‌ర్భంగా శ్రావ‌ణ‌మాసంలో ఆకుకూర‌లు, దుంప‌కూర‌లు; భాద్రపదంలో పెరుగును; ఆశ్వయుజంలో పాలను; కార్తికంలో రెండు బ‌ద్ద‌లుగా వ‌చ్చే గింజ‌ల‌ను (పెస‌లు, మినుములు...) విస‌ర్జిస్తారు. రాత్రివేళ‌లు ఎక్కువ‌గా ఉండి, చంద్రుని ప్ర‌భావం మ‌న మీద అధికంగా ఉండే ఈ నాలుగు నెల‌ల‌లో...

మ‌న శ‌రీరంలోని ఉష్ణాన్ని స‌వ‌రించేందుకు పెద్ద‌లు ఇలాంటి ఆహార‌నియ‌మాల‌ను ఏర్ప‌రిచార‌ని చెబుతారు. స‌న్యాసులు ఈ నాలుగు నెల‌ల కాలం ఎక్క‌డికీ ప్ర‌యాణాలు చేయ‌కుండా, ఒక్క‌చోట‌నే ఉండి ప్ర‌వ‌చ‌నాల‌ను అందిస్తూ, జ‌ప‌త‌పాల‌ను ఆచ‌రిస్తుంటారు. దీని వెనుక కూడా ఒక విశేషం లేక‌పోలేదు. ఈ నాలుగు నెల‌లూ వ‌ర్షాకాలం కాబట్టి... కొండ‌చ‌రియ‌ల‌కీ, వ‌ర‌ద‌ల‌కీ ఇబ్బంది ప‌డ‌కుండా ఒకే చోట నిశ్చ‌లంగా ఉండి త‌మ త‌ప‌స్సుని కొన‌సాగించేందుకు ఆ ఆచారం మొద‌లై ఉంటుంది..

- నిర్జ‌ర‌