ఈ పనులు పొరపాటున కూడా చేయకండి.. శ్రీకృష్ణుడి ఆగ్రహానికి గురవుతారు..!
ఈ పనులు పొరపాటున కూడా చేయకండి.. శ్రీకృష్ణుడి ఆగ్రహానికి గురవుతారు..!
శ్రీకృష్ణుడిని గొప్ప గురువుగా భావించేవారు చాలామంది ఉన్నారు. ఆయన లీల, ఆయన చేసే మాయలు చాలా కొద్ది మంది మాత్రమే అర్థం చేసుకోగలరు. జీవితాన్ని ఉన్నత కోణంలో చూసేవారు మాత్రమే కృష్ణుడిని అర్థం చేసుకోగలరు. కురుక్షేత్ర యుద్దాన్ని నేను చెయ్యను అని వెనుకడుగు వేయబోయిన అర్జునుడికి జ్ఞానబోధ చేసి అర్జునుడితో యుద్దం చేయించినది కృష్ణుడే.. పాండవుల పక్షాన నిలబడి ధర్మానికి ఎప్పుడూ దైవం అండ ఉంటుంది నిరూపించినది కృష్ణుడే.. జీవితం, ప్రేమ, వ్యామోహం, మాయ, కర్మ.. పాప పుణ్యాల వలయం.. వీటన్నింటికి పురాణాలలో చక్కని సమాధానం ఇచ్చినది, ప్రజలందరికీ ఆధ్యాత్మిక చింతన వైపు మనసు మళ్లేలా చేసినది కృష్ణుడే.. అలాంటి కృష్ణుడికి కొన్ని విషయాలు చాలా ఆగ్రహం తెప్పిస్తాయి. వాటిని పొరపాటున కూడా చేయకూడదు. అవేంటో తెలుసుకుంటే..
తులసి..
తులసి అంటే కృష్ణుడికి చాలా ప్రీతి. కృష్ణుడి పూజలో తులసి లేకపోతే అది వ్యర్థం అని చెబుతారు. అయితే తులసి విషయంలో కొన్నినియమాలు ఉన్నాయి. అవి పాటించక పోతే కృష్ణుడికి ఆగ్రహం వస్తుంది.
తులసి నియమాలు..
తులసిని పొరపాటున కూడా స్నానం చేయకుండా కోయకూడదు. ఇలా చేస్తే తులసిని అపవిత్రం చేసినట్టు, అవమానించినట్టు.
తులసిని ఆడవారు నెలసరి సమయాల్లో అస్సలు ముట్టకూడదు. అలా ముట్టడం వల్ల తులసిని అపవిత్రం చేసినట్టు అవుతుంది. అంతేకాదు.. ఆ తరువాత ఆ తులసి దైవ ఆరాధనలో అస్సలు పనికిరాదు కూడా. తులసిని దైవ ఆరాధనకు దూరం చేయడం చాలా పాపం.
తులసిని ఎప్పుడంటే అప్పుడు కోయరాదు. సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత, ఏకాదశి, శుక్రవారం రోజుల్లో తులసిని కోయకూడదు. పైగా మిగిలిన సమయాల్లో తులసిని కోసే ముందు ఆ శ్రీహరి పూజ కోసమే నిన్ను కోస్తున్నాను అని పవిత్రంగా తులసి ముందు చెప్పుకున్న తర్వాతే తులసిని కోయాలి.
తులసిని కోసిన తర్వాత తులసికి ఇచ్చే గౌరవం కూడా చాలా ముఖ్యం. చాలామంది తులసిని కోసిన తర్వాత పూజలో మిగిలిపోతే ఎక్కడంటే అక్కడ పడేస్తుంటారు. ఇది చాలా తప్పు. తులసిని మిగిలిపోతే ఎండబెట్టి ఆరోగ్యం కోసం వాడుకోవచ్చు. లేదంటే తులసిని పారే నీరు లేదా చెరువు, బావులలో కలిపేయవచ్చు. ఇది నీటిని కూడా శుద్ది చేస్తుంది.
ధర్మం..
కృష్ణుడు ఎప్పుడు ధర్మాన్నే పాటించాలని చెబుతాడు. ఎలాంటి పరిస్థితిలో కూడా అధర్మం వైపు నిలబడకూడదు. అలాంటి అధర్మపు మార్గంలో లేదా అలాంటి అధర్మం వైపు నిలబడి కృష్ణుడిని ఎంత వేడుకున్నా ఆయన మనసు కరగదు, ఆయన కాపాడడు.
కర్మ..
నిష్కామ కర్మ చేయమని కృష్ణుడు చెబుతాడు. తన ముందున్న ప్రతి పనిని తాను చేయాలి. వచ్చే ఫలితాన్ని గురించి ఆసక్తి ఉండకూడదు. ఫలితం వచ్చినా అది భగవంతుడు తనకు ఇచ్చినదే అని భావించాలి. అలా ఉన్నప్పుడు ప్రతి కష్టంలో, ప్రతి పనిలో ఆయన తోడుంటాడు. తాను చేయాల్సిన పని నుండి తప్పించుకునే వాడు తన కర్మను మరు జన్మకు వాయిదా వేస్తున్నట్టే లెక్క.. తరువాత దాన్ని వడ్డీతో సహా తీర్చుకోవాల్సిందే.
పైన చెప్పుకున్నవన్నీ కృష్ణుడికి ఇష్టమైన, ఇష్టం లేని విషయాలు. వీటిని ఎలా పాటిస్తారు అనే దాన్ని బట్టి ఆ వ్యక్తి మీద కృష్ణుడి ఆగ్రహం ఉంటుందా లేదా అనుగ్రహం ఉంటుందా అనే విషయం ఆధారపడి ఉంటుంది.
*రూపశ్రీ.