Read more!

పుష్కరాలు

 


పుష్కరాలు

 


జలమే సమస్త జగతికి ఆధారము. సృష్టిలోని చరాచర ప్రాణికోటికి జలమే ఆధారభూతమైనది. జలం లేకుంటే ప్రాణికోటి మనుగడే కష్టమైపోతుంది. జలావిర్భావం తర్వాతనే ప్రాణి కోటి ఆవిర్భవించింది. అట్టి జలాన్ని దేవతగా భావించి, పూజించి తరిస్తున్నదీ మానవజాతి. ఇది మన హిందువులకు అనాదిగా వస్తున్న సంప్రదాయము, సదాచారము. నదీస్నానాలు, కోనేటిస్నానాలు,  సముద్రస్నానాలు, మాఘస్నానాలు, మంగళస్నానాలు మొదలగు ఎలా అయితే ఎప్పటి నుంచో వస్తున్న మన ఆచారాలో   ఈ  పుష్కర స్నానం కూడా ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. 12 ఏళ్ళకొకసారి వచ్చే నదీపుష్కరాలు మన హిందువులకేంతో పవిత్ర మయినవి.


పుష్కరం వివరణ:

 

పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలు. ఈ పుష్కరాలు మన దేశంలోని ముఖ్య నదులన్నిటికీ వస్తాయి. వీటికి పుష్కరం అనే పేరు ఎందుకొచ్చిదో తెలిపే కథలు పురాణాల్లో, ఉపనిషత్తులలో ఉన్నాయి! పుష్కరుడు ఒక బ్రహ్మ లోక వాసి. అతడు శివుని గురించి తపస్సు చేసాడు. శివుడు తపస్సుకి మెచ్చి వరం కోరుకోమన్నాడు. అప్పుడు పుష్కరుడు శివునిలో శాశ్వత స్థానాన్ని కోరుకున్నాడు. పుష్కరుడు,  శివుని అష్టముర్తులలోని జలసిద్ధిని వేడగా, పుష్కరునికి పుష్కర మూర్తిత్వాన్నిప్రసాదించాడు. అంతట పుష్కరడు పుష్కరమూర్తిగా మారి శివుని చెంత చేరాడు.

దేవేంద్రుడు గౌతమ మహర్షిచే శాపగ్రస్థుడై “విరూపి”యైనాడు. అతడు తన వికృత రూపాన్ని భరించలేక తరుణోపాయాన్నిప్రసాదించమని తన గురువు బృహస్పతిని వేడుకొన్నాడు. తన శిష్యుని కోరికను మన్నించి బ్రహ్మలోకం చేరి ఆయన దర్శనంచేసుకొని ఇంద్రునికి శాప విమోచనం కోరాడు. అయినా అతడి విరూపం పోలేదు. అప్పుడు బ్రహ్మ మందాకిని నదీతీరంలో ఒక దివ్య సరస్సును సృష్టించి తన కమండలం లో పుష్కర జలం ప్రోక్షించి దేవేంద్రుణ్ణి స్నానం చేయమన్నాడు.దేవేంద్రుడు అందులో స్నానం చేయగా పూర్వరూపాన్ని పొందాడు. విరూపంపోయి, స్వరూపాన్నిపొందిన దేవేంద్రుడు, దేవ గురువు బృహస్పతులిద్దరూ ఆకాశగంగ కన్నా అత్యంత ప్రభావశాలియైన పుష్కర స్నాన మహత్యానికి ఆశ్చర్యపోయారు. ఇది ఈనోటా ఆనోటా అన్ని లోకాలకు వ్యాపించింది.

ఆకాశగంగని మించిన ఉత్తమమైన పుష్కర తీర్థ సమ్మేళనానికి మిగతా నదులున్నీఎదురు చూడసాగాయి. గంగ, గౌతమీ నదులతో కలిసి అన్ని నదులు బ్రహ్మను ప్రార్ధించాయి. అదే సమయాన తన కనులారాగాంచిన పుష్కర తీర్థ మహిమను, గురు బృహస్పతి తనకు ఆ భాగ్యాన్ని కల్గించమని ప్రార్ధించాడు. కాని పుష్కరుడు వారి కోర్కెను ముందు అంగీకరించలేదు. అయినా సమస్త నదుల ప్రార్ధనకు, గురుని ప్రార్ధనకు పుష్కరుని మనసు కరిగి గ్రహబలం పుష్టికై పుష్కర సమయం లో మొదటి 12 రోజులు, చివరి 12 రోజులు బ్రహ్మచే నియమింపబడిన నదులలో మాత్రమే తాను ప్రవేశిస్తానని పుష్కరుడు ఒప్పుకొన్నాడు.

రాశికొక్క సంవత్సరం చొప్పున 12 రాశులకు, 12 సంవత్సరములకొకసారి ఆయా నదీ పుష్కరములు వచ్చుట వాడుకగా మారింది. దేవ గురువు యొక్క  సింహరాశి ప్రవేశం, అలా గోదావరి యొక్క పుణ్యకాలంగా పరిగణలో కి వచ్చింది. అదే గోదావరి పుష్కరమయింది. గోదావరి జన్మస్థానం నాసిక్ మహారాష్ట్రలో ఉంది. పంచభూతములలో  జలము అధిక శ్రేష్ఠమైనది. అది దివి నుండి భువికి భగీరధునిచే  తేబడిన గంగ - మహా గొప్పది. అయినా గోహత్య దోష నివారణకై గౌతమ మహర్షిచే కొనిరాబడిన గంగవలె గోదావరి కూడా ప్రాచుర్యంలో అగ్రస్థానంలో ఉంది. స్మృ తులు గోదావరిలో స్నానం చేసిన తరువాతనే గంగలో స్నానం చేయాలని అంటున్నాయి. ఈ విధంగా గురుడు సింహరాశిలో ప్రవేశించగానే మూడు కోట్ల యాభై లక్షల తీర్థములతో  కూడి పుష్కరుడు గోదావరి నదిని ఆశ్రయిస్తాడు. అలా ఆయన ప్రవేశించిన సంవత్సరములో మొదటి పన్నెండు దినములు, చివరి పన్నెండు దినములు ఆశ్రయించి ఉంటాడు.

మొదటి పన్నెండు దినములను ఆది పుష్కరములుగా, చివరి పన్నెండు దినములను అంత్య పుష్కరములుగా వ్యవహరించటం, ఉత్సవం జరపటం మనకు అనాదిగా వస్తున్న ఆచారము.  ఒకసారి ఒక నదికి పుష్కరం వచ్చిన తరువాత మరల, పన్నెండేళ్ళకే ఆ నదికి పుష్కరాలు వస్తాయి.  ఈ ఏడాది గోదావరికి పుష్కరాలు వచ్చాయి. నాసిక్ లో పుట్టి ప్రవహించే గోదావరి మనకు ఆదిలాబాద్,  కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం మరియు ఉభయ గోదావరి జిల్లాల్లో పారుతూ ఉండటం వలన ఈ నదికి పుష్కరాలు జరుగుతాయి. అది 2015 సంవత్సరం అధిక ఆషాఢ బహుళ త్రయోదశి మంగళవారం అనగా 14 జూలై 2015 నాటి ఉదయం 6గం. 25ని. లకు గురువు సింహరాశిలో ప్రవేశించే దినం. అదే పుష్కర సమయం, పుష్కర ప్రారంభం.

ఈ పుష్కర సమయములో సూర్యుడు ఉదయించక ముందే లేచి నదిని స్మరిస్తూ స్నానం చేయాలి. దీనివలన పాపాలు పోతాయని నమ్మకం. ఇంకా నదిని స్తుతిస్తూ, భజనలు చేస్తూ మంగళ హారతులిస్తారు. ఈ సమయములో దేవుళ్ళందరూ ఆ నదిలో ఉంటారని గాఢంగా విశ్వసిస్తారు. పుష్కరాల కాలంలో నదీమతల్లికి హారతి యివ్వటం అంటే సకల దేవతలకు హారతులిచ్చినట్లే!! ఈ నమ్మకంతో భక్తులంతా తమ శక్తిననుసరించి హరతులిచ్చి, పుణ్యప్రదులౌతారు. పాప ప్రక్షాళనం చేసుకొన్న తృప్తి ననుభవించి తమ జీవితాలు ధన్యమైనాయనే మహదానందంతో శేషజీవితాన్ని గడుపుతారు


జీవులకు మూడు కర్మల ద్వారా ముక్తి లభిస్తుందట!!

1.    రేవానదీ తీరాన తపస్సు చేస్తే ముక్తి.
2.    గంగాతీరాన తనువును వదిలితే ముక్తి.
3.    కురుక్షేత్రంలో దానం చేస్తే ముక్తి. 

ఈ మూడింటి ఫలము పొందాలంటే పుష్కర సమయంలో పవిత్ర గోదావరి లో స్నానం చేస్తే ఫలితం లభిస్తుందని వేదం చెపుతోంది.

ఇట్టి ఘనమైన దివ్యమైన పుష్కర స్నానాన్ని ఈ ఏడు వస్తున్న గోదావరి పుష్కరాల్లో మనమంతా, మనకు దగ్గరలో ఉన్న గోదావరిని చేరి అందులో పుణ్యస్నానమాడి పాపాలను పోగొట్టుకొని తగినంత పుణ్యాన్ని మూటగట్టుకుందాం. మరిక  ఆలస్యం ఎందుకు? అందరమూ మూడు మునకలు వేసి యోగ్యులైన బ్రాహ్మణుల పర్యవేక్షణలో స్నానాలు, జప హోమ, తర్పణాదులు, దాన ధర్మాలను చేసి పితృదేవతలను సంతోషింప చేసి మనలను తరింపజేసుకొందాం.

పుష్కర సమయంలో చేయవలసిన దానాలు:
 
పుష్కర సమయం                దానాలు      
మొదటిరోజు                        బంగారం, వెండి, ధాన్యం (బియ్య౦), భూదానం మొదలగునవి.      
రెండో రోజు                          వస్త్రం, ఉప్పు, రత్నం (పగడాలు, కెంపు, ముత్యాలు మొదలగునవి.)      
మూడవరోజు                      బెల్లం, అశ్వం, పండ్లు  మొదలగునవి.      
నాలుగవ రోజు                    నెయ్యి, నూనె, పాలు, తేనె.      
ఐదవ రోజు                        బియ్యం, ఆవు, హలం మొదలగునవి.      
ఆరవ రోజు                        మందులు, కర్పూరం, గంధం మొదలగునవి.      
ఏడవ రోజు                       గృహదానం, పీట, మంచం, కందమూలములు (దుంపలు: కంద, పెండలం, అరటి మొదలగునవి).      
ఎనిమిదవ రోజు                గంధం, కందమూలములు, పువ్వులు.      
తొమ్మిదవ రోజు                పిండదానం, కన్యాదానం, కంబళి (రగ్గు).      
పదవ రోజు                      కూరగాయలు, సాలగ్రామం, పుస్తకం.      
పదకొండవ రోజు                గజదానం.      
పన్నెండవ  రోజు               నువ్వులు.     


పుష్కర స్నాన విశిష్ఠత:

 

గంగానది వంటి పవిత్ర నదిలో ప్రతి రోజుస్నానం చేసిన ఫలితం పుష్కరాల సమయంలో గోదావరి నది లో ఒక్కసారి స్నానం చేయటం వల కలుగుతుందని బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది. మనం రోజూ ఉదయం చేసిన స్నానం వల్ల సాయంత్రం  వరకు ఎంత ఉత్సాహంగా ఉంటామో, అలాగే ఒక్కసారి చేసిన ఈ పుష్కర స్నానం వల్ల 12 సంవత్సరాలపాటు మనలోని నాడీ మండలము చురుకుగా పని చేస్తుంది. గోదావరి పుష్కరాలలో భాగమైన ఆది పుష్కరాలు 14-జులై –2015 నుండి 25-జులై-2015 వరకు ఉంటాయి. అంత్య పుష్కరాలు 31-జులై –2016 నుండి 11-ఆగస్టు-2016 వరకు ఉంటాయి.

పుష్కర సమయం లో ముఖ్యంగా మూడు పనులను చేయాలని పెద్దలు సూచించారు. అవి:

1.    స్నానము
2.    దానము
3.    శ్రాద్ధము

పుష్కర స్నాన విధానము:

ఏ తీర్థ స్నానానికైనా మొదట సంకల్పము చెప్పుకొని స్నానం చేయాలి. లేక పొతే తగినంత ఫలం ఉండదు.
నదీ స్నానం చేసే ముందే ఇంటిలో ఒకసారి స్నానం చేయాలి. వేరే ఊరి నుండి వచ్చేవారు యాత్రకు వస్తే ఒకరోజు ఉపవాసం చేసి ఆ తరువాత రోజు పితృ శ్రాద్ధ కర్మలు చేయాలి.  పుష్కరస్నానం చేసే ముందు తీరంలోని మట్టిని తీసుకొని నదిలోని నీళ్ళలోకి వేయాలి. ఇలా చేయకపోతే స్నానం చేసేవారి పుణ్యాన్ని “కృత్య” అనే శక్తి హరిస్తుంది (తినేస్తుంది).
 “కృత్య”: శివుని మూడో కంటి మంటలోనుండి ఉద్భవించిన శక్తి .
తరువాత నదిలోకి ప్రవేశించి ఈ క్రింది శ్లోకం చదవాలి:

“పిప్పలాదాత్సముత్పన్నే  కృత్యే లోకభయంకరి  
మృత్తికాంతే మయాదత్తా మహారార్ధం ప్రకల్పయ.” 

ఈ మంత్రము చదువుకొని మట్టిని నదిలోకి  వేసి మూడు సార్లు బ్రొటనవేలితో నీళ్ళు తీసుకొని తలపై చల్లుకోవాలి (గోవిందా అని మూడు సార్లు దేవుణ్ణి తల్చుకొని చల్లుకోవాలి). తరువాత గోదావరికి నమస్కరించి, ఆచమనం చేసి, (ఆచమనం అంటే –కుడిచేతిలోకి నీళ్ళు తీసుకొని దేవుడి పేరు చెప్పి త్రాగాలి). తదుపరి  ఇలా మనం సంకల్పం చెప్పుకోవాలి.

సంకల్పం :

“అస్యాం మహానద్యాం సమస్త పాప క్షయార్ధం
 సింహగతే దేవగురౌ సార్ధత్రికోటి 
తీర్ధసహిత తీర్ధరాజ సమాగమాఖ్య మహాపర్వణి  పుణ్యకాలే 
అఖండ గౌతమీ స్నాన మహం కరిష్యే .”
అని చెప్పి మూడు సార్లు నీటిలో మునక వేసి స్నానం చేయాలి.
పై మంత్రము చెప్పలేనివారు ఈ విధంగా కూడా చెప్పుకోవచ్చు: “అమ్మా గోదావరి  ఈ పవిత్ర నదిలో స్నానం చేస్తున్నాను అని  తమ పేరు, గోత్రం, దేశం, కాలం” చెప్పుకొని స్నానం చేయాలి. తరువాత గురుడికి, పుష్కరుడికి, సూర్యుడికి ముక్కోటి దేవతలకు, సప్త ఋషులకు, గోదావరి నదికి అర్ఘ్యం ఇవ్వాలి (అర్ఘ్యం అనగా రెండు దోసిళ్ళలోకి నీళ్ళు తీసుకొని తూర్పు దిశగా నిలబడి పైన చెప్పినవారందరకు ఆ నీటిని చూపించి నదిలో విడిచిపెట్టాలి). తరువాత పితృ దేవతలను స్మరించి వారికి కూడా అర్ఘ్యం ఇవ్వాలి. తిరిగి మళ్ళీ నదిలో మూడు సార్లు మునక వేసి స్నానం చేయాలి. ఇలా స్నానం చేసి పవిత్రమయిన తరువాత
“ఆచరిత వ్రత కల్పోక్త సకల ఫలావ్యాప్తర్ధం గౌతమీ పూజాం కరిష్యే“  అని సంకల్పం చెప్పి షోడశోపచారాలతో గోదావరీ మాతకు పూజలు చేయాలి .
స్నానం చేస్తున్నప్పుడు పరిపూర్ణ ఫలితాన్ని పొందటానికి శంకరాచార్యుల వారు “పుష్కరాష్టకం “లో చెప్పిన మరొక శ్లోకం కూడా చదువుకోవటం ఉత్తమోత్తమం .
“శ్రీ యాయుతం త్రిదేహ తాప పాప రాశి నాశకం
మునీంద్ర సిద్ధ సాధ్య దేవదాన వైరభిష్టుతం
తతే  అస్తి యజ్ఞ పర్వతస్య ముక్తిదం సుఖాకరం      
నమామి బ్రహ్మ పుష్కరం స వైష్ణవం సశాంకరం “ .

పై శ్లోకాన్ని చద వటం వలన పుష్కరుని యొక్క సర్వ దేవతల యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చని పురాణాలు చెప్తున్నాయి .

పుష్కర స్నాన నియమాలు :

1. ఇంట్లో స్నానం చేయకుండా, నేరుగా నదిలో చేసే వారు నదికి తూర్పు ముఖంగా నిలబడి స్నానం చేయాలి.
2. అభ్యంగస్నానం (తలంటు), తలకు నూనె రాసుకోవటం వంటివి చేయకూడదు.
3. సబ్బులు, షాంపూలు వాడరాదు.
4. కేవలం ఒళ్ళు తడిసే వరకు మూడు మునకలు వేయాలి.
5. నిద్రపోయి వచ్చిన బట్టలతో స్నానం చేయకూడదు.
6. ఒకే వస్త్రంతో స్నానం చేస్తే ఐశ్వర్యం పోతుంది. అందుకే పంచె మీద ఉత్తరీయం (చిన్న టవల్ ) చుట్టుకొని స్నానం చేస్తే మంచిది .
7. తెల్లటి వస్త్రంతో స్నానం చేయాలి (ఎరుపు రంగు వాడరాదు).
8. స్నానం చేశాక తడి వస్త్రాన్ని క్రింద పడవేయకూడదు.
9. నది మధ్యలోకి, లోతుగా ఉన్న చోటుకు వెళ్లి స్నానం చేయవద్దు.
10. స్నానం చేసిన వస్త్రాలను నదిలో పిండకూడదు.
11. నదిలో ప్లాస్టిక్ కవర్లను వేస్తే మహాపాపం. నదిలో కాని తీరంలో కాని ఉమ్మివేసినచో వికలాంగులవుతారని  పోతన గారు చెప్పారు. కావున తగు జాగ్రత్త తీసుకోగలరు.
12. స్వచ్చమైన నీటిని మాత్రమే త్రాగండి.
13. మాసిన, చిరిగిన బట్టలతో స్నానం చేయకూడదు.
14. అర్ధరాత్రి 12 గం. లకు  స్నానం చేయకూడదు.
15. అల్పాహారం, భోజనం వంటివి చేసి స్నానం చేయకూడదు (కానీ వృద్దులు, పిల్లలు, వ్యాధి గ్రస్తులు అల్పాహారం తిని పుష్కర స్నానం చేయవచ్చునని శాస్త్రాలు చెప్తున్నాయి).
పుష్కర స్నానం వలన గ్రహ బాధలు తొలగిపోతాయి. “బ్రహ్మపురాణం “ ప్రకారం దైవనది అయిన గోదావరిలో స్నానం చేస్తే , సమస్త పాపాలు తొలగి, శుభ ఫలితాలు కలుగుతాయి. అంతేకాక ఇందులో స్నానం చేసిన వారికి దీర్ఘాయువు లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి .
ఈ సమయంలో దేవతర్పణాలు, ఋషి తర్పణాలు, పితృ తర్పణాలు వంటివి ఇస్తే వారి యొక్క ఋణవిముక్తులవుతారు.

జలుబు, జ్వరం, ఆస్తమా వాటి సమస్యలున్నవారు నదీ స్నానం చేయకూడదు. వారు పుష్కర స్నానం చేసిన వారి చేత కొంచెము పుష్కర జలము తెప్పించుకొని, ఆ నీటిని చేతిలో పోసుకొని, “ఓం లక్ష్మీ నారాయణాభ్యాం నమః “ అని తల్చుకొని తలపై చల్లుకోవాలి. దీనీవల్ల పుష్కర స్నాన ఫలితం లభిస్తుందని పెద్దలు సూచిస్తున్నారు. ఈ పుష్కరాల కాలంలో ఒక్క రూపాయి దానం ఇస్తే కోటి రూపాయిలు దానం ఇచ్చినట్లే .ఒక్కసారి మంత్రం జపిస్తే కోటిసార్లు జపించినట్లే. గోదావరిలో స్నానం చేస్తే ప్రపంచంలోని అన్ని నదులలో స్నానం చేసినట్లే అవుతుందని పురాణాలు తెల్పుతున్నాయి .మన కలుషాన్ని కడిగి వేసే  పవిత్ర నదులకు, మనవల్ల కాలుష్యం రాకుండా చూసుకొనే బాధ్యత మనదే. అప్పుడే ఆ నదీ దేవతల అనుగ్రహం మన మీద ఉంటుంది. పన్నెండేళ్ళకు ఒక్కసారి వచ్చే అరుదైన ఘట్టం ఈ గోదావరి పుష్కరాలు. కాబట్టి ఇంతటి విశిష్టత కలిగిన ఈ పుష్కర కాలాన్ని వినియోగించుకొని స్వర్గలోక ప్రాప్తి కోసం మార్గం వేసుకుంటారని ఆశిస్తున్నాను .           

!! శుభం !!

.....Urmila Chetan